బుల్డోజర్ బాబాకు సుప్రీం చురకలు .. చట్టం గీత దాటకండి
posted on Jun 16, 2022 @ 5:22PM
బుల్డోజర్ బాబా’ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అద్జిత్య నాథ్ ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బిరుదు. రాష్ట్రంలో దశాబ్దాలుగా క్షీణిస్తూ వచ్చిన, శాంతి భద్రతల పరిస్థితిని చక్క దిద్దేందుకు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, తమ ఫస్ట్’టర్మ్ నుంచే సంప్రదాయ పద్ధతులకు కొంత విభిన్నంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించే వారు ఎవరైనా, ఇన్స్టంట్’గ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు. రాజకీయంగా ఇతరత్రా ఎంత ప్రతిఘటన వచ్చినా వెనకాడ లేదు. మాఫియాపై ఉక్కుపాదం మోపారు.
కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే,ఆయన అనుచరులు సహా అనే మంది రౌడీషీటర్లు ఎన్‌కౌంటర్’లో పోయారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చనే భయంతో కొందరు పోలేస్సులకు లొంగి పోయారు.కొందరు రౌడీలు రాష్ట్రం వదిలి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్‌ల ఇళ్లను, స్థావరాలను యోగి ప్రభుత్వం బుల్‌డోజర్లతో కూల్చేసింది.నిజానికి యూగీ ప్రభుత్వం అనిసరించిన ఈ ‘అణచివేత’ విధానం రాజకీయంగా బీజేపీని దెబ్బతీస్తుందని, రాజకీయ ప్రత్యర్దులే కాదు, సొంత పార్టీ నేతలు, చివరకు మంత్రులు కూడా భావించారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని వదిలి ఎస్పీలో చేరారు. అయితే, 2022 ఎన్నికలలో బీజీపీ గెలుపుకు, బుల్డోజర్ న్యాయం కూడా కలిసొచ్చింది.
ఈ నేపధ్యంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. బుల్డోజర్లకు మరింతగా పనిచెప్పింది. తప్పు చేసి తప్పించుకుందామంటే కుదరదని, నోటి మాటలతో కాకుండా బుల్డోజర్’ చేతలతో సమాధానం చెప్పింది. ముఖ్యంగా ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి (ప్రస్తుత మాజీ) నుపుర్ శర్మ, పార్టీ ఐటీ సెల్ ఇంచార్జి నవీన్ కుమార్ జిందాల్ ( ఇప్పుడు పార్టీ బహిష్కృత నేత) మొహ్మద్ ప్రవక్త గురించి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు నేపధ్యంగా వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి.
అందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ హింసాత్మక ఘటన వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జావేద్ అహ్మద్ నివాసాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ స్థానిక అధికారులు కూల్చివేశారు. అనుమతి తీసుకోకుండా నిర్మించడంపై మే 10నే నోటీసు ఇచ్చి, రెండువారాల సమయం ఇచ్చామనీ, గడువులోగా ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టామనీ అధికారులు తెలిపారు. ఇదే కాకుండా, ఇంతకూ ముందు తర్వాత కూడా చట్టాని త్తమ చేతుల్లోకి తీసుకుని, హింసకు పాల్పడుతున్న వారిని అక్రమ నివాసాలను యోగీ ప్రభుత్వం నెల మట్టం చేసింది.
ఈ పరిస్థితిలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జమియత్ ఉలామా-ఇ-హింద్ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. చట్టబద్ధమైన ప్రక్రియకు విరుద్ధంగా కూల్చివేతలు జరగకుండా చూసేలా కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.‘ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నది చట్టవిరుద్ధంగా ఉంది. షాక్‌కు గురిచేస్తోంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడిలా ఉంది’ అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది.‘కూల్చివేత ప్రక్రియ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలి.అది ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదు. అయితే తాము కూల్చివేతలపై స్టే ఇవ్వలేము. చట్టం ప్రకారం వెళ్లమని మాత్రమే చెప్పగలం’ అని వ్యాఖ్యానించింది.