కిడారి హత్యకి నమ్మక ద్రోహమే కారణమా?
గిరిజన నేత, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు పక్కా ప్రణాళికతో హతమార్చిన సంగతి విదితమే.ఈ హత్య లో కిడారికి విశ్వాసపాత్రులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు స్థానిక నేతల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వీరిలో ఒకరు మండల స్థాయి నాయకుడు కాగా, మరొకరు గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తని,వీరిలో ఒకరు గంజాయి స్మగ్లింగ్, అక్రమ రవాణా కార్యకలాపాల్లో నిరంతరం మునిగి తేలుతుంటారని సమాచారం.ఎమ్మెల్యే హత్యకు గురికావడానికి రెండు, మూడు రోజుల ముందు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు? ఆయనకు ఆ రెండు మూడు రోజుల్లో వరుసగా ఫోన్ చేసింది ఎవరు? సర్రాయిలో గ్రామదర్శిని కార్యక్రమానికి బయల్దేరే ముందు ఆయన ఫోన్‌కు ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వచ్చాయనే దానిపై కాల్ డేటా విశ్లేషించగా ఈ ఇద్దరి ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు లభించినట్లు సమాచారం.ఎమ్మెల్యే లివిటిపుట్టు వైపు వచ్చేలా చేయడం, మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకునేలా చూడటంలో వీరు క్రియాశీల పాత్ర పోషించారని తెలుస్తోంది.గత రెండు, మూడు రోజులుగా వీరిరువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు జంట హత్యల్లో తమ పాత్ర ఉందని వీరు అంగీకరించినట్లు సమాచారం.అదుపులో ఉన్న ఈ ఇద్దరు నాయకుల నుంచి మరికొన్ని వివరాలు సేకరించి ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశముంది.అయితే మావోయిస్టులకు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? ఎప్పటి నుంచి వారితో సంబంధాలు కొనసాగిస్తున్నారు? ఎమ్మెల్యేపై వారికి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా? తదితర అంశాలకు సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.