కేసీఆర్‌ విమర్శలు..రాష్ట్రంలో ఐటీ దాడులు..సీఎం అత్యవసర భేటీ

ఒక పక్క తెలంగాణాలో కేసీఆర్‌ మరో పక్క రాష్టంలో ఐటీ అధికారుల దాడులు ఈ నేపధ్యం లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే కొందరు మంత్రులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.మంత్రివర్గ సమావేశంలో రాష్టం లో జరుగుతున్నఐటీ దాడులపై చర్చ జరిగినట్టు సమాచారం.చంద్రబాబు నేతలకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని,నేతలంతా ధైర్యంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.     ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులపై తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్,ఏపీ మంత్రి ఆదినారాయణ,కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.అమరావతిలో మీడియా తో మాట్లాలిన కనకమేడల ఐటీ సోదాల పేరుతో కేంద్రం మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. అధికార దుర్వినియోగంలో మోదీ ప్రభుత్వం ముందజలో ఉందని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష పట్ల నిలదీస్తున్నందునే ఈ దాడులు జరుగుతున్నాయని కనకమేడల ఆరోపించారు.కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పథకం ప్రకారమే ఐటీ దాడులు జరుగుతున్నాయని,రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఐటీ దాడులు చేపట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌కు నోటి దురుసు ఎక్కువని, సీఎం హోదాలో ఉండి వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పడిపోతుందని..కూటమిదే గెలుపని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఏపీ మంత్రి ఆదినారాయణ ఓటమి భయంతోనే కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేశారని,కేసీఆర్‌కి నోటి దురద ఎక్కువై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రాజకీయ కోణంలోనే ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే విషయం తెలుసుకోవాలని మంత్రి సూచించారు.

తెరాస ప్రచారానికి అడ్డంకులు

  ఓ వైపు తెరాస అధినేత కేసీఆర్‌ రానున్న ఎన్నికల్లో 100 కి పైగా సీట్లు గెలుస్తామని బహిరంగ సభల్లో వెల్లడిస్తుంటే మరో వైపు తమ నియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్లిన నేతలకు చేదు అనుభవం ఎదురవుతుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వొడితెల సతీశ్ కుమార్ ని కాంగ్రెస్ కార్యకర్తలు,స్థానికులు అడ్డుకొని నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు పై బయటయించి నిరసన తెలుపగా వారిని బూటు కాలుతో తన్నుకుంటూ వెళ్లి వివాదంలో చిక్కుకున్న సంగతి మరవకముందే మరో ఇద్దరు తెరాస ప్రజాప్రతినిధులకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.ఖమ్మం జిల్లా చీమలపాడులో ప్రచారానికి వెళ్లిన వైరా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది.‘‘మాపై అటవీ సిబ్బంది దౌర్జన్యాలు కొనసాగుతుంటే.. మీరు ఏమైనా చేశారా? ఇప్పుడు మీకు మేం ఎందుకు ఓట్లేయాలి?’ అంటూ ఆయనను పోడు రైతులు నిలదీశారు.అలానే ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ప్రచారంలో భాగంగా తలమడుగు మండలం కుచ్లాపూర్‌ వెళ్లగా చెరువు నిర్మిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీ ఇస్తున్నారే తప్ప అమలుచేయడం లేదని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి మూడేళ్లయినా ముందుకుసాగడం లేదని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు,దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి ప్రశ్నల పరంపరను తట్టుకోలేక బాపూరావు.. తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘మళ్లీ మీ ఊరికి ఎన్నికల ప్రచారానికి రాను’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా?

  తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు పలువురు టీడీపీ నాయకులు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి నక్కా ఆనందబాబు ‘కేసీఆర్ నీకు సిగ్గుందా?.. నీలాంటి నీచుడు రాజ‌కీయాల్లో ఉండ‌రు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.పోటుకాడు త‌న్నుకోవ‌డానికి వ‌స్తాడా? రమ్మనండి అంటూ సవాల్ విసిరారు.చంద్రబాబుపై కేసీఆర్‌ వాడిన భాషను దేశంలో మరే సీఎం ఉపయోగించరని, తెదేపాని చూస్తే కేసీఆర్‌కి వణుకు పుడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెదేపాయే అని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని ఆనందబాబు మండిపడ్డారు.2009లో చంద్రబాబుతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని మంత్రి ప్రశ్నించారు.కేసీఆర్‌ మనిషి అయితే ఆయనకు మూడో కన్ను ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో ఆయన చేసిన ఒక మంచిపని చెప్పగలరా అంటూ ఆనందబాబు నిలదీశారు.ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లను చూసి సిగ్గు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా? అని...తమకు పదేళ్ల హక్కు ఉందని ఆనందబాబు స్పష్టం చేశారు. కేసీఆర్‌ చేసిన దొంగదీక్షలతో తెలంగాణ రాలేదని, కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకరాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తా

నల్గొండలో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్‌ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలుస్తామని అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.నల్గొండ పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు.రౌడీలకు, దోపిడీదారులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, రౌడీలను గెలిపిస్తే నల్గొండలో నిత్యం హత్యలు, దోపిడీలే అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎ‌ల్‌బీసీ) సొరంగమార్గం పూర్తి చేస్తానని హామినిచ్చిన కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఎస్ఎ‌ల్‌బీసీలో కమీషన్లు రావనే పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దామరచర్ల ప్లాంట్‌ను ఆపేస్తామన్నారు.ఈ ప్లాంట్ల వల్ల మిర్యాలగూడ పరిసరాలు కాలుష్యమవుతున్నాయని పేర్కొన్నారు.మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రిని లేకుండా చేసి బతుకమ్మ చీరల గురించి కేసీఆర్‌ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాజకీయాలపై అమిత్‌షా ఆరా

  2014 సాధారణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయ ఘంటిక మోగించింది.దేశంలో 22 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసిన కమలనాథులు దక్షిణాదిలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల కార్యాచరణ రూపొందిస్తున్నారు.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.ఈ నెల 10న కమలనాథులు కరీంనగర్‌లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు అమిత్‌షా హాజరు కానున్నారు. తెలంగాణలో ముమ్మర ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర ప్రముఖులను సభలకు రప్పించేందుకు స్థానిక నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయటంతో పాటు తెలంగాణ ప్రజలు, అమరుల ఆకాంక్షలు ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపకల్పనకు సామాజిక వేత్తలు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది.

చంద్రబాబు నయ వంచకుడు

  తెరాస అధినేత కేసీఆర్‌ చంద్రబాబు,కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు.. నయ వంచకుడు. అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. తెలుగువాళ్లమంతా ఒక్కటి, మనమిద్దరం ఒకటిగా ఉంటే దిల్లీలో పట్టు ఉంటుందని కేసీఆర్‌కు చెప్పినా వినలేదు అందుకే మహాకూటమి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మహాకూటమా? కాలకూట విషమా?.. మహాకూటమా.. మన తెలంగాణను నాశనం చేసే గూటమా? అని ఎద్దేవా చేసారు.తాను, మోదీ ఒక్కటైపోయారంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ‘‘ నాలుగేళ్లు మోదీ సంకలో ఉన్నది నువ్వుకాదా? ఇన్నేళ్లు మోదీ సంకనాకింది నువ్వుకాదా? మోదీ కాళ్లుపట్టుకుని నా ఏడు మండలాలను గుంజుకున్నావు. సీలేరు పవర్‌ ప్రాజెక్టును పట్టుకుపోయావు. హైకోర్టు విభజనను అడ్డుకున్నావు’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ దెబ్బ ఏందో ఓసారి తగిలితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావ్‌. మా బతుకు మేం బతుకుతున్నాం. మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో ఆలోచించుకో. తెలుగు దేశం పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు. చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న తెలంగాణను విజయవాడకు అప్పగిస్తామా? దరఖాస్తు పట్టుకుని అమరావతి వెళ్లాలా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారు. మీ అధికారం కోసం, స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు పదవులకోసం తెలంగాణను వాడుకున్నారు.. ఆడుకున్నారు అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. బారెడు మూరెడు కబుర్లు చెప్పే జానారెడ్డి కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో తెలంగాణ కోసం ఉద్యమిద్దామని తనకు చెప్పారని కేసీఆర్‌ వెల్లడించారు.మంత్రి పదవి కోసమే తెలంగాణ అంటున్నావని జానారెడ్డి ముఖంపైనే చెప్పానన్నారు. విజయభాస్కర్‌రెడ్డి నేను అన్నట్లే జానారెడ్డిని పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే తెలంగాణ ఊసే ఎత్తలేదు.1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపింది ఎవరు? 1969లో తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిందెవరు? మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ మరణాలకు కారణం కాంగ్రెస్‌ నేతలు కాదా? మణుగూరు విద్యుత్‌ ప్లాంట్‌ విజయవాడకు తరలిస్తే కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదు. కాంగ్రెస్‌ నేతలు నల్గొండ జిల్లాను నాశనం చేశారు. ఫ్లోరైడ్‌తో లక్షా 40వేల మంది జీవితాలు నాశనమయ్యాయన్నారు.నల్గొండ ఆర్థిక ముఖచిత్రం దామచర్ల థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుతో మారుతుందని చెప్పిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 119 స్థానాలకు గాను తాజా సర్వేలో 7 స్థానాలు మజ్లీస్ కు పోగా మిగిలిన 112లో 110 టీఆర్ఎస్ వే అని చెప్పారు. నల్లగొండలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, పీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేతలకు గోచీలు ఊసిపోవడం ఖాయమన్నారు.

కిడారి కుమారునికి మంత్రి పదవి

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరపనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో గిరిజనులు లేకపోవటం తో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని చంద్రబాబు పరిశీలుస్తున్నట్టు సమాచారం.ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం లేదు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరునెలల్లోగా ఏదోఒక సభకు ఎన్నికవ్వాలి.ఆలోగా శాసనసభకు సాధారణ ఎన్నికలే రానున్నాయి.ముందు శ్రావణ్‌ని మంత్రిగా తీసుకుంటే... ఆ తరువాత అవకాశముంటే శాసనమండలికి ఎన్నికయ్యేలా చూడటం, లేదంటే ఆరు నెలల సమయం ముగిశాక రాజీనామా చేయించి సాధారణ ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేయించటం అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి.. ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని,గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోవటంతోపాటు రాజకీయంగానూ సానుకూలత ఏర్పడుతుందని తెదేపా వర్గాల అంచనా.

తెరాస పై కాంగ్రెస్ ఎదురుదాడి

తెలంగాణ ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తుతోంది.తెరాస,కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధిచుకుంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, సీనియర్‌ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలి, భట్టి విక్రమార్క, డీకే అరుణ. అనంతరం ఎన్నికల ప్రచార శంఖారావం పూరించి గద్వాల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.     ఈ సందర్బంగా మాట్లాడిన పీసీసీ చీఫ్‌ ఉత్తమకుమార్ రెడ్డి కేసీఆర్‌ అబద్ధాలకోరని ధ్వజమెత్తారు.కేసీఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రి చేశారా? దళితులకు మూడు ఎకరాలు ఇచ్చారా? ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. ‘మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు తలసాని, మహేందర్‌రెడ్డి, తుమ్మల తెలంగాణలో ఎక్కడ ఉద్యమం చేశారని పక్కన కూర్చోబెట్టుకున్నావు?’ అంటూ ధ్వజమెత్తారు.కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతం కావాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి మద్దతు ఇచ్చి కేసీఆర్‌ కేంద్రంలోని నరేంద్ర మోదీకి జైకొట్టారన్నారు. దిల్లీలో మోదీని ఓడించాలంటే రాష్ట్రంలో కేసీఆర్‌ను ఇంటికి పంపాలన్నారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్‌ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ‘‘అన్నా కేసీఆర్‌.. మా ప్రజలను కొంచెం పట్టించుకోండి దొరా! సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే నాలుగున్నరేళ్లు ప్రగతిభవన్‌లో, ఫామ్‌హౌస్‌లో కూర్చున్నావు’’ అని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు.ఒసేయ్‌ రాములమ్మ సినిమాను తలపించేలా రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నడిచిందన్నారు.రాములమ్మ సినిమాలో రామిరెడ్డి ఉంటే ఇక్కడ కేసీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. ‘‘ఉద్యమంలో చూసిన కేసీఆర్‌ వేరు.. ఇప్పటి కేసీఆర్‌ వేరు’’ అన్నారు.అర్థరాత్రి తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి బయటకు పంపించాడని, కారణం మాత్రం చెప్పలేదని విమర్శించారు.కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, కవితను ఉద్దేశించి ‘‘వారు చార్‌మినార్‌ కాదు.. చోర్‌ మినార్‌’’ అని ధ్వజమెత్తారు.

ఐసిఐసిఐ బ్యాంక్ సీఈవో రాజీనామా

  ఐసిఐసిఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో చందా కొచర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈమె రాజీనామాకు బ్యాంకు బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇది వెంటనే అమలులోకి వస్తుంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ సహా ఐసిఐసిఐ బ్యాంక్‌కు అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల పదవులకు కొచర్‌ రాజీనామా చేశారు. క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌ స్థానంలో ప్రస్తుతం బ్యాంక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గా ఉన్న సందీప్‌ భక్షిని కొత్త ఎండి, సీఈవోగా బోర్డు నియమించింది. అక్టోబరు 3 నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది. భక్షి అయిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని బోర్డు తెలియజేసింది. కొచర్‌పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ సారథ్యంలో దర్యాప్తు కొనసాగుతుందని, దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి ఆమెకు రిటైర్‌మెంట్‌ తర్వాత ఇచ్చే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని బ్యాంకు పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ఐసిఐసిఐ గ్రూపులో 1984లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన కొచర్‌.. ఆ తర్వాత పాతికేళ్లకు ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రతిభాశాలిగా పేరు తెచ్చుకున్నారు. పద్మభూషణ్‌ పురస్కార పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఒక తప్పు చాలు వంద ఒప్పుల్ని చెడగొట్టడానికి అన్నట్టుగా.. ఒక్క సంఘటన ఆమె జీవితాన్నిపాతికేళ్ళు వెనక్కి నెట్టింది. భర్త దీపక్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు కొచర్‌ నిబంధనలు అతిక్రమించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బ్యాంకు నియమించిన స్వతంత్ర కమిటీతో అంతర్గత విచారణ ఎదుర్కోవడం జరిగింది. తుది నివేదిక వచ్చే వరకు సెలవుపై వెళ్లాల్సి రావడం.. తాజాగా ముందస్తు పదవీ విరమణకు పూనుకోవడం.. బ్యాంకు బోర్డు వెంటనే ఆమోదం తెలపడం అన్ని అలా జరిగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖులపై ఐటీ దాడులు

  తెలంగాణాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులు రాజకీయ దుమారంలేపాయి.తాజా సమాచారం ప్రకారం ఐటీ కన్ను ఆంధ్రప్రదేశ్ పై పడినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ప్రముఖులపై ఐటీ దాడులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే నారాయణ విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ మంత్రి పి.నారాయణ తెలిపారు.ఇప్పటివరకు నారాయణ సంస్థలపై ఐటీ దాడులు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేని కొట్టిపారేశారు.మరోవైపు విజయవాడలోని బెంజి సర్కిల్‌లో గల నారాయణ కాలేజీకి ఈరోజు ఉదయం ఐటీ అధికారులు వెళ్లినట్లు,ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి ఉంచాలని సిబ్బందికి సూచించినట్లు తెలుస్తుంది.ఇప్పటికే నెల్లూరులో తెదేపా నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.చెన్నైలోని బీఎంఆర్‌ సంస్థల కార్యాలయాల్లోనూ వారు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది.ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఐటీ రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అవును హరీష్ రావు, నేను పోటీ పడుతున్నాం: కేటీఆర్

ఈ మధ్య తెలంగాణ రాజకీయాలు.. అందునా ముఖ్యంగా తెరాస రాజకీయాలు కేటీఆర్, హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య మనస్పర్థలు ఉన్నాయని.. కేటీఆర్ ని సీఎం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కావాలనే హరీష్ రావుని దూరం పెడుతున్నారని.. హరీష్ రావు త్వరలో పార్టీ వీడే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తాజాగా కేటీఆర్ స్పష్టం చేసారు. అంతేకాదు హరీష్ రావుని పొగడ్తలతో ముంచెత్తారు.     గురువారం సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. అభివృద్ధిలో మేమిద్దరం పోటీ పడుతున్నామని చెప్పుకొచ్చారు. కాలంతో పాటు పోటీపడి హరీష్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిగెత్తిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మన బతుకులు కూడా ముడిపడి ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా ఇద్దరికి ఏవేవో మనస్పర్థలు ఉన్నాయని ఎవరెవరో చెబుతున్నారని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. ఎస్ మేమిద్దరం పోటీ పడుతున్నాం. అందరూ అనుకున్నట్లుగా కాదు అభివృద్ధిలో మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకుపొదామని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేటీఆర్ పనితీరుపై హరీష్ రావు ప్రశంసలు గుప్పించారు. ఆత్మహత్యల సిరిసిల్ల, సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ కేటీఆర్‌దేనని అన్నారు. సిద్దిపేట రికార్డ్ మెజార్టీ దాటేలా సిరిసిల్లలో మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల కార్యకర్తలు పోటీపడి పని చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

విజయశాంతి,బాలయ్య,చిరు కలిసి ప్రచారం చేయనున్నారా?

  తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రావటం,తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి తెలుగు దేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటంతో ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుందో అని అందరికి ఆసక్తి నెలకొంది.ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే , నటుడు బాలకృష్ణ ఖమ్మం జిల్లా లో పర్యటించి ప్రచారం ప్రారంభించారు.అలానే కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార భాద్యతలు అప్పగించటంతో అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.చిరంజీవి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు.మరి టీడీపీ,కాంగ్రెస్ పొత్తుతో ఏకమవుతున్న వీరు ఒకే వేదికపై ప్రచారం చేస్తే కన్నుల పండుగగా ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతగా ఉన్న విజయశాంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు కలిసి పని చేయవలసి వస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని విజయశాంతి తెలిపినట్లు సమాచారం.మరి ఈ ముగ్గురి కలయిక ఎప్పుడో? వీరి ప్రచారం తో రాజకీయ వాతావరణం ఎంత వేడెక్కనుందో?.

కార్యకర్తను బూటు కాలితో తన్నిన ప్రజాప్రతినిధి

  ప్రచారానికి వెళ్లిన ఓ ప్రజాప్రతినిధికి ఉహించని పరిణామం ఎదురవ్వటంతో ఆగ్రహానికి లోనయ్యారు. ప్రచారం అడ్డుకున్న వారిని బూటుకాలుతో తన్ని వివాదంలో చిక్కుకున్నారు.తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రానుండటంతో ప్రచారాలహోరు మొదలు పెట్టారు తెరాస పార్టీ నాయకులు.ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెరాస నాయకుడు వొడితెల సతీశ్‌ కుమార్‌ వెళ్లారు. ప్రచారానికి వచ్చిన వొడిదలను అడ్డుకొని నాలుగేళ్ల తెరాస పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని రోడ్డుపై బైఠాయించి నిరసన గళం వినిపించారు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు,కొందరు స్థానికులు.అంతేకాకుండా వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో సహనం కోల్పోయిన వొడితెల వారిని బూటు కాలుతో తనుకుంటూ వెళ్లారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపే వొడిదల అనుచరులు,తెరాస కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగారు.ఇరువర్గాల మధ్య తోపులాటతో యుద్ధ వాతావరణం నెలకొంది.చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకొచ్చింది.

సుప్రీంకోర్టు ముందస్తు ఝలక్.. స్టే విధించే అధికారం హైకోర్టుకు

  ఓ వైపు తెరాస అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం మొదలుపెట్టి ముందస్తు వైపు ఆశగా అడుగులు వేస్తోంది. మరోవైపు మహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చలతో మునిగితేలుతోంది. అయితే కొందరు మాత్రం అసలు ముందస్తు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందస్తుకు నిలిపివేయాలంటూ ఇప్పటికే హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన సుప్రీం కోర్టులో తాజాగా విచారణ జరిగింది. అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పైన స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

వైఎస్‌ హయాంలో మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారు

  గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన మంత్రి పరిటాల సునీత జగన్ పాదయాత్రలకే పరిమితమని,ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని స్పష్టం చేశారు.రాష్ట్రాభివృద్ధిపై అవగాహన లేని జగన్‌ తెదేపాపైనా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.వైఎస్‌ హయాంలో ఎంతో మంది మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారని, తాము చంద్రన్న పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు సాయం చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో డ్వాక్రా మహిళలకు రూ.2,300కోట్ల వడ్డీ రాయితీ ఇస్తే తాము నాలుగేళ్లలోనే రూ.2,500 కోట్లు చెల్లించామన్నారు. రూ.50వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించామని మంత్రి తెలిపారు. భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్‌కు వంతపాడుతున్నారని.. వైకాపా, భాజపా కుమ్మక్కై తెదేపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.రాష్ట్రాభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సునీత వ్యాఖ్యానించారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని కన్నా దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రాయలసీమలో అభివృద్ధి జరిగిందా..? అని మంత్రి ప్రశ్నించారు.ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేసిన హంద్రీనీవాను వైఎస్‌ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇస్తున్నామని, ఇవాళ సీమ మొత్తం పంటలతో కళకళలాడుతోందని మంత్రి సునీత తెలిపారు.

తగ్గిన పెట్రోల్ ధర.. సామాన్యునికి కాస్త ఊరట

  నిన్న మొన్నటి వరకు పెట్రోల్,డీజిల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ సామాన్యునికి చుక్కలు చూపించాయి.వీటి దారెక్కడ సెంచరీ కొడుతుందో అని అంతా ఆందోళన చెందారు,పెరిగిన ధరలపై సర్వత్రా నిరసన గళం వినిపించారు,కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఆందోళనలు చేపట్టారు.ఇన్నాళ్లుగా ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని మొండి ప‌ట్టు ప‌ట్టిన కేంద్రం.. మొత్తానికి దిగి వ‌చ్చింది.ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని 1.50 మేర తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇంధన ధరలను రూ.1 మేర తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై సామాన్యుడికి రూ.2.5 మేర ఉపశమనం కల్పిస్తున్నట్టయింది.కాగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.5 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు జైట్లీ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.10,500 కోట్ల భారం పడనుందని జైట్లీ తెలిపారు.అయితే సామాన్యులకు మరో భయం పట్టుకుంది పైసల్లో తగ్గినప్పుడే పెరుగుదల రూపాయల్లో ఉంది అలాంటిది రూపాయల్లో తగ్గుతుందంటే మళ్లీ ఎంత పెరుగుతుందో అని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

చంద్రబాబు కోసం దేవుడిని ప్రార్ధించిన శివాజీ!!

  నటుడిగా శివాజీ సినిమాల్లో ఎంత ఫేమస్ అయ్యారో.. ఆపరేషన్ గరుడతో రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మొదటినుండి తన గళాన్ని వినిపిస్తున్న శివాజీ.. కేంద్రాన్ని నిలదీస్తూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శివాజీ.. చంద్రబాబు కోసం, అప్ ప్రత్యేకహోదా కోసం దేవుణ్ణి ప్రార్థించినట్టు చెప్పారు. ఏపీలో రాజకీయాలు నడవటం లేదని, ఆ స్థానంలో కుట్రలు, కుతంత్రాలు నడుస్తున్నాయన్నారు. నీచమైన మనస్తత్వాలతో రాజకీయ నేతలు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ వేంకటేశ్వరుని కోరుకున్నానని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం కూడా ఆ దేవదేవున్ని ప్రార్థించానని శివాజీ తెలిపారు.

చేయిచేసుకున్న ఎంఆర్ఓ ..విలపించిన యువతి

  ప్రభుత్వ అధికారిణిగా బాధ్యతాయుతమైన పదివిలో ఉండి ఓ యువతి పట్ల భాద్యతారాహిత్యంగా చేయిచేసుకోవటంతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చోటుచేసుకుంది.నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌కు చెందిన ఉగ్గపల్లి సరిత ఆదాయ, కులధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ రశీదులతో కార్యాలయంలోని కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన ఎంఆర్ఓ కేసీ ప్రమీల.. ఇక్కడ నీకేంపని అంటూ ఆగ్రహంతో చేయిచేసుకున్నారని సరిత రోదిస్తూ తెలిపింది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు కార్యాలయానికి చేరుకొని ఎంఆర్ఓ తో వాగ్వాదానికి దిగారు.అయితే ఎంఆర్ఓ మాత్రం తాను ఎవరిపై చేయిచేసుకోలేదని, కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టి సూచించానని తెలిపారు.

వెస్టీండీస్‌తో టెస్ట్.. రికార్డు సృష్టించిన పృథ్వీ షా.!!

  టీమిండియా అండర్19 టీమ్ మాజీ కెప్టెన్ పృథ్వీ పంకజ్ షా ఆరంభ టెస్ట్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఓపెనర్ గా దిగిన పృథ్వీ షా 56బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసాడు. ఆ తరువాత సెంచరీ చేయడంలో కూడా అదే దూకుడు కొనసాగించాడు. 99బంతుల్లోనే 101 కొట్టి సెంచరీతో సత్తా చాటాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ ఆటగాడు పృథ్వీ షా కావడం విశేషం. తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (99 బంతుల్లో) చేసిన మూడో బ్యాట్స్‌మెన్ కూడా పృథ్వీనే. ఇతని కంటే ముందు శిఖర్ ధావన్(85బంతుల్లో).. ఆ తర్వాత వెస్టీండీస్ ఆటగాడు స్మిత్ (93బంతుల్లో) ఉన్నారు. ఇదిలా ఉంటే, అతి తక్కువ వయసులోనే సెంచరీ చేసిన భారత రెండో ఆటగాడు పృథ్వీ కావడం విశేషం. పృథ్వీ కంటే ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.1990లో 17సంవత్సరాలకే ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో పృథ్వీ షా 154 బంతుల్లో 134 పరుగులు చేసి వెనుతిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 278/3 కాగా కోహ్లీ (33) , రహానే (15 ) క్రీజులో ఉన్నారు.