స్కూళ్లను మూసివేయనున్న తెలంగాణ విద్యాశాఖ
posted on Oct 4, 2018 @ 11:22AM
|
టోలిచౌకిలోని ఓ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖాధికారులు నగరంలో,నగర పరిసరాలలో ఎటువంటి గుర్తింపు లేకుండా నడుపుతున్న పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.చిన్నారిపై లైంగికదాడి ఘటనతో పాటు మరో చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన వరస ఘటనలు చోటు చేసుకున్న అజాన్ జెమ్స్ పాఠశాలపై చర్యలు తీసుకున్న అధికారులు ప్రీప్రైమరీ తరగతులను మూసివేయాలంటూ ఆదేశాలిచ్చారు.అనుమతి లేకున్నా ప్రీప్రైమరీ సెక్షన్ నిర్వహించడం, నిబంధనల ప్రకారం ప్రీప్రైమరీ తరగతులు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్వహించకుండా మూడో అంతస్తులో నిర్వహించడం, స్కూల్ ప్రధాన ద్వారాల వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం, తల్లిదండ్రులతో యాజమాన్యం సమావేశమై వారి సలహాలు తీసుకోకపోవడంతో పాటు స్కూల్ ఉద్యోగియే లైంగికదాడికి పాల్పడినా చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలో ప్రీప్రైమరీ విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చడానికి విద్యాశాఖాధికారులు కూడా తల్లిదండ్రులతో సమావేశమై ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించనున్నారు. విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ పాఠశాలలో ఉన్నత తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పునరాలోచనలో పడ్డారు. వారి పిల్లలను కూడా పాఠశాల మార్చాలని చాలా మంది తల్లిదండ్రు లు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది స్కూల్ మానేశారని కూడా సమాచారం.ఘటనల దృష్ట్యా చాలా మంది పాఠశాల మానేయాలనుకుంటున్న సమయంలో వారికి ఇతర పాఠశాలల్లో సీట్లు దొరుకుతాయా అనేదీ ప్రశ్నార్థకమే.స్టేట్ సిలబస్ విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చినా... సీబీఎస్ఈ సిలబస్ విద్యార్థులను చేర్చాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. |