ఆ ధైర్యం జగన్‌కు ఉందా?
posted on Mar 27, 2011 9:11AM
హైదరాబాద్: రాష్ట్రంలో భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సభా సంఘాన్ని వేయాలని కోరే ధైర్యం జగన్‌కు ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'జగన్ వర్గం ఎమ్మెల్యేలు టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయని అంటున్నారు. మేం మా హయాంలో చేసిన కేటాయింపులపై కూడా సభా సంఘం విచారణకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై సభా సంఘం విచారణకు జగన్ సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఆయనతో లేఖ రాయించుకొని ఆ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం సభకు రావాలి. ఆయన ఆ మాట అనలేకపోతే నోరు మూసుకొని ఊరుకోవడం మంచిది' అని రేవంత్ ధ్వజమెత్తారు. జగన్ తరపున అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలకు కనీస పరిజ్ఞానం ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. 'సెజ్‌ల పాలసీని 2005లో కేంద్రం ప్రకటించింది. వైఎస్ హయాంలో వీటికి ఎడాపెడా అనుమతులిచ్చారు. టీడీపీ హయాంలో సెజ్‌లు వచ్చాయంటున్నారంటే.. వారికి ఏమన్నా తెలుసా అన్న అనుమానం వస్తోంది. వారికి, వారి నాయకునికి తెలియకపోతే ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధం' అని పేర్కొన్నారు.