నడ్డా వచ్చె .. పార్టీ పరువు తీసె!
posted on Jun 8, 2022 @ 3:44PM
రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తా చాటి అధికారంలోకి రావాలన్న ఆతృతలో బిజెపి భారీ ప్రచారానికి దిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని నిలబెట్టాలన్న పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ఇం దుకు కేంద్ర నాయకులు కూడా వచ్చి పార్టీ వర్గాల ఉత్సాహాన్ని పెంచుతున్నారు. నిజానికి అలా రావడం ప్రాంతీయ నాయకులకు బలాన్ని చేకూరుస్తుంది. కానీ మొన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఇందుకు పూర్తి భిన్న దృశ్యాన్ని చూపింది.
రాష్ట్రంలో ఇప్పటికే పొత్తుల విషయంలో గందరగోళం ఏర్పడింది. టిడిపి, జనసేన పొత్తుకి అవకాశం లేదని జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు స్పష్టం చేసేయి. ఈసారి టిడిపి కి సహకరించేం దుకు సిద్ధంగా లేనన్నది ఆయన చెప్పకనే చెప్పాడు. పోతే ఇటు బిజెపి బలం పుంజుకోవడానికి జనసేన ను దగ్గరకు చేర్చుకున్నప్పటికీ ఒకవేళ అధికారంలోకి వచ్చేంతగా గెలిస్తే పవన్‌ను దూరంగా నెట్టేయనూ వచ్చన్న ప్రచారమూ సాగుతోంది.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన నడ్డా ఒక్కసారిగా బిజెపి నాయకుల ఆవేశం మీద నీళ్లు చల్లారు. అసలు ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం వుండగా ఇప్పటి నుంచే పొత్తుల చిక్కుల్లో ఎందుకు పడుతున్నారు? అది అప్పటికి ఆలోచించవచ్చునని హెచ్చరించేరు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ వర్గాలు మరింత గట్టిగా రెట్టించిన ఉత్స హంతో పనిచేయడం, కేంద్ర పథకాలు, వాటి అమలు గురించి ప్రచారం చేయడం, ఓటర్లు తమ వైపు తిప్పుకునేందుకు చేయవలసిన వ్యూహాలు, మహత్కార్యాల గురించి ఆలోచించాలని కాస్తంత గట్టిగానే క్లాస్ తీసుకున్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు. నిజానికి నడ్డా అన్నదానిలో తప్పు లేదు. పార్టీ ఇక్కడ గట్టి పట్టుసాధించాలంటే క్రింది స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయడం, ప్రజలకు ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం బాగా తెలిసేలా కార్య్రకమాలు నిర్వహించడం, తద్వారా ఓటర్లను ఆకట్టుకోవడం చేయా లి గాని పొత్తులు, తిట్టడాలతో పనేమీ జరగదు.
మా నాయకుడు వస్తున్నాడు, మహాద్భుతం చేస్తాడు అని జై నాయకా! జై జై నాయకా!! అంటూ గొంతు చించుకుంటూ నానా హడావుడీ చేసేరు. నడ్డా వచ్చేడు. కానీ చేసిందేమిటి, జరిగిందేమిటి? ఆయన కూడా తిట్ల దండకం అందుకున్నాడే గాని ప్రత్యేకించి పార్టీ క్యాడర్‌ని ఉత్సాహపరిచిందేమీ లేదు. విపక్షా లను తిట్టిపోయడం తన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపర్చడం ఎలా అవుతుంది. దీని కోసం ఢిల్లీ నుంచే రానక్క ర్లేదు.
ఒక ఫోన్‌చేస్తే ఇక్కడి నాయకులు ఇక్కడి భాషలో అర్ధమయేలా తిడుతున్నది మరింత పెద్ద గొంతు కతో, మరింత కొత్తపదజాలంతో కానిచ్చేవారు కదా! పైగా రాబోయే ఎన్నికలకు తొందరపడాల్సిన అవసరం లేదని బోధ చేయడం ఇక్కడి పార్టీ వర్గాలమీద పెద్ద రాయి పడేసినట్టే అయిందనాలి. ఎంతో ఉత్సాహంతో వున్నవారంతా తమ పార్టీ అధినేత నుంచి ఇలాంటి నీరుగార్చే మాటలు వినాల్సి వస్తుందని కల్లోనైనా ఊ హించి వుండరు. కానీ ఇది కాల కాదు వాస్తవమేనని తెలుసుకునేసరికి మహానేత ఢిల్లీ వెళిపోయారు.
ఇక ఇప్పుడు ఏమి చేయవలె? అనే ప్రశ్న తెలుగు రాష్ట్రాల బిజెపి నేతలు, కార్యకర్తలు వేసుకుని కంగారు పడు తున్నారు. వచ్చినాయన వచ్చినట్టు వెళ్లిపోయినా బాగుండేది, కానీ పరువు కాస్తా తీసేడు. నడ్డా .. పార్టీ వర్గాలకు లేని తల నొప్పి తెచ్చావుగదా! .. ఇదీ పార్టీ వర్గాల స్వగతం!!