జగన్ కు కిరణ్ చురక
posted on Mar 27, 2011 @ 4:21PM
హైదరాబాద్: వ్యక్తుల వెంట పార్టీ నడవదని, పార్టీ వెంటే వ్యక్తులు నడవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను పార్టీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్టీలో కార్యకర్తలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం అని అన్నారు. కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ ఉండదన్నారు.డిఎస్ పార్టీలో మరింత ఎదగాలని ఆయన అన్నారు. డిఎస్‌కు ఇంతకంటే పెద్ద పదవి రావాలని అన్నారు. పార్టీ వెంటే కార్యకర్తలు ఉంటారన్నారు. కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు ప్రతి మనిషికి సహజమన్నారు. పార్టీకి డిఎస్ చేసిన సేవలు మరువలేనివన్నారు.