భారత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డ్
posted on Oct 3, 2018 @ 12:33PM
ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు జస్టిస్ రంజన్ గొగొయ్.భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా గొగోయ్ రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ గొగొయ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2019 నవంబరు 17న విరమణ పొందే వరకు 13 నెలల పాటు జస్టిస్ గొగొయ్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
ఇప్పటివరకు సీజేఐగా కొనసాగిన జస్టిస్ దీపక్ మిశ్ర అక్టోబరు 1న పదవీ విరమణ చేశారు. సాధారణంగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తన వారసుడిగా సీజేఐ సిఫార్సు చేస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో తన తర్వాత అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్ గొగొయ్ పేరును జస్టిస్ దీపక్ మిశ్ర ప్రతిపాదించారు. ఈ సిఫార్సుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ గొగొయ్ నేడు సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.కాగా జస్టిస్ దీపక్ మిశ్రా స్థానంలో గొగోయ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ గతవారంలో దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.