పొగిడినా, తిట్టినా పట్టించుకోవద్దు.. జనసైనికులకు పవన్ ట్వీటోపదేశం
posted on Jun 9, 2022 7:22AM
సినీ నటులకు వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సిల్వర్ స్క్రీన్ మీద గొప్ప స్టయిల్‌గా డైలాగులు చెప్పడం, నాలుగు ఫైట్లు చేయడంతోనే లక్షలాది మంది అభిమానులు పుట్టుకొచ్చేస్తారు, అభిమాన సంఘాలు ఏర్పడతాయి. తమ స్టార్ హీరో ఏదంటే అదే మరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవలో తరిద్దామనుకున్నారు. మంచిదే. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఏమాత్రం గట్టిగా నిలవగలుగుతాడన్నది చూడాలి. ఎందుకంటే ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఫాన్ ఫాలోయింగ్ ఉన్నవారు, రాజకీయాల్లోకి రాగానే ఎన్టీఆర్‌లా ఒకే ఉదుటన సీఎం అయిపోవచ్చుననే అనుకన్నారు. కానీ జరిగింది వేరు. ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తిరిగి మొహానికి రంగు వేసు కుని స్క్రీన్ మీద నాలుగు ఫైట్లు, రెండు డ్యూయెట్స్‌తో అభిమానుల ఆదరణ నీడలోకి వెళ్లేరు.
ఇదంతా కళ్ల ముందు జరిగినది. దీనికి ప్రత్యేకించి కల్పితాలేమీ లేవు. ఇప్పుడు తమ్ముడు గారు తన అభిమానులకు, రాష్ట్రంలో కొత్త పార్టీ రావాలని, నిలవాలని ఆశించినవారికి పవన్ ఆశలు కల్పించేడు. 2019 ఎన్నికలలో తొలి సారి ఎన్నికలలో పోటీకి తనే జనసేన పార్టీ తరఫున అభ్యర్ధులను నిలిపారు. తానూ స్వయంగా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కానీ ఫలితం అత్యంత నిరాశా జనకంగా వచ్చింది. కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలోనే జనసేన విజయం సాధించింది. జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ ఓడిపోయారు.
ఈ తరువాత ఈ మూడేళ్లుగా ఆయన రాజకీయ పరిస్థితులు, పరిణామాలను గమనిస్తూనే గడిపేడు. అది పరిశీలనో, భయయో తెలియనీయకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. అప్పుడపుడూ ఏవో స్టేట్‌మెంట్లు ఇస్తూ తన వునికిని తెలియజేస్తూన్నారు. కాగా ఇప్పుడు కాస్తంత స్వరం పెంచి అందరికీ వినపడేట్టు మాట్లాడు తున్నారు. ఎందుకంటే ఆయన మనసులో మాట ఆయన వెంట వున్న నాయకులు, వీరాభిమానులకు సరిగా అర్ధం అయిందా అంటే అనుమానమే గనుక!
రాబోయే ఎన్నికలకు టిడీపీకి మద్దతునిచ్చే అవకాశం లేదన్నారు పవన్. హీరోగారు ఇంత గట్టిగా చెప్పడంతో బిజెపీ కూడా జనసేనను అంతగా పట్టించుకోవడం లేదు.
కాకుంటే కొద్దిరోజులుగా సాగుతున్న పొత్తుల ప్రచార హౌరులో తనను తాను ప్రొజెక్ట చేసుకున్నారు పవర్ స్టార్. తప్ప ప్రత్యేకించి గట్టిగా తన అను చరులకు సూచనలు చేసిందేమీ లేదు. పైగా ఈ పొత్తులు, మాటలు.. ఇవన్నీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని, ఇలాంటివి రాజకీయ నాయకులకు చాలా సహజమని పార్టీ వీరాభిమానులకు తెలియజెప్పేడు. పైగా రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారిందంటే అలా మారడానికి గల కారణాలు తెలుసుకోవాలని, తిట్టినవారే పొగుడుతూ దరి జేరితే పూర్తిగా మారిపోయారని అర్ధం కాదని గొప్ప జ్ఞానబోధ చేసేరు జనసేన అధినాయకుడు.
రాజకీయాలు, రాజకీయ నాయకులు కాలానుగుణంగా, సందర్భానుసారం మారవచ్చునన్నది లోక రహస్యం. ఇందులో పెద్దగా ఆలోచించి బాధపడాల్సిందేమీ లేదు. కానీ రాజకీయరంగంలో ఇలాంటివారు వుంటారు, ఇలాంటి వారి మాటల్ని పట్టించుకోవద్దని, వారిని సీరియస్‌గా తీసుకుంటే మనం చేయాల్సిన పనులు జరగవని హెడ్‌మాస్టర్ స్థాయిలో తన అభిమానులకు ఒక బహిరంగ రహస్యాన్ని పవర్‌స్టార్ సెలవిచ్చాడు.
ఇదంతా తాను ఒంటరిగా పోటీచేస్తున్నానని తెలియజేయడానికి. పొత్తుల కోసం చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించవన్న జ్ఞానోదయం కలిగినందుకు. తన ప్రత్యర్ధులు రాజకీయరంగంలో డొక్కశుద్ధి బాగా వున్న వారు కావడం వల్ల. మరంచేత, తాను అనుకున్నవన్నీ తనకే వచ్చి తగలడాన్ని అభిమానులకు గ్రహింపు కలిగే లోగానే వారికి ట్వీటోపదేశం చేశారు పవర్‌స్టార్.