ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో ఎన్నికల నియమావళి అమలులో ఉండటం,ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ తేదీని కూడా ప్రకటిచటంతో మహా నగరం లో ఎన్నికల నియమావళి అమలుపై ద్రుష్టి సారించారు అధికారులు. ప్రధాన రహదారులు, పైవంతెనల పక్కన, విద్యాసంస్థల ప్రాంగణాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన బోర్డులు, గోడపత్రాలను తొలగించడంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పది ప్రత్యేక వాహనాలు, ఎస్‌ఎఫ్‌ఏలు, పారిశుద్ధ్య కార్మికులు, విపత్తు నిర్వహణ దళం, సహాయ వైద్యాధికారులు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.పలు పార్టీల నేతలు గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో రాసిన రాజకీయ నినాదాలు, ప్రకటనలపై దృష్టిపెట్టారు.విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతరత్రా నిర్మాణాల గోడలపై రాతలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు.వాటిపై సున్నం వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.భవన సముదాయాలపై, ఇళ్లపై, ప్రైవేటు ఆస్తుల గోడలపై ఏర్పాటు చేసుకునే ప్రకటనలకు సదరు యజమానుల అనుమతి తప్పనిసరి అని, అనుమతి లేకపోతే ఉల్లంఘన కింద భావించి ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఒకసారి తొలగించిన ప్రకటనల్ని మళ్లీ ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.డబ్బు పంపిణీ, అక్రమ ప్రకటనలు, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే ఉల్లంఘనలపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్ అనే మొబైల్ అప్లికేషన్‌ను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది.ఫిర్యాదు చేసిన 30 నిమిషాల్లోనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధన.