మాటల తూటాలు పేల్చిన కేసీఆర్
posted on Oct 4, 2018 @ 11:08AM
తెరాస అధినేత,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసారు.బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రతి పక్ష పార్టీలపై తీవ్ర స్థాయి లో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ మహాకూటమిపై, చంద్రబాబు, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు.ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణ పాలిట రాక్షసి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతుంటే రాక్షసానందం పొందారని ఆరోపించారు. తెలంగాణ నుంచి 7 మండలాలను, సీలేరు పవర్ ప్లాంటును బలవంతంగా గుంజుకున్నారని ధ్వజమెత్తారు. ‘ఎవ్వడైతే తెలంగాణను నాశనం చేసిండో, ఎవడైతే గుండు గొట్టిండో, నిర్దాక్షిణ్యంగ ఎన్‌కౌంటర్ల పేరు మీద ఎవ్వడైతే వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నడో తెలంగాణ ద్రోహి.. చెడిపోయి చంద్రబాబునాయుడితోని పొత్తా, మీ బతుకులకు? ఏమయా అడుక్కుంటే మేమిస్తమయ్యా నాలుగు సీట్లు గావాలంటే.. ఇదా మీ బతుకు?’’ అని నిప్పులు చెరిగారు.'‘ఢిల్లీకి, అమరావతికి గులాములు చేస్తున్నారు. థూ... మీ బతుకులు చెడ’’ అంటూ విరుచుకుపడ్డారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం చంద్రబాబు రూ.500 కోట్ల నిధులు, మూడు అద్దె హెలికాప్టర్లు ఇచ్చి సాయం చేయనున్నట్లు కేసీఆర్ ఆరోపించారు.కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నపుడు తెలంగాణ మంత్రులెవరూ ప్రశ్నించలేదని ప్రస్తావించారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.మహారాష్ట్రతో ఒప్పందం జరిగినపుడు 1974లోనే ఒప్పందం జరిగిందని చెప్పారని ప్రస్తావించారు. అప్పటి జీవో చూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆయన పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ తనను బట్టేబాజ్ అనడంపై సీఎం మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా తిట్టొచ్చా అని ప్రశ్నించారు. తన నోరు కూడా చెడ్డదే అని నోరు తెరిచానంటే తెల్లారే వరకు తిట్టగలనని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత స్థాయిలో ఉన్నందువల్లే తాను స్పందించడం లేదన్నారు.2014లో అసెంబ్లీలో రెండేళ్లలో రెప్పపాటు కరెంటు పోకుండా చేస్తానంటే జానారెడ్డి.. అలా చేస్తే గులాబీ కండువా వేసుకొని ప్రచారం చేస్తామన్నారు. ఇప్పుడు తప్పించుకునే యత్నం చేస్తున్నారని ఎద్దేవాచేశారు.కేసీఆర్ బీజేపీ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.తెలంగాణాలో బీజేపీ ఎక్కడ ఉందో కూడా తెలియదు.ఇళ్ల కిరాయిల కడతామని ఆ పార్టీ నేత లక్ష్మణ్ అంటున్నారు.అధికారంలోకి రాగానే నల్లధనం తీసుకువస్తానని ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రకటించారని, ప్రతీ కుటుంబానికి 15 లక్షలు ఖాతాలో వేస్తామని చెప్పారని గుర్తు చేశారు.ఈ డబ్బులిస్తే మేమే మీ ఇంటి కిరాయి కడతాం. ఇప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.