ఓలా.. ఊబర్ సేవలు దారుణం, తీరు అధ్వానం.. సీసీపిఎకు ఫిర్యాదుల వెల్లువ
posted on Jun 17, 2022 6:34AM
ఎక్కడికయినా వెళ్లాలంటే బస్సులు పట్టుకుని వేలాడుతూ నానా అవస్థలూ పడాలా? ఇంక అక్కర్లేదు. సిటీ పరిధిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి హాయిగా ఇంట్లో కూర్చునే క్యాబ్ బుక్ చేసుకుని.. అది రాగానే ఎంచక్కా పెద్దగా శ్రమ పడకుండానే అందులో కూచుని గమ్యానికి చేరుకోవచ్చు. ఇదీ సగటు మానవుడి ఆలోచన. క్యాబ్ అనగానే ఊబర్, ఆటో అనగానే ఓలా గుర్తుకొస్తాయి. అంతగా అవి పాపులర్ అయ్యాయి. అనుకున్నదే తడవు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవడం గమ్యానికి చేరుకోవడం. అంతే అనుకుంటాం. కానీ పరిస్తితి అలా లేదు. ఈ మాట వినియోగదారులే అంటున్నారు.
ఇటీవల వాటి సర్వీసు బొత్తిగా అధ్వానంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుక్ చేసిన చాలాసేపటికి గాని రావడంలేదని, పెద్ద సౌకర్యవంతంగా వుండటం లేదని, బుక్ చేసిన తరువాత రైడ్ ను క్యాబ్ డ్రైవర్ లు అర్ధంతరంగా క్యాన్సిల్ చేసేయడం, అలా వాళ్లు క్యాన్సిల్ చేసిన దానికి కూడా వినియోగదారుడే డబ్బులు చెల్లించాల్సి రావడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలా ప్రజల నుంచి వస్తున్న ఆరోపణల కారణంగానే కేంద్ర వినియోగదారుల రక్షణ అధారిటీ (సిసిపిఏ) ఓలా, ఊబర్ సంస్థలకు నోటీసులు జారీచేసింది.
వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం ఓలా సేవలు దారుణంగా వుంటున్నాయని మే ఒకటో తేదీ వరకూ గత 12 నెలల్లో 2,400 మంది వినియోగదా రులు, ఊబర్ కు వ్యతిరేకంగా 770 మంది వినియోగదారు లు జాతీయ వినియోగదారుల హెల్స్ లైన్‌కి ఫిర్యాదులు చేశారు. అసలు ఆయా సంస్థల సేవలు బొత్తిగా బాగుండడం లేదని, ఫిర్యాదులకు సమాధా నం చెప్పడం లేదని, ఛార్జీలు కూడా మితిమీరి వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు. అలాగే క్యాబ్, ఆటోలను బుక్ చేసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ క్యాన్సిల్ చేస్తే అందుకు తీసుకునే ఛార్జీలు అతిగా ఉంటున్నాయని ఫిర్యాదులు వున్నాయి.
దేశంలో అనేక దాదాపు అన్ని ప్రాంతాల నుంచి అటువంటి ఆరోపణలు కోకొల్లుగా వస్తుండడంతో ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు అధారిటీ పేర్కొన్నది. ముఖ్యంగా ఓలా విషయానికివస్తే, 54 శాతం ఫిర్యాదులు సర్వీసు తక్కువగా వుండడం మీద, అలాగే ఊబర్ క్యాబ్‌ల విషయంలో 64 శాతం సేవలు తక్కువ స్థాయిలో వున్నాయని వచ్చాయి. అంతేగాక కస్టమర్ సపోర్ట్ నుంచి తగిన విధంగా సమాచారం లేక పోవడం, డ్రైవర్లు ఆన్‌లైన్లో చెల్లింపులను తిరస్కరించడం, క్యాష్ రూపంలోనే చెల్లించాలని డిమాండ్ చేయడం పెరిగిపోయిందనే ఫిర్యాదులు చాలా వున్నాయి.
అసలు ఒకే రూట్‌లో వెళ్లేటపుడు ఒక విధంగా, వచ్చేటపుడు మరో విధంగా ఛార్జీలు వసూలు చేస్తుండటం, క్యాబ్‌లో ఏసీ వుందని యాప్‌లో చెప్పినప్పటికీ క్యాబ్‌లో ఆ సౌకర్యం కల్పించకపోవడం వంటి ఫిర్యాదులూ నమోదయ్యాయి. మరీ ముఖ్యం గా క్యాబ్, లేదా ఓలా ఆటో బుక్‌చేసినపుడు ఒకవేళ కాన్సిల్ చేసుకుంటే ఎంత చెల్లించాల్సి వస్తుందనేది తెలియడం లేదని, దీనితో ఆ ఛార్టీలు తోచినట్టు విధిస్తున్నాని, అలాగే పిక్ అప్ పాయింట్ కి రావడానికి కూడా చాలా మంది డ్రైవర్లు ఆసక్తి చూపకపోవడమో, తిరస్కరించడమో చేస్తున్నారనీ విని యోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయని సిసిపిఏ అధికారులు పేర్కొన్నారు.