వస్తున్నా మీ కోసం.. ఇక ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబు
posted on Jun 9, 2022 7:28AM
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే రాజకీయ హీట్ చూస్తుంటే ఇప్పుడో ఇహనో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయా అన్నంత హడావుడి కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్న సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది.
మాటల యుద్ధం, పొత్తుల ఎత్తులు జోరుగా నడుస్తున్నాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ మూడూ వేటికవే తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. జగన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించి సో కాల్డ్ సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితి రావడానికి ముందే ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలనుకుంటే.. ముందస్తు తథ్యం. ఒక వేళ జగన్ అలా తలపోయకపోయినా.. వైసీపీ పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత ఇలాగే కొనసాగేలా చేసేందుకు తెలుగుదేశం వేగంగా కార్యాచరణలోకి దిగుతోంది.
మహానాడు విజయంతో కేడర్ లో ఉప్పొంగుతున్న ఆనందోత్సాహాలను అలాగే కొనసాగేలా చేయడానికి విస్పష్ట కార్యాచరణతో కార్యరంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో మహానాడు నిర్వహణతో పాటు జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నారు.
26 జిల్లాల్లో ఏడాది పాటు విసృత్తంగా పర్యటించేందుకు పక్కా ప్రణాళికను చంద్రబాబు రెడీ చేశారు. క్యాడర్ లో జోష్ నింపడం, అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నారు. మరో వైపు అక్టోబర్ 2 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేపట్టడం కూడా దాదాపు ఖరారైందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రతి నెలా మూడు రోజుల పాటు పర్యటించాలనీ, ఆ పర్యటనలో రెండు జిల్లాలను కవర్ చేయాలని ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ఈ నెల మూడో వారం నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సమీక్షలు, క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు.
జిల్లా టూర్ లో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటూ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రసంగిస్తారు. ఏడాదిలో 80కిపైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పర్యటన రూపొందించారు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా జరిగేలా పక్కాగా షెడ్యూల్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తొలుత ఈ నెల 15న అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే మినీ మహానాడులో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారిగా సమీక్షలు 17వ తేదీన చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.