రాజకీయ వార్తలంటే యువత పరుగో పరుగు.. రాయటర్స్ సర్వే తేల్చిన నిజం
posted on Jun 16, 2022 @ 4:50PM
టెన్త్ చదివే వారి దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి వరకూ.. ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకూ, అంతెందుకు యువతలో అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేదు, ఎప్పడూ మొబైల్‌తోనే కనపడుతుంటారు. అది వారికి మూడో చేయి. అది చేతిలో లేకపోతే వారి ప్రపంచం తలకిందులవుతుంది. ఇది ప్రతీరోజూ అందరూ గమనిస్తున్నదే.
కానీ మొబైల్ నుంచి వారిని దూరం చేయడమన్నది దుర్లభం, ప్రయ త్నించి విఫలమయిన తలిదండ్రుల శాతం చాలా ఎక్కువ. అది అటుంచితే అసలు యువతను అంతగా కట్టిపడేస్తున్న ప్రత్యేకాంశాలు మొబైల్ ఫోన్ లో ఏమున్నాయి? అనేది ప్రత్యేకంగా పరిశోధించాల్సిన అవసర మే లేదు. దానికి వెంటనే రెడీమేడ్ సమాధానం వుంది.. సినిమా, వెబ్ సీరీస్, ఇంకా ఇలాంటివే ఏన్నెన్నో! అసలు ప్రపంచం, పోనీ దేశం, పోనీ ప్రాంతీయ వార్తలను పట్టించుకుంటున్నవారే కనపడరు. అసలు వార్తల మీద అంత విముఖత ఎలా ఏర్పడిందనేది పెద్ద ప్రశ్నే!
రాయిటర్స్ ఇటీవల జరిపిన సర్వేలో జర్నలిజం ప్రజల్ని అంతగా ఆకట్టుకోవడం లేదన్న అంశం స్పష్ట మయింది. ఏదో మధ్య మధ్యలో టీవీ న్యూస్ అదీ ఇంట్లో వారి వొత్తిడితో ఓ క్షణం వినడమో, చూడ్డమో తప్ప ప్రత్యేకించి యువత దాని పట్ల నమ్మకం, ఆసక్తి కనబరచడం లేదని, శ్రద్ధ పెట్డడం లేదన్నది రాయటర్స్ సర్వే తేల్చిన కఠోర వాస్తవం. టీవీల్లో, పత్రికల్లో వచ్చే వార్తల పట్ల యువతకు చిత్రంగా అపనమ్మకం ఏర్పడిందని, అందుకే వారు వార్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని రాయటర్స్ సర్వేలో తేలింది. ఈ తరహా వాతావరణం దాదాపు అన్ని దేశాల్లోనూ ఏర్పడింది. యువత పని గట్టుకుని విముఖత ప్రదర్శించడం గమనించవచ్చని రాయిటర్స్ సర్వే స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ప్రశ్నావళి ద్వారా చేపట్టిన ఈ సర్వేలో యువతలో వార్తల పట్ల అనాసక్తి పెరగడానికి కోవిడ్-19 కూడా ఒక కారణమని తేలింది!
అసలు టీవీ పెడితే, వార్తా పత్రికలు తిరగేస్తే అవే భయానక వార్తలు వినవలసి వస్తుందని, చదవ వలసివస్తుందన్న భయాందోళనతో వార్త లకు బాగా యువత దూరమయింది. యువత లో ముఖ్యంగా 35 సంవత్సరాల లోపు వారిలో అసలు వార్తలను నమ్మం అనేవారి శాతం 29 , వార్త లతో విసిగెత్తిన వారి శాతం 29గా ఉంది. అసలు వార్తల వల్ల తమ మూడ్ దెబ్బతింటోందనీ అంటున్న సుమారు 17 శాతం మంది వాటి వల్ల స్నేహితులతో, బంధువులతో వాగ్వివాదాలకు దిగాల్సి వస్తోందని వార్తా పత్రికల వేపు చూడడం లేదని అన్నారు! 16 శాతం మంది అసలు వార్తలు వింటూంటే, చదువుతూంటే అసలు దేశంలో ప్రభుత్వం వుందా లేదా అనే సందిగ్ధంలో పడుతున్నాన్నారు.
భారతదేశంలో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం సహకారంతో రాయిటర్స్ సర్వే నిర్వహిం చింది. దేశంలో 72 శాతం యూత్ స్మార్ట్‌ఫోన్‌లో వార్తలు తెలుసుకుంటున్నారని, 35 శాతం మంది కంప్యూ టర్ల ద్వారా తెలుసుకుంటున్నారని తేలింది. అలాగే 84 శాతం యువత ఆన్‌లైన్ న్యూస్‌నే ఫాలో అవుతు న్నారు. కాగా 63 శాతంమంది సోషల్ మీడియా ద్వారా, 59 శాతం మంది టివీ న్యూస్, 49 శాతం మంది ప్రింట్ మీడియా ద్వారా వార్తలను తెలుసుకుంటున్నారు. ఇక యూ ట్యూబ్ 53 శాతం, వాట్స్ అప్ ద్వారా 51 శాతం మంది భారతీ యువత వార్తలను తెలుసుకోంటున్నారు. 36 శాతం మంది మీడియాపై రాజకీయ, వాణిజ్యరంగాల ప్రభావం అతిగా ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా యువతకు రాజకీయ వార్తల పట్ట ఆసక్తి గణనీయంగా తగ్గిపోయందని రాయటర్స్ సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది.