సినిమాల్లో కామెడీ ట్రాక్.. రాజకీయాల్లో పాల్ ఫార్సు
posted on Jun 16, 2022 @ 4:13PM
సినిమాలలో ప్రధాన కథ రంజుగా సాగుతుంది. అయితే ఆ కథకు అడ్డు రాకుండా , టెంపో చెడకుండా ఓ కామెడీ ట్రాక్ కూడా కొనసాగుతూ ఉంటుంది. పాత కాలం సినిమాలలో ఇదో హిట్ ఫార్ములా. అలాగే కొన్నేళ్ల కిందటి వరకూ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఈ హాట్ ఫార్ములాను ఫాలో అయ్యేరు. ఇడియట్ సినిమాలో సినిమాకు సంబంధం లేకుండా కమేడియన్ అలీతో అలా నడిపిన ట్రాక్ బాగా పాపులరైంది కూడా.
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? ఇప్పుడు రాజకీయాలలో కూడా అలాంటి కామెడీ ట్రాక్ నడుస్తోంది. ఈ కామెడీ ట్రాక్ కు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, నటన అన్నీ ఒక్కరే. అంటే కర్తా కర్మా క్రియా కూడా ఒక్కరే. ఆయనే కే.ఏ పాల్. ప్రజా శాంతి వ్యవస్థాపకుడు పాల్. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హీటెక్కిన రాజకీయాలలో ఒకింత రిలీఫ్ ఆయన మాటలూ చేతలూ. తాజాగా ఆయన తన హాస్యరసాన్ని మరో ఎత్తుకు తీసుకు వెళ్లారు.
ఏకంగా మోడీ షాలకే వార్నింగ్ ఇచ్చేశానని చెప్పుకున్నారు. అన్నీ గుజరాత్ కే అంటే తాను ఓప్పనని మోడీకి ఖరాఖండీగా చెప్పేశానని చెప్పుకున్నారు. ఇంతకీ అసలు మోడీ, అమిత్ షాలతో ఆయన అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా సెలవిచ్చేశారు. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయానికి సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలు పాల్ ను వేడుకున్నారట. అందుకు పాల్ గారు అంగీకరించారట. ఈ విషయాన్ని స్వయంగా పాలే మీడియాకు తెలియజేశారు. అక్కడితో ఊరుకోకుండా మోడీ దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందనీ, ఎకనామిక్ సమ్మిట్ ఏర్పాటు చేసి దేశాన్ని గట్టెక్కించాలని తనను కోరినట్లు ఆయన చెప్పారు.
అందుకు తాను అంగీకరించాననీ, అయితే మోడీ సదరు సమ్మిట్ గుజరాత్ లో ఏర్పాటు చేయాలంటే తాను కుదరదంటే కుదరదని ఖరాఖండీగా చెప్పేశారట. హైదరాబాద్ లో అయితేనే ఏర్పాటు చేస్తానని కుండ బద్దలు కొట్టేశానని సెలవిచ్చారు. ఈ విషయంలో రాజీ ప్రశక్తే లేదని మోడీకి స్పష్టం చేశానని పాల్ చెప్పారు. మళ్లీ రాష్ట్రపతి ఎన్నిక గురించి మోడీ షాలకు అభయమిచ్చినట్లూ చెప్పుకున్నారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థే గెలుస్తారని తాను వారికి చెప్పానన్నారు. మోడీ షాలతో పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కూడా చర్చించారట.
వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశం లేదని పాల్ చెప్పారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదనీ తాను మోడీకి వవరించినట్లు కేఏపాల్ మీడియాకు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. హీటెడ్ పొలిటికల్ స్పీచెస్ మధ్యలో నెటిజన్లు పాల్ ప్రసంగాలు వింటూ తెగ రిలాక్స్ అవుతున్నారు.