తెరాస మద్దతు బీజేపీ కేనా?
posted on Jun 17, 2022 6:04AM
ఈ దేశంలో బీజేపీని ,మోడీని ఎదిరించగల మగాడు కేసీఆర్, ఒక్కరే. ఈ మాట అన్నది ఎవరో వేరే చెప్పనక్కరలేదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మూడు గంటలకు పైగా, భేటి అయిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, ఈ వ్యాఖ్య చేశారు. అంతే కాకుండా, కేసీఆర్ తో మాట్లాడిన తర్వాతనే బీజేపీ భయంకర రూపం తనకు అర్థం అయిందని చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజీపీ అధికారంలో కొనసాగితే దేశానికి జరగనున్న భయంకర ప్రమాదం గురించి, కేసీఆర్ బోధనలతోనే తనకు మరింతగా జ్ఞానోదయం అయిందని ఉండవల్లి, ఉద్ఘాటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేనే అనుకుంటే, నాకంటే కేసీఆర్ కరుడు గట్టిన బీజీపీ వ్యతిరేకి అని కితాబు నిచ్చారు. అసలు, బీజేపీ , మోడీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకతే మా ఇద్దరినీ కలిపిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు.
అయితే, ఇది నిజమా? నిజంగా కేసీఆర్ నరనరాన బీజేపీ వ్యతిరేకతను నింపు కున్నారా? కమల దళం పై ఆగ్రహంతో రగిలి పోతున్నారా? అంటే, అదంతా ఒట్టి నాటకం, అందులో నిజం లేదని, ఉండవల్లి మాజీ మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఉత్తమ కుమార్ రెడ్డి అంటున్నారు. అంతే కాదు, కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు. నిజానికి, ఒక్క ఉత్తమ కుమార్ రెడ్డి మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి కూడా పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు.
అంతే కాదు, ఆ ఇద్దరి మధ్య రహస్య బంధం ఉంది కాబట్టే, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్, రేవంత్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అందుకు కౌంటర్ గా బీజేపీ నాయకులు, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడే, ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని అంటారు. ఎన్నికల వరకు ప్రత్యర్దులుగా నటించినా, ఎన్నికల తర్వాత ఇద్దరు కలిసి పోతారని, కమల దళం నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్, తెరాస ఒకే నాణ్యానికి రెండు పార్స్వాలని అంటారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినా చివరకు చేరేది గులాబీ గూటికే అని, గతాన్ని గుర్తు చేస్తారు.
అయితే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తెరాస, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు. నిజానికి, గతంలో పరిస్థితి అదే అయినా, ఇటీవల కాలంలో తెరాస, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనే అందరూ అంటున్నారు. అయినా, ఉత్తమ కుమార్ రెడ్డి మాత్రం, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని,అందుకే ప్రతిపక్షాలతో కలిసి రావడం లేదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన ప్రతిపక్షాల సమావేశానికి తెరాస ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు. అందులో కుట్ర దాగి ఉందని అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆరోపించారు. అంతే కాకుండా ఇప్పుడే కాదు,గత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు తెరాస మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ అనుకూల అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు రాష్ట్రపతిగా ఓటు వేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కరుడుగట్టిన బీజేపీ వాది వెంకయ్య నాయుడుకు అనుకూలంగా ఓటు వేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీకి టీఆర్ఎస్ దూరంగా ఉంటే ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేయాలి. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు అనుకుంటారని ఉత్తమ్ చెప్పారు.
నిజమే, ఉత్తమ కుమార్ చేసిన ఆరోపణలలో కొంత నిజం ఉంది,అయితే,అదే సమయంలో తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నా లేకున్నా ఆ రెండు రెండు పార్టీలు మధ్య రాజకీయ అవగాహన, సైధాంతిక సారుప్యతా ఉన్నాయనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని, విశ్లేషకులు అంటున్నారు.