మోదీ జీతగాడు మనకు సీఎంగా ఉండాలా?

  తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, తెరాస మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీ నేతలు ఒకరిమీద ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెరాస మీద, కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ముస్లిం మైనార్టీల సభలో రేవంత్‌ మాట్లాడారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని.. పోలీసులు ఇక స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని అన్నారు. ఢిల్లీలో ఉండే ప్రధాని మోదీ జీతగాడు కేసీఆర్‌ అని విమర్శించారు. రాబోయే కాలంలో మోదీ జీతగాడు మనకు సీఎంగా ఉండాలా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ నెరవరుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు కరెంట్‌ షాక్‌ తప్పదని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఆయన కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. కనీసం అమరుల కుటుంబాలను పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం కోసం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన అంతం కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు.

ముచ్చటగా మూడోసారి.. భట్టి వర్సెస్ కమలరాజు

  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7 వ తేదీన అని ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అంటూ చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడడంతో తెరాస వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగనుంది. ముఖ్యంగా ఈ మహాకూటమి ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. దీంతో ఖమ్మంలో మహాకూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందునా మధిర నియోజకవర్గం మీద ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంది. దానికి కారణం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క.. భట్టి రెండు పర్యాయాలుగా మధిరకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అసలే కేసీఆర్ కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటిల్లో మధిర కూడా ఒకటనే టాక్ ఉంది. అలాంటి మధిరలో భట్టికి పోటీగా తెరాస అభ్యర్థిగా కమలరాజుని బరిలోకి దింపారు. అయితే కమలరాజు ఇప్పటికే భట్టి మీద రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. 2009లో మహాకూటమి నుంచి టీడీపీ, సీపీఐ, తెరాస మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీచేశారు. భట్టి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీచేశారు. భట్టిపై తలపడి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ భట్టికి ప్రధాన ప్రత్యర్థిగా, తెరాస పార్టీ అభ్యర్థిగా కమలరాజు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈసారి కమలరాజు విజయం సాధించి చరిత్ర తిరగరాస్తారా? లేక ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోయి భట్టికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారో చూడాలి.

చంద్రబాబుకి మమతా లేఖ

  నాలుగేళ్లు ఎన్డీయే తో కలిసి పని చేసిన టీడీపీ కేంద్ర వైఖరికి నిరసనగా పొత్తు నుంచి బయటకి వచ్చి విమర్శలు సంధిస్తున్నది అందరికి  తెలిసిందే.ఎన్డీయే ప్రభుత్వంపై నిరసన గళం వినిపించే వారిలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఒకరు.ఈ నేపధ్యం లో తృణమూల్‌ కాంగ్రెస్‌ వచ్చే ఏడాది జనవరి 19 న ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో భారీ ప్రదర్శన చేపట్టనుంది.2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని,ఈ భారీ ప్రదర్శనకు హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’అని లేఖలో వివరించారు.

2019లో మనదైన ప్రభుత్వాన్ని నెలకొల్పుదాం..పవన్

  పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమలోని ఓ రిసార్ట్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ 2019 లో మనదైన ప్రభుత్వాన్ని నెలకొల్పుదామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాద్‌ జనసేనలో చేరారు. వారికి పవన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ప్రజాసేవ చేసే వారే జనసేనలోకి రావాలని ఆకాంక్షించారు.రాజకీయాల్లో తనకు ఎవరూ శత్రువులు లేరని, వైకాపా అధ్యక్షుడు జగన్‌ కూడా బద్ధశత్రువు కాదని తెలిపారు. అనంతరం గిరిజన ఉపాధ్యాయులు, నిర్వాసితులు, యువకులతోనూ సమావేశమయ్యారు.ఆ సమావేశంలో గత ఎన్నికల్లో తెదేపాకు అండగా ఉన్నది ప్రజల కోసమే కానీ అవినీతి కోసం కాదని చెప్పారు.గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెదేపా ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో నిర్వీర్యం చేసిందని విమర్శించారు.నేడు పథకాల్లో 25 శాతం లబ్ధి మాత్రమే ప్రజలకు చేరుతుందని, 75 శాతం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. కాటన్‌ ఆనాడు ఉభయగోదావరి జిల్లాల్లో కరవును దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం బ్యారేజీ నిర్మిస్తే, ప్రస్తుతం డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఆదివాసీల సమస్యలను దగ్గరినుంచి చూశానని పవన్‌ చెప్పారు.గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి వైద్యం అందే విధంగా జనసేన ఎన్నికల ప్రణాళికలో చేర్చుతామని, ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి గ్రామాలకు పంపుతామని తెలిపారు. భాగస్వామ్య పింఛను పథకం విధానాన్ని రద్దు చేస్తామని పవన్‌ స్పష్టంచేశారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మావోల దిగ్బంధానికి పోలీసుల వ్యూహం

మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు అనటానికి అరకు ఘటనే ఉదాహరణ.పోలీసులు కూడా ఆ ఘటనతో అప్రమత్తయ్యారు.మావోల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.ఈ నేపధ్యం లో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కొరాపూట్‌ జిల్లా  చిక్కల్‌ములి అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో డిస్ట్రిక్ట్‌ వలంటరీ ఫోర్స్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సులు ఉమ్మడిగా గాలింపు నిర్వహించాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో 15 నుంచి 20 మంది వరకు మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించిన భద్రత బలగాలు వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. దీంతో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 20 నిమిషాలపాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. అనంతరం భద్రత బలగాలు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసి భారీడంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కిట్‌బ్యాగ్‌లు, ఐఈడీలు లభించినట్లు సమాచారం. ఈ ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే, చలపతి అలియాస్‌ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అరుణ అలియాస్‌ వెంకటరవి చైతన్యలు ఈ ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నారని సమాచారం. వారు కాల్పుల్లో గాయపడి ఉండొచ్చని ఒడిశాలోని కొరాపూట్‌ ఎస్పీ కన్వర్‌ బిశ్వాళసింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు.తప్పించుకున్న మావోయిస్టులు ఎక్కువ దూరం వెళ్లేందుకు అవకాశం లేదని భావిస్తున్న భద్రత బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఏపీ, ఒడిశా పోలీసులు ఉమ్మడి ఆపరేషన్లు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తున్నారు. మావోల దిగ్బంధానికి ఏపీ, ఒడిశా పోలీసుల వ్యూహం పన్నుతున్నారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన దళ సభ్యులు వీరే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు

కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళం వినిపించే వారిలో ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ఒకరు.తాజాగా కేజ్రీవాల్ భాజపాయేతర రాష్ట్రాల ముఖ్య మంత్రులకు లేఖలు పంపారు. విద్యుత్‌ చట్టం-2003లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు కేజ్రీవాల్ .‘కొన్ని సంస్థలకు లాభాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్నట్లు అనిపిస్తోంది.విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి, పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందకుండా మనం అందరం కలిసి అడ్డుకోవాల్సి ఉంది. ఈ బిల్లు వల్ల సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయనే విషయాలను మనం ప్రచారం చేయాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.   పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి కుమారస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మిజోరాం ముఖ్యమంత్రి లాల్ ‌తన్హ‌వ్‌లా, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌లకు కేజ్రీవాల్ లేఖలు పంపారు.ఈ అంశాలపై చర్చించడానికి తాను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలనుకుంటున్నానని ఆయన తెలిపారు.

ఏపీలో ఉపఎన్నికలు లేవు.. ప్లాన్ ప్రకారమే జరిగిందా?

  ఓ వైపు తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం మరోవైపు ఏపీలో ఉప ఎన్నికలు లేవని స్పష్టం చేసింది. కొద్ది నెలల క్రితం వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాలను జూన్ 4న ఆమోదించారు. అయితే ఈ రాజీనామాలు నిజాయితీతో చేసినవి కావని అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. ఉప ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ఆ రాజీనామాలకు లేటుగా ఆమోదం వచ్చిందని విమర్శలు తలెత్తాయి. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఏడాది కన్నా తక్కువ గడువు ఉంటే ఉపఎన్నికలు నిర్వహించరు. ఈ లాజిక్ ని రాజీనామాలు, ఆమోదంలో ఉపయోగించారని పలువురు అభిప్రాయపడ్డారు. తరువాత ఈ టాపిక్ సైలెంట్ అయింది. అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పుణ్యమా అని ఈ టాపిక్ మళ్ళీ తెరమీదకు వచ్చింది. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన సీఈసీ ఓపీ రావత్ ఏపీలో ఉప ఎన్నికలు లేవని తేల్చిచెప్పారు. ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఆయన మాట్లాడుతూ.. ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించడం జరిగిందన్నారు. జూన్ 3వ తేదీతో లోక్‌సభ గడువు ముగుస్తుందని, ఎన్నికల నిర్వహణకు ఏడాది కంటే తక్కువగానే గడువు ఉన్నందున ఉప ఎన్నికలు ఉండవని రావత్ ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీవి చెత్త రాజకీయాలు : మోదీ

  పలు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలవడంతో.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీవి చెత్త రాజకీయాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని, సర్జికల్ స్ట్రైక్స్ పై కూడా వారు రాజకీయాలు చేసి సైనికులను అవమానించారని ధ్వజమెత్తారు. అనవసర భయాలు, అనుమానాలు సృష్టించే వారిని దూరంగా ఉంచాలని అన్నారు. అలాంటి వాళ్లు హాయిగా ఉండి మీ భయాలు, సందేహాలతో ఆడుకుంటారని.. అలాంటి మనుషులు, పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్తూ.. భయాలు సృష్టిస్తోందని అన్నారు. వారి హయాంలో జరిగిన అభివృద్ధి, మా హయాంలో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ చర్చ జరుపుదాం రమ్మని ఆహ్వానిస్తే.. అలాంటి చర్చకు దూరంగా పారిపోతున్నారని అన్నారు. తాము ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ కోసం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌ సమాజాన్ని విడదీస్తోందని మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ కు మరో షాక్

  భారతీయ జనతా పార్టీని గద్దె దింపేందుకు సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అనుకోని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.2019 లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని పలు పార్టీలతో జట్టు కట్టి బీజేపీ పై పోరాటానికి దిగుదామనుకుంది.ప్రతి పక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి బీఎస్పీ అధినేత మాయావతి షాక్ ఇచ్చింది.కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని సందిగ్ధంలో పడేసింది.ఈ షాక్ నుంచి తేరుకునేలోపే పశ్చిమ్‌బంగా అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా కాంగ్రెస్ పార్టీ తో కలిసి పోటీ చేయవల్సిన అవసరంలేదని ఊహించని షాక్ ఇచ్చింది.'పశ్చిమ్‌ బంగాలో భాజపా, వామపక్ష పార్టీలకు వ్యతిరేక శక్తిగా మమతా బెనర్జీ మాత్రమే ఉన్నారు.కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీతోనూ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేదు’ అని ఆ పార్టీ నేత చందన్‌ మిత్రా  వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌తో కలిసి మమతా బెనర్జీ పనిచేయకపోతే భాజపాకే లాభం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆ రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈసారి అత్యధిక సీట్లు సాధించాలని భాజపా భావిస్తోంది.

ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు-కేటీఆర్

  టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి పార్టీలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కమిటీ భేటీలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్‌, తెదేపా పొత్తు బలంగా ఉండాలని కోరుకుంటున్నా. తెలంగాణ జనసమితి, సీపీఐ కూడా మహాకూటమిలో భాగస్వాములుగా చేరాయి. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం వచ్చింది. మహాకూటమిలోని పార్టీలు విడిపోకుండా చూడాలి. ఆ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరుంటారు? మహాకూటమిలో ఉన్నవాళ్లంతా ముఖ్యమంత్రి పదవి కావాలంటారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే 3 నెలలకోసారి ముఖ్యమంత్రి మారుతారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవర్‌లో ఉన్న వ్యక్తే సీఎం అవుతారు.ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మహాకూటమి గెలిస్తే ప్రాజెక్టులు ముందుకు సాగుతాయా? అని అన్నారు. కేసీఆర్‌ను ఎందుకు దించాలి? సాగునీటి ప్రాజెక్టులను పరుగులు తీయిస్తున్నందుకా? 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నందుకా? నాలుగేళ్లలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకా? అని ప్రశ్నించారు.నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఉద్యమం జరిగిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కోటి ఎకరాల మాగాణి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఓట్లు వేసే నాటికి ఇంటింటికీ నీళ్లు అందుతాయన్నారు.

భారత్ జోరు..వెస్టిండీస్ విల విల

  వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.ప్రత్యర్థిని ఇన్నింగ్స్‌ 272 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ఆట ముగిసింది. తొలి రోజు చిచ్చర పిడుగు పృథ్వీ షా జోరు చూపించగా రెండో రోజు ఆటలో మరో యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ దూకుడు కనిపించింది. దీనికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సూపర్‌ ఫామ్‌ను చాటుకుంటూ శతకాలు సాధించగా రవీంద్ర జడేజా టెస్టుల్లో ఇప్పటిదాకా ఊరిస్తున్న శతకాన్ని అజేయంగా పూర్తి చేశాడు. దీంతో ఒకటిన్నర రోజులోనే భారత్‌ 649 రన్స్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన విండీస్‌ 181 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ ఆడింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ మరోసారి తడబడింది.ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకుంది. విండీస్‌ తొలి వికెట్‌ను అశ్విన్‌ తీయగా, ఆపై ఐదు వికెట్లను కుల్దీప్‌ యాదవ్‌ సాధించాడు. విండీస్‌ చివరి నాలుగు వికెట్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశాడు. దాంతో విండీస్‌ కనీసం రెండొంద పరుగుల మార్కును చేరుకుండానే ఆలౌటైంది.మ్యాచ్‌లో విండీస్‌ ఆటగాళ్లలో కీరన్‌ పావెల్‌(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవల అఫ్గానిస్తాన్‌ జరిగిన టెస్టు మ్యాచ్‌లో లభించిన ఇన్నింగ్స్‌ 262 పరుగుల రికార్డును టీమిండియా సవరించింది.మరొకవైపు విండీస్‌ తన క్రికెట్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయాన్ని చవిచూసింది. 2007లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్‌ 283 పరుగుల ఓటమి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఇదే విండీస్‌కు అతిపెద్ద పరాజయం.

ఇద్దరు చంద్రులు పిల్లులు... నరేంద్ర మోదీ ఓ కోతి!??

  తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది! తెలంగాణ తొలి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యర్థులపై పదునైన విమర్శనాస్త్రాలతో ప్రచార పర్వంలో దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడుతున్నారు. చంద్రబాబు విమర్శల్ని తిప్పి కొడుతున్నారు. నేరుగా ఇద్దరు చంద్రులు పేరు ప్రస్తావించకున్నా... ఆంధ్ర, తెలంగాళ వాళ్ళు ఫైట్‌ చేసుకుంటే ఎవరికి ఫైదా(లాభం)? అని నటి పూనమ్‌కౌర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. చిన్నతనంలో స్కూల్‌లో చదువుకున్న ఓ కథ గుర్తొస్తుందని రెండు పిల్లులు, ఓ కొతి బొమ్మను పోస్ట్‌ చేశారామె.     ఒక్కసారి ఆ కథేంటి? అనేది గుర్తుచేసుకుంటే... రెండు పిల్లులు చాలా స్నేహంగా వుండేవి. ఒకరోజు ఒక ఇంటి నుంచి రొట్టెముక్కను దొంగతనం చేస్తాయి. ఇద్దరూ కష్టపడి రొట్టెను దొంగిలించాయి కనుక సమానంగా పంచుకోవాలని పిల్లులు అనుకుంటాయి. వాటాల్లో రెండు పిల్లుల మధ్య గొడవ మొదలవుతుంది. ఇది గమనించిన కోతి సమానంగా పంచుతానని చెప్పి మొత్తం రొట్టెను కాజేస్తుంది. తినేస్తుంది. ఈ కథను గుర్తచేసే కార్టూన్‌ బొమ్మను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన పూనమ్‌ కౌర్‌ ‘‘ఆంధ్ర... తెలంగాణ... మనవాళ్ళే ఫైట్‌ చేసుకుంటూ వుంటే ఫైదా ఎవరికి అబ్బా? నాకు అర్థం కావట్లే. ఇదిగో ఈ స్కూల్‌ స్టోరీ గుర్తొచ్చింది’’ అని పేర్కొన్నారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అనగానే చాలామంది నెటిజన్లు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని ఒక అంచనాకు వస్తున్నారు. అందులో నిజమేంత? అబద్దమెంత? అనేది పక్కన పెడితే... కోతి ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమా? లేదా దేశప్రధాని నరేంద్ర మోదీయా? ప్రేక్షకుల ఊహకు వదిలేస్తున్నాం!!

డిసెంబర్ 7 న తెలంగాణలో ఎన్నికలు

  మొత్తానికి ఎన్నికల నగారా మ్రోగింది. తెలంగాణాలో అసలైన ఎన్నికల సందడి మొదలవబోతుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌లతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ గురించి స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 7 న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. డిసెంబర్ 11 న ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణలో నామినేషన్లు నవంబర్ 12 నుంచి 19 వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 22 చివరి తేదీ. అంటే మొత్తానికి 2 నెలల్లో ఎన్నికల తంతు ముగియనుంది. రెండు నెలల్లో విజయం ఎవర్ని వరిస్తుందో తేలనుంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్దమైన తెరాస గెలుస్తుందా? లేక తెరాస ను ఓడిస్తామంటున్న మహాకూటమి గెలుస్తుందో చూద్దాం. ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత నవంబర్ 12 న కాగా, రెండో విడత నవంబర్ 20 న జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, మిజోరం‌లలో ఒకే తేదీన నవంబర్ 28 ఎన్నికలు జరుగుతాయి. ఇక రాజస్థాన్‌ లో తెలంగాణతో పాటే డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికల షెడ్యూల్‌ ఎలా ప్రకటిస్తారనే అనుమానాలు ఉన్నాయి. కేసు ఓటర్ల జాబితాకు సంబంధించింది మాత్రమే. ఓటర్ల జాబితాను సరిచేయడానికి తగినంత సమయం ఉంది. ఓటర్ల జాబితాకు సంబంధించి కోర్టుకు అన్ని వివరాలనూ నివేదిస్తాం. మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికల సంఘం వెళ్లాల్సి ఉందన్నారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు వెళ్తాం' అని వివరించారు. అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. తెలంగాణలో ఈ నెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు వెల్లడించారు. గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకావడంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, మిగతా రాష్ట్రాల్లో ఇప్పటినుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని అన్నారు. డిసెంబర్‌ 15నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని రావత్‌ వెల్లడించారు.

నేను బతకాలి.. ఇంకెవరూ బతకకూడదు

  జేసీ దివాకర్ రెడ్డి ..ఈ పేరు వింటేనే గుర్తొచ్చేది సంచలనాత్మక వ్యాఖ్యలు.మరో మారు జేసీ తెలంగాణ సీఎం కేసీఆర్‌, మోదీపై సంచలనాత్మక విమర్శలు చేశారు.పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన జేసీ ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడటం మంచి కాదన్నారు.చంద్రబాబు ఎలా మాట్లాడుతారో చూడాలని సూచించారు. చంద్రబాబుకు, కేసీఆర్‌కు చాలా తేడా ఉందని అన్నారు. కేసీఆర్‌ భస్మాసురుడులాంటి వాడని, భస్మాసురుడు ఎలాగైతే తన చేత్తో తానే భస్మమయ్యాడో ఆయన కూడా తన మూడో కంటితో తానే బూడిదవుతాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులకు ఎవరూ భయపడటం లేదని జేసీ అన్నారు.మోదీ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తానెప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు.‘నేను బతకాలి.. ఇంకెవరూ బతకకూడదు’ అనేది ప్రధాని మోదీ భావజాలమని, తనతో పాటు పది మంది బతకాలనే మనస్తత్వం సీఎం చంద్రబాబుదని జేసీ వ్యాఖ్యానించారు.

దేశంలోని ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ అధముడు

  తెరాస అధినేత ,ఆపద్ధర్మ ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ,చంద్ర బాబుపై విమర్శలు చేస్తున్నారు.కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు,తనపై ఐటీ దాడుల సందర్భంగా ఛానళ్లలో ప్రసారం అయన ప్రసారాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడారు.తన నివాసంలో ఐటీ రైడ్స్ సందర్భంగా కొన్ని చానెళ్లు,పత్రికలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు హంకాంగ్, మలేషియా, సింగపూర్ లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ఇచ్చిన తప్పుడు వార్తలపై 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆ సదరు మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లోకల్లా కేసీఆర్‌ అధముడని రేవంత్ విమర్శలు గుప్పించారు.మోదీతో కుమ్మక్కై కేసీఆర్‌ రైల్వే కేసులన్నీ ఎత్తివేయించుకున్నారని ఆరోపించారు.మోదీకి కేసీఆర్‌ కుటుంబం మీద ఉన్న ప్రేమ...తెలంగాణ సమాజం మీద లేదన్నారు. ఆంధ్రావాళ్ళు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్‌ అమరావతి వెళ్లినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా? అని  రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై  కేసీఆర్‌ దుర్మార్గంగా మాట్లాడటం పెద్ద కుట్రని,ఎన్నికలు కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబు అని చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.చంద్రబాబును టార్గెట్‌ చేసి మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆయన చూస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబుపై వాడుతున్న భాషను ప్రజలు గమనించాలని కోరారు.కేసీఆర్ ఆడుతున్న నాటకాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు.సీఎం పదవి పోతుందన్న భయంతో కేసీఆర్‌ నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు.  

కోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న బాబు

  బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గత నెలలో చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసారు. కాగా ఈ కేసులో సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. అయితే తాజాగా అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు, అడ్వకేట్‌ జనరల్‌తో చంద్రబాబు తన నివాస ప్రాంగణంలోని ప్రజా వేదికలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐటీ దాడులు, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల తదితర అంశాలపై చర్చించారు. బాబ్లీ పోరాటంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. ధర్మబాద్ కోర్టుకు భారీ ర్యాలీతో హజరైతే బాగుంటుందని చంద్రబాబుకి ఇప్పటికే కొందరు మంత్రులు సూచించారు. కోర్టుకు వెళ్లకుండా రీకాల్‌ పిటిషన్‌ వేయాలని పలువురు కోరారు. చిన్న కేసులకు సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు హాజరుకావాలని సీనియర్‌ మంత్రులు సూచించారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. చివరికి రీకాల్‌ పిటిషన్‌ వేసేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం.

బీజేపీ కి షాక్..కాంగ్రెస్ వైపు మోడీ డూప్

  ఆయన అచ్చం ప్రధాన మంత్రి మోడీలా ఉంటారు.గత ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం కూడా చేసారు.కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తా అంటున్నారు.ఆయనే ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన అభినందన్‌ పాఠక్‌.మోదీనేన అనుకునేంత దగ్గర పోలికలు ఉండటంతో 2014 లో బీజేపీ ఆయనతో ప్రచారం కూడా చేయించింది.అయితే భాజపా వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చడం లేదని, మోదీ అనుకున్నట్లుగా భాజపా పనిచేయడం లేదని, ఆ పార్టీలోని నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని అభినందన్ ఆరోపించారు.అందుకే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నానని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బార్‌ను కలిసి మాట్లాడానని ఆయన చెప్పారు.అయితే మోడీ పట్ల తనకు వ్యతిరేకత లేదని, మోడీ భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకురావాలని చూస్తున్నారని అభినందన్‌ పేర్కొన్నారు.తన సమస్య భారతీయ జనతా పార్టీతోనే అని స్పష్టంచేశారు.ప్రజలు తన దగ్గరికి వచ్చి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారని, కొందరు తనను కొట్టారని, నిందించారని తెలిపారు.

మోదీని ఓడించడమే ప్రధాన లక్ష్యం

బీజేపీని ఓడించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.రాహుల్ గాంధీ అవకాశం దొరికిన ప్రతిసారి కేంద్రంపై,మోడీపై విరుచుకుపడుతున్నారు.హిందుస్థాన్‌ టైమ్స్‌ నాయకత్వ సదస్సులో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్రంపై మరో మారు విమర్శలు గుప్పించారు.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటించింది.వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. రూపాయి విలువ పతనమయింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎన్నడూలేనంత స్థాయికి చేరాయి. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం పెరిగిపోయింది. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ విధానంతో లక్షలాది చిన్నతరహా వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రజల ఆకాంక్షలు ఆగ్రహరూపం సంతరించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా దళితులు ఆందోళన పథంలో ఉన్నారు. మైనార్టీలపై మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి.భారత్‌ గురించి తమకు తప్ప ఈ దేశంలో మరెవ్వరికీ ఏమీ తెలియదన్న భావన ప్రభుత్వ పెద్దల్లో గూడుకట్టుకుపోయింది. వాళ్లు ప్రజలను నమ్మరు. వారి గొంతు వినరు. ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదు అని ధ్వజమెత్తారు.     మిత్రపక్షాలు కోరుకుంటేనే ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమని ప్రకటించారు.కలిసొచ్చే పార్టీలతో జతకట్టి మోదీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమనీ, మిగతావన్నీ ఎన్నికల తర్వాతేనని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాయవతితో పొత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్‌లో సీట్ల సర్దుబాట్లపై సంప్రదింపులు జరుగుతుండగానే బీఎస్పీ సొంత పంథాలో వెళ్లిపోయిందనీ, వారి వైఖరి తమపై ప్రభావం చూపదన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణల్లో తమకు విజయావకాశాలు దండిగా ఉన్నాయని రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు.తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేస్తామని చెప్పారు. రైతులకు అండగా నిలవడంతోపాటు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య, వైద్య వ్యవస్థను నిర్మిస్తామన్నారు.  

నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల?

  కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకి సిద్ధం అయినప్పటి నుండి.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని అందరిలో ఆసక్తి మొదలైంది. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి అంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని గురించి ఈరోజు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌లతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్ని రాష్ట్రల ఎన్నికల అధికారులతో రెండ్రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమవుతున్నారు. ఇవాళ తెలంగాణకు సీఈసీ సాంకేతిక నిపుణులు రానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా రూపొందించే విషయంలో సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. ఈ నెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం సాంకేతిక సమస్యలు వస్తున్నందున సాంకేతిక నిపుణులను సీఈసీ పంపిస్తోంది.