ఉమ్మడి రాష్ట్రం పీఠం కోసం కేసీఆర్ కుట్ర చేశారు..
కేసీఆర్’ ఆ మూడు అక్షరాలే మహామంత్రం. ఆ మూడు అక్షరాలే తెలంగాణ తెచ్చిపెట్టాయి. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు..ఆయనే లేక పొతే తెలంగాణ వచ్చేదా.. ఆయనే లేక పొతే ... టీ కాంగ్రెస్, టీబీజేపీ ఎక్కడివి? రేవంత్ రెడ్డి, బండి సంజయ్’ గాళ్ళకు పదవులు లెక్కడివి? కుర్చీలెక్కడివి? ఇవి కదా మంత్రి కేటీఆర్ దినానికోసారి వినిపించే కోడి కూత కబుర్లు. (కోడి కూత కబుర్లు అంటే ఏంటో తెలుసు కదా. వెనకటికో ఓగుడ్డి కోడి తాను కూస్తేనే కానీ తెల్లవారదని తెగ గొప్పలకు పోయింది..ట..అప్పటి నుంచి, ఇలా గప్పాలు పోయే కేటీఆర్లు చెప్పే కబుర్లను కోడి కూత కబుర్లని అంటున్నారని అంటారు. అఫ్కోర్స్ ఆ గుడ్డి కోడి కబుర్లు వినివినీ విసుగేసి, ఆ ఆసామి ఆ కోడి గారిని కూర వండేశాడు అనుకోండి అది వేరే విషయం).
నిజానికి, తెలంగాణ ఎవరివలన వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అందరికీ తెలిసిన విషయమే. పుష్కర కాలం పైగా సాగిన ఉద్యమంలో 1200 మందికి పైగా తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానంతో తెలంగాణ వచ్చింది.అంతే కానీ, ఒకాయన చావునోట్లో తలపెడితేనో,ఇంకొకాయనకు అగ్గిపెట్టె దొరకనందుకో, ఇంకొకాయన తీరిగ్గా అమెరికా విమానం దిగినందుకో, తెలంగాణ రాష్టం రాలేదని, అందరికీ తెలిసిన విషయమే.
అదలా ఉంటే, కేసీఆర్, 2001లో తెరాస ఆవిర్భావానికి ముందు ఏమిటి? తెలంగాణ వాదా? సమైక్య వాదా? అనే చర్చ ఒకటి కొత్తగా తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి పదవి కోసం, ఆయన అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారనే విషయంఫై రాజకీయ వర్గాలో జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జూన్ 2 న నాగోల్‌లోని గడ్డి అన్నారం జె.కన్వెన్షన్‌లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన’ సభలో, కేసీఆర్ మాజీ సహచరుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎ. చంద్రశేఖర్ ఇందుకు సంబంధించి, ఇంటి గుట్టును బయట పెట్టారు. అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు తెలియదా? అన్నటుగా, కేసీఆర్ గత చరిత్ర పై ఎ.చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిజానికి, తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో కేసీఆర్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలోనే సమైక్య వాదాన్ని సమర్ధించారు.
అందుకే, ఇప్పుడు, 2001కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని చంద్రశేఖర్ చేసిన ఆరోపణకు బలం చేకూరిందని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు. నిజం. ఒక్క చంద్రశేఖర్ మాత్రమే కాదు, కేసీఆర్ అప్పటి సహచరులు చాలా మంది కూడా కేసీఆర్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఉండేదని, అందుకే శాసనసభలో ఆంద్రోళ్ళ కంటే, బలంగా సమైక్య వాదాన్ని బలపరచారని గుర్తు చేస్తున్నారు.అలాగే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయిన నేపధ్యంలోనే, కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, అప్పట్లో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే కాదు, ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా తెలుసునని అంటారు.
ఇక చంద్రశేఖర్ తాజాగా 2001కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు, 60 మంది ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ కుట్ర పన్నారని తెలిపారు. వీరిలో తనతో పాటు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇతర కీలక నేతలు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేసిన వెంటనే కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే, చివరి క్షణంలో కేసీఆర్ కుట్ర చంద్రబాబు చెవిన పడడంతో,ఆయన పథకం పారలేదని వివరించారు.
అదలా ఉంటే...2001లో కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారని, అంతకుముందు కేసీఆర్, తాను ఒకేసారి మంత్రులం అయ్యామని చంద్రశేఖర్ చెప్పారు.‘మళ్లీ జరిగిన ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదు. దీంతో నాటి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉండి కూడా చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేల్లో చీలిక తేవాలని ప్రయత్నించారు’ అని చంద్రశేఖర్ చెప్పారు.
‘చిత్తూరు జిల్లాకు చెందిన గోపాలకృష్ణారెడ్డి, నేను, మరికొంత మంది మిత్రులు కలిసి చంద్రబాబును దించేయాలనేది కుట్ర చేశామని, ఇందుకోసం 3, 4 నెలల పాటు చర్చలు, ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబును దించేందుకు దగ్గరికొస్తున్నాం కాబట్టి ఒక రోజు రాత్రి ప్లాన్ చేశాం. సీఎంను దించడానికి 60 మంది ఎమ్మెల్యేలు చాలని కేసీఆర్ చెప్పారు. 20 హెలికాప్టర్లు తెచ్చుకుందాం.. నేరుగా గవర్నర్ వద్దకు వెళ్దామని ఆయన అన్నారు. చంద్రబాబును దించేసిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని ఆకాంక్ష. ఆనాటి మీటింగ్‌కు ముఖ్యమంత్రిలా సూటు, బూటు వేసుకొని వచ్చిండు. బొజ్జల గోపాలకృష్ణ సరదాగా నువ్వేందుకు ముఖ్యమంత్రి కావాలె అన్నందుకు ఆయణ్ని కొట్టినంత పనిచేసిండు’ అని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
‘ఐతే, 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారు.ఆయన కేసీఆర్ ఇంటి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకెళ్లి విషయం మొత్తం చెప్పారు.ఏకమైన ఆ ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడగొట్టి తన పదవి కాపాడుకున్నారు’ అని చంద్రశేఖర్ అన్నారు.కేసీఆర్‌కు ఉన్నంత అధికార దాహం ప్రపంచంలో ఎవరికీ ఉండదు.అందుకు ఉదాహరణగా ఈ ఘటన గురించి చెప్పా’ అని చంద్రశేఖర్ చెప్పారు.
ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పారని కాదు గానీ, కేసీఆర్, తెలంగాణ సాకారం అయిన వెంటనే ఉద్యమ నేతలను బయటకు పంపి, సమైక్య వాదులను అందలం ఎక్కిస్తున్న తీరును గమించినా, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టింది,చెన్నారెడ్డి తరహాలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకే అని అర్థం అవుతుందని అంటున్నారు. అవును, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ... అందుకే, వారు వీరని కాకుండా అన్ని వర్గాల ప్రజలు, సిద్ధాంతాలను పక్కన పెట్టి, ఆర్ఎస్ యు మొదలు ఆర్ఎస్ఎస్ వరకు అందరూ ఒకటయ్యారు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు..కానీ, కేసీఆర్’కు మాత్రం అధికారమే ప్రధానం.. అయిందని అంటున్నారు.