ఆత్మకూరు ప్రచారంలో జయప్రద.. బీజేపీ కోసమా.. తన ఉనికి కోసమా?
posted on Jun 17, 2022 7:36AM
ఏ అవకాశమూ లేని చోట బీజేపీ ఆకాసానికి నిచ్చెన వేస్తున్నంత హడావుడి చేస్తోంది. అధికార పార్టీ ఘన విజయంగా చెప్పుకోవడానికి పూర్తిగా దోహదపడేందుకే ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలిపిందని విపక్షాలు, రాజకీయ పరిశీలకులే కాదు.. సామాన్య జనం కూడా బహిరంగంగా చెప్పేస్తున్నారు. దీనిని బట్టే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగడంలో బీజేపీ సీరియస్ నెస్ ఏమిటన్నది అవగతమౌతుంది.
అయితు పొలిటికల్ డ్రామాను రక్తి కట్టించడానికి బీజేపీ నానా తిప్పలూ పడుతోంది. బీజేపీ ప్రచారానికి సినీ గ్లామర్ ను రంగంలోకి దించి ప్రజలను ఆత్మకూరు ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుందని నమ్మించడానికి తంటాలు పడుతోంది. అలనాటి అందాల తార, ప్రస్తుతం బీజేపీ నాయకురాలు అయిన జయప్రదను ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దించుతోంది.
స్టార్ క్యాంపెయినర్ గా సినీ గ్లామర్ ను రంగంలోనికి దించుతోంది. గత కొంత కాలంగా రాజకీయాలలో ఏ మంత చురుకుగా లేని జయప్రద తిరిగి తన ఉనికిని ఘనంగా చాటాలని భావిస్తున్న సంగతి విదితమే. అయితే అందుకు ఉత్తర భారతంలో కాకుండా.. తనకు సినీ నటిగా గుర్తింపును తీసుకువచ్చిన తెలుగు గడ్డ మీద నుంచి అయితే బాగుంటుందని ఆమె భావించారు. రాజకీయంగా తన ఉనికిని బలంగా చాటేందుకు తెలుగు రాష్ట్రాలైతేనే ఏదో ఒక మేరకు ప్రయోజనం ఉంటుందనీ భావించారు.
అందుకే ఆమె ఇటీవల తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఇటీవలే రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ సభలోనూ పాల్గొన్నారు. ఆ సభలో ఏపీలో వైసీపీ పాలన అధ్వానం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అవే మాటలు ఆత్మకూరులోనూ వల్లించి.. తాను రాజకీయాలలో క్రియాశీలంగానే ఉన్నానంటూ చాటేందుకు సిద్ధపడుతున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం లాంఛనమేనన్నది పరిశీలకుల అభిప్రాయం. అక్కడ ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీకి ఓటు లేదు.
అటువంటి చోట వైసీపీ కూడా చతురంగ బలాలను మోహరించినట్లు పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను అక్కడ దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మంత్రి రోజా ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్నారు. అక్కడ వైసీపీకి ప్రత్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీపై కాకుండా.. పోటీలో లేని తెలుగుదేశంపై విమర్శలు కురిపిస్తూ ఆత్మకూరులో వైసీపీ, బీజేపీ పోటీ వెనుక ఉన్న రహస్యమేమిటో చెప్పకనే చెప్పేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా ఇంత వరకూ ప్రచారం గురించే పట్టించుకోలేదు. తమ అభ్యర్థి తరఫున నియోజకవర్గంలో పర్యటించి సభలు, ఇంటింటి ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలెవరూ బయటకు రాలేదు. ప్రెస్ మీట్లతో సరిపెట్టేస్తూ వచ్చారు. అయితే జనం నవ్విపోతున్నారన్న గ్రహింపునకు వచ్చి.. ఇప్పుడు ఆత్మకూరు ఉఫ ఎన్నికలో బీజేపీ తరఫున ప్రచారానికి జయప్రదను రంగంలోకి దింపుతున్నారు. ఇటు రాజకీయాలలోనూ, అటు సినిమాలలోనూ ప్రాధాన్యత పెద్దగా లేని జయప్రద ఆత్మకూరు ఉప ఎన్నికలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొని కనీసం ఏపీలోనైనా రాజకీయ గుర్తింపు తెచ్చుకుని క్రియాశీల రాజకీయాలలో ఉనికి చాటాలని భావిస్తున్నారు.