బీజేపీ నెత్తిన కేసీఆర్ పాలు.. రాష్ట్రపతి ఎన్నికకు టీఆర్ఎస్ దూరం?
posted on Jun 8, 2022 @ 1:19PM
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఏమిటి అన్న ఉత్కంఠకు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు తెరపడినట్లే. బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థికి బేషరతు మద్దతు అంటూ వచ్చిన కేసీఆర్ ప్లేట్ ఫిరాయించినట్లేనని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఈ ఎన్నికను బహిష్కరించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమంటే బీజేపీ నెత్తిన పాలు పోయడమే. సొంతంగా అభ్యర్థిని గెలిపించుకునేంత బలం లేని బీజేపీ మద్దతు కోసం ఇతర పార్టీల మీద మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతోంది.
ఇప్పటికే వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయన్నది ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడమంటే బీజేపీ అభ్యర్థి విజయానికి మార్గం సుగమం చేసినట్లే. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జనం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తారో.. అంతకు మించి ఉత్కంఠ ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కనిపిస్తున్నది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 25తో పూర్తి కానుంది.
ఈ నేపథ్యంలోరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నిక బీజేపీకి ఎంత ప్రతిష్ఠాత్మకమో, బీజేపీ యేతర పక్షాలకు అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడమూ ఆ పార్టీలకు అంతే ప్రతిష్ఠాత్మకం. అయితే బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి కోసం కేసీఆర్ శతధా ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. కనీసం రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనైనా బీజేపీయేతర కూటమిని తన నాయకత్వం కింద ఏకం చేద్దామన్న ఆయన ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో ఆయన ఓ రెండు మెట్లు దిగి సోనియాగాంధీతో భేటీకి ప్రయత్నించారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థికి టీఆర్ఎస్ బేషరతు మద్దతు ఇస్తుందని ఆమెకు చెప్పాలన్న ప్రయత్నమూ విఫలమైంది. కేసీఆర్ తో భేటీకే సోనియా గాంధీ నిరాకరించారు.
దీంతో ఇప్పడు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన ఏ వైఖరి తీసుకుంటారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కేసీఆర్ కు ఆమోదయోగ్యం అయితే సరే లేకుంటే మాత్రం టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటుందన్నది ఆయన ఉద్దేశంగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీయేతర కూటమి కోసం, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం కోసమంటూ కాలికి బలపం పట్టుకు తిరిగిన కేసీఆర్.. తన ప్రయత్నాలు విఫలమైన తరువాత విపక్షాల ఉమ్మడి అభ్యర్థి తనకు ఆమోదమే అని చెబుతారా అన్నది అనుమానమే. రాజకీయ వర్గాలైతే ఖచ్చితంగా అనరు అనే అంటున్నాయి. అంటే టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమే జరుగుతుందని పరిశీలకుల విశ్లేషణ. టీఆర్ఎస్ ఒక వేళ అదే నిర్ణయం తీసుకుంటే బీజేపీ నెత్తిన పాలు పోసినట్లే. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా గెలిపించుకునేంత బలం బీజేపీకి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమంటే బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం చేసినట్లే.
పరిశీలకుల విశ్లేషణ ప్రకారం టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమంటూ జరిగితే.. కేసీఆర్ ఇంత కాలం వ్యక్తం చేస్తున్న బీజేపీ వ్యతిరేకత ముసుగు తొలగిపోయినట్లే. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కాకుండా ఉండేందుకే టీఆర్ఎస్ బీజేపీకి లేని ప్రాముఖ్యత ఇచ్చిందనీ, రాష్ట్రంలో త్రిముఖ పోరు జరిగితే లబ్ధి పొందాలన్నది కేసీఆర్ లక్ష్యం కాగా, కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యానికి తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా కొంచం చేరువ కావచ్చన్నది బీజేపీ ఉద్దేశంగా చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ తొలి నుంచీ కూడా తెలంగాణలో బీజేపీ బీ టీమ్ టీఆర్ఎస్ అని విమర్శిస్తూ వస్తున్నది. అలాగే ఇరు పార్టీలూ కలిసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు మార్లు ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ( బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థి తనకు ఆమోదయోగ్యమైన వ్యక్తి కాకపోతే) టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటే ఇంత కాలంగా వేసుకున్న ముసుగును కేసీఆర్ తొలగించినట్లేనని, వాస్తవంగా కేసీఆర్ కోరుకున్నది కూడా ఇదేననీ రాజకీయవర్గాలలో ఒక చర్చ ప్రారంభమైంది. అసలు బీజేపీయేతర కూటమి అంటూ కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కూడా విపక్షాల మూడ్ ను తెలుసుకుని బీజేపీకి చేరవేయడానికేనని కూడా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాకు రాష్ట్రపతి ఎన్నికకు టీఆర్ఎస్ దూరం కావడంతో తెరపడుతుందన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.