తెరాస నేత హత్య
posted on Mar 27, 2011 @ 11:22AM
నల్లగొండ: మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత సాంబశివుడిని శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో ధూంధాం కార్యక్రమానికి వెళ్లి ఇన్నోవా వాహనంలో మరో పది మందితో కలిసి తిరిగొస్తున్న సాంబశివుడిపై గోకారం వద్ద రెండు కార్లలో వచ్చిన పదిమంది వేటకొడవళు, గొడ్డళ్లతో దాడి చేశారు. సాంబశివుడు నల్లగొండ జిల్లాకు చెందినవారే. ఈ సంఘటనలో సాంబశివుడు, తెరాస మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వలిగొండ ఆస్పత్రికి తరలించారు.సాంబశివుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సాంబశివుడు పోలీసులకు లొంగిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వస్తున్నాడు.
కాగా, ఈ హత్యను టీఆర్‌ఎస్ ఖండించింది. తెలంగాణ ప్రాంతం ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆపార్టీ ఎమ్యెల్యే, శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచిన సాంబశివుడు మృతదేహాన్ని తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసీఆర్ సందర్శించనున్నారు.