హై‘డరా’బాద్..!
posted on Jun 8, 2022 @ 12:07PM
సామూహిక అత్యాచారాలు, హత్యాచారాలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని గొప్ప అపకీర్తి మూటగట్టుకుంటోంది. భద్రత లేని నగరంగా విశ్వ విఖ్యాతి చెందుతోంది. ఒక వైపు ప్రభుత్వం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందంటూ హైదరాబాద్ ను కీర్తిస్తుంటే.. మరోపైపు మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు శాంతి భద్రతల జాడ లేని విశ్వనరకంగా విమర్శల పాలౌంతోంది.
విశ్వగరం పరిస్థితి విశ్వనరకంగా మారడానికి కారణం ప్రధానంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన పబ్బులు, నిబంధనలను యథేచ్ఛగా తోసి రాజని ఇష్టారాజ్యంగా వాటిని నిర్వహిస్తున్న తీరే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశ్వనగరంగా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతోందని తమ భుజాలను తామే చరిచేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఈ మహానగరం బాలికల పాలిట ‘అ’భాగ్యనగరంగా మారిపోవడానికి కారణమేమిటో చెప్పాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చి బౌలి వంటి ప్రాంతాలలో అత్యంత విలాసవంతమైన బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల యజమానులు ఎవరు, వాటిలో వాటాదారులెవరే, ఎవరెవరి భాగస్వామ్యంతో ఇవి వర్థిల్లుతున్నాయి వంటి వివరాలు సేకరించాల్సి ఉంది. ఎందుకంటే వాటి వెనుక ఉన్నది బడా బడా నేతలేనన్నది బహిరంగ రహస్యమే. అయినా ఎవరూ బయటకు చెప్పరు. వాటకి నిబంధనలతో పని లేకుండానే అనుమతులు మంజూరైపోతాయి. కనీస నిబంధనలను పాటించకపోయినా వాటిపై చర్యలు ఉండవు. ఒక వేళ అనివార్యంగా చర్యలు తీసుకోవలసిన పరిస్థితి వస్తే జరిమానాతో సరిపెట్టేయడానికి వీలైన సెక్షన్ల కిందే కేసులు నమోదౌతాయి. సమయ నియంత్రణ ఉండదు,
మైనర్లను అనుమతించకూడదన్న నిబంధన ఈ పబ్బులు, బార్లు, రెస్టారెంట్లలో పాటించరు. పోలీసులూ చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు. వెనకుండి ఈ దందాలకు సహకరిస్తున్నదెవరు? అందరికీ తెలిసన రహస్యమే అయినా అందరూ తెలియనట్టే ఉంటారు. విశ్వనగరంలో ఖరీదైన బార్లు రెస్టారెంట్లు పబ్బులు హుక్కాసెంటర్లు ఆరోగ్య కేంద్రాలు పేరుతో మసాజ్ పార్లర్లు వ్యభిచార కేంద్రాలు నడుపుతున్నది సంపన్నులు, రాజకీయ నాయకుల ఉన్నతాధికారుల పేరెన్నికగన్న న్యాయవాదులు డాక్టర్లు కుటుంబాల సభ్యులు వారసులేనని పోలీసు శాఖ వారు ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తూనే ఉన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36, 45, 10 లలో, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో, బంజారాహిల్స్ లో నిత్యమూ పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న చీకటి దందా పాలకులకు అధికారులకు తెలియదంటే ఎవరైనా నమ్మగలరా?. చీమ చిటుక్కు మంటే ఏలిన వారికి క్షణాల్లో నివేదికలందించే పటిష్ట నిఘా ఉన్న రాష్ట్రంలో.. రాష్ట్ర రాజధానిలో నిబంధనలను తోసి రాజని పబ్బులలో జరుగుతున్న తంతు ప్రభుత్వానికి తెలియదంటే ఎలా నమ్మడం. తల్లిదండ్రులు ఆరాచకంగా అక్రమంగా అన్యాయంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో వాళ్ళ సంతానం బార్లు రెస్టారెంట్లు పబ్బులు జూద గృహాలు(క్లబ్బులు) మాసాజ్ కేంద్రాలు, హుక్కాసెంటర్లు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వీటిల్లో రష్యా యూరోప్ నేపాల్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుండి , ఈశాన్య రాష్ట్రాలు నుండి అమ్మాయిలను తీసుకొచ్చి బార్లలో పబ్బుల్లో మసాజ్ సెంటర్లలో వెయిటర్లుగా సర్వర్లుగా డాన్సర్లుగా పెట్టి నడిపిస్తున్నారు. నేడు హైదరాబాద్ నగరంలో నడుస్తున్న అత్యంత విలాసవంతమైన బార్లు పబ్బులు రెస్టారెంట్లులో వాటాదారులు ఎవరో? వాటికి అనుమతులు ఎలా ఇచ్చారో,ఎలా వచ్చాయో? తెలుసుకోవడానికి నిజాయితీ కలిగిన మేధావులతో విచారణ కమిటీ వేయడానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, విపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు కానీ ఎందుకు ముందుకు రావడం లేదు? జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్బుల్లో జరిగిన ఘటన అనంతరం ఆ కేసులో నిందితులను కాపాడేందుకు పోలీసులు పడిన తాపత్రయం, ఆత్రుత చూస్తుంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ చేయాల్సిన వాళ్లు చేస్తున్నదేమిటి? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అసలింతకీ ఆ పబ్బు వాటాదారులు నిర్వాహకులు ఎవరో వాళ్ళను, అనుమతులు ఇచ్చిన అధికారులను, కనీస వయసు కూడా లేని మైనర్లను పబ్బులోకి అనుమతిస్తుంటే తెలిసీ ఊరకుంటున్న సంబంధిత పోలీసు అధికారులను ఆ యువకుల తల్లిదండ్రులను దోషులుగా పోలీసులు మీడియా ముందు నిలబెట్టాలి? అలా ఎందుకు చేయరు? దొంగకు తేలు కుట్టినట్టుగా అందరూ మౌనం వహిస్తున్నారు. పెద్దల ఒత్తిడి, ప్రమేయంతోనే పబ్బుల ఇష్టారాజ్య అరాచకాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణల్లో నూటికి నూరు శాతం వాస్తవం ఉందన్న ఆరోపణలు అవాస్తవం కాదని సామాజిక ఉద్యమ కారులు అంటున్నారు. ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడనంత వరకూ విశ్వనగరం అమ్మాయిల పాలిట ‘అ’భాగ్యనగరంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.