అభ్యర్ధుల జాబితాతో రేవంత్ ముందస్తుకు రెడీ.. కాంగ్రెస్ లో కలకలం
posted on Jun 16, 2022 @ 3:16PM
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అంటే, అందుకు ఇంకో సంవత్సరం పైగానే సమయముంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి శాసన సభను అర్ధాంతరంగా రద్దు చేసి ముందస్తుకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ అదే బాటలో మరో మారు ముందస్తు ఎన్నికలు వెళతారని, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.
ముందస్తు తధ్యమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా విశ్వశిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు ప్రధాన ప్రతిపక్ష నాయకులు అందరూ ఎన్నికలకు సిద్దమై పోతున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో,నవంబర్ లేదా డిసెంబర్’లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తారు.. నెక్ట్ ఇయర్ ఏప్రిల్, మే నెలల్లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ... ఇది నా మాట.. నా మాటే శాసనం..అన్నట్లు ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తపరుస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు.
అదలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసి, జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇందులో ఎంత నిజం వుంది, ఎంత లేదు అనే విషయాన్ని పక్కన పెడితే, రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్ధులను ప్రకటిస్తామని, మూడు నెలల ముందుగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని చెపుతూ వస్తున్నారు.
అదే క్రమంలో ఇప్పుడు జాబితా సిద్దం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, అసెంబ్లీ రద్దు కాకుండానే, ముందస్తు ఎన్నికలు ఉహించుకుని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను ప్రకటిస్తుందా, అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ముందుగా అభ్యర్ధులను ప్రకటించే కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు, ఆఖరి నిముషంలో అభ్యర్ధులను ఖరారు చేయడమే కాంగ్రెస్ సంప్రదాయం. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే సంప్రదాయం పాటించిందని, పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మరోవంక, పార్టీ టికెట్ ఆశిస్తున్న అనేక మంది నాయకులు, రేవంత్ జాబితాలో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు, పనిలో పనిగా అధిష్టానం పెద్దలకు తమ కోరికను వినిపించేందుకు ఢిల్లీకి క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. అయితే, వీరు నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరట్ ( ఈడీ) విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సాలిడారిటీ తెలిపేందుకే ఢిల్లీ వెళ్ళినట్లు బిల్డప్ ఇస్తున్నా, స్వామి కార్యం స్వకార్యం చక్క బెట్టుకునేందుకే ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. అక్కడకు చేరిన రాష్ట్ర నాయకులు, ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరో వంక రేవంత్ రెడ్డి జాబితాలో ఆయన తమ అనుకూల వర్గానికి చెందినవారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి, చేసిన వివాదస్పద, ‘రెడ్డి’ వ్యాఖ్యల నేపధ్యంగాను, పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి ఒక్కడే కుర్చుని జాబితా తయారు చేశారా? కాంగ్రెస్ పార్టీలో ఒంటరి నిర్ణయాలు చెల్లుతాయా అనేది మరో చర్చగా వినవస్తోంది. అదెలా ఉన్నా, రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల అభ్యర్ధుల జాబితా సిద్ధం చేసింది నిజమైనా కాకున్నా, సోషల్ మీడియాలో మాత్రం మొత్తం 119 పేర్లతో జాబితా షికార్లు చేస్తోంది. దీనిపై వంక వివాదాలూ మొదలయ్యాయి.
అదలా ఉంటే, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తమ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు రావచ్చని అంటున్నారు. నిజానికి ఇటీవల హిజాబ్, హలాల్ వివాదాలు పతాక శీర్షికలకు ఎక్కిన సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనతోనే బీజేపీ మత ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. అంతే కాదు, ముందస్తు అంచనాలతోనే రాహుల్ గాంధీ ఏప్రిల్ లో లిగాయత్ ఓటు బ్యాంక్ టార్గెట్ గా తుముకూరు శ్రీ సిద్ధి గంగ మఠాన్ని సందర్శించారని వార్తలొచ్చాయి.
అయితే, అక్కడ కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముందస్తు తధ్యం అంటున్నా, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ముఖ్యంత్రులు మాత్రం ముందస్తు లేదు వెనకస్తూ లేదు ... ఐదేళ్ళు అయిన తర్వాత, షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని,అంటున్నారు. అయితే రేవంత్ జాబితా కాంగ్రెస్ పార్టీలో కలకలం అయితే రేపింది.