సికిందరాబాద్ స్టేషన్లో రైలు దగ్ధం చేసిన ఆందోళనకారులు
posted on Jun 17, 2022 @ 11:02AM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రైల్వే స్టేషన్ ముందు ఉన్న బస్టాప్ లలో ఉన్న బస్సులను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ లోనికి చొచ్చుకుపోయిన ఆందోళనకారులు ప్లాట్ ఫాంలపై ఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో స్టేషన్ లో రైళ్లను నిలిపివేశారు. కొన్ని రైళ్ల బోగీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అగ్ని పథ్ నియామకాలను తక్షణమే నిలిపివేసి ఆర్మీ రిక్రూట్ మెంట్ యథాతథంగా కొనసాగించాలంటే ఆర్మీ అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి విదితమే.
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ కింద నాలుగేళ్ల సర్వీస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని దేశంలో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక రూపు దాలుస్తున్నాయి. పలు చోట్లు ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. హైదరాబాదులో కూడా అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పుపెట్టారు.
సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం వల్ల ప్రయోజనం వుండదనియువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పథకం నాలుగేళ్లకు మాత్రమే యువతకు ఉద్యోగభద్రతను కల్పిస్తోంది. మరి ఆ తర్వాత ఇతర వుద్యోగాలకు వెళ్లడానికి వీలు లేకుండా పోతుంది. కనుక ఆ నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగంలో యువత కూరుకుపోవడం ఖాయమని విమర్శలు మేధావులు సైతం విమర్శిస్తున్నారు.
అగ్నిపథ్ వంటి పథకాలతో ప్రయోజనం లేకపోగా, పథకం కాలం ముగిసిన తర్వాత యువతను నిర్వీర్యం చేస్తుందనే ఆరోపణలు దేశమంతటా వెల్లువెత్తుతుండడమే కాకుండా అసలు ఇలాంటి పథక రూపకల్పనే చాలా దారుణమని విపక్షాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.