మోడీ, షాలు విచారణ ఎదుర్కో లేదా.. రాహుల్ ను ఈడీ విచారిస్తే ఆందోళనేల?
posted on Jun 17, 2022 6:42AM
నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఈడీ నోటీసులు విచారణ దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో తమ నాయకుడిని ఇ.డి. విచారణ పేరుతో వేధించడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేశంలో అనేక ప్రాంతాల్లో నిరసనకు దిగారు. హైదరాబాద్‌లో గురువారం పెద్ద ఎత్తున రాజ్‌భవన్ ముట్డిడికి ఉపక్రమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదాలకు దిగారు. ఊహించని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
సీనియర్ నాయకులను అరెస్టు చేశారు. దీనిపై బీజేపీ విమర్శలకు దిగింది. కాంగ్రెస్ ఆందోళన పేరుతో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన విధ్వంసంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. అసలు కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం కల్పించారని బండి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆ పార్టీని ఎవరూ అంతగా పట్టించు కోవడం లేదని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వంటి సంస్థ నుంచి వేలాది కోట్లు దోచుకుంటే చోద్యం చూసినట్టు చూడాలా? విచారణ జరిపితే ఆందోళనలా. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపడం సహజమేననీ, విచారణను ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తే జనం కూడా మెచ్చుతారని హితవు పలికారు. రాహుల్ గాంధీని ఈ.డి. విచారించడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అక్రమాలు బయట పడితే ప్రజలు పూర్తిగా ఆ పార్టీని మర్చి పోతారని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఇప్పటి నుంచే భయం పట్టుకుందన్నారు.
తమ నాయకులు మోదీ, షా కూడా ఇ.డి. విచారణను ఎదుర్కొన్నారని, నిజాయితీ నిరూపించుకొని బయటకు వచ్చారేగాని విధ్వంసాలకు పాల్పడలేదని బండి అన్నారు. ఇదంతా టిఆర్ ఎస్ సౌజన్యంతోనే జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి బలపడుతుందనే భయంతోనే కాంగ్రస్, టిఆర్ ఎస్ కలిసి ఈ నాటకం ఆడుతున్నాయన్నారు. అసలు రాహుల్ గాంధీ పాదయాత్రను కాంగ్రెస్ నాయకులే అంతగా పట్టించు కోవడం లేదని బండి ఎద్దేవా చేశారు.