ఐటీ కార్యాలయానికి రేవంత్
posted on Oct 3, 2018 @ 12:57PM
రేవంత్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు,అనుచరుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంట్లో లాప్‌టాప్, హార్డ్ డిస్కులు, పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు అక్టోబరు 3న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవన్‌కు రేవంత్ చేరుకున్నారు. ఐటీ అధికారులు జారీ చేసిన సమన్లను రేవంత్ తన వెంట తీసుకువచ్చారు. రేవంత్‌తో పాటు ఉదయ్‌సింహ కార్యాలయానికి వచ్చారు.
రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ ఇళ్లలో చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పరిశీలనను ఐటీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.ఓటుకు నోటు కేసులో 50లక్షల రూపాయల గురించే ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.ఈ రోజు జరిగే విచారణలో రేవంత్‌రెడ్డిని ఐటీ అధికారులు దీనిపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, మామ పద్మనాభరెడ్డి, స్నేహితుడు ఉదయసింహ, సెబాస్టియన్‌ను ప్రశ్నించిన ఐటీ అధికారులు ఓటుకు నోటు కేసులో విచారించారు.ఇదిలా ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఆందోళనతో ఐటీ కార్యాలయానికి రేవంత్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.