కేటీఆర్ ట్వీట్లపై తెరాసలో ఆందోళన
posted on Jun 8, 2022 @ 3:22PM
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, తెరాస అధ్యక్షుడు ఆయనే...అయినా,ఈరోజున అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కూడా, ఐటీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామా రావు, కనుసన్నల్లో పనిచేస్తున్నాయనే అభిప్రాయం రోజు రోజుకు బలపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే పార్టీ అధ్యక్షుడు అన్న విధంగా, ప్రవర్తించిన సందర్భాలు చాలనే ఉన్నాయి.
అలాగే, ఇటు మంత్రులు, అటు అధికారులకు అయన ట్విటర్’ పైనే ఆదేశాలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నాయి. ఒక విధంగా చూస్తే, కేటీఆర్ తెలంగాణ డిఫ్యాక్టో ముఖ్యమంత్రి, తెరాస డిఫ్యాక్టో అధ్యక్షుడు అన్నా, ఎవరూ అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని, అటు ప్రతిపక్షాలే కాదు, స్వపక్ష నాయకుకులుం చివరకు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.సరే, అది ప్రస్తుతానికి అప్రస్తుత చర్చ, అధికార పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే, ఒకప్పుడు ప్రామిసింగ్ లీడర్’ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పడు, ఎందుకనో,, ఏమైందో కానీ, ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెడుతున్నారని, విపక్షాలకు అస్త్రాలను ఆయనే సప్లై చేస్తున్నారనే మాట, పార్టీలోనే వినిపిస్తోంది. ఒక విధంగా కేటీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు, నగరానికి చెందిన ఇతర నేతలను ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి, తమ అధికార నివాసంలో వారితో సమావేసమయ్యారు. గతంలో ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలో, జీహెచ్ఎంసి కార్పొరేటర్లు,ఇతర నగర నేతలను కలవవలసి ఉన్నా అప్పుడు సమయాభావం వల్లనో ఏమో అందరినీ కలవలేక పోయారు. ఈ నేపధ్యంలో, కార్పొరేటర్లు ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించుకుని వారితో, సుమారు గంటన్నర సేపు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ప్రధాని పరిచయం చేసుకొని వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ దశలో మరింత కష్టపడితే సునాయాసంగా అధికారంలోకి వస్తామని చెప్పారు.
నిజానికి ఇది, బీజేపీ అంతర్గత వ్యవహారం. ప్రభుత్వానికి సంబందించిన విషయం కానే కాదు. అయితే, మంత్రి కేటీఆర్ బీజేపీ పుట్టలో వేలు పెట్టారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న ప్రధాని వ్యాఖ్యలను, ఎక్కడ నుంచి పట్టుకున్నారో, ఏమోకానీ, పట్టుకున్నారు. అదేదో మహాపరాధం అయినట్లు తప్పుబట్టారు. మోడీజీ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఎన్జీవోనా? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.హైదరాబాద్ గతంలో ఎన్నడూలేని రీతిలో భారీ వరదలను ఎదుర్కొందని, కానీ ప్రధాని మోడీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని కుడా మంత్రి ప్రశ్నించారు.అఫ్కోర్స్, ఇతర విషయాలు కూడా ప్రస్తవించారు అనుకోండి అది వేరే విషయం.
ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై, బీజేపీ నాయకులు విరుచుకు పడుతున్నారు. తెరాసలోనూ చర్చ మొదలైంది. నగర కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు కమ్యూనిటీ సేవ చేయాలనడం ఏ విధంగా తప్పని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రజను దోచుకోవాలే కానీ, ప్రజలకు సేవ చేయ రాదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ, వ్యాపార దృక్పథంతో చూడడం, అన్నిటికీ అదే మందు ‘జిందా తిలస్మాత్’ అన్నట్లుగా, కేద్రంపై విరుచు పడడం చూస్తుంటే, ఆయనకు, బీజేపీ, మోడీ ఫోబియా పట్టుకుందని అనిపిస్తోందని, బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవంక, కేటీఆర్ చేస్తున్న తొందరపాటు ట్వీట్లు, తమకు తలనొప్పులు తెస్తున్నాయని తెరాస నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలంటే కేవలం నిధులు ఇచ్చిపుచుకోవడమేనా, అని ప్రశ్నిస్తున్నారు. విషయం ఏదైనా కేంద్రం ఏమీ చేయలేదు, ఏమీ ఇవ్వలేదు, చిప్పలో చిల్లిగవ్వ రాల్చలేదు అని విరుచుకు పడడం, వాపోవడం రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడుతోందని సొంత పార్టీ నేతలే చిరాకు పడుతున్నారు.
అలాగే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) గురించి అనేక సందర్భాలలో స్వయంగా కేటేఆర్ మాట్లాడారు.అంతేకాదు, ఆయనే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎపీలు ఇతర పార్టీ నాయకులను ప్రోత్సహించి, అంబులెన్సులలని విరాళంగా సేకరించారు. అదే విధంగా, కొవిడ్ సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒకటి రెండు నెలల జీతాలను ముఖ్యమంత్రి, ప్రధాని సహాయ నిధిని విరాళంగా ప్రకటించారు.
అదే విధంగా ప్రధానమంత్రి తమ పార్టీ కార్పొరేటర్లు సేవా భావంతో పని చేయాలని చెపితే చెప్పారేమో, అందులో తప్పేముందని, తెరాస నాయకులు కూడా విస్మయం వ్యక్తపరుస్తున్నారు. ఈమధ్య కేటీఆర్, తొందరపడి చేస్తున్న ట్వీట్లు తమకు తల నొప్పులు తెస్తున్నాయని అంటున్నారు.
మరోవంక నిజానికి ప్రధాన మంత్రి కార్పొరేటర్లతో ఏమి మాట్లాడారు, ఏమి మాట్లాడలేదు అనే విషయాన్ని, పక్కన పెట్టి, దేశ ప్రధాని నగర కార్పొరేటర్లకు అంత సమయం కేటాయించడం నుంచి తెరాస నాయకత్వం నేర్చుకోవలసింది చాలా ఉందని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. ముఖ్యమంత్రి మంత్రులకు కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వరని, ప్రగతి భవన్’ గేట్లు కూడా తెరుచుకోక, తానూ. హరీష్ రావు సహా మరి కొందరు మంత్రులు గేటు వద్ద ఏడ్చిన సందర్బాలు ఉన్నాయని. గతంలో ఈటల చేసిన విమర్శలు హుజురాబాద్ ఉప ఎన్నికలలో ప్రభావం చూపిన విషయాన్ని మరిచి పోరాదని అంటున్నారు. నిజానికి, ప్రస్తుతం రాష్ట్రంలో వీస్తున్న తెరాస వ్యతిరేక పవనాలకు, ఇది కూడా ఒక కారణమని, విశ్లేషకులు పేర్కొంటున్నారు.