దటీజ్ చంద్రబాబు.. 1100 తో ప్రజలకు అండగా
posted on Oct 4, 2018 @ 2:59PM
చంద్రబాబు ఏం చేసినా అలోచించి చేస్తారు. ప్రజలకి మంచి జరిగేలా చూస్తారు. ఇది కేవలం నోటి మాట కాదు. చాలా సందర్భాల్లో రుజువైంది. తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబుకి ఎంత విజన్ ఉందో అర్ధమవుతుంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. గుంటూరు జిల్లాకు చెందిన షేక్ మొయినుద్దీన్ ఎంపీడీఓగా పనిచేసి పదవి విరమణ చేసారు. ఆయన 2008 లో తెనాలిలో 60 గజాల స్థలం కొని రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది నిర్వాకం మూలంగా రిజిస్ట్రేషన్లో కొన్ని తప్పులు దొర్లాయి. అప్పుడు ఆయన వాటిని గమనించలేదు. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుందామని ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకోగా తప్పులు ఉన్నట్టు తేలింది. వాటిని సరి చేయిస్తే కానీ ప్లాన్ అప్రూవల్ చేయలేమని మున్సిపల్ అధికారులు స్పష్టం చేసారు. దీంతో మొయినుద్దీన్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి తప్పులు సరిచేయాలని కోరారు. దీనికి కార్యాలయ ఉద్యోగులు 12 వేలు డిమాండ్ చేసారు. చివరికి మొయినుద్దీన్ 7 వేలు ఇచ్చి పని చేయించుకున్నారు. ఇది జరిగి రెండేళ్లయింది.
ఇటీవల 1100 పై చంద్రబాబు చేసిన ప్రకటనతో మొయినుద్దీన్ లో చైతన్యం వచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని 1100 కు ఫోన్ చేసి చెప్పారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన విషయం.. ఇప్పుడు స్పందిస్తారా? అనే అనుమానం ఆయనలో ఎక్కడో దాగుంది. కానీ ఆ అనుమానం పటాపంచలైంది. ఫోన్ చేసిన కొద్దిరోజులకే ఒక ఉద్యోగి ఆయన వద్దకు వచ్చి తన వల్లే తప్పు జరిగింది అంటూ క్షమాపణలు చెప్పి.. లంచంగా తీసుకున్న 7 వేలు తిరిగిచ్చాడు. ఆ ఉద్యోగి తిరిగిచ్చింది డబ్బుని మాత్రమే కాదు.. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందనే నమ్మకాన్ని. ఈ సంఘటనతో మొయినుద్దీన్ కళ్ళు ఆనందబాష్పలతో నిండిపోయి మనసులోనే చంద్రబాబు ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు.