మహాకూటమిలో కోదండరాంకే పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్,తెలుగు దేశం,సీపీఐ,తెలంగాణ జన సమితి మహాకూటమి ఏర్పాటుచేశాయి.తాజాగా మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ముసాయిదాను సిద్ధం చేసింది.హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ మల్లు భట్టివిక్రమార్క, తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి నేత దిలీప్‌కుమార్‌తోపాటు ఆ పార్టీల నాయకులు సమావేశమై ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను ఖరారు చేశారు.కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమతిలు విడివిడిగా రూపొందించుకున్న ఎన్నికల హామీలతోపాటు ఉమ్మడిగా చర్చించిన అనేక అంశాలను ఈ ముసాయిదాలో పొందుపరిచారు.ఈ ముసాయిదా ప్రతులు నాలుగు పార్టీల రాష్ట్ర అధ్యక్షుల ఆమోదానికి పంపారు.వారి ఆమోదం అనంతరం ప్రజల ముందు పెట్టి సలహాలు, సూచనలు తీసుకుని ఉమ్మడి ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు.
అంతేకాకుండా మహాకూటమికి పేరు మార్చాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు.ప్రాధమికంగా తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ ఫ్రంట్, తెలంగాణ పరిరక్షణ వేదిక, తెలంగాణ పరిరక్షణ సమితి, తెలంగాణ ప్రజా కూటమి తదితర పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.నాలుగు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కమిటీకి ఛైర్మన్‌గా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఉండాలనే అభిప్రాయం చర్చకు రాగా అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, తెజస నాయకులు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇక సీట్ల సర్దుబాటుపై దృష్టిసారించనున్నారు. ఏయే పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, ఎక్కడకెక్కడ పోటీ చేయాలనే అంశాలపై త్వరలనో చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం.
ఉమ్మడి ప్రణాళిక ముసాయిదాలోని ముఖ్యాంశాలు..
*ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఇచ్చే వరకూ ఒక్కో కుటుంబానికి నెలకు రూ.3 వేలు పంపిణీ.
* ఒక్కో రైతు కుటుంబానికి ఒకే దఫా రూ.2 లక్షల రుణమాఫీ.
* తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్.
* రూ.10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
* కౌలు రైతులకు అన్ని రకాల భద్రత.
* బలవంతపు భూసేకరణ నిలిపివేత.
* భూనిర్వాసితుల పట్ల మానవీయ కోణం. యోగ్యులైన వారికి ప్రభుత్వ భూమి పంపిణీ.
* ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో నిధి.
* రైతులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు.
* అన్ని పంటలకు బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు.
* పేదలకు గృహనిర్మాణ పథకం అమలు, అర్హులందరికీ పక్కా ఇళ్లు.
* ధర్నా చౌక్ పునరుద్ధరణ. ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు కల్పన.
* పంచాయతీల వారీగా ప్రణాళికల రూపకల్పన. వాటికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు.
* నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.
* రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం.
* ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవడం. ప్రాజెక్టులను పునరాకృతి చేసి ప్రాధాన్యక్రమంలో నిర్మించడం.
* కేజీ నుంచి పీజీ విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు సమగ్ర విధానం.
* దారిద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ ఉచితంగా కార్పొరేటు వైద్యాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కల్పించడం.
* చాకలి ఐలమ్మ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమాల నిర్వహణ.
* ఆచార్య జయశంకర్ పేరిట విద్యాభివృద్ధి కార్యక్రమాలు.
* కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో శిక్షణ కార్యక్రమాలు.
* అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు.
* బీసీ ఉప ప్రణాళిక రూపకల్పన.
* ఒక ఏఎన్‌ఎం ఉన్నచోట మరొకరి నియామకం.
* విద్యుత్, పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపు.
* అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ పదవుల భర్తీ.
* కళాకారులు, ఉద్యమ కుటుంబాలకు పింఛన్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు.
* పౌరసేవల చట్టం బలోపేతం, లోక్‌పాల్ ఏర్పాటు.