టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 'పైసావసూల్' ప్రొడ్యూసర్
posted on Oct 4, 2018 @ 1:11PM
తెలంగాణలో ముందస్తు వేడి మొదలైన సంగతి తెలిసిందే. ఓవైపు తెరాస, మరోవైపు మహాకూటమి నువ్వా నేనా అన్నట్టుగా గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే తెరాస 105 అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలుపెట్టింది. మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల దశలోనే ఉంది. మఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఎక్కువ సమయం తీసుకునేలా ఉంది. అయితే ఇంకా అధికారకంగా చెప్పనప్పటికీ టీడీపీ ఖచ్చితంగా పోటీ చేసే స్థానాల్లో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి లాంటివి ఉంటాయి. అయితే మొదట్లో ఈ రెండు స్థానాల్లో ఏదోక స్థానం నుండి నందమూరి కళ్యాణ్ రామ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు వార్తల్లాగానే మిగిలిపోయాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ లో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ను `భవ్య క్రియేషన్స్`అధినేత - నిర్మాత ఆనంద ప్రసాద్ కు కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్యతో ప్రసాద్ కు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వార్తలో నిజమెంతో త్వరలో తెలుస్తోంది.