దిగ్విజయ్ ఆరెస్సెస్, బీజేపీ ఏజెంటు: మాయావతి
posted on Oct 4, 2018 @ 12:13PM
రాష్ట్రాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీని మట్టికరిపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఆశాభంగం మిగిల్చారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పేశారు.‘‘బీఎస్పీని అంతం చేయడానికే కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ఎన్నికల్లో గెలుపు కన్నా తమ పార్టీని దెబ్బతీయడమే ఆ పార్టీ లక్ష్యంగా కనపడుతోంది’’ అని మాయావతి తీవ్రంగా విమర్శించారు.ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన అజిత్ జోగితో జట్టుకట్టడం ద్వారా ఆమె కాంగ్రెస్-వ్యతిరేక వైఖరిని పూర్తిస్థాయిలో అనుసరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమయ్యింది.కాంగ్రెస్‌కు సరైన కూటమి ఏర్పర్చాలన్న ఆలోచనే లేదని, అసలు బీజేపీని ఓడించాలన్న పట్టుదలే ఆ పార్టీలో కనపడ్డం లేదని, కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ వైఖరి వల్లే తాము ఛత్తీస్ గఢ్, కర్ణాటకల్లో ఇతర పార్టీలతో చేతులు కలిపామన్నారు.
సీట్ల విషయంలో ఒప్పందం కుదరకపోవటంతో మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ కలిసిరాకపోవచ్చని కాంగ్రెస్ ముందే ఓ అంచనాకు వచ్చింది.దీనికితోడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ చేసిన ఓ వ్యాఖ్య కూడా మాయావతికి ఆగ్రహం తెప్పించింది. మాయావతిపై చాలా సీబీఐ కేసులున్నాయని, కాంగ్రెస్ తో వెళితే ఆ కేసులు తిరగదోడతామని అమిత్ షా బెదిరించడం వల్లే ఆమె వ్యతిరేక వైఖరితో ఉన్నారని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. దీంతో మాయావతికి చిర్రెత్తుకొచ్చింది. ‘అసలు దిగ్విజయే ఆరెస్సెస్, బీజేపీ ఏజెంటు. వాటికి అనుకూలంగా మాట్లాడతారు’ అని ఆమె ఎదురుదాడి చేశారు. ‘కాంగ్రెస్‌కు విపరీతమైన పొగరు. ఈ పొగరు వల్లే గుజరాత్‌లాంటి రాష్ట్రాల్లో 20 ఏళ్లుగా అధికారానికి దూరమైపోయింది’ అని ఆమె ఘాటుగా దుమ్మెత్తిపోశారు.‘కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లోక్‌సభ, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రెంటిలోనూ కలిసి పోటీచేయాలని గట్టిగా భావిస్తున్నారు. వారి చిత్తశుద్ధిని శంకించలేం. కానీ రాష్ట్రాల్లో మాత్రం కొందరు నాయకులు ఈ పొత్తు యత్నాలను దెబ్బతీయాలని ద్రోహం తలపెట్టారు’ అని మాయావతి పేర్కొన్నారు.