బండ్ల గణేష్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్.!!

  బండ్ల గణేష్ పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ నుండి ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్.. తను చేసిన సినిమాలతో కంటే సినిమా వేడుకల్లో తను ఇచ్చే స్పీచ్ లతోనే ప్రేక్షకులకు ఎక్కువ దగ్గరయ్యారు. ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న బండ్ల గణేష్.. రీసెంట్ గా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన వెంటనే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలిచి అసెంబ్లీకి వెళ్లడం ఖాయమంటూ బండ్ల ధీమా వ్యక్తం చేసారు. అసలే కాంగ్రెస్ లో నేతలు ఎక్కువ.. దానికితోడు మహాకూటమి పుణ్యమా అని సీట్లు కొన్ని సర్దుబాటు చేయాలి. మరి ఇలాంటి సమయంలో బండ్లకు టికెట్ దక్కడం కష్టమే అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. అయితే కొందరు మాత్రం టికెట్ ఖాయం చేసుకున్న తర్వాతే బండ్ల కాంగ్రెస్‌లో చేరారని.. కాంగ్రెస్ లోని కీలక నేతలతో బండ్లకు ఉన్న సత్సంబంధాల వల్ల టికెట్‌ ఖాయమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, బండ్ల తాను పుట్టి పెరిగిన షాద్ నగర్ టికెట్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. తనకు స్థానికంగా ఉన్న వ్యాపార సంబంధాలు, సర్కిల్ తనకు ఓట్లను రాల్చుతుందని బండ్ల భావించినట్లు తెలిసింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఫైనల్ చేసిన జాబితాలో షాద్ నగర్ స్థానాన్ని ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతాప్‌రెడ్డి 2009లో షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు. ప్రతాప్ రెడ్డి షాద్ నగర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ వై.అంజయ్య యాదవ్‌నే అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతాప్ రెడ్డి మాత్రమే ధీటైన అభ్యర్థిగా కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షాద్ నగర్ నుంచి బండ్లకు అవకాశం లేదని తేలిపోవడంతో ఇప్పుడు ఆయన ఎక్కడ నుంచి పోటీకి దిగుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. మరి కాంగ్రెస్ బండ్లకు టికెట్ కేటాయిస్తుందో లేక షాక్ ఇస్తుందో చూడాలి.

తెలంగాణాలో ఎన్నికల కోడ్..అమెరికాలో ట్రంప్ మిస్

  తెలంగాణాలో ఎన్నికల కోడ్ ఏంటి?అమెరికాలో ట్రంప్ మిస్ అవ్వటం ఏంటి?.. ఈ రెండింటితో ఓ వ్యక్తికి లింక్ ఉంది.ఆయనే రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌.ఏటా అమెరికా ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఐఏసీపీ అవార్డుకు మన దేశం తరపున మహేష్‌ భగవత్‌ ఎంపికయ్యారు.ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి,పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు మహేష్‌ భగవత్‌ను అమెరికా ప్రభుత్వం ఈ అరుదైన అవార్డుకు ఎంపిక చేసింది.అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి అమెరికాకు రావాల్సిందిగా సీపీకి ఆహ్వానం పంపింది.అయితే రాష్ట్రంలో త్వరలో జరగబోయే ముందస్తు ఎన్నికలు, పనుల ఒత్తిడి, కోడ్‌ ఆఫ్‌ కాండక్టు అమల్లో ఉండటంతో అమెరికా ప్రయాణాన్ని సీపీ రద్దు చేసుకున్నారు.అమెరికాలోని ఓర్‌లాండోలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దీంతో ట్రంప్‌ను కలిసి, ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశాన్ని ఆయన మిస్సయ్యారు.అమెరికా రాలేకపోయిన సీపీకీ అవార్డును పోస్టులో పంపిస్తామని ఐఏసీపీ స్పష్టం చేసింది.

'థర్డ్ ఫ్రంట్ కన్వీనర్' గా చంద్రబాబు!! దేశంలో చక్రం తిప్పుతారా?

  జనవరి 19 న కోల్‌కతాలో జరిగే భారీ బహిరంగ సభలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రకటించేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగం సిద్ధం చేశారు. గతంలో రెండుసార్లు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా పనిచేసిన అనుభవం చంద్రబాబుకి ఉన్నందున మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నందున  చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా మరొకసారి పనిచేయాలని మమతా బెనర్జీ కోరనున్నారు. జనవరి 19న కలకత్తాలో 10 లక్షల మందితో అతి పెద్ద ర్యాలీకి తృణముల్ కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. రంగస్థలం మీదకు రమ్మని మమతా బెనర్జీ లేఖ రాసారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని కోరుతూ చంద్రబాబుకు మమతా బెనర్జీ లేఖ రాశారు. 2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’ అని లేఖలో వివరించారు. కోల్‌కతాలో జరిగే భారీ బహిరంగ సభలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా  చంద్రబాబును ప్రకటించేందుకు మమతా బెనర్జీ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ నాయకులతో సంప్రదించారు. గతంలో దేశరాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు.. ఇప్పుడసలే ఏపీకి అన్యాయం చేసిందని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో 'థర్డ్ ఫ్రంట్ కన్వీనర్' గా చంద్రబాబుని ప్రకటిస్తే దేశరాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారో చూడాలి మరి.

బీజేపీలో చేరమని పవన్ కి పిలుపు!!

  గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ తెలుగు దేశం నాయకులు మోదీకి జగన్‌ అవినీతి పుత్రుడు, పవన్‌ దత్త పుత్రుడని విమర్శలు చేస్తున్నారని తాను మోదీ దత్త పుత్రుడిని కానని కొణిదల వెంకట్రావు పుత్రుడినని పవన్‌ స్పష్టం చేశారు.గత ఎన్నికల్లో చంద్ర బాబే తన మద్దతు కోరారని,అప్పుడు మద్దతు కోసం నన్ను దేశభక్తుడన్నారు ఇప్పుడు ప్రశ్నిస్తుంటే విమర్శలు చేస్తున్నారని తెలిపారు.2104 ఎన్నికల తర్వాత భాజపాలో చేరమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కోరినా తాను వెళ్లలేదని చెప్పారు.బీజేపీ ద్రోహం చేసిందన్న మాటమీదే తాను ఉన్నానని తేల్చి చెప్పారు.2016 నుంచి ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నది జనసేన ఒక్కటే అన్నారు. పోలవరం నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటించిన పవన్ మాదాపురం గ్రామంలో నిర్వాసితులతో సమావేశం అయ్యారు.అనంతరం వారి ఇళ్లు కూల్చివేసిన పైడిపాక గ్రామాన్ని సందర్శించారు.ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చివేసి వారు రోడ్లుపై కూర్చుంటే అప్పుడు నిర్వాసితుల సమస్యలు తెలుస్తాయని అన్నారు.అమరావతికి రోజుకు 20 బస్సులు ఏర్పాటుచేస్తానని, అక్కడికి వెళ్లి గోడు వెళ్లబోసుకోవాలని నిర్వాసితులకు సూచించారు.జగన్‌ పాదయాత్ర చేసుకుంటూ ముద్దులు పెడుతూ ముందుకెళ్తున్నారని, అది తన నైజం కాదని, ప్రశ్నించడానికే జనసేన వచ్చిందని పవన్‌ పేర్కొన్నారు.  

తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాం.. అయ్యో బీజేపీ

  మీరు 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా చూసే ఉంటారు. అందులో హీరో శ్రీకాంత్ ఎన్నికల సందర్భంగా 'హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తా' లాంటి వింత హామీలు ఇస్తూ ఉంటాడు. అంతెందుకు బయటకూడా చాలామంది రాజకీయ నాయకులు అలాగే ఉంటారు. ఓట్లు కోసం ఆచరణకు వీలు కాని హామీలు ఇస్తుంటారు. గెలిచాక అసలు మేం ఎప్పుడు అన్నాం? ఒకవేళ అన్నా అసలు ఆ హామీలు సాధ్యమవుతాయా? అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఇంతలో ఐదేళ్లు గడుస్తాయి. ఎన్నికలు వస్తాయి. మళ్ళీ గెలుపు కోసం ఆ నాయకులు అలాంటి హామీలే ఇస్తారు. అప్పుడు ప్రశ్నించాల్సిన ఓటర్లు మాత్రం ప్రశ్నించరు. సర్లే ఇదంతా చైన్ సిస్టంలా జరుగుతుంది కామన్. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. గత ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ తప్పుడు హామీలు ఇచ్చిందట. ఈ మాట అన్నది ప్రతిపక్షాలు కాదు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఇరుకున్న పెట్టాలని ఆరోపణలు, విమర్శలు చేయడం కామన్.. కాని వెరైటీగా సొంత పార్టీ నేతనే తన వ్యాఖ్యలతో బీజేపీని ఇరుకున పెట్టేసారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కలర్స్‌ చానల్‌లో ప్రసారమైన ‘అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే’ అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానాతో సంభాషిస్తూ గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. ‘మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నాం’ అని ఎన్నికల ముందు, ఇప్పటి పరిస్థితుల గురించి గడ్కరీ ఒక్కమాటలో చెప్పేసారు. అధికారంలోకి రాలేదనుకోండి.. ఇచ్చిన హామీలతో సంబంధమే ఉండదుగా అని భావించామంటూ పార్టీ ధోరణిని చెప్పకనే చెప్పారు. కానీ, ప్రజలు తమకు అధికారం కట్టబెట్టడంతో సమస్య వచ్చిపడిందని సరదాగా వ్యాఖ్యానించారు. అసలే కాంగ్రెస్, బీజేపీ మీద విమర్శలు చేయడానికి అస్త్రాలు వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు గడ్కరీ రూపంలో మరో అస్త్రం దొరికింది. ఇంకేముంది కాంగ్రెస్ ఇక బీజేపీ మీద విమర్శలు షురూ చేసింది. గడ్కరీ వ్యాఖ్యలు ఉన్న వీడియో క్లిప్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘నిజం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమ కలల్ని, నమ్మకాన్ని వాడుకుందని ప్రజలు కూడా భావిస్తున్నారు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. తెలిసో తెలియకో గడ్కరీ.. రాహుల్ కి రాఫెల్ లాంటి అస్త్రాన్ని ఇచ్చారు.

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ప్రాణ గండం

  టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ హత్యలకు కారణాలను పేర్కొంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో విడుదలైన ఓ లేఖ సంచలనం సృష్టించింది.గిరిజనులకు ద్రోహం చేస్తున్నందుకే ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించామని లేఖలో పేర్కొన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు వారిని హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని వెల్లడించారు.బాక్సైట్‌ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.లేఖలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు.నీకు అందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచేసి క్షమాపణ చెప్పాలి.బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పద్ధతి మార్చుకోకపోతే కిడారి, సోమకు పట్టిన గతే ఆమెకు పడుతుందని లేఖలో హెచ్చరించారు.పోలీసులకు, తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, అందుకే వాళ్లు తమకు ఆయుధాలతో దొరికినా ఎలాంటి హాని తలపెట్టలేదని వివరించారు. పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తున్న పోలీసులను క్షమించి వదిలిపెట్టామని వివరించారు. కానీ, విప్లవసోదరులు దొరికితే మాత్రం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ లేఖ మావోయిస్టులు విడుదల చేసింది కాదని పోలీసు నిఘా వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.  

కోదండరాం ఆగ్రహం..కాంగ్రెస్ కు అల్టిమేటం

  తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.ఓ పక్క ప్రచారాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.తెరాసను గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజసలతో తెలంగాణలో మహాకూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. కానీ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నిన్న సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించాల్సిన పార్టీలు చివరి నిమిషంలో సమావేవేశాన్ని వాయిదా వేసుకున్నాయి.దీంతో సీట్ల కేటాయింపు, పొత్తుల అంశంపై స్పష్టత ఇవ్వని కాంగ్రెస్‌పై తెజస కోదండరాం ఆగ్రహం వ్యక్తంచేశారు.త్వరగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తేల్చాలంటూ ఆయన మహాకూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు లేఖ రాశారు.48గంటల్లోగా సీట్ల కేటాయింపు అంశాన్ని తేల్చాలని.. లేకపోతే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం. తాము కోరుకున్న సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే కలిసొచ్చే పక్షాలతో ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది మరో రెండు రోజుల్లో 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా ప్రకటించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో తెజస కార్యాలయంలో కోదండరాంతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ భేటీ అయ్యారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు.మరి కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు అంశంపై తొందరపడకుంటే పొత్తు పటాపంచల్ అవ్వటం కాయమని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

రాఫెల్ డీల్..గుజరాత్ లో దాడులు..రాహుల్ ఫైర్

  లక్షల కోట్ల రుణాల మాఫీ,నోట్ల రద్దు,జీఎస్‌టీ,రాఫెల్ కుంభకోణం తాజాగా గుజరాత్ లో స్థానికేతరులపై దాడులు..కేంద్రాన్ని ఎండకట్టటానికి రాహుల్ గాంధీ సంధిస్తున్న అస్త్రాలు.రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ ఒక్క విమానం కూడా తయారు చేయని రూ.45,000 కోట్ల మేరకు బకాయిలు ఉన్న అనిల్ అంబానీకి రాఫెల్ ఒప్పందాన్ని మోదీ కట్టబెట్టారని ధ్వజమెత్తారు.ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు ప్రధాని పెంచేశారని ఆరోపించారు. నిరర్ధక ఆస్తుల వ్యవహారంపైనా రాహుల్ దాడి సాగించారు. దేశంలో అత్యంత సంపన్నులైన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీల వంటి వారికి రూ.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత మోదీ సర్కార్‌దేనని అన్నారు.సంస్కరణల పేరుతో తీసుకు వచ్చిన నోట్లరద్దు, జీఎస్‌టీతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు.చిన్న తరహా పరిశ్రమలు,వ్యాపారాలు తూచిపెట్టుకుపోయాయన్నారు.ఆయన తీసుకువచ్చిన సంస్కరణలన్నీ కేవలం 15 నుంచి 20 మంది పారిశ్రామికవేత్తలకే ఉపయోగపడ్డాయని ఆరోపించారు. గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాల కార్మికులు పెద్దఎత్తున వెళ్లిపోతుండటంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యువకులపై గుజరాత్‌లో దాడులు చేస్తూ, అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 'ఉద్యోగాలిస్తారని నరేంద్ర మోదీని మీరు నమ్మారు. ఆయన మీ విశ్వాసంపై దెబ్బకొట్టారు' అని అన్నారు.ప్రేమ, ఐకమత్యంతో కూడిన పాలన అందించగలిగిన యూపీఏకు ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు.

రేవంత్‌ను ఓడించేందుకు రూ.వందకోట్ల ఒప్పందం

  కొడంగల్ నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కంచుకోట.ఎలాగైనా రేవంత్ రెడ్డి కోట బద్దలు కొట్టి తెరాస జెండా పాతాలని కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే తెరాస కొడంగల్ టికెట్ ని మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కి కేటాయించింది.నరేందర్ రెడ్డి కూడా రేవంత్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా మీడియా తో మాట్లాడిన నరేందర్ రెడ్డి దమ్ము, ధైర్యముంటే రేవంత్‌రెడ్డి తనపై గెలవాలని సవాల్‌ విసిరారు.మాటలతో మభ్యపెట్టి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డిని ఈసారి ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని నరేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ దీపావళి నాటికి మిషన్‌ భగీరథ ఫలాలు అన్ని గ్రామాలకు అందుతాయని.. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా కొడంగల్‌ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని నరేందర్‌రెడ్డి వివరించారు.కొడంగల్‌లో మిషన్‌ భగీరథ ఆలస్యానికి రేవంత్‌రెడ్డి తీరే కారణమని విమర్శించారు. నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.రేవంత్‌ను ఓడించేందుకు రూ.వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

పెట్రోల్ ధర సెంచరీ కొడుతుందా?

  పెట్రోల్ ధర ఎన్నడూ లేని విధంగా పెరగటంతో ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని దుమ్మెత్తి పోశాయి.సర్వత్రా నిరసన గళం వినిపించటంతో దిగివచ్చిన కేంద్రం లీటరు పెట్రోల్‌పై రూ. 2-50 సుంకాన్ని తగ్గించింది. మరో రూ. 2-50 భరించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది.భాజపా పాలిత రాష్ట్రాలు కేంద్రం సూచన మేరకు సుంకం తగ్గించాయి.కానీ గత నాలుగు రోజులుగా పెట్రోల్ ధర పెరుగుతూ వస్తుంది.పెరుగుతుంది స్వల్పమే అనుకుంటే పొరపాటే .. నాలుగు రోజులుగా పైసల్లో పెరిగిన పెట్రోల్ ధర లీటర్ పై దాదాపు రూపాయి పెరగటానికి కారణయింది.శనివారం లీటరు పెట్రోల్‌పై 18 పైసలు, ఆదివారం 14 పైసలు, సోమవారం 21 పైసలు, మంగళవారం 23 పైసలు చొప్పన నాలుగు రోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై దాదాపు రూపాయి పెరిగింది.హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర 25 పైసలు పెరిగి రూ. 87-21. డీజిల్ 21 పైసలు పెరిగి రూ. 80-61కి చేరింది.కాస్త ఊరట లభించింది అని తేరుకునేలోపే పెట్రోల్ ధర పెరుగుతుండటంతో లీటర్ పెట్రోల్ రూ. 100 చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెరాసకు ఓటేస్తే.. భాజపాకు ఓటేసినట్లే

  హైదరాబాద్‌లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌.. మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని వ్యాఖ్యానించారు.భాజపా సహకారంతోనే కేసీఆర్‌ తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు తెరదీశారని పొన్నం ఆరోపించారు.విభజన హామీలు అమలు కాకున్నా బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహకరించిందని,తెరాసకు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని ఆరోపించారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కాకుండా తెరాస నేతలకు మాత్రమే 119 నియోజకవర్గాల్లో టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.భాజపా నేతలు కరీంనగర్‌లో సభ పెట్టి ప్రజలకు ఏం చెబుతారని పొన్నం ప్రశ్నించారు. ప్రజలకు నెరవేర్చని హామీల గురించి, తెరాసతో స్నేహం గురించి చెబుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు భాజపా ఏం చేసిందని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.భాజపా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిందని పొన్నం ఆరోపించారు. ఈ నాలుగేన్నరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనమేంటో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో భాజపా తెలంగాణలో 119 స్థానాల్లో పోటీచేస్తే 100 చోట్ల డిపాజిట్‌ కూడా రాదని పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ చేశారు.బీజేపీ అభ్యర్థుల లిస్ట్ కూడా కేసీఆర్ రెడీ చేసి అమిత్‌షాకు ఇచ్చారని విమర్శించారు.

తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసినందుకు నాలుగేళ్లు జైలు శిక్ష.!!

జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకుంటేనే ఆ జన్మకో అర్ధం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల విలువ అర్ధం చేసుకోలేని కొందరు.. ఎదిగే వరకు తల్లిదండ్రుల నీడలో బ్రతుకుతారు.. ఎదిగాక వారిని దూరంగా ఉంచి పట్టించుకోవడం మానేస్తారు. అయితే అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారుడుకి కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది.     అహ్మదాబాద్‌కు చెందిన రాంఛోద్‌భాయ్ సోలంకి, జసుమంతి సోలంకికి ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులకు కొడుకులతో వివాదం నడుస్తోంది. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో.. తప్పనిసరి  పరిస్థితుల్లో 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కొడుకుల నుంచి తమకు ప్రతి నెలా కొంత డబ్బు అందేలా చూడాలని కోరారు. ఆ దంపతుల కష్టాలను చూసిన కోర్టు.. ప్రతి నెలా తల్లిదండ్రులకు ఒక్కొక్కరు రూ.900 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి మొదటి కుమారుడు దయాభాయ్ మాత్రం ప్రతి నెలా తల్లిదండ్రులకు డబ్బు చెల్లిస్తున్నాడు. రెండో కుమారుడు కాంతి భాయ్ మాత్రం సరిగా డబ్బు ఇవ్వడం లేదు. రెండో కుమారుడి నుంచి డబ్బు సరిగా అందకపోవడంతో.. ఆ దంపతులు మళ్లీ 2015లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్‌లోనే నాలుగేళ్లు జైలు శిక్ష విధించాలని కోర్టు నోటీసులు పంపిందట. కానీ అరెస్ట్ వారెంట్ మాత్రం రాలేదట. ఆ తర్వాత కూడా అతడు డబ్బు చెల్లించకపోవడంతో శిక్షను ఖరారు చేసింది. మొత్తానికి కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలకు గట్టి సంకేతాలు పంపిందనే చెప్పాలి.

కొండగట్టు భాదితులకు సాయం అందేదెప్పుడు?

  కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ప్రమాదంలో 62 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన అందరికి తెలిసిందే.మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2.50 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కానీ సంఘటన జరిగి నెలరోజులు కావొస్తున్నా బాధితులకు నేటికీ పరిహారం మంజూరు కాలేదు.ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఆపద్బంధు పధకం కింద రూ.50 వేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉండటంతో గత నెల 19 నే  జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట్ర సచివాలయానికి నివేదిక పంపినప్పటికీ పరిహారం మంజూరీ ఉత్తర్వులపై సీఎం సంతకం చేయాల్సి ఉండగా ఎన్నికల నియమావళి అడ్డంకిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకున్నాకగానీ నిధుల మంజూరీపై నిర్ణయం తీసుకోలేమని సీఎంఆర్‌ఎఫ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.ప్రభుత్వం భాదితులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నప్పటికీ రాకపోకలకు అయ్యే ఖర్చులతో కుదేలవుతున్నారు.ఆర్టీసీ సంస్థ రూ.3 లక్షల చొప్పున మంజూరు చేయగా మొదట చేతి ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు ఇచ్చింది.ఆర్ధిక ఇబ్బందులతో భాదపడుతున్న నిరుపేద కుటుంబాలు సాయం అందేదెప్పుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహాకూటమి చర్చలకు అమావాస్య అడ్డు

  సాధారణంగా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అంతా మంచి రోజు మంచి మూహూర్తం చూసుకొని మొదలు పెడతారు.అమావాస్య రోజు ఏ పని ప్రారంభించినా అది ముందుకు సాగదు అని అందరూ విశ్వసిస్తారు.అందుకేనేమో ఈ రోజు జరగాల్సిన మహాకూటమి చర్చని కూడా వాయిదా వేసుకున్నాయి కాంగ్రెస్,తెదేపా,సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు.తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో  తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడ్డాయి.కానీ ఇంతరకు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు.దీంతో సీట్ల సర్దుబాటుపై చర్చించి ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ ముఖ్య నేతలు సమావేశమవ్వాల్సిన నేపధ్యంలో అమావాస్య కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మరో పరువుహత్య?

  మిర్యాలగూడలో ప్రణయ్ హత్య.. హైదరాబాద్లో మాధవిపై దాడి మరువకముందే మరో పరువుహత్య జరిగింది. ప్రేమను తుంచలేక పరువు పేరుతో నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తాడికల్‌కు చెందిన గడ్డి కుమార్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తాడికల్‌ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పొలంలో మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. కుమార్‌కు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు కుమార్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. యువతిని మర్చిపోవాలని లేదంటూ చంపేస్తామని యువకుడిని చాలా సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ యువతితో కుమార్ ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో కుమార్ శవమై కనిపించాడు. దీంతో యువతి బంధువులే కుమార్‌ను చంపేశారని ఇది ఖచ్చితంగా పరువు హత్యే అని యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న శంకరపట్నం పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఈ మార్గంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఆనాడు పాండవులు..ఈనాడు మావోయిస్టులు

  ఛత్తీస్‌గఢ్‌ - ఆంధ్రా సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్‌ పొడియం ముడా అలియాస్‌ మల్లేశ్‌ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.సుకుమా జిల్లాకు చెందిన ముడా మొత్తం 116 మంది భద్రతా సిబ్బంది మృతి కేసుల్లో కీలక పాత్ర పోషించినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు.ముడా గతంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మంత్రి మహేంద్ర కర్మ హత్య సహా మొత్తం 15 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరించారు.అతడి నుంచి పెద్ద ఎత్తున డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆనాడు పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాస్తే నేడు మావోయిస్టులు ఒక చెట్టు తొర్రలో తమ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రంగా ఉంచారు.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మినప అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో ఇవి బయటపడ్డాయి. ఒక చెట్టులో బర్మా తుపాకీ, ఐఈడీ పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బురకాపాల్‌ సమీపంలో ప్రమాదకరమైన మూడు స్పైక్‌ రంధ్రాలను కనుగొని నిర్వీర్యం చేశారు.

బీజేపీ.. ఆపరేషన్ తెలంగాణ

  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేదు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలు, ప్రచారాలతో బిజీబిజీ అయిపోయాయి. ప్రధానంగా తెరాస, మహాకూటమి మధ్య పోటీ జరగనుంది. అధికారం మాది అంటే మాది అంటూ దూసుకుపోతున్నాయి. అయితే ఎప్పటినుండో దక్షిణాదిలో పాతుకుపోవాలని చూస్తున్న బీజేపీ తెలంగాణ మీద ప్రత్యేకదృష్టి పెడుతోంది. ఇప్పటికిప్పుడు అధికారం పొందకపోయినా బలమైన పార్టీగా ఎదగాలని చూస్తోంది. అందుకే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది కానీ కొన్ని స్థానాల మీదనే ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటుంది. దానిలో భాగంగానే 30 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుందట. దీంతో కనీసం 15 స్థానాలైనా గెలిచే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. 15 స్థానాలు ఉంటే ఆటోమేటిక్ గా రాష్ట్రంలో కీలక పార్టీ అవుతుంది. '119 స్థానాల్లో పోటీ చేయి.. 30 స్థానాలు టార్గెట్ చేయి.. 15 స్థానాలు గెలువు.. కింగ్ మేకర్ అవ్వు' ఇది ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఫార్ములా. అంతేకాదు తెలంగాణ ఎన్నికల ప్రచారం విషయంలో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రచారానికి 15మంది పార్టీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 100మంది ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు రాబోతున్నారట. మొత్తానికి బీజేపీ తెలంగాణను బాగానే టార్గెట్ చేసినట్టుంది.

ఖమ్మం టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగ

  సాధారణంగా ఎన్నికల ప్రచారానికి సభలు నిర్వహిస్తారు.కానీ ఇందుకు భిన్నంగా ఓ నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నిర్వహించటం అరుదు.ఖమ్మం జిల్లా  వైరా నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ ని మార్చాలని ఆ పార్టీ అసంతృప్తి నేతలు డిమాండ్‌ చేశారు. ఐదుమండలాల నుంచి వేలాదిమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులను అసంతృప్తులు సమీకరించి వైరాలో భారీ బలప్రదర్శన, సభ నిర్వహించారు.టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నాయకుడు బొర్రా రాజశేఖర్‌ అధ్యక్షతన ఈ సభ జరిగింది.గత నాలుగేళ్లలో మదన్‌లాల్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను అనేక కేసుల్లో ఇరికించి వేధించారని విమర్శించారు. తనకు నచ్చని నాయకులు, కార్యకర్తలను జైలుపాలు చేశారని విమర్శించారు.మదన్‌లాల్‌ వైరాలో పోటీచేస్తే టీఆర్‌ఎస్‌ను ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వేరే ఏ నాయకుడినైనా వైరాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెడితే గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇస్తామని ప్రకటించారు.మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని మార్చాలనే డిమాండ్‌తో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన అసంతృప్తి నేతలు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు లంబాడీ తండా నుంచి బయల్థేరి వెళ్తున్న ఎంపీ వర్గీయులకు ఆ ర్యాలీని వ్యతిరేకించిన మదన్‌లాల్‌ వర్గీయులు పరస్పరం ఎదురు దాడి చేసుకున్నారు.ఓ వైపు వర్గ పోరు మరో వైపు అసంతృప్తి సభలు దీంతో మదన్ లాల్ గెలుపు కన్నా ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి అభ్యర్థిని మార్చి పార్టీని గెలిపించుకుంటారో?లేదో?

పొత్తులో సీట్ల సర్దుబాటు కొలిక్కిచేరేనా?

  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో  తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడ్డాయి.పొత్తులో భాగస్వామ్యం కావటంతో ఒకే వేదికపై పలు పార్టీల నేతలు పాల్గొని ప్రచారం కూడా ముమ్మరం చేశారు.ఇప్పటికే కూటమి పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదాని పార్టీ అధ్యక్షులు సమీక్షించారు.కానీ ఇంతరకు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు.దీంతో మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా ఆమోదం,సీట్ల సర్దుబాటుపై చర్చించి ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ ముఖ్య నేతలు సమావేశమవుతున్నారు.     తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా తాము కోరుకుంటున్న స్థానాలపై కాంగ్రెస్‌కు స్పష్టత ఇచ్చాయి.ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? ఎవరెవరికి ఏయే స్థానాలు కేటాయించాలనే అంశాలపై చర్చించి నిర్ణయానికి రానున్నారు. గెలుపు ప్రాతిపదికగానే స్థానాలను తీసుకోవాలనేది సీట్ల సర్దుబాటులో ప్రధాన అంశం.ఈ చర్చలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు రమణ, చాడ వెంకటరెడ్డి, కోదండరాం పాల్గొంటారు. నేరుగా ప్రధాన నేతలే చర్చలకు దిగుతుండడంతో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వస్తుందని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 18వ తేదీ లోపు పూర్తి స్థాయిలో విడుడల చేయాలని టీపీసీసీ నిర్ణయించింది.పోటీ చేసే అన్ని స్థానాల అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నారు.