ధన దాహం పెంచేస్తున్న క్రికెట్!
ఇంగ్లీషువాడు భారతదేశాన్ని వదిలిపోతూ అంటించిన జాఢ్యాలు రెండు.. ఇంగ్లీషు, క్రికెట్! పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదవాలి, మాట్లాడాలి, ఆడితే క్రికెట్ మాత్రమే ఆడాలి .. ఈ రెండు చేయనివారు ఒట్టి పిచ్చాళ్లు! పనికిరానివారు అదే గొప్ప అభిప్రాయం తరతరానికి అందివస్తున్న గొప్ప సంప్రదాయం. పిల్లలు చదువుతోపాటు ఆటలూ ఆడాలి. వొంటికి వ్యాయామం అవసరం గనుక. పూర్వం కబడ్డీ, పరుగు పందెం, బ్యాడ్మింటన్ చాలా సహజంగా ఆడేవారు. ఇప్పుడూ ఆడుతున్నారు. కానీ క్రేజ్, ప్రతిష్ట, మీదు మిక్కిలీ మంచి ఆర్ధిక స్థాయి కోసం క్రికెట్ ఆడటం జరుగుతోంది.
తల్లిదండ్రులు తమ మగ పిల్లల్లో ఎవరికయినా ఈ జాఢ్యం అంటి పొరపాటున అర కొర చాకచక్యం చూపితే.. కాబోయే టెండూల్కర్ అని, కాబోయే కపిల్ అనీ భావించుకుని కోచింగ్ పేరుతో వాడి జీవితాన్ని సదరు కోచ్ చేతిలో పెడుతున్నారు. ఇది గతంలో పట్ట ణాలలో వుండేది. ఇప్పుడు టీ 20లు, ఐపిఎల్ పుణ్యాన గ్రామీణ ప్రాంతాల్లోనూ అదో పెద్ద సోపానంగా భావి స్తున్నారు. పైగా టాలెంట్ సర్చ్ పేరుతో క్రికెట్ సంఘాలు చిన్న వూళ్లలోకి వెళ్లి వారి ఆటను గమనించి నచ్చితే తమ వద్దకు వచ్చేయమని అనడం జరుగుతోంది. అదేదో మహాద్భుతం, ఇక రేపే మనోడు టెస్ట్ ఆడతాడు, పనిగినీ వదిలేసి టీవీ ముందు బైఠాయించాలి అని అమ్మమ్మలు, అమ్మలు సైతం తెగ ఉత్సాహ పడుతున్న రోజులివి.
అసలు ఆ ఆట మహత్తే అంత అని అంటూంటారు క్రికెట్‌ను అమితంగా ప్రేమించి తిండీ తిప్పలు మానేసినవారు. ఎందుకంటే, మ్యాచ్‌లు, ప్లేయర్లకంటే ఆ మ్యాచ్‌లను చూస్తూ డబ్బు సంపాదించే ఓ కొత్త దరిద్రం వచ్చిపడింది. దాన్నే ఆంగ్లంలో బెట్టింగ్ అంటారు. ఇది ఐపిఎల్ తో మరింత విజృంభిస్తోంది. నర నరానా ఆ పిచ్చి ఎక్కించేసుకుంటున్న యువత, చిన్నపాటి వ్యాపార సంస్థలవారు కూడా ఆవేశపడుతు న్నారు. క్రమేపీ ఆటను ఆటగా చూడ్డం మానేసి వారి అభిమాన ప్లేయర్ ఆట తీరును కరెన్సీ కాయితా లతో కొలుస్తూ ఆ వేడిలో లక్షలకు లక్షలు కోల్పోతున్నారు.
కష్టపడి ఏదో ఒక పనిలో, లేదా వృత్తిలో ఆర్ధికంగా మెరుగుపడటం అనేది లోకం హర్షించే పద్ధతి. కానీ కాలక్రమంలో ఆటలతోనూ కోట్లు గడించవచ్చన్నది గొప్ప ఆర్ధిక సూత్రం కింద తయారయింది. ప్లేయర్లు ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్లు తమ ప్రొఫెషన్‌లో ఉన్నత శిఖరాలు అధిగమించడంలో ఆర్ధికంగా బాగానే నిలదొక్కుకుంటారు. దాన్ని ఆట్టే ప్రశ్నించలేం. కానీ వారి ఆటను పిచ్చిగా ప్రేమించి ఆర్ధికంగా దిగజారు తున్న కుటుంబాలు తయారు కావడమే ఊహించని పరిణామం! పనీపాటా లేని పదకండు మంది ఆడే ఆటను కోట్లమంది బుద్ధిహీనులు ఎంజాయ్ చేయడంలో కాలం విలువ తెలుసుకోలేకపోతున్నారని పూర్వం ఒక ఆంగ్ల రచయిత అన్నాడు. అప్పుడన్నది ఇప్పుడు అక్షరాలా నిజం. మత్తులో పడితే గమ్మ త్తుగ చిత్తవడం అంటే ఇదేనేమో!
ఐపిఎల్‌లో ఆడితే దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా సులువు అనే గొప్ప రహస్యసారం ప్లేయర్లు కూడా బాగా జీర్ణించుకున్నారు. అంతకుముందు రంజీలో సరిగా ఆడకపోయినా, అదృష్టవశాత్తూ ఏదో ఒక జట్టుకి ఆడేందుకు ఈ టోర్నీకి సెలక్ట్ అయితే మారుమూల అమాయకంగా వుండే చిన్నపాటి ప్లేయర్ కి కూడా కళ్లు నెత్తినెక్కుతాయి. వాడి అదృష్టం మరీ అధికశాతంలో వుంటే వాడికిక తిరుగే వుండదు. ఇప్పటి ట్రెండ్ అదే! ఇక విదేశీ ప్లేయర్ల సంగతి వేరు. వారికి కేవలం డబ్బు కావాలి. ఆట ఎలాగూ మనవాళ్లతో పోలిస్తే బాగానే ఆడతారు.
ఒకవేళ ఒకటో రెండో మ్యాచ్‌ల్లో పెద్దగా పరుగులు తీయకపోయినా, వికెట్లు తీయకపోయినా సదరు ప్లేయర్‌కి వచ్చిన నష్టం లేదు. మహా అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లను షామియానా కింద చల్లబడుతూ చూడమంటారు అంతే. ఆ తర్వాతా అవకాశం ఇవ్వకపోయినా మరీ అదృష్టమే వాడికి. ఎందుకంటే మొత్తం టోర్నీలో పాల్గొనడానికి ఇవ్వవలసిన మొత్తం సొమ్ము ఎన్నో కొన్ని కోట్లు చచ్చుకుంటూ స్పాన్సర్లు ఇస్తారు! ఈ వ్యాపార ఆట సరళితో చిన్న చిన్న సంస్థలు, పారిశ్రామికవేత్తలు ప్రచారం మాత్రం బాగానే చేసుకో గల్గుతున్నారు. లక్షలు పెట్టి యాడ్స్ రూపంలో అందరి ముందు కనపడితే వచ్చేదానికంటే, ఈ టోర్నీలో వారి సంస్థల పేరు మాటి మాటికీ కనిపించి, వినిపించే ప్రచార హోరు పసిడి కుండల్ని అమాంతం అందిస్తుండవచ్చు అనే అభిప్రాయాలూ లేకపోలేదు.
ఒక్క ఆటతో వందల మంది లక్షాధికారులు, కోటీశ్వరులూ కావడం అనేది ఈ రోజుల్లో చూడగల్గుతున్నాం. ఇందుకు ప్రభుత్వాలూ మద్దతునిస్తున్నాయి. రాజకీయ నాయకులు, పోనీ వారి బంధువర్గమో ఆయా స్పాన్సార్లలో భాగమవుతున్నారు. అసలు క్రికెట్ పాలక మండలిలోనే రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులను సభ్యులుగా చూస్తున్నాం. ఇది రాజకీయంగా తమ బలాన్ని ప్రదర్శిస్తుంది.
మన దేశంలో దురదృష్టమేమంటే, హాకీని, ఫుట్‌బాల్‌ని అంతగా ప్రోత్సహించలేకపోవడం. పైకి ఏదో కథలు చెప్పడం, ప్రచారం చేయడం, ఒకటి రెండు టోర్నీలకు పెద్ద స్థాయిలో హడావుడి చేయడం తప్ప ప్రత్యేకించి మద్దతు నీయడం అనేది చాలా అయిష్టంగానే జరుగుతోంది. క్రికెట్ వేడితో కొన్ని కుటుంబాలే బాగుపడుతున్నాయి. చాలామటుకు ఆర్ధికంగా చితికిపోతున్నాయి.