అప్పడూ, ఇప్పుడూ ఫైర్ బ్రాండే!.. తగ్గేదేలే పోలీస్ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి
posted on Jun 16, 2022 @ 3:53PM
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఫైర్‌బ్రాండ్‌గా సుపరిచితురాలు. ఆమెను అలానే కాంగ్రెసే తర నాయకులు కూడా గుర్తిస్తారు. నమ్మిన విషయం కోసం ధైర్యంగా నిలబడటంలో ఆమెను మించినవారు లేరనే అనాలి. ఇది చాలా కాలం నుంచి ఆమె ప్రదర్శిస్తున్న ఫైర్. పాతికేళ్ల కిందట ‘నెల రాజు’ నాదెండ్ల సభలో ఎన్టీఆర్ జిందాబాద్ అని గర్జించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్పింపు పొందిన నాటి రేణుకా చౌదరికీ ఇప్పటి రేణుకా చౌదరికీ ఏం తేడా లేదు. అప్పడూ ఫైరే.. ఇప్పుడూ ఫైరే.
తాజాగా రేణుకా చౌదరి మరోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి విచారణకు పిలవడం మీద తెలంగాణా కాంగ్రెస్ ఆగ్రహించి చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్య్రకమం ఉద్రిక్తతకు దారి తీసింది.
మహిళా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు నిలువరించడంలో తోపులాటలు జరిగాయి. ఆ ఉద్రిక్త పరిస్థితిలో రేణుకా చౌదరి పోలీసు కాలర్ పట్టుకుని నిలదీశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును దుయ్య బట్టారు. గురువారం ఉదయం రాజ్‌భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించారు.
పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. రేణుకా చౌదరి వారితో వాదులాటకు దిగారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యా న్ని అణచి వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలతో ఆమె విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా చేపట్టిన కార్యక్రమాలను పోలీసుల సాయంతో అడ్డుకోవడంపై మహిళా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసించింది. ఆ సందర్భంగా జరిగిన వాదులాటలో, తోపులాటలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేణుకా చౌదరి పోలీస్ కాలరు పట్టుకుని నిలువరించారు. ఈ దౌర్జన్యం ఏమిటంటూ నిలదీశారు.