నిరసనలు వెల్లువెత్తుతున్నా... అగ్నిపథ్.. తగ్గేదేలే.. అంటున్న కేంద్రం
posted on Jun 17, 2022 @ 11:20AM
కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి నిరసనగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది. భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన 'అగ్నిపథ్' పథకానికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. పలు ప్రాంతాలలో ఈ హింసాత్మక రూపం కూడా దాలుస్తున్నాయి. అయితే ఈ పథకం విషయంలో పునరాలోచనే లేదంటూ కేంద్రం మొండిగా ముందుకే అడుగేస్తున్నది. అయితే ఈ పథకం కింద అర్హులైన యువత వయోపరిమితిని రెండేళ్లు పెంచింది.
తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకుల మాత్రమే ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. గత రెండేళ్లుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెబుతోంది. మున్ముందు ఆర్మీలోకి మరింత మందిని తీసుకుంటామని, ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని చెబుతోంది. అగ్నిపథ్ పథకం కింద ఈ ఏడాది 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్లను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ల పాటు నియమిస్తారు. అంతే.. నాలుగేళ్ల తరువాత వీరి భవిష్యత్తేమిటన్న ప్రశ్నకు మాత్రం కేంద్రం బదులివ్వడం లేదు.
నాలుగేళ్లు ఆర్మీలో చేసిన సేవలకు నెలనెలా ఇచ్చే వేతనం మినహా వీరికి దక్కేది ఏమీ ఉండదు. పెన్షన్ వంటి సౌకర్యాలూ ఉండవు. నాలుగేళ్ల తరువాత మళ్లీ నిరుద్యోగులుగా రోడ్డున పడతారని ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న వారు చెబుతారు. యథాప్రకారం ఆర్మీరిక్రూట్ మెంట్ జరిపితే.. ఇటువంటి దొడ్డిదారి పథకాల అవసరమేముంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.