ఖమ్మం అసెంబ్లీ.. మహాకూటమి నుండి ఎవరో?

  ఖమ్మం అసెంబ్లీకి తెలంగాణ రాజకీయాల్లో మొదటి నుండి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ ఉత్కంఠను రేపుతాయి. తెలంగాణలో ముందస్తుకు తెరలేవడంతో ఖమ్మం రాజకీయం కూడా వేడెక్కింది. ఇప్పటికే తెరాస, తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అజయ్ కుమార్ సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు తనయుడు. అజయ్ 2014 లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొంది.. అనంతరం తెరాసలో చేరారు. మరోవైపు ఆయనకు పోటీగా టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తుమ్మల కూడా తెరాస లో చేరారు. మంత్రిగా కూడా పనిచేసారు. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో నువ్వా నేనా అంటూ పోటీ పడిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఇప్పుడు మహాకూటమితో దగ్గరయ్యాయి. దీంతో మహాకూటమి అభ్యర్థి ఎవరా? అంటూ చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి బరిలోకి దిగుతారు అంటుంటే.. టీడీపీ శ్రేణులు మాత్రం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతారు అంటున్నారు. అయితే ఈ ఇద్దరు పార్టీ అధినాయకత్వం, కూటమి నిర్ణయమే మా నిర్ణయమని చెప్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఖమ్మంలో బలమైన కేడర్ ఉంది కాబట్టి ఆ స్థానాన్ని మాకే కేటాయించాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం నామా నాగేశ్వరరావు పోటీ చేస్తే ఆ స్థానం వదులుకోవడానికి సిద్ధం.. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సుముఖుత వ్యక్తం చేయకపోతే మాత్రం ఆ స్థానం మాకే అని తేల్చినట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ నుండి రేణుక పోటీ చేయని పక్షంలో బరిలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరరావు లాంటివారు ఉవ్విళ్లూరుతున్నారు. చూద్దాం మరి మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం నుండి ఎవరు బరిలోకి దిగుతారో ఏంటో.  

పరాక్రమ దినోత్సవ వేడుకకు కేంద్రం భారీ ఏర్పాట్లు

  పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులకు రెండేళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా.. సర్జికల్ దాడుల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ‘పరాక్రమ దినోత్సవం’ పేరుతో ఈ నెల 28 నుంచి 30 వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఇదే పేరుతో ఓ దేశభక్తి గీతం కూడా సిద్ధమవుతోంది. ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద పరాక్రమ దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ వేడుకల్లో భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు పాల్గొననున్నాయి. కాగా దేశవ్యాప్తంగా సర్జికల్ దాడుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఇదే తొలిసారి. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్రం కోరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ సైతం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముందుకు రావడం విశేషం.

ఆసియా కప్‌.. రోహిత్ కి రెస్ట్.. కెప్టెన్ గా ధోని..!!

  వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్.. ఆసియా కప్‌ సూపర్-4లో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆప్ఘనిస్తాన్‌తో నేడు టీమిండియా తలపడుతోంది. టోర్నీ పరంగా ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. టీమిండియాకు మాత్రం ప్రత్యేకమైన మ్యాచ్ అనే చెప్పాలి. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. ఈ మ్యాచ్‌కు మాత్రం కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదే ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. తనకు మరోసారి కెప్టెన్‌గా అవకాశం రావడంపై ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. ‘నేను ఇప్పటి వరకు 199 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాను. ఆ తరువాత కెప్టెన్సీ నుంచి వైదొలిగాక.. మరోసారి కెప్టెన్‌గా అవకాశం రావడంతో వన్డేల్లో 200 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది. ఇది నిజంగా విధి కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను. విధిరాతను నేను తప్పకుండా నమ్ముతాను. మరోసారి నేను కెప్టెన్ కావడంలో నా ప్రమేయం లేదు. అయితే కెప్టెన్‌గా నా 200వ మ్యాచ్‌ను విజయవంతంగా ముగిస్తాను. అయితే ఇది పెద్ద విషయమేమీ కాదు’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.

'అయ్యా మాకు బీర్ దొరకట్లేదు' అంటూ కలెక్టర్ కి లేఖ..!!

మందు ఎంత పనైనా చేయిస్తుందని ఊరికే అన్నారా. ఓ మందు బాబు కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదని ఏకంగా కలెక్టర్ కి లేఖ రాసాడు. ప్రజా సమస్యల పట్ల కలెక్టర్ కి లేఖ రాయడం కామన్.. కాని ఇలా బీర్ కావాలంటూ లేఖ రాయడంతో ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగిత్యాల కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అయిల సూర్యనారాయణ అలియాస్ టీవీ సూర్యం కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదని ఫిర్యాదు చేస్తూ లేఖ రాసాడు. ఆ లేఖలో ఇలా పేర్కొన్నాడు.     'శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ గారికి మనవి చేయునది ఏమనగా.. జగిత్యాల పట్టణంలోని వైన్ షాప్ మరియు బార్ అండ్ రెస్టారెంట్ లలో గత కొన్నేళ్లుగా కింగ్ ఫిషర్ బీర్లను అమ్మడం నిలిపివేశారు. ప్రజలలో, మద్యం ప్రియుల్లో, యువత ఎక్కువగా ఇష్టపడి సేవించే బీర్లలో కింగ్ ఫిషర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బీర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ జగిత్యాలలోని మద్యం విక్రయదారులు సిండికేటుగా మారి కింగ్ ఫిషర్ బీరును విక్రయించడం బంద్ చేశారు. ఈ బీర్ల స్థానంలో మరొక నాసిరకం బీరును విక్రయిస్తూ కొనుగోలు దారులను మోసం చేస్తున్నారని మనవి చేస్తున్నాను. భారత రాజ్యంగం లోని ఆర్టికల్-19 ద్వారా సక్రమించిన ప్రాథమిక హక్కులలోని స్వేచ్చతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని  తమకు మనవి చేస్తున్నాను. జగిత్యాల పట్టణం మరియు పలు మండలాల్లో ఏ నెల నుంచి కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం నిలిపేశారన్న అంశంపై విచారణ జరిపించాలని.. మద్యం డిపోల్లో స్థానిక మద్యం వ్యాపారులు కింగ్ ఫిషర్ కోటాను కొనుగోలు చేయకపోవడంపై విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకొని.. కింగ్ ఫిషర్ బీర్లను మద్యం ప్రియులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను’ అని సూర్యనారాయణ లేఖలో పేర్కొన్నారు. కాగా ఆ లేఖను కలెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కి పంపించారు.  

బాబు, లోకేష్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. హైకోర్టులో పిల్!!

  ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ 'క్విడ్ ప్రో కో' కు పాల్పడుతూ 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని.. వారిపై సిబిఐ, ఈడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డు న్యాయాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం కాగితాలకే పరిమితం అయిన కంపెనీలకు అత్యంత ఖరీదైన వేల ఎకరాల భూములను సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్ కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాలకు అధికారికంగా చంద్రబాబు, లోకేష్.. తెరవెనుక కీలకపాత్రధారిగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సిఇవో వేమూరి రవికుమార్ ఉన్నారని జె.శ్రవణ్‌కుమార్ పిల్‌లో ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, రవికుమార్ కలిసి దురుద్దేశంతోనే ఒక ఐటి పాలసీని రూపొందించి ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారని.. పాలన చేతికి రాగానే కాగితాల కంపెనీలకు భూకేటాయింపులు చేసేందుకు వీలుగా ఉన్న చట్టాల్ని అందుకు అనువుగా మార్చేశారన్నారు. ఉద్యోగ కల్పన పేరుతో లోకేష్, రవికుమార్‌లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. ఈ అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తులకు ఆదేశించాలంటూ శ్రావణ్ కుమార్ పిల్‌లో హైకోర్టును కోరారు.

కేసులున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..!!

  ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. కేవలం అభియోగాలు నమోదైతే వారిపై అనర్హత వేటు వేయలేమని.. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చో లేదో అన్న విషయాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలాకే చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. అయితే అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు నేడు తీర్పు వెలువరిచింది. క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో న్యాయస్థానం లేదు. అయితే నేరస్థులను చట్టసభలకు దూరంగా ఉంచే సమయం వచ్చింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్లమెంట్‌కే వదిలేస్తున్నాం. దీనిపై పార్లమెంట్‌ ఓ చట్టం తీసుకురావాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వాటికి సంబంధించిన వివరాలను ఆ అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపింది. పార్టీలు కూడా తమ అభ్యర్థుల కేసుల వివరాలను వెబ్‌సైట్లలో పొందుపర్చాలని ఆదేశించింది.

పేషెంట్ కోరిక.. చివరిసారిగా బిర్యాని తింటా డాక్టర్

  దుబాయ్‌కి చెందిన గులాం అబ్బాస్‌ గతకొంత కాలంగా ఉదర క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ క్యాన్సర్‌ మూడో స్టేజ్‌లో ఉండడంతో ఉదర భాగాన్ని తొలగించాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. శస్త్రచికిత్సకు ఒక రోజు ముందు తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినాలని ఉందని అబ్బాస్‌ డాక్టర్ ని కోరాడు. ఎటూ ఉదర భాగాన్ని తొలగిస్తున్నాం కదా అని ఇందుకు ఆ వైద్యుడు కూడా ఒప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో అబ్బాస్‌ భార్య ఇంట్లో రుచికరమైన బిర్యాని వండి ఆస్పత్రికి తెచ్చింది. అయితే ఉదర భాగాన్ని తొలగించినంత మాత్రాన అబ్బాస్‌ ఇక ఏమీ తినలేడని కాదు. కాకపోతే ఎక్కువ కారంతో ఉన్న ఆహార పదార్థాలు కాకుండా స్వల్పాహారం తీసుకుంటూ ఉండాలి. ‘ఉదరం లేకుండా ఓ మనిషి ఎలా జీవిస్తాడు? అని చాలా మంది అడిగే ప్రశ్నే. కానీ ఉదరం లేకుండా తిన్న ఆహారాన్ని జీర్ణించుకోగలిగే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. కాకపోతే కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి’ అని వైద్య నిపుణులు తెలిపారు.

తెరాస పార్టీ నిట్టనిలువునా చీలుతుంది..!!

  తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలవుతుండటంతో అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ కూడా ఇదే పనిలో బిజీగా ఉంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. తెరాసతో పాటు, మహాకూటమిలోని పార్టీల మీద కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెరాస నిట్టనిలువునా చీలుతుందని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అన్నారు. హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. హరీశ్‌ రావు వ్యాఖ్యలు తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, పార్టీలో చీలికలు రావడం తప్పదని అన్నారు. అరవై ఏళ్లు తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ దోషిగా నిలబడిందని, అటువంటి టీడీపీ ఉన్న మహా కూటమిలో కోదండరాం చేరుతారని అనుకోవడం లేదని అన్నారు. ఒకవేళ కోదండరామ్ కూటమిలో చేరితే ఉద్యమ నాయకుడి విలువ, గౌరవం పోతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మహాకూటమితో అంటకాగితే, తెలంగాణ ప్రజలు క్షమించరని లక్ష్మణ్ అన్నారు.

హరికృష్ణ ఉద్యమకారుడా లేక కేసీఆర్‌కు చుట్టమా.. కొండా సురేఖ ఫైర్

తెరాస పార్టీ ప్రకటించిన తొలిజాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న కొండా సురేఖ.. తెరాసను, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మందుగోలీలు ఇచ్చే సంతోష్‌ను రాజ్యసభకు పంపారని విమర్శించారు. లష్కర్‌ బోనాలకు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవితకు అర్హత ఏంటి? అంటూ ప్రశ్నించారు. అలాగే కుమారుడికి పట్టం కట్టేందుకు కేసీఆర్‌ ఆరాటపడుతున్నారని ఆరోపించారు.     కేసీఆర్‌ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, ప్రతి పనికి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బార్లకు అనుమతి ఇచ్చారని అన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించలేని అసమర్ధ ప్రభుత్వం అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని, ఉద్యమంలో కోదండరాంను పొగిడినవాళ్లు ఇప్పుడు దూషిస్తున్నారని.. ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మశాంతించాలంటే తెరాసను ఓడించాలని అన్నారు. మా కూతురు ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఉద్యమకారులకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ స్మారకానికి ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేసారు. హరికృష్ణ ఉద్యమకారుడా లేక కేసీఆర్‌కు చుట్టమా లేదా తెలంగాణ పోరాట యోధుడా, అమరవీరుల కుటుంబ సభ్యుడా అని ఆమె ప్రశ్నించారు. హరికృష్ణ చనిపోయిన కొద్ది నిమిషాల్లోనే తండ్రీకొడుకులు ఇద్దరూ వెళ్లారని, అంత్యక్రియలు పూర్తయ్యే దాకా కేటీఆర్ అక్కడే ఉన్నారని, 450 గజాల స్థలాన్ని స్మారక స్థూపం కోసం కేటాయించారని.. ఎవడబ్బ సొమ్మని హరికృష్ణకు తెలంగాణ భూమిని ధారాదత్తం చేశారని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మీకు టైం దొరకలేదని.. మాజీ సీఎం టి.అంజయ్య భార్య మణెమ్మ చనిపోతే మీకు తీరిక దొరకలేదని.. కొండగట్టులో 60మంది చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేసీఆర్‌కు తీరిక దొరకలేదని ఆమె విమర్శించారు.

కేసీఆర్‌ కు నేనేంటో చూపిస్తా - జగ్గారెడ్డి

  కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి 2004 లో నకిలీ పాస్ పోర్టులతో గుజరాత్ కి చెందిన వారిని కుటుంబసభ్యులుగా పేర్కొని.. వారిని అమెరికాలో వదిలి వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ కూడా చేసారు. అయితే తాజాగా ఆయన బెయిల్ పై విడులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడమే తాను చేసిన నేరమని జగ్గారెడ్డి అన్నారు. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం నాటి కేసును కేసీఆర్ తిరగదోడారని ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతోంది కనుకనే తనను కేసీఆర్ కుటుంబం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పైందని.. ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని.. లేకుంటే పాత కేసులను తిరగదోడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఇకపై తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. ఎన్నికలకు నెలరోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేదా నియంత పాలనైన కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకుని తీర్పు ఇవ్వాలన్నారు. కేసీఆర్ జీవితంలో ఏ తప్పూ చేయాలేదా? అని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న జగ్గారెడ్డి తను నిర్దోషిగా బయటపడతానన్నారు.

ఐరాస సదస్సులో చంద్రబాబు కీలక ప్రసంగం

  ఐక్యరాజ్యసమితి వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పురోగతిని వివరించారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ సదస్సులో బాబు తన తొలిపలుకులు తెలుగులో మాట్లాడటంతో సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారిందని, ఇది ప్రపంచానికే ఆదర్శం అని అన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అమలుతీరును వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.

తాజా రాజకీయాలపై హరీష్ రావు స్పందన

  ముందస్తుతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తెరాస, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తెరాస సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెరాస గెలుపుపై ధీమా వ్యక్తం చేయడంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెరాసకు 100 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని కూటమిలు కట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కోతలు, ఎరువుల కొరత తప్ప ఏమీ ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు గెలవమని తెలిసి ఆపద మొక్కులు మొక్కుతున్నారని అన్నారు. ఓడిపోయే నాయకులే మాటలెక్కువ మాట్లాడుతారని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గం.. దేశానికే రోల్ మోడల్ అవుతుందని అన్నారు. కేసీఆర్ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటూ కొనియాడారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవీ, చెప్పనివీ అమలు చేశామని హరీష్‌‌రావు అన్నారు. మరి హరీష్ రావు 100 సీట్ల ధీమా నిజమవుతుందో లేదో చూడాలి.

మహాకూటమిలో లొల్లి.. కాంగ్రెస్, టీడీపీ పొత్తు కష్టమేనా?

తెలంగాణలో తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్, తెరాసకు గెలుపును దూరం చేయడం కోసం.. ఏ పార్టీకైనా దగ్గరవడానికి సిద్దపడింది. అదే మహాకూటమికి పునాది పడేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ మహాకూటమితో తెరాసను గద్దె దించడం ఏమో కానీ.. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తలలు పట్టుకుంటుంది. కూటమిలో భాగంగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి.. 30 నుంచి 35 వరకు స్థానాలను కూటమిలోని మిగతా పార్టీలకు కేటాయించాలనుకుంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది.     టీడీపీ 25 నుండి 30 స్థానాలు కేటాయించాలని కోరుతోందట. అమ్మో అన్ని స్థానాలు కష్టం.. మ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు కూడా అవకాశం కల్పించాల్సి ఉన్నందున ఓ 15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోందట. మరి టీజేఎస్‌ ఏమన్నా తక్కువ తిన్నదా.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాము.. టీడీపీ కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివాం.. అందుకే టీడీపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారో దానికన్నా ఎక్కువ మాకు రెండు స్థానాలు కేటాయించాలని పట్టుబడుతుందట. అంతేకాదు తాము 35 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం అని నియోజకవర్గాల లిస్ట్ కూడా ఇచ్చిందట. అయితే టీజేఎస్‌ తరఫున అభ్యర్థులు బలంగా లేరని.. కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలనే టీజేఎస్‌ అడుగుతోందట. ఈ రెండు పార్టీలకు ఇన్ని సీట్లు ఇచ్చేస్తే ఇక తమకు మిగిలేది ఏంటి అని కాంగ్రెస్ ఆందోళన చెందుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని మహాకూటమి అంటున్నామే గానీ ఇన్ని సీట్లు ఇచ్చేస్తే మొదటికే మోసం రావొచ్చని కాంగ్రెస్ ఆందోళన చెందుతుందట. మరి మహాకూటమిలో మొదలైన ఈ సీట్ల లొల్లి సాఫీగా ముగుస్తుందో లేదో చూడాలి.

ప్రవాసాంధ్రుల సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హత్యలను అందరు ఖండించాలని పిలుపునిచ్చారు. హత్యలకు, విధ్వంసానికి ప్రజాస్వామ్యంలో తావులేదని అన్నారు. ప్రాణం పోసే ప్రతిభ లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికి లేదని స్పష్టం చేశారు. నిర్మాణమే అందరి బాధ్యత కావాలి తప్ప.. విధ్వంసం నైజం కారాదని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రవాసాంధ్రులకు ఓటుహక్కు వస్తోందని, అమెరికా నుంచే వారంతా ఓటేయవచ్చని తెలిపారు.     ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటి మీద పెట్టిన శ్రద్ధ వల్లే ఈరోజు ఇంతమంది అమెరికా రాగలిగారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వందలాది ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడం వల్లే రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రతిభ పెరిగిందని అన్నారు. దూరం అనేది పెద్ద సమస్య కాదని, సొంత గ్రామానికి ఏం చేయాలో ప్రవాసాంధ్రులు ఆలోచించాలని కోరారు. అమెరికాలోని అన్ని నగరాల్లో తెలుగువారు ఉన్నారని.. వారంతా అటు వృత్తిలో రాణిస్తూనే, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారని ప్రశంసించారు. సమాజ సేవలో ముందున్న ప్రవాసాంధ్రులందరికీ అభినందనలు తెలిపారు. ఇటీవలే అమెరికాలో లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు బ్రహ్మాండంగా నిర్వహించారని.. అదే స్పూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. ఏ పార్టీ వల్ల పైకి వచ్చామో ఆ పార్టీకి ప్రచారం చేయడం అందరి బాధ్యతని తెలిపారు. ప్రపంచ దేశాలలో పసుపు జెండా రెపరెపలాడుతుందని ఎవరూ ఊహించలేదన్న చంద్రబాబు.. ఇది ఒక రాజకీయ పార్టీకి దక్కిన అపూర్వ గౌరవంగా పేర్కొన్నారు.

అలిగిన దత్తాత్రేయ.. మెట్రో రైలు మధ్యలోనే దిగిపోయారు..!!

  ఈ రోజు అమీర్‌పేట - ఎల్బీనగర్ మెట్రో రైలు మార్గం ప్రారంభమైన విషయం తెలిసిందే. గవర్నర్‌ నరసింహన్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని, కేటీఆర్, తలసాని తో పాటు.. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం గవర్నర్‌ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. ఈ సమయంలో దత్తాత్రేయ అలకబూనినట్టు తెలుస్తోంది. మెట్రో రైలుపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మెట్రో రైలు ఎంజీబీఎస్‌ స్టేషన్‌కు రాగానే దత్తాత్రేయ మధ్యలో దిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. అనంతరం గవర్నర్, మంత్రులు ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌ను పరిశీలించారు.

అమీర్‌పేట - ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం

  అమీర్‌పేట - ఎల్బీనగర్‌ మెట్రో రైలు మార్గాన్ని సోమవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్‌ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులను అనుమతించనున్నారు. అమీర్‌పేట నుండి ఎల్బీనగర్ కు సుమారు 16కి.మీ దూరం ఉంటుంది. ఈ దూరాన్ని కేవలం 50 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు. బస్సుల్లో అయితే సుమారు గంటన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉంటుంది. నేడు ప్రారంభమైన 16 కిలోమీటర్ల మెట్రోమార్గంతో కలిపి హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గం పొడవు 46 కిలోమీటర్లకు చేరింది. దీంతో దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత ఎక్కువ దూరం మెట్రో రైలు మార్గం ఉన్న నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది.

చంద్రబాబుపై పవన్ కొత్త స్కెచ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుస యాత్రలు, ప్రభుత్వం మీద విమర్శలతో హడావుడి చేసారు. అయితే గత కొద్దిరోజులగా మౌనంగా ఉన్న ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవైపు నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గరకు చేరుకొని రొట్టెల పండగలో పాల్గొనడం. మరోవైపు తరువాతి యాత్రల డేట్ లను అధికారికంగా ప్రకటించడం. దీంతో అభిమానులు పవన్ జోరు మళ్ళీ మొదలైంది అంటూ సంబరపడిపోతున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇదంతా బీజేపీ, జనసేన కలిసి వేస్తోన్న స్కెచ్ ఆరోపణలు చేస్తున్నారు.     ఆపరేషన్ డైవర్షన్ లో భాగంగా చంద్రబాబు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే రోజు.. పోలవరం వెళ్లి విమర్శలు చేయడానికే పవన్ రంగంలోకి దిగుతున్నారని తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఐక్యరాజ్యసమితిలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం ఉన్న నేపధ్యంలో.. జాతీయ స్థాయిలో బాబుపై ఫోకస్ పడింది. దీనిని డైవర్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ను బీజేపీ అధిష్టానం మళ్ళీ రంగంలోకి దించిందని సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పవన్ అడుగులనే ఉదాహరణగా చూపిస్తూ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నారు. గతంలో కూడా కేంద్రంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్న సమయంలోనే పవన్ విరుచుకుపడడం.. అలాగే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు, లోకేష్ లు అవినీతి చేసేసారంటూ పవన్ విమర్శించడం.. ఇలాంటి సంఘటనలు గుర్తుచేస్తూ తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం పవన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో కాలమే నిర్ణయించాలి.

మైనింగ్ వివాదం.. ఎరవేసి ప్రాణం తీశారు

  మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలపై నక్సలైట్ల దాడి ఎలా జరిగిందనే విషయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వీరు తమ మైనింగ్ క్వారీల వద్దకు వెళుతుండగా మావోయిస్టులు దాడి చేసి చంపేశారని తొలుత ప్రచారం జరగగా, ఆ తరువాత వీరు గ్రామదర్శినిలో పాల్గొనేందుకు వెళుతుండగా మావోల దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం వేరని వీరిని మావోలే ఒక పథకం ప్రకారం తమవద్దకు రప్పించుకొని ఆ తరువాత వీరిని మట్టుబెట్టారని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యూహాన్నే 'బెయిటెడ్‌ ఆంబుష్‌' అంటారని వారు చెబుతున్నారు. బెయిటెడ్‌ ఆంబుష్‌’... అంటే ఎరవేసి మట్టుపెట్టడం! ఆ ‘ఎర’ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఒక చిన్నపాటి ఘటనకు పాల్పడి, దానిపై ఆరా తీసేందుకు వచ్చిన బలగాలను మట్టుపెట్టి పెను విధ్వంసానికి పాల్పడవచ్చు. లేదా... గిరిజనుల రూపంలో అభ్యర్థనలు పంపించి, అక్కడికి వచ్చిన జవాన్లను మట్టుపెట్టవచ్చు. ఇదే... బెయిటెడ్‌ ఆంబుష్‌. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్‌కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ దిట్ట. గత ఏడాది మే 12న బస్తర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను బెయిటెడ్‌ ఆంబు్‌షలోనే ఉచ్చులోగి లాగారు. ఈ ఘటనలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం విశాఖ మన్యంలోనూ అధికార పార్టీకి చెందిన నేతలను మాట్లాడుకుందాం అనే ఎర వేసి మట్టుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మిలీషియా సభ్యులు వస్తారని అంచనా వేయని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ ఉచ్చులో చిక్కారని పోలీసులు అంటున్నారు. మైనింగ్‌ వివాదమే వీరి ప్రాణాలను బలితీసుకున్నట్లు తెలుస్తోంది.కిడారి, సోమ ఇద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా గనుల వ్యాపారంలో ఉన్నారు. సోమ ఓ గనిని మరొకరి పేరిట లీజుకుతీసుకొని భారీగానే పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అయితే, అక్కడ తవ్వకాలు జరపొద్దని మావోయిస్టులు సోమను హెచ్చరించారు. ఎమ్మెల్యేను కూడా లేటరైట్‌ విషయంలో నాలుగుసార్లు హెచ్చరించినట్లు తెలిసింది. అయితే, బయట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, మైనింగ్‌ నిలిపివేస్తే తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో మావోయిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు తాను సహకరిస్తానంటూ ఏజెన్సీకే చెం దిన ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. ‘ఇప్పటికే వారి నుంచి హెచ్చరికలు అందుకున్నాం కదా.. ఎంతకాలమని దీనిని నాన్చుతాం.. అప్పులు పెరిగిపోతున్నాయి.. ఈ సమస్య పరిష్కారమైతే బాధలు తీరిపోతాయి' అని నేతలు భావించి వెళ్లినట్టు తెలుస్తోంది. మావోయిస్టులు వీరిని మాటల పేరిట తీసుకుకెళ్లి మట్టుపెట్టారు.

విజయవాడలో కలకలం.. పరువు హత్య పోస్టర్లు..!!

  మిర్యాలగూడలో ఈమధ్య పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. ప్రణయ్ అనే వ్యక్తిని మామ మారుతీరావు దారుణంగా చంపించాడు. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఇదే తరహా దాడి హైదరాబాద్ లో ఒక జంట మీద జరిగింది. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. ఇలా వరుస సంఘటనలతో ప్రేమికుల్లో భయం మొదలైంది. మొన్నటికి మొన్న గుంటూరులోని కొన్ని ప్రేమ జంటలు మాకు రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాయి. అయితే ఇప్పుడు విజయవాడలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. విజయవాడలో పరువు హత్య పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సోని రాహు ప్రియ పరువు హత్యకు గురికానున్నారంటూ ముద్రించిన పోస్టర్లు నగరంలో వెలిశాయి. సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. అయితే భయపెట్టే ఉద్దేశ్యంతోనే ఇలా చేసారని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు పోస్టర్లలో పేర్కొన్న సోని రాహు ప్రియ ఎవరు? పోస్టర్లు వేసింది ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.