నయీమ్ తో గొడవలే కారణమా?
posted on Mar 27, 2011 @ 12:49PM
హైదరాబాద్: మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడును హత్య చేసింది నయీమ్ గ్యాంగ్ పనేనని పలువురు భావిస్తున్నారు. సాంబశివుడు కుటుంబ సభ్యులు కూడా నయీమ్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పీపుల్సువార్‌లో ఉన్నప్పుడు నయీమ్, సాంబశివుడు మధ్యన ఉన్న గొడవలే ఇప్పుడు సాంబశివుడు హత్యకు దారి తీసినట్లుగా భావిస్తున్నారు. నయీమ్ సోదరుడు అయిన అలీమ్‌ను సాంబశివుడు వర్గం చంపినట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రతికారంగా సాంబశివుడు వర్గానికి చెందిన బెల్లి లలితను నయీమ్ వర్గం దారుణంగా హత్య చేసినట్లు అప్పుడు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలే ఇరువర్గాల హత్యలకు కారణంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే అనంతరం సాంబశివుడు నయీమ్‌ను, నయీమ్ సాంబశివుడును టార్గెట్ చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే నయీమ్‌కు ఓ కేసులో ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీ చేయడంతో ఆ తర్వాత నయీమ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సమాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఆయన మంచాన పడ్డాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ సాంబశివుడు హత్య వలన మళ్లీ అందరు నయీమ్ వర్గంవైపు అనుమానంగా చూస్తున్నారు. సాంబశివుడు హత్యకు భూవివాదాలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది.