కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చిరంజీవి ధ్వజం
posted on Mar 27, 2011 @ 9:32AM
హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయించడం లేదని పీఆర్పీ అధినేత చిరంజీవి విమర్శించారు. వ్యవసాయ రంగంపై దేశంలో 65 నుంచి 70 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడుతున్నారని, దీనికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించే ఉద్దేశంతో ప్రారంభమైన ఏడో జాతీయ రైతుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్లు కరువవుతున్నారని ఆవేదన చెందారు. గత దశాబ్ద కాలంలో దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అందులో 10 వేల మందికి పైగా రైతులు రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. ప్రస్తుతం మన రైతాంగంలో 45 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నారని తెలిపారు. వ్యవసాయ భూములను సెజ్‌ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, వారిని సెజ్‌లలో భాగస్వాములను చేయాలని సూచించారు. దేశ ఆర్థికాభివృద్ధి 8 నుంచి 9 శాతం నమోదు అవుతోందని, ఆ స్థాయిలో వ్యవసాయ రంగంలోనూ వృద్ధి కనపడాలని కోరారు. 2006 స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.