నిష్ప్రయోజనం అగ్నిపథ్ పథకం
posted on Jun 16, 2022 @ 2:32PM
త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి దేశంలో యువత నుంచి తీవ్రవ్యతిరేకత వెల్లువెత్తింది. సైనిక నియామక రిక్రూట్‌మెంట్ కొరకు సిద్ధపడుతున్న నిరుద్యోగ యువకు లు దేశ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన పథకం వల్ల ప్రయోజనం వుండదని దేశమంతటా యువత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం నాలుగేళ్లకు మాత్రమే యువతకు ఉద్యోగభద్రతను కల్పిస్తోంది. మరి ఆ తర్వాత ఇతర వుద్యోగాలకు వెళ్లడానికి వీలు లేకుండా పోతుంది. కనుక ఆ నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగంలో యువత కూరుకుపోవడం ఖాయం.
అసలే శత్రువుల నుంచి ముప్పు పొంచి వున్న ఈ సమయంలో ఈ సరికొత్త పథకం వల్ల ఇటు సాయుధ బలగాల సామర్ధ్యానికి చెప్పుకోదగ్గ మేలు అయితే ఏమీ వుండదన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నయి. దేశంలో యువతను అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, అభివృద్ధి ఫలాలు అందుకోవాలని, అందుకు కేంద్రం ఎంతో చేయూతనిస్తోందని బిజెపి నాయకులు భారీ ఎత్తు ప్రచారం చేయడం తప్ప నిజానికి అగ్నిపథ్ వంటి పథకాలతో ప్రయోజనం లేకపోగా, పథకం కాలం ముగిసిన తర్వాత యువతను నిర్వీర్యం చేస్తుందనే ఆరోపణలు దేశమంతటా వెల్లువెత్తుతు్నాయి. అసలు ఇలాంటి పథకరూపకల్పన చాలా దారుణమని విపక్షాలూ గోల చేస్తున్నాయి. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలంటూ రాహుల్ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఈ కొత్త పథకంపై అనుభవజ్ఞులతో పాటు పలు వర్గాల నుంచి విమర్శలు, ప్రశ్నలు ఎదురవు తున్నాయి. నాలుగేళ్ల పాటు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడంతో యువతలో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం దేశానికి గానీ, యువ తకు గానీ అనుకూలంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా విమర్శించారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించారు. సాయుధ దళాల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న సైనికులకు వారి ఉద్యోగాలను శాశ్వత ఉద్యోగాలుగా హేతుబద్ధీకరించేలా కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై విశ్రాంత మేజర్ జనరల్ బీఎస్ ధనోవా రెండు కీలక సిఫారసులతో ట్వీట్ చేస్తూ.. కొత్తగా నియమించుకొనే వారికి కనీసం ఏడేళ్ల పాటు సర్వీసు ఉండేలా చూడాలని, వీరిలో 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకొనేలా చేయడం మంచిదని సూచించారు. ఇలా పలువురు తమ తమ అభిప్రా యాలను వెల్లడిస్తున్నారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కేవలం 25శాతం మంది అగ్నివీరులను మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. వీరంతా 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంకులో సేవ లందించే వీలుంటుంది. మిగిలిన 75శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. పెన్షన్ ప్రయోజనాలు కూడా లేవు. ఇలాం టి పథకాలతో యువతను ఆకట్టుకోవడంలో అర్ధం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.