కిడారి హత్య ముందురోజు.. పోలీసులు నాటుకోడి.. మావోలు కల్లు
posted on Oct 4, 2018 @ 11:51AM
పోలీసులు అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా మావోయిస్టులు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో చాలా అలెర్ట్ గా ఉండాలి. కానీ కొందరి పోలీసుల్లో అది లోపించింది. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రత్యేక పోలీసుల బృందం విచారణ సందర్భంగా వెలుగుచూస్తున్న విషయాలు నివ్వెరపరుస్తున్నాయట. మావోల దాడి గురించి వందలాదిమందిని ప్రశ్నిస్తున్న క్రమంలో వారికి ప్రత్యక్షంగా సహకరించిన కొందరిని పోలీసులు గుర్తించి ఆరా తీయగా.. దాడికి ముందు రోజు రాత్రి పోలీసులు నాటుకోడితో పార్టీ చేసుకుంటే, మావోయిస్టులు జీలుగు కల్లుతో మజా చేసుకున్నారని తెలిసి విస్తుపోయారట.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు స్వీయ రక్షణ విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పోలీసులు.. మామూళ్ల మత్తులో పడి గ్రామాల్లో తిరగడమే మానేశారని ఉన్నతాధికారులకు అందిన నివేదికల్లో తేలింది. మైదాన ప్రాంతాల్లో పనిచేసి పనిష్మెంట్‌పై అరకు ప్రాంతానికి వచ్చిన ఓ పోలీసు అధికారి ఇక్కడకు వచ్చిన తరువాత విందుల్లో మునిగితేలడమే సరిపోయిందట. గిరిజనులు ప్రతి ఆదివారం తనకు తప్పనిసరిగా నాటుకోడి పంపాల్సిందేననేది ఈ అధికారి హుకుం జారీ చేశారట. ఆ క్రమంలో ఒక్కోసారి శనివారం రాత్రి నుంచే పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయే ఆయన.. ఆ రోజు తనకు అత్యంత సన్నిహితులైన మిత్రులతో కలసి మంచి విందు చేసుకుంటారట. అలాగే మావోల అరకు దాడి ముందు రోజు సెప్టెంబర్ 22 రాత్రి కూడా ఆయన అదే పనిలో ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆ రాత్రి ఆయన గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఒక వైద్యుడితో కలసి పార్టీ చేసుకున్నారట. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిన్సియర్ గా డ్యూటీ చేసేవాళ్ళని ఇలాంటి ప్రాంతాల్లో ఉంచితే అలెర్ట్ గా ఉంటారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటారు. కానీ సరిగ్గా పనిచేయని వ్యక్తిని పనిష్మెంట్ పేరుతో ఇలాంటి ప్రాంతంలో డ్యూటీ వేస్తే ఎలా?. అతను పార్టీలు, విందులు చేసుకుంటాడు తప్ప డ్యూటీ చేయడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నుండైనా ఇలాంటి ప్రాంతాల్లో కరెక్ట్ గా డ్యూటీ చేసే వాళ్ళని ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఇక మావోల విషయానికొస్తే ఎమ్మెల్యే కిడారి హత్య కోసం తమకు సహకారం అందించేందుకు ఒడిశా,ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం నుంచి గిరిజనులను రప్పించారట. అలా సెప్టెంబరు 22 రాత్రికి గ్రామానికి వచ్చిన ఆ గిరిజనుల్లో అత్యధికులు మహిళలు ఉండటంతో పాటు వారి కోరికమేరకు మావోలు స్థానికుల చేత సమీప అడవి నుంచి జీలుగకల్లు తెప్పించి పార్టీ ఇచ్చారట. టార్గెట్ ఫినిష్ చేసే వ్యూహంలో భాగంగా స్థానిక గిరిజనుల పేర్లను వాడుతూ ఎమ్మెల్యే అనుచరులకు మావోలే ఫోను చేయించారట. మా ఊరికి ఎమ్మెల్యే సార్ ఎన్ని గంటలకు వస్తున్నారు?.. అని వారితో అరా తీయించారని పోలీసుల విచారణలో తెలిసిందట. నిజానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాత్రమే మావోల టార్గెట్ కాగా ఆయనతో కలసి రావడంవల్లే మాజీ ఎమ్మెల్యే సోమనూ చంపారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇక కిడారికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయన సన్నిహితులనుంచే తెలుసుకున్న మావోలు,కిడారికి బంధువులు అయ్యే ఓ జంటను బెదిరించి ఆయన రాకపోకల గురించి పక్కాసమాచారం తెలుసుకున్నారట. అలాగే కిడారి కారు డ్రైవర్,అనుచరులు,గన్‌మెన్ నంబర్లు కూడా దాడికి ముందే మావోయిస్టులు సంపాదించారని తెలుస్తోంది.