నీ జీవిత రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు.!

కొన్ని ఆలోచనలను ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు అన్నారు. మనం ఏ ఆలోచనలను ఇతరులతో పంచుకోకూడదు? మన రహస్యాలను ఇతరులతో పంచుకుంటే ఏమవుతుంది..? ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలని చెప్పాడు. ఈ విషయాలను ఇతరులతో పంచుకుంటే తర్వాత పశ్చాత్తాపపడతారని అన్నారు. అంతే కాదు, ఇది మిమ్మల్ని తీవ్రమైన సమస్యలకు కూడా గురి చేస్తుంది. చాణక్యుడి ప్రకారం మనం ఇతరులతో పంచుకోకూడని ఆలోచనలు ఏంటో తెలుసా..? ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు. వివాహ రహస్యం: మీ వైవాహిక జీవితం, కుటుంబ విషయాలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచండి. ఈ విషయాలను స్నేహితులకు, సన్నిహితులకు, బంధువులకు చెబితే ఇంటి సభ్యుల మధ్య పరస్పర శత్రుత్వం, అపనమ్మకం పెరిగి కుటుంబంలో అస్థిరత ఏర్పడుతుంది. అవమానం: ఎవరైనా మిమ్మల్ని పబ్లిక్‌గా లేదా ప్రైవేట్‌గా అవమానిస్తే, దానిని ఇతరులతో పంచుకోకండి. మీరు మీ అవమానాన్ని ప్రచారం చేస్తే, ఇతరులు మిమ్మల్ని అవమానించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ప్రజలు మీ పట్ల సానుభూతి చూపరు. ఒకరి సానుభూతి పొందాలనుకునే వారు తమ అవమానాల గురించి ఎవరితోనూ చర్చించకూడదు. ఆర్థిక పరిస్థితి: మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఎవరితోనూ చర్చించకండి. డబ్బు రహస్యంగా ఉంచండి. మీరు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. మీరు నేరుగా చెప్పకపోతే, ఈ వ్యక్తులు ఇతర మార్గాల్లో అడగడం ద్వారా దాని గురించి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు సంపాదించిన లేదా పొదుపు చేసిన డబ్బు గురించి ఎవరికీ చెప్పకండి. గురు మంత్రం, సాధన, తపస్సు: మీరు యోగ్యత గల గురువు ద్వారా దీక్ష పొందినట్లయితే, ఆయన ఇచ్చిన గురు మంత్రాన్ని గోప్యంగా ఉంచండి. ఇది కాకుండా, మీరు ఏదైనా ధ్యానం, తపస్సు లేదా మంత్రాలను అభ్యసిస్తే, దానిని రహస్యంగా ఉంచాలి. లేకుంటే విజయం సాధించదు. వీటిని రహస్యంగా ఉంచడం వల్ల మీరు కూడా లాభాలను పొందుతారు. మీ వైకల్యం లేదా బలహీనత: మీరు మీ అనర్హత లేదా బలహీనతలను ఎవరితోనూ పంచుకోకూడదు. మీరు దానిని ఇతరులతో పంచుకుంటే, వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు. మీకు సమస్యలను కలిగించవచ్చు. మీ అనర్హత, బలహీనత తెలిసిన తర్వాత వారు మీతో తప్పుగా ప్రవర్తించవచ్చు. దాతృత్వం: మనం ఎవరికైనా చేసే దానాన్ని గోప్యంగా ఉంచితేనే దాని పూర్తి ఫలం దక్కుతుంది. రహస్యంగా చేసే ధర్మం దేవుని దృష్టిలో ఉంటుంది.  అది ఫలవంతంగా ఉంటుంది. మీరు ఆలయానికి విరాళం ఇచ్చారని, పేదవారికి భోజనం పెట్టారని లేదా ఏదైనా మంచి పని చేశారని ఎవరికీ చెప్పకండి.

అనంతమైన ప్రేమకు నీరాజనం!

◆వాలెంటైన్స్ డే◆  ఫిబ్రవరి నెల పేరు చెబితే ప్రేమికులందరికీ గుర్తొచ్చేది వాలెంటైన్స్ డే నే.. ఎల్లలు లేని ప్రేమను చాటి చెబుతూ ప్రేమికులందరూ ఒకరి ఎదుట మరొకరు ఆరాధకులు అయిపోతారు. ప్రేమ పిపాసులు ప్రేమిస్తారు, ప్రేమను స్వీకరిస్తారు ఈ ప్రపంచాన్ని ప్రేమ మయం చేస్తారు. అయితే అక్కడక్కడా వినబడే కొన్ని వార్తలు మనసును కలచివేస్తుంటాయ్.  ప్రేమను కాదంటే దారుణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ క్రతువుల్లో కాలిపోతున్నారు. మరెందరో యువకులు ఆత్మర్పణ చేసుకుంటున్నారు. ఇలా చూస్తే ప్రేమకు అర్థం ఇదేనా అని కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ప్రేమంటే.. ప్రేమంటే బాధను పరిచయం చేస్తుందని ఎంతోమంది చెబుతారు. ప్రేమ మనిషికి ఇచ్చేది ఏంటి?? ధైర్యం, ఆప్యాయత, అనురాగం, నమ్మకం ఇవన్నీ ప్రేమ ఇస్తుంది. కానీ.. అవన్నీ విరిగిపోయి వీగిపోతే.. ప్రేమ కూడా వెలసిపోతుంది. ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎన్ని కావ్యాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ ప్రేమను బాధగా పరిచయం చేసి తరువాత సంతోషంతో ముగింపు ఇస్తాయి. కానీ నిజజీవితంలో సుఖమైన ముగింపు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే.. అందుకే ప్రేమ అంటే బాధ అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడిపోయింది. ఇస్తున్నారా?? తీసుకుంటున్నారా?? ప్రేమను తీసుకోవడమే ఈ ప్రపంచంలో చాలా మందికి ఇష్టం. ఒకరికి ప్రేమను పంచడం కూడా ఇష్టమే.. కానీ ఆ పంచడం అనేది కూడా తమకు నచ్చినట్టు ఉంటుంది కానీ ఎదుటివారికి కావలసింది ఇవ్వడం, దాన్ని అర్థం చేసుకోవడం తక్కువ. కొందరు అయితే తాము ప్రేమను ఇస్తున్నాం కాబట్టి ఎదుటివారు తమకు ప్రేమను ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటారు. ఇలా ప్రేమను కూడా డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం??  ప్రేమ మీద ఒట్టేసి.. ప్రేమించేవాళ్ళందరూ ఒకటే మాట చెబుతారు. జీవితాంతం నీతోనే ఉంటాను అని, నువ్వే కావాలి అని, నిన్ను ఎప్పటికీ వదులుకోనని. కానీ ఈ మాట నీటి రాతలు అయిపోతాయి. ప్రేమ మత్తులో ఎన్నో చెప్పిస్తుంది. ఎన్నెన్నో బాసలు చేయిస్తుంది. కానీ.. నిజంగా ప్రేమ మీద ఒట్టేసి మీ ప్రేమను ఎప్పటికీ వధులుకోమని మీకు మీరు ఓసారి మాట ఇచ్చుకోండి.. ప్రేమ గురించి కవులు, సినిమాలు, కథలు, ఎన్నెన్నో జీవితాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇక మనం ప్రత్యేకంగా ఏమని చెప్పుకోగలం. ప్రేమను ప్రేమగా మనలోకి ఒంపుకోవడం, ప్రేమను మౌనంగా ఆరాధించడం.. ప్రేమను ఇవ్వడమే కానీ తిరిగి ఆశించకుండా ఒకానొక నిశ్చల సంద్రంలో నిశ్శబ్దంగా ప్రయాణించడం. ఇవి మాత్రమే మనం చేయగలం. మీ ప్రపంచంలో  ఉన్న ప్రేమకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.. ప్రేమతో.. ఆరాధనతో..                                        ◆నిశ్శబ్ద. 

మీ వయసు 20-30 ఏళ్ళ మద్యనుందా? పొరపాటున  కూడా ఈ తప్పులు చేయకండి!

మనిషి జీవితం ఎన్నో దశలతో కూడుకుని ఉంటుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యవయసు, వృద్దాప్యం ఇలా ప్రతి ఒక్కటీ అధిగమిస్తూ వెళ్తారు. అయితే ఈ అన్ని దశలలోకి చాలా సున్నితమైనది, కీలకమైనది యవ్వనదశ. 20-30 ఏళ్ల మధ్యనున్నవారు  తప్పులు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో ఆవేశం, సంతోషం, ఆరాటం, కోపం, మరీ ముఖ్యంగా శారీరక స్పందనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే యవ్వన దశను చాలామంది ఉరకలు వేసే వయసు అంటూ ఉంటారు. ఈ వయసులో చేసే కొన్ని తప్పులు జీవితాన్ని చాలా నష్టానికి గురి చేస్తాయి. భవిష్యత్తును వ్యక్తి చేతుల నుండి చేజారేలా చేస్తాయి.  యవ్వనంలో ఉన్నవారు పొరపాటున కూడా చేయకూడని పనులేంటో తెలుసుకుంటే.. మూర్ఖంగా ఉండకూడదు.. వయసు పెరిగేకొద్దీ విషయావగాహన కూడా పెంచుకోవాలి. 20ఏళ్లు దాటిన తరువాత  వ్యక్తిలో చాలా ప్రపంచ జ్ఞానం పోగై ఉండాలి. జీవితంలో 20-30 ఏళ్ళ మధ్యనే వృత్తి, ఉద్యోగం, వివాహం వంటి విషయాలలో నిర్ణయాలు జరుగుతాయి.  కాబట్టి ఈ కీలకమైన దశను సక్సెస్ గా డీల్ చేయాలంటే మూర్థత్వాన్ని వదిలించుకుని జ్ఞానవంతులుగా ఉండాలి. విషయాలను అన్ని కోణాలలో అలోచించుకునే వైఖరి అలవడాలి. లేకపోతే ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేక యవ్వనాన్ని, దీని కారణంగా జీవితాన్ని కూడా చేజేతులా నాశనం చేసుకుంటారు. ఈ దశ దాటితే జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశాలు మెండుగా దొరక్కపోవచ్చు. లైంగిక వాంఛలతో జాగ్రత్త.. లైంగిక వాంఛలు సర్పం లాంటివి. అవి నిరంతరం మనిషిని ఉద్రేకానికి లోను చేస్తాయి. 20-30ఏళ్ళ మధ్య ఈ లైంగిక వాంఛల ప్రభావం కారణంగా ఎన్నో తప్పులు కూడా జరుగుతాయి. వీటిని తీర్చుకోవడం ఎంత అవసరమో.. వాటిని తీర్చుకోవడానికి ఎంచుకునే మార్గాలు అంత కీలకం. లైంగిక వాంఛలు వ్యక్తిని ఎప్పుడూ అసంతృప్తికి గురిచేస్తాయి. ఈ కారణంగా జీవితంలో గొప్పగా ఎదుగుతున్నా సరే సంతోషంగా ఉండలేరు. లైంగిక కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేస్తే మాత్రం దాని ఫలితాన్ని జీవితాంతం భరించాల్సి ఉంటుంది. ఇతరుల పంచన ఉండకండి ఇతరుల ఇంట్లో ఉండటమంటే స్వేచ్చను కోల్పోవడమే. దీని కారణంగా జీవితంలో ధైర్యంగా ఎదగలేరు. మంచి నిర్ణయాలు తీసుకోలేరు. అన్నింటికి ఇతరుల దయపై ఆధారపడతారు. ఇతరుల వద్ద ఆశ్రయం పొందుతున్నప్పుడు ఎక్కువశాతం మంది బానిస లాంటి జీవితాన్ని గడుపుతారు. జీవితం గురించి ఎన్ని కలలున్నా, ఎదగాలనే తపన ఉన్నా దాన్ని నెరవేర్చుకోవడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. అందుకే 20-30 ఏళ్ల వయసు మధ్యన ఉన్నవారు కష్టమైనా సరే స్వశక్తితో బ్రతకడానికి ప్రయత్నించాలి.                                                         *నిశ్శబ్ద.  

టెడ్డీ బేర్స్ తోనే మీలో ఉన్న  రొమాంటిక్ యాంగిల్ ను బయట పెట్టొచ్చు..!

టెడ్డీ బేర్స్ చిన్నపిల్లల నుండి  అమ్మాయిల వరకు అందరూ ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఈ వాలెంటైన్ వీక్ లో టెడ్డీ బేర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అంతేనా  ప్రతి ప్రియుడు  తన  ప్రియురాలికి  వాలెంటైన్ వీక్ లో టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటారు. అయితే  ఇలా  టెడ్డీ బేర్స్ ఇవ్వడంలోనూ కొన్ని ప్రత్యేక రంగులు ఎంపిక చేసుకుని ఇవ్వడం వల్ల టెడ్డీ బేర్ డే కాస్తా చాలా రొమాంటిక్ గా మారిపోతుంది. ఆ రంగులు ఏంటో తెలుసుకుంటే.. నలుపు.. నలుపు రంగు టెడ్డీ బేర్ లు చాలా అరుదుగానే దొరుకుతాయి. అయితే  ఇవి స్పెషల్ గా అనిపిస్తాయట. చాలావరకు యూత్ కానీ, అమ్మాయిలు కానీ నలుపు రంగు  వేసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే అబ్బాయిలు అమ్మాయిలకు నలుపు రంగు టెడ్డీ బేర్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతారు. అంతేకాదు.. ఈ రంగు టెడ్డీ బేర్ ఇవ్వడం వల్ల రిలేషన్ లో ఎలాంటి నెగిటివ్ సమస్యలున్నా అన్నీ పోతాయంట. పింక్, గ్రీన్.. పింక్ కలర్ అంటే అమ్మాయిలకు ప్రాణం. టెడ్డీల నుండి డ్రస్సులు, చీరలు,  చెప్పులు, లిప్స్టిక్ ఇలా అన్ని అదే రంగు కావాలన్నా వేసేసుకుంటారు. సో పింక్ కలర్ టెడ్డీ బేర్ ఇస్తే అమ్మాయిలు చాలా హ్యాపీ అవుతారు. అలాగే ఇది రొమాంటిక్ గా కూడా ఉంటుంది.  ఇక గ్రీన్ కలర్ టెడ్డీ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది ప్రకృతికి దగ్గరగా ఉండే రంగు. ప్రశాంతతను చేకూర్చడం ద్వారా ఇది మనిషిని రొమాంటిక్ మూడ్ వైపు మళ్లిస్తుంది.  పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రకృతిని ఇష్టపడేవారు వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రీమ్ అండ్ వైట్.. క్రీమ్ అండ్ వైట్ టెడ్డీ బేర్లు ప్రశాంతతకు చిహ్నంగా ఉంటాయి.  అమాయకత్వం, ప్రేమ, శాంతి, స్వచ్చత కోరుకునేవారు, వాటి ద్వారా  మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు.  ఇవి రిలేషన్ ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎరుపు, పర్పుల్.. ఎరుపు అంటే ప్రేమకు పెద్ద నిర్వచనం. ఇక పర్పుల్ రంగు మనిషిలో ఉండే ఉత్సాహాన్ని సూచిస్తుంది. అంతేకాదు.. ఈ రంగు టెడ్డీ బేర్ లను గిఫ్ట్ గా ఇస్తే రాయల్ లుక్ ఉంటుంది. అలాగే లగ్జరీ మూమెంట్స్ ను ఇవి ప్రతిబింబిస్తాయి. ఇవి అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతాయి.                                                       *నిశ్శబ్ద.

ప్రేమికుల పండుగలో తియ్యని వేడుక..చాక్లెట్ డే కు భలే ఐడియాలు ఇవి..!

వాలెంటైన్స్  డే అంటే యువతకు చాలా ప్రత్యేకం. ఈ వారాంతం మొత్తం బోలెడు చాక్లెట్లు, గులాబీలు, గిఫ్టులు అమ్ముడుపోతాయి. కోట్లమీద వ్యాపారం కేవలం చాక్లెట్ల ద్వారా జరుగుతుందంటే అతిశయోక్తి లేదు. వాలెంటైన్స్ డే వీక్ లో అందరికీ ఇష్టమైన చాక్లెట్ డే రోజు ఊరికే అంగట్లో  చాక్లెట్ లు తెచ్చివ్వడం కాకుండా కాస్త వెరైటీగా.. మరింత నోరూరేలా ఈ కింది విధంగా మీ భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. ఇంతకీ భాగస్వాములను ఆకట్టుకునే ఆ చాక్లెట్ రుచులు ఏంటో తెలుసుకుంటే.. చాక్లెట్ డిప్డ్ స్ట్రాబెర్రీస్.. ఇవి బయటెక్కడో కొనక్కర్లేదు. ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. నోరూరించే స్ట్రాబెర్రీస్ ను కరిగించిన చాక్లెట్ లో ముంచి వాటిని ఫ్రిజ్ లో ఉంచాలి. స్ట్రాబెర్రీస్ పైన చాక్లెట్ లేయర్ లా కోట్ అవుతుంది. ఇవి చూడటానికి భలే అట్రాక్షన్ గా ఉంటాయి. అలాగే రుచిలోకూడా భలే ఉంటాయి. వీటిని కాస్త ఆకర్షణీయంగా డెకరేట్ చేస్తే బయట గిప్టు షాపులలో కొనే గిప్టులకంటే ఇవే చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ సాధారణంగానే హృదయం ఆకారంలో ఉంటాయి. ఇది కూడా వీటి ఎంపికకు కారణం. చాక్లెట్ స్పా సెట్.. అమ్మాయిలకు అందం మీద చాలా ఆసక్తి. ఎప్పుడూ అందంగా కనిపించాలని అనుకుంటారు. దానికి తగినట్టే చాలా సౌందర్య ఉత్పత్తులను, బ్యూటీ టిప్స్ ను ఫాలో అవుతారు. కానీ అమ్మాయిలకు చాక్లెట్ స్పా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ తో చేసిన సోప్ లు, బాడీ స్క్రబ్, లోషన్లు, మాయిశ్చరైజర్లు ఉంటాయి. చాక్లెట్ ఫ్లేవర్ తో ఘుమఘుమలాడే వీటిని ఎంతో ఇష్టంగా వాడతారు. కస్టమైజ్డ్ చాక్లెట్స్.. సాధారణంగా అంగట్లో తెచ్చిన చాక్లెట్స్ ఎప్పుడూ ఇచ్చేవే. అందుకే ఈ చాక్లెట్ డే రోజున స్పెషల్ ఉండేలా చూసుకోవాలి. చాక్లెట్లమీద భాగస్వామి పేరు ఉండేలానూ, భాగస్వామికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయాలన్ని చాక్లెట్ కవర్ లోపల చిన్న కాగితంలో ఉంచి ఇవ్వవచ్చు. చాక్లెట్ మేకింగ్ కిట్.. అమ్మాయిలకు అసలే చాక్లెట్లంటే బోలెడు ఇష్టం. ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా, ఎంత ఖరీదైన చాక్లెట్లు ఇచ్చినా తృప్తి పడరు. ఆ తరువాత వెంటనే ఇంకా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ పక్కాగా వస్తుంది. అందుకే చాక్లెట్ తయారుచేసే కిట్ వారికి గిప్ట్ గా ఇవ్వొచ్చు. ఈ కిట్ లో కోకో పౌడర్, మౌల్డ్స్ తో సహా చాక్లెట్స్  తయారీకి అవసరమైన ఇతర వస్తువులు కూడా ఉంటాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా చాక్లెట్ డే రోజు భాగస్వామితో రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన చాక్లెట్ కేక్స్, ఫుడ్డింగ్, చాక్లెట్ లో ఉన్న బోలెడు వెరైటీలను ఆస్వాదించవచ్చు.                                            *నిశ్శబ్ద.

మీ  ప్రపోజ్ కు ఎదుటివారు నో చెప్పకూడదంటే ఈ 5 తప్పులు చెయ్యకండి!

  ప్రేమ ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన ఆయుధం. ఫిబ్రవరి అనగానే చాలామందికి ప్రేమికుల రోజే గుర్తుకొస్తుంది. ఈ ప్రేమికుల దినోత్సవం కేవలం ఒకరోజుతో కాకుండా వాలెంటైన్స్ వీక్ గా జరుపుకోబడతుంది. మొదటిరోజు  రోజ్ డే  తరువాత రెండవరోజును ప్రపోజ్ డే గా జరుపుకుంటారు.  ప్రపోజ్ డే రోజు నచ్చిన వారికి ప్రపోజ్ చేయడం ద్వారా కొత్త బంధానికి పునాది పడుతుంది. అయితే కొందరు ఈ ప్రపోజ్ ను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. సో.. నచ్చినవాళ్లకు ప్రపోజ్ చేసినప్పుడు వారు నో చెప్పకూడదంటే ప్రపోజ్ చేసేటప్పుడు ఈ కింది తప్పులు అస్సలు చేయకూడదు.. ప్రిపరేషన్ లేకపోవడం.. ప్రపోజ్ చేసేటప్పుడు చాలామంది నేరుగా పువ్వు లేదా ఉంగరం, లేదా బహుమతులు ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. కానీ ప్రేమను వ్యక్తం చేయడానికి  ముందుగా ప్రిపేర్  అవ్వడం చాలాముఖ్యం. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది.  ప్రపోజ్ అనేది తేలికగా తీసుకోవలసిన లేదా ఇష్టానుసారంగా అమలు చేయవలసిన విషయం కాదు. వివరాలను ప్లాన్ చేయడానికి సమయాన్ని వెచ్చించాలి.  భాగస్వామి  ప్రాధాన్యతలను పరిగణలో ఉంచుకోవాలి.  ప్రపోజ్ చేయడానికి మంచి ప్లేస్ ను ఎన్నుకోవాలి. ముఖ్యంగా చాలా పాజిటివ్ గా ఉండాలి. పార్ట్నర్ ఇష్టాఇష్టాలు.. భాగస్వామి ఇష్టాఇష్టాల గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ఇది వారికి ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేస్తాయి. వారికి అసౌకర్యం కలిగించే ఏ పనిని, ఏ పరిస్థితిని తీసుకురాకుండా చూసుకోవాలి. ప్రేమను వ్యక్తం చేయడం, ఎమోషన్స్ ను బయటపెట్టడమే కాదు.. భాగస్వామి మనసును అర్థం చేసుకుంటేనే వారి మనసులో స్థానం ఉంటుంది.   ఓవర్ గా ఏదీ వద్దు.. సినిమాలలో చూపించినట్టు నలుగురి మధ్య ప్రపోజ్ చేయడం, గట్టిగా అరిచి చెప్పడం, సర్పైజ్ పేరుతో అతిగా ప్రవర్తించడం, ప్రేమను వ్యక్తం చేయడమనే పేరుతో భాగస్వాములకు ఇబ్బంది కలిగే చర్యలు చేయడం, పబ్లిక్ లోనే భాగస్వామిని ముట్టుకోవడం వంటివి చేయకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా భాగస్వామి సింపుల్ గా నో చెప్పి వెళ్లిపోవచ్చు. అందుకే ప్రపోజ్ ను కూడా ఆచి తూచి సందర్భం చూసి చేయాలి సహజత్వం కోల్పోవద్దు.. సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చాలామంది కృత్రిమంగా మారిపోతారు. అలాగే పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తారు. ఇవన్నీ ఊహించుకోవడానికి, చూడటానికి బాగుంటాయి కానీ అనుభూతి చెందే విషయంలో మాత్రం అంత తృప్తిని ఇవ్వవు. ఏదైనా సరే మనసులో నుండి వచ్చేదే స్పష్టంగా, సహజంగా ఉంటుంది. కాబట్టి అసవసరపు డాంభికాలకు పోకుండా సహజంగా ప్రపోజ్ చేయాలి. అదే విధంగా గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఫీలింగ్స్.. ఏదో సరదాకు నచ్చేశారు అనే భావనతో కాకుండా జీవితాంతం వారితో కలిసి ఉండాలని, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రపోజ్ చేయడం మంచిది.  ఇదే విషయాన్ని భాగస్వామితో కూడా చర్చించాలి. భాగస్వామి వైపు పరిస్థితులను, వారి నిర్ణయాలను గౌరవించాలి. నిజాయితీ.. ప్రేమించడంలోనూ, ప్రపోజ్ చేయడంలోనూ నిజాయితీగా ఉండటం ఎంతో అవసరం. లేని ఫీలింగ్స్ ను ఎక్ప్రెస్ చేసి  ఎదుటివారి ఫీలింగ్స్ తో ఆడుకోకూడదు. ప్రేమ విషయంలోనూ, భవిష్యత్తు విషయంలోనూ నిజాయితీగా, జీవితం మీద ఒక భరోసా ఇవ్వగలిగేలా ఉండాలి. మీరు ఉత్తమ భాగస్వామి కాగలరనే నమ్మకాన్ని మీ భాగస్వామికి అనిపించేలా చేస్తే మీ ప్రపోజల్ కు నో చెప్పడం అంటూ జరగదు.                                   *నిశ్శబ్ద.  

పొరపాటున కూడా ఈ ముగ్గురిని నమ్మకండి..ఎందుకంటే!

ఆచార్య చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, ప్రసిద్ధ పండితుడు. మౌర్య సామ్రాజ్యానికి సమకాలీనుడైన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆయన విధానాలు నేటికీ సంబంధించినవి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ వ్యక్తి అయినా నైతికతను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో విజయం సాధించవచ్చు. నీతి శాస్త్రంలో ముగ్గురిని నమ్మవద్దని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే, పొరపాటున కూడా ఈ ముగ్గురిని నమ్మకండి. ఈ వ్యక్తులను విశ్వసించడం జీవితంలో అన్ని సమయాలలో ద్రోహానికి దారితీస్తుంది. చెడు స్నేహం: ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్నేహం కూడా ఆలోచనాత్మకంగా చేయాలి. ముఖ్యంగా, చెడు సమయాల్లో సహాయం చేయని, క్లిష్ట పరిస్థితుల్లో సాకులు చెప్పే వ్యక్తికి దూరంగా ఉండాలి. దుఃఖంలో అబద్ధాలు చెప్పే స్నేహితుడిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఇలాంటి స్నేహితుల వల్ల జీవితంలో ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు. ద్రోహి: ఆచార్య చాణక్యుడు చెపుతున్నాడు ద్రోహి... ఎప్పుడూ యజమాని మంచిని కోరుకోడు. అలాంటి వ్యక్తులు ద్రోహులు. ఎప్పుడూ తమ సంక్షేమం గురించే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ల యజమాని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటివారిని అస్సలు నమ్మకూడదు అంటాడు చాణక్యుడు. సంస్కారం లేని భార్య: ఆచార్య చాణక్యుడు ఆజ్ఞలను పాటించే అమ్మాయిని వివాహం చేసుకుంటే , మరణానంతరం స్వర్గం వంటి సుఖం లభిస్తుందని చెప్పారు . అదే సమయంలో, విధేయత, సంస్కారవంతమైన భార్య దొరకకపోతే, ఆ వ్యక్తి జీవితం నరకంలా మారుతుంది. అలాంటి స్త్రీ తన భర్త లేదా కుటుంబ సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించదు. దుష్ట భార్యను పొరపాటున కూడా నమ్మకూడదు. చెడ్డ భార్యను నమ్మి పొరపాటు చేస్తే దాని పర్యవసానాలను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కావున చెడు స్నేహం, ద్రోహులకు,దుష్ట భార్యలకు దూరంగా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నారు.

ఇవి నేర్పిస్తే చాలు.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది!

పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండటం ఎంతో అవసరం. వేగవంతమైన ప్రపంచంలో సక్సెన్ ను అందుకోవాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పనిసరి. కానీ కొందరు పిల్లలు లక్ష్యాలను చేరుకోవడంలోనూ, చదువులోనూ, ఇతర కార్యకలాపాలలోనూ వెనుకబడి ఉంటారు. ఆత్మవిశ్వాసం లేకపోతేనే ఇలా జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులే పిల్లలో ఆత్మవిశ్వాసం పెంచాలి. పిల్లలో ఆత్మవిశ్వాసం పెరిగితే వారి భవిష్యత్తు కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకోసం ఈ కీంది విషయాలు పిల్లలకు నేర్పించాలి. పిల్లలు ఏదైనా ప్రయత్నం చేసి ఓడిపోతే ఓటమి గురించి వారిని తిట్టకండి. ఓడిపోవడం సాధారణ విషయమని, ఓటమి నుండి  పాఠాలు నేర్చుకుని తరువాత మళ్లీ ప్రయత్నం చెయ్యాలని పిల్లలకు చెప్పాలి. దీంతో ఓటమితో అంతా ముగిసిపోలేదు అనే భావన, తరువాత ప్రయత్నాలకోసం తగినంత ఆత్మవిశ్వాసం వారిలో పెరుగుతుంది. సంకల్పబలం గురించి పిల్లలకు వివరించాలి. ఏదైనా పని మొదలుపెడితే దాన్ని సాధించేవరకు వెనకడుగు వేయకూడదని, పనిని మధ్యలో వదిలేయడం లాంటివి చెయ్యకూడదని వారికి చెప్పాలి. ఇలా చేస్తే ప్రతి పనిని వారు పూర్తీ నిబద్దతతో పూర్తీ చేస్తారు. ఏకాగ్రత లేకపోతే ఏ పనీ చెయ్యలేరు. పిల్లలకు అదే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఏకాగ్రత పెంచడానికి ధ్యానం,  యోగా  వంటివి అలవాటు చెయ్యాలి. ఏ పని చేసినా అందులో తాము గెలిచితీరాలని పెద్దల నుండ పిల్లల వరకు అందరూ కోరుకుంటారు. పిల్లలు అయితే చాలా డిజప్పాయింట్ అవుతారు. కానీ గెలుపు ఎలాగో ఓటమి కూడా అలాగే వస్తుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. దీంతో గెలుపోటములను సమానంగా యాక్సెప్ట్ చేస్తారు. పిల్లలు పెద్దయ్యే కొద్దీ తాము స్పెషల్ అనే ఫీలింగ్ కు లోనవుతారు. వారు తమకు గౌరవం కావాలని, అందరూ తమను గౌరవించాలని అనుకుంటారు. ఈ విషయాలను కూడా పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. గౌరవం లభించాలంటే వారు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ఉండటం ఎంత ముఖ్యమో వారికి వివరించాలి. పిల్లలు బేలగా ముఖం పెట్టగానే తల్లిదండ్రులు కగిరిపోయి పిల్లల పనిని తాము చేసేస్తారు. దీని వల్ల పిల్లలు నేర్చుకునే సామర్ద్యం కోల్పోతున్నారు. అందుకే ప్రతి పనిని పిల్లలు స్వయంగా చేసేటట్టు చూడాలి. అవసరమైతేనే తల్లిదండ్రులు సహాయం చెయ్యాలి.                                         *నిశ్శబ్ద.

పిల్లలలో పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి..!

  సాధారణంగా కొత్త ఏడాది మొదలయ్యిందంటే పిల్లలలో ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులకు కొత్త టెన్షన్ మొదలవుతుంది. దీనికి కారణం పిల్లల చదువుల ఏడాది ముగింపు చాలా దగ్గరకు వచ్చేయడమే.. సిలబస్ పూర్తీ చేయాలి, అన్ని విషయాలు బాగా నేర్చుకోవాలి, పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. పిల్లలు తమ ప్రతిభ నిరూపించుకుంటేనే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. తమ పిల్లలను  మరింత మంచి స్కూలు, కాలేజీలో చేర్పించడానికి ఆసక్తి చూపుతారు. వీటన్నింటి మధ్య తల్లిదండ్రులు ఎంత టెన్షన్ అనుభవిస్తారో.. పిల్లలు అంతకంటే ఎక్కువ టెన్షన్ అనుభవిస్తారు. ఈ ఒత్తిడి లేకపోతే పిల్లలు కనీసం తాము చదువుకున్న దాన్ని అయినా ఎలాంటి గందరగోళం లేకుండా రాసి మార్కులు తెచ్చుకోగలుగుతారు.  ఒత్తిడి తగ్గడానికి చేయాల్సిన పనులివే.. క్రమం తప్పకుండా వ్యాయామం.. పిల్లలలో ఒత్తిడి తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. ఏరోబిక్స్, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి సులువైన వ్యాయామాలు కనీసం ఉదయం సమయంలో 30నిమిషాలు చేసేలా చూడాలి. శారీరక శ్రమ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును రిలాక్స్ చేస్తుంది. ఆహారం.. పిల్లలకు సమతులాహారం ఇవ్వడం తప్పనిసరి. చదువు పేరుతో ఆహారన్ని కూడా స్కిప్ చేస్తే అది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండేలా చూడాలి.  చేపలు, తృణధాన్యాలు వంటి పోషకాలు ఆహారంలో ఇవ్వాలి. నిద్ర.. చదువు పేరుతో పిల్లలను నైటౌట్లు చేయించడానికి అస్సలు అనుమతించకూడదు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల తరువాత పిల్లలు నిద్రపోయేలా చూడాలి.  ఉదయం 5గంటలకు లేచి చదువుకునేలా ప్రోత్సహించాలి. ఇంకా ముందే నిద్రపోయి మరింత ముందే నిద్రలేచినా మంచిదే. కానీ నిద్ర వేళలు, నిద్ర నుండి మేల్కొనే వేళలు  తప్పకుండా ఫాలో అయితే పిల్లలకు సహజంగానే చదువుకోవడం మీద ఆసక్తి ఉంటుంది. చదువుకున్నది బాగా గుర్చుపెట్టుకోగలుగుతారు. బ్రేక్.. పరీక్షలు దగ్గర్లో ఉన్నాయనే కారణంతో గంటలు, గంటలు  కూర్చుని చదువుతుంటారు. అయితే ప్రతి 3గంటలకు ఒకసారి కాస్త బ్రేక్ తీసుకోవాలి. కనీసం 10 నుండి 15 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం వల్ల కళ్లకు, మనసుకు రిలాక్స్ గా ఉంటుంది.  ఈ  సమయంలో లోతైన శ్వాస, ధ్యానం, సంగీతం వినడం వంటివి చేస్తుంటే  ఒత్తిడి తగ్గుతుంది. పాజిటీవ్ డిస్కషన్.. పిల్లలతో పరీక్షల గురించి, మార్కుల గురించి, వారు చదువుతున్న విధానం గురించి ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. తాము చదువుతున్న  విషయాల మీద, పరీక్షలలో అడిగే విషయాల మీద ఆత్మవిశ్వాసంతో ఉండేలా చూడాలి. పిల్లలు చదువుతున్న తీరులో ఏవైనా  తప్పులున్నా, సరిగా లేదని అనిపించినా పిల్లలు వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి తప్ప కసురుకోవడం, నువ్వెప్పుడూ ఇంతే, నీకేం రాదు, ఇలా ఉంటే పరీక్షలు ఏం రాస్తావు అంటూ తిట్టకూడదు. కెఫిన్ వద్దూ.. పిల్లలు కూడా కాఫీ, టీ లు తాగుతుంటే వారిని పరీక్షల సందర్భంలో కాఫీ, టీ ల బారిన పడకుండా చూసుకోవాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగుతూ నైటౌట్లు చేయడం, చదువుతున్న విషయం మీద శ్రద్ద పెరగాలని కాఫీ, టీలు తాగడం వంటి అలవాట్లుంటే వాటిని మాన్పించాలి. పిల్లలు మానసికంగా దృఢంగా ఉండటానికి పండ్లు, పండ్లరసాలు, నీరు, కొబ్బరినీరు, స్మూతీలు మొదలైనవి తీసుకునేలా చేయాలి. ఇవి శరీరాన్ని హేడ్రైట్ గా కూడా ఉంచుతాయి. ఫన్ కూడా ముఖ్యం.. ఎప్పుడూ చదువే ఉంటే పిల్లలకు బోర్ కొడుతుంది. అందుకే కాస్త సరదాగా ఉండటం కూడా ముఖ్యం. కొద్దిసేపు  టీవీ చూడటం, స్నేహితులతో గడపడం, ఇంట్లో తోట పని, సరదాగా కొద్దిసేపు బయటకు వెళ్లడం,  బ్రెయిన్ పవర్ పెంచే పజిల్స్, గేమ్స్ ఆడటం వంటివి చేయాలి. ఇది ఎక్కువ చదవడం వల్ల కలిగే ఒత్తిడిని తరిమేస్తుంది. సందేహాలు.. సమాధానాలు.. పరీక్షలకు, చదువుతున్న విషయాలకు  సంబంధించి  సందేహాలు, సమాధానాలు అవసరమైతే స్నేహితులతో చర్చించడం చాలామంచిది. గ్రూప్ డిస్కషన్ వల్ల గంటసేపులో అర్థమయ్యే విషయాలు కేవలం 10 నిమిషాలలో అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సొంతంగా చదివి అర్థం చేసుకునే విషయాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా అర్థమవుతాయి. ఇలా సమస్యలు పరిష్కారమవుతుంటే ఎలాంటి ఒత్తిడి దరిచేరదు.                                              *నిశ్శబ్ద.    

అతి వేగం ప్రాణాంతకం

పోలీసు కారు తనని వెంబడించడం చూడగానే ఆ చర్చి ఫాదరు ఒకసారి తన స్పీడోమీటర్‌ వంక చూసుకున్నాడు. పరిమిత వేగాన్ని మించి 20 కిలోమీటర్లు ఎక్కువగా వేగంతో తను బండిని నడుపుతున్నాడు. ఆ విషయం గమనించి పోలీస్‌ తనని వెంబడిస్తున్నాడని అర్థమైంది. దాంతో నిదానంగా తన కారుని పక్కకితీశాడు. తీరా పోలీసు కారులోంచి దిగిన వ్యక్తిని చూశాక ఫాదరుకి కాస్త ఉపశమనంగా తోచింది. వారం వారం చర్చిలో తన ఉపన్యాసం వినడానికి వచ్చే హేరిస్‌ని ట్రాఫిక్‌ పోలీస్ అవతారంలో చూసేసరికి భయం కాస్తా ఎగిరిపోయింది. హేరిస్‌ తనని కాస్త చూసీ చూడనట్లు వదిలిచేయవచ్చు. ‘‘హాయ్‌ హారిస్! మనం ఇలాంటి సందర్భంలో కలుసుకుంటామని అనుకోలేదు’’ అన్నాడు చర్చి ఫాదర్‌ సరదాగా. ‘‘నేను కూడా!’’ చాలా నిర్లిప్తంగా బదులిచ్చాడు హేరిస్‌.   ‘‘ఇవాళంతా విపరీతమైన పని ఒత్తిడి. పైగా ఇంటికి వెళ్లేందుకు చాలా ఆలస్యం అయిపోయింది. ఇదిగో ఆ తొందరలో ఉండగానే నువ్వు నన్ను గమనించినట్లున్నావు’’ తన సంజాయిషీని తెలివిగా చెప్పుకొచ్చారు ఫాదర్‌. ‘‘ఊ!’’ అంటూ బదులిచ్చాడే కానీ హేరిస్‌ మొహంలో ఎలాంటి చిరునవ్వూ కనిపించలేదు. ‘‘అయినా నేనేమంత వేగంగా వెళ్లడం లేదు. మహా అయితే ఒక ఐదు కిలోమీటర్ల ఎక్కువ స్పీడుందేమో! ఏదో పరధ్యానంగా ఉండి పట్టించుకోలేదు,’’ అంటూ చటుక్కున చిన్న అబద్ధం చెప్పేశారు ఫాదర్‌.   హేరిస్‌ ఒక్క క్షణం ఫాదర్‌ మొహంలో చూశాడు. ‘‘మా వాడలో మీరు ఒక మంచి ఫాదర్‌ అన్న పేరు ఉంది,’’ అన్నాడు. హేరిస్‌ ఆ మాట ఎందుకు చెప్పాడో ఫాదర్‌కి అర్థం కాలేదు. కానీ ఇక అంతకు మించి అతనితో సంభాషణ అంత మంచిది కాదనిపించింది. నిదానంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. హేరిస్‌ ఎలాగూ చలాను రాసి ఇస్తాడు కాబట్టి, ఎంతో కొంత రుసుముని చెల్లించేందుకు జేబులో ఉన్న డబ్బులు తీసి లెక్కపెట్టుకోసాగాడు. ఓ రెండు నిమిషాల తరువాత హెరిస్ కారు అద్దంలోంచి చలాను లోపలకి పడేశాడు. చలాను తీసి చూసుకున్న ఫాదర్‌కి అది ఏదో ఉత్తరంలా తోచింది. ‘‘ఫాదర్‌! ఒక నాలుగేళ్ల క్రితం ఇలాగే వేగంగా వెళ్తున్న కారు కింద పడి నా ఆరేళ్ల పాప చనిపోయింది. డ్రైవరు వేగంగా కారు నడిపినందుకు గాను అతనికి జరిమానా, మూడు నెలల జైలుశిక్ష విధించారు. అతను ఓ మూడు నెలలు కళ్లు మూసుకుని జైళ్లో గడిపేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో తన ముగ్గురు పాపాలతో అతను హాయిగా ఉన్నాడు. కానీ నేను నా ఒక్కగానొక్క కూతురిని కోల్పోయాను. నేను చనిపోతే కానీ స్వర్గంలో ఉన్న నా కూతురిని కలుసుకోలేనేమో! ఈలోగా నా కొడుకుని చూసుకుంటూ ఆ బాధని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నాము. మీరు వేగంగా నడిపే కారు ఏదో ఒక రోజు నా కొడుకుని కూడా మా నుంచి దూరం చేయగలదు. దయచేసి మా కుటుంబం కాసం ఆ ప్రభువుని ప్రార్థించండి. మరో బిడ్డ చనిపోకుండా ఉండేందుకు మీ కారుని నిదానంగా నడపండి,’’ అని ఆ ఉత్తరంలో ఉంది.   ఫాదర్‌ నోట మాట రాలేదు. వాహనాన్ని వేగంగా నడపడం అనేది తనకు సరదానో, అవసరమో కావచ్చు... కానీ అది ఇంకొకరి కుటుంబాన్ని నాశనం చేయగలదన్న ఊహే చాలా భయంకరంగా తోచింది. తన కారుని నిదానంగా ముందుకు పోనిచ్చారుత. వచ్చే ఆదివారం చర్చిలో ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవాలని నిశ్చయించుకున్నారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

అనుకున్న పనులలో విజయం సాధించాలనే ఆరాటం ఉందా? అయితే ఈ పనులు చేయండి!

జీవితంలో ఓడిపోవాలని ఎవరూ అనుకోరు. మూర్ఖుడు కూడా విజయం గురించే ఆలోచిస్తాడు. తెలివైన వారు కూడా విజయం ఎలా సాధించాలనే విషయాలపై తర్జభర్జన పడుతుంటారు. అయితే తెలివైనవారు విజయానికి మార్గాలు కనుగొనడంలో ఎప్పుడూ తలమునకలై ఉంటారు. కానీ మూర్ఖులు మాత్రం విజయం వాకిట్లో ఉన్నా మళ్లీ చూద్దాం అనుకుంటారు. మరికొందరు విజయం సాధించాలనే తపన ఉన్నా సరే..  తమ వల్ల కావట్లేదని నిరుత్సాహ పడతారు. అయితే జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే కింద చెప్పుకున్న నాలుగు విషయాలు త ప్పకుండా గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఇంతకీ ఆ నాలుగు విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుంటే.. క్రమశిక్షణ.. వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ మొట్టమొదటి మెట్టు.  క్రమశిక్షణ ఉంటే ఎప్పటిపనులు అప్పుడు పూర్తిచేయడం, ఏ సమయంలో ఏ పనులు చేయాలో, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమయపాలన క్రమశిక్షణ ద్వారానే సాధ్యం. కాబట్టి క్రమశిక్షణ బాగుంటే  విజయం సాధించడంలో మొదటి అడుగు సక్సెస్ గా ముందుకు వేసినట్టే.. సానుకూల దృక్పథం.. సానుకూలంగా ఉండటం అనేది విజయం సాధించడానికి రెండవ మెట్టు. సానుకూలత అనేది వ్యక్తిలో సబ్ కాన్సియస్ మైండ్ ను శక్తివంతంగా మారుస్తుంది. మన మెదడును పాజటివ్ గా విజయానికి సంసిద్దం చేస్తే.. ఎంత ఆటంకాలు ఉన్నా సరే విజయం సాధించేలా మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంతేకాదు.. పాజిటివ్ ఆలోచన అనేది ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుంది. నైతిక విలువలు.. నైతిక  విలువలు విజయానికి మరొక మెట్టు లాంటివి. నైతిక విలువలు ఉన్నవారు సమాజం చేత గౌరవించడబడతారు. నైతిక విలువలతో కూడిన జీవితంలో వ్యక్తి ఎప్పుుడూ తప్పు పనులు చేయడు. నిజాయితీగా కష్టపడేవాడికి ఖచ్చితంగా ఫలితం లభించి తీరుతుంది. పైగా అడ్డదారులలో సాధించే విజయాలలా కేవలం ఊరించి తరువాత చేజారిపోయే రకం కాదు. కాబట్టి నైతిక విలువలు ఉంటే విజయానికి సగం మార్గం సుగమమైనట్టే.. నేర్చుకోవడం.. ఎవరు ఏది చెప్పినా వినాలి. అందులో ఉపయోగపడే విషయాలను స్వీకరించాలి. ప్రయత్నాలలో వైఫల్యాలు ఎదురైతే వాటిని అనుభవ పాఠాలుగా తీసుకోవాలి. మరొకసారి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. మరీ ముఖ్యంగా మొదటిసారే విజయం సాధించాలనే ఆలోచనను వదలాలి. విఫలమైన ప్రతిసారి  మరింత నేర్చుకోవడానికి అవకాశం దొరికిందనే సానుకూల భావంతో ఉండాలి. ఇవన్నీ ఫాలో అయితే విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.                                                 *నిశ్శబ్ద.

మొండిగా ఉన్న పిల్లలను మార్చడం కుదిరే పనేనా? ఇలా చేసి చూడండి!

మొండితనం పిల్లలలో చాలా సహజమైన విషయం. అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పెద్దల గారాబం పిల్లలను మొండివాళ్లుగా తయారుచేస్తాయి. ఇప్పటి తల్లిదండ్రులు ఒకప్పటి పిల్లలే.. అప్పటి బాల్యంలో చాలా విషయాలు కఠినంగా గడిచాయని  అలా తమ పిల్లలకు ఉండకూడదనే కారణంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద అతిప్రేమ, అతి గారాబం చేస్తారు. ఈ కారణంగానే ఇప్పటి పిల్లలలో మొండితనం తారా స్థాయిలో ఉంటుంది. ఎంతగా అంటే తల్లిదండ్రులే పిల్లల మాట వినేంత, పెద్దా చిన్న బేధం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడేంత.  ఇవన్నీ చూసి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో గొప్పగా మాట్లాడుతున్నారనుకుని మురిసిపోతారు. కానీ రానురాను అది పిల్లలలో మొండితనానికి, నిర్లక్ష్యానికి  ఎలా కారణం అవుతుందో తెలిసొస్తుంది. అయితే మొండిగా, నిర్లక్ష్యంగా ఉన్న పిల్లలను తిరిగి దారిలో పెట్టడం కుదురుతుందా అంటే.. కుదురుతుంది. అందుకోసం ఈ కింది టిప్స్ ఫాలో కావాలి. చేతులారా చేస్తున్నారు.. తల్లిదండ్రులు బిజీ ఉన్న కారణంగా పిల్లలను ఏదో విధంగా సైలెంట్ గా ఉంచితే సరిపోతుందనే కారణంతో డబ్బు నుండి వారు అడిగిన ప్రతి వస్తువును వారి ముందు ఉంచుతారు. ఇలా అడగ్గానే అలా అన్నీ సమకూరుతుంటే పిల్లలు చాలా నిర్లక్ష్యంగా తయారవుతారు. ఆ తరువాత ఎప్పుడైనా వారు అడిగింది లేదంటే అరిచి గీ పెడతారు. ఏడుస్తారు. ఇంకా చెప్పాలంటే ఎమోనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి వారు అడిగింది వెంటనే సమకూర్చడం మాని వారికి అదెంత అవసరం, అసలు ఎందుకు అడుగుతున్నారు అనే విషయం మొదట ఆలోచించాలి. అదే విషయాన్ని పిల్లలకు చెప్పాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా అవసరమైనవి ఏంట్? అనవసరమైనవి ఏంటి? అనే విషయాలు ఆలోచించగలుగుతారు. సమయం కేటాయించాలి.. ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలకోసం అన్నీ చేస్తున్నారు, వారికి సమయం కేటాయించడంలో మాత్రమే నిర్లక్ష్యంగా ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే ఈ నిర్లక్ష్యం మరింత ఎక్కువగా ఉంటుంది.  అదే పిల్లలకు సమయం కేటాయించి వారితో మాట్లాడటం, వారు చెప్పే విషయాలు వినడం, వారికి సరైన సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటే పిల్లలు మొండితనం మాని తల్లిదండ్రుల మాటకు, తల్లిదండ్రులకు విలువ ఇస్తారు. కావాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయంలో మొబైల్ ఫోన్ కూడా దూరం ఉంచవచ్చు. మెచ్చుకోవాలి.. పిల్లలలో మొండితనం తగ్గించడానికి గొప్ప మార్గం మెచ్చుకోవడం. ఒక వ్యక్తిని దారిలో పెట్టాలంటే సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించాలని అంటారు. అయితే పిల్లలను దారిలో పెట్టడానికి వారిని మెచ్చుకోవడం, పొగడటం చేస్తే సరిపోతుంది. పిల్లలకు ఏదైనా పనిని అప్పజెప్పడం, ఆ పనులు పూర్తీ చేసిన తరువాత వారిని మెచ్చుకోవడం చెయ్యాలి. అదే విధంగా పిల్లలు ఏదైనా మంచి పని చేసినా, చదువులో, ఆటలలో, సామాజిక కార్యక్రమాలలో ఇలా ఏదైనా సరే మంచిగా రాణించినా వారిని మెచ్చుకోవడం, చిన్న బహుమతులు ఇవ్వడం చేస్తే వారి మొండితనం పోయి సంస్కారవంతులుగా మారతారు. మార్గనిర్దేశం చెయ్యాలి.. పిల్లలకు మంచి, చెడు ఆలోచించే పరిణితి ఉండదు. వారికి అనిపించింది చేస్తారు, అలాగే వారికి కనిపించేది నిజమని అనుకుంటారు. మంచి చెడు, నైతికత మొదలైనవి పిల్లలకు అంతగా తెలియవు. వారికి తెలిసిందల్లా తమను ఆకర్షించే పనులు చెయ్యడం. అయితే తల్లిదండ్రులే ఈ విషయాల మీద అవగాహన పెంచాలి. మంచి, చెడు గురించి వివరించి చెప్పాలి. చెడ్డ పనుల వల్ల కలిగే నష్టాలు, మంచి పనుల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలి. ఇలా చేస్తే పిల్లలు  మంచిదారిలో ఉంటారు. సృజనాత్మకత.. సృజనాత్మకత పిల్లలలో ఉండే ప్రతిభను బయటకు తీస్తుంది. పిల్లలను ఖాళీగా అస్సలు ఉంచకూడదు. ఏదో ఒక పని చేసేలా వారిని ప్రోత్సహించాలి. వారిలో ఉండే ప్రతిభను ప్రోత్సహించాలి. ఇది పిల్లలను మానసికంగా మెరుగ్గా ఉంచుతుంది. వారిలో ఆలోచనను, కష్టపడే గుణాన్ని, వారి ప్రవర్తనను అభివృద్ది చేస్తుంది.                                                          *నిశ్శబ్ద.  

ప్రతిరోజూ తండ్రులు ఈ పనులు చేస్తే చాలు.. తరగతిలో పిల్లలు ఫెయిల్ అవ్వడమనే మాట వినబడదు!

తల్లిదండ్రులు పిల్లల జీవితానికి మూలస్థంభాలు. సాధారణంగా పిల్లల జీవితం ఎక్కువగా తల్లి సమక్షంలోనే గడిచిపోతుంది. ఉదయమెప్పుడో ఆఫీసు, ఉద్యోగమంటూ వెళ్ళిపోయే తండ్రి రాత్రెప్పుడో పిల్లలు నిద్రలోకి జారుకునే సమయానికి ఇంటికి చేరుకుంటాడు. అంత వరకు పిల్లలు అన్ని అవసరాల కోసం తల్లిమీదనే ఆధారపడతారు. అందుకే పిల్లలకు తల్లులతోనే అనుబందం ఎక్కువ. అయితే పిల్లల విషయంలో తండ్రులు కొన్ని పనులు చేయడం ద్వారా పిల్లలు తరగతిలో ఫెయిల్ అనే మాట వినబడకుండా చూసుకోవచ్చు. చదువులో పాలుపంచుకోవాలి.. పిల్లలు హోం వర్క్ చెయ్యాలన్నా, తరగతి విషయాలు మాట్లాడాలన్నా అన్నీ తల్లితోనే.. కేవలం స్కూలు ఫీజు విషయమే తండ్రుల వరకు వెళుతుంది. అయితే పిల్లలు చదువుకుంటున్నప్పుడు, హోం వర్క్ చేస్తున్నప్పుడు తండ్రులు  సమయం గడపాలి. వారిసందేహాలు తీరుస్తూ, తండ్రుల ప్రమేయం పిల్లల చదువులో చాలా ప్రభావం చూపిస్తుంది. పరీక్షల దగ్గర నుండి  తరగతిలో సాధారణంగా జరిగే విషయాల వరకు అన్నీ తండ్రులు తెలుసుకోవాలి.  పిల్లలలో మేధోవికాసాన్ని ప్రోత్సహించే అంశాలపై తండ్రులు పిల్లలతో మాట్లాడాలి. ఇదివారిని టాపర్స్ గా మారుస్తుంది. రోల్ మోడల్స్.. పిల్లలకు తమ తండ్రులు రోల్ మోడల్స్ లానూ, సూపర్ హీరోస్ లానూ అనిపించాలి. తండ్రి ప్రవర్తన, పనితీరు, జీవిత విలువలు, కుటుంబం, వృత్తి, బాధ్యతల విషయంలో అతని నిర్ణయాలు ఇవన్నీ పిల్లలను కూడా ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ చూసి పిల్లలు నైతిక విలువలు అలవాటు చేసుకుంటారు. జీవిత నైపుణ్యాలు పిల్లలలో అభివృద్ది అవుతాయి. అందుకే తండ్రులు కూడా వీలైనంత సమయాన్ని పిల్లలతో గడపాలి. ఎమోషన్ కనెక్షన్.. తండ్రి పిల్లల మధ్య సంబంధం బయటకు గంభీరంగా కనిపిస్తుంది. ఆడపిల్లలు తండ్రితో చనువుగా ఉన్నట్టు మగపిల్లలు ఉండలేరని కూడా అంటారు. అయితే తండ్రులు జెండర్ తో సంబంధం లేకుండా పిల్లలతో ఎమోషన్ బాండింగ్ పెంచుకోవాలి.  తండ్రులు తమ పనిలో పిల్లలను భాగస్వామ్యం చేసుకుంటూ ఉంటే  అది పిల్లలలో మానసిక పరిపక్వతకు దారితీస్తుంది.  మరొక విషయం ఏమిటంటే పిల్లలు తండ్రుల సమక్షంలో చాలా ధైర్యంగా ఉండగలుగుతారు కూడా. కమ్యూనికేషన్.. పిల్లలతో కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. వారిని ఎప్పుడూ భయపెడుతూ మాట్లాడటం సరికాదు.  పిల్లలు స్కూల్ అయినా ఇతర విషయాలు అయినా వారు చెప్పేటప్పుడు శ్రద్దగా వినాలి. వారి ఎమోషన్స్ ను అర్థం చేసుకోవాలి. చిన్న వయసులో పిల్లలు  పేరెంట్స్ తమకు సపోర్ట్ ఉంటారనే భావనలో ఉంటారు. అయితే అలా కాకుండా పిల్లలు మాట్లాడటానికి భయపడేలా తండ్రులు ప్రవర్తిస్తే పిల్లలు ఏ విషయాన్ని బయటకు చెప్పలేక లోలోపలే కుమిలిపోయి మానసికంగా డిస్టర్బ్ అవుతారు.                           *నిశ్శబ్ద.

మనిషి జీవితానికి మూడు ముఖ్య సూత్రాలు చెప్పిన స్వామి వివేకానంద..!

మనిషి జీవితానికి ఆత్మవిశ్వాసం, ఆత్మశక్తి, ఆత్మనిగ్రహం,  చాలా అవసరం. వీటిని  అలవర్చుకోవడం వల్ల జరిగేది ఏంటో స్వామి వివేకానంద ఇలా చెప్పారు..  ఆత్మవిశ్వాసం.. భగవంతుణ్ణి నమ్మని వారిని సనాతన ధర్మం నాస్తికులని అన్నది. కానీ తమ మీద తమకి నమ్మకం లేని వారిని నాస్తికులంటుంది ఆధునిక ధర్మం. "పురాణాల్లో చెప్పిన మూడువందల ముప్ఫై కోట్ల దేవుళ్ళ మీద నమ్మకం ఉన్నా..... మీ మీద మీకు విశ్వాసం లేకుంటే మీకు ముక్తి లభించదు" అని స్వామి వివేకానంద అన్నారు. బధిరత్వం, అంధత్వం గల హెలెన్ కెల్లర్ అనే బాలిక ఆత్మవిశ్వాసంతో ఎన్నో అద్భుతాలను సాధించింది. సీతాన్వేషణలో వానరులు మహాసాగరాన్ని దాటడానికి సాహసించలేదు. వయోవృద్దుడైన జాంబవంతునికి హనుమంతుడి శక్తి గురించి తెలుసు. బాల్యంలో హనుమంతునికి గల పరాక్రమాన్ని గుర్తు చేసి, ఆతనిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించాడు. అతను ఆంజనేయునితో "నీలో అపారమైన శక్తి ఉంది. నువ్వు అద్భుతాలు సాధించగలవు. నీపై నువ్వు విశ్వాసాన్ని పెంచుకో. రామకార్యాన్ని సాధించడానికి సిద్ధమవు, లే, జాగృతుడవవు" అన్నాడు. జాంబవంతుని మాటలు హనుమంతునిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. ఆ సవాలును ఎదుర్కొనేందుకు హనుమంతుడు సిద్ధపడి, రామకార్యాన్ని నిర్వర్తించాడు. నిరుత్సాహం, దిగులు కలిగినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడానికి బదులు తమ శక్తినంతటినీ కూడదీసుకుని లక్ష్యసాధనకై పరిశ్రమించాలి. ఆత్మశక్తి..  మనం శారీరకంగా, మానసికంగా, నైతికంగా దృఢంగా ఉండి మన దక్షత, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడాలి. మన భవితను మనమే సుగమం చేసుకోవాలి. మన జీవితాలకు మనమే బాధ్యత వహించగలిగితే మనం ఎన్నో సాధించగలం. ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పడానికి నిరాకరించినా తనంతట తానే విలువిద్య నేర్చుకుని, అర్జునుణ్ణి మించిన మేటి విలుకాడయ్యాడు ఏకలవ్యుడు. ఒకమారు ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో  తన సామాను మోయడానికి కూలివాడి కోసం చూస్తున్నాడు. ఇంతలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అక్కడకు వచ్చి, ఆ వ్యక్తికి సహాయం చేశాడు. ఇంటికి చేరగానే ఆ వ్యక్తి విద్యాసాగర్కు కొంత పైకం ఇవ్వబోగా, ఈశ్వరచంద్రుడు నిరాకరించాడు. ఆ వ్యక్తి "నీ పేరేమిటి” అని ప్రశ్నించగా విద్యాసాగర్ తానెవరో తెలియపరచగానే ఆ వ్యక్తి విద్యాసాగర్ కాళ్ళ మీద పడి, క్షమాపణ వేడుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ మన స్వశక్తిపై ఆధారపడడం నేర్చుకోవాలి. ఆత్మనిగ్రహం..  ఆత్మనిగ్రహం అంటే మనోనిగ్రహం కలిగి ఉండడం. ఎవరైతే మనసుని తమ ఆధీనంలో ఉంచుకోగలుగుతారో వారు ఎలాంటి క్లిష్టసమస్యల్ని అయినా ప్రశాంతంగా ఎదుర్కోగలరు. స్వామి వివేకానంద పశ్చిమ అమెరికాలోని ఒక నగరంలో ఉపన్యసిస్తూ ఇలా చెప్పారు.. 'మనోనిగ్రహం కలిగిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులలోనైనా నిశ్చలంగా ఉంటాడు. బాహ్యపరిస్థితులు అతని ప్రశాంతతకు భంగం కలగజేయవు. స్వామీజీ ప్రసంగం విన్న కొంతమంది యువకులు స్వామీజీ చెప్పింది ఆయన జీవితంలో ఎంతవరకు ఆచరణలో పెట్టారో పరీక్షించాలనుకున్నారు. స్వామీజీ వారి గ్రామానికి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆ యువకులు స్వామీజీని ఒక బోర్లించిన తొట్టి మీద నిలబడి ప్రసగించమన్నారు. స్వామీజీ వారి అభ్యర్థన మేరకు అలాగే నిలబడి ప్రసంగిస్తూ అందులో లీనమయ్యారు. అంతలో ఆ యువకులు తుపాకీ గుళ్ళు వారి చెవుల మీద నుండి దూసుకుని వెళ్ళేలా తుపాకీ పేల్చసాగారు. అయితే స్వామీజీ కాస్త కూడా చలించలేదు. ప్రసంగాన్ని ఎంత ప్రశాంతంగా ప్రారంభించారో, అదే ప్రశాంతతతో కొనసాగించారు. వారు ఉపన్యాసం ముగించిన వెంటనే ఆ యువకులు స్వామీజీ చుట్టూ చేరి, కరచాలనం చేస్తూ “మీరు చెప్పినది అక్షరాలా నిజం స్వామీజీ. మీరు ఆచరించినదే మీరు బోధిస్తున్నారు” అన్నారు. మనోనిగ్రహం ఉంటే బాహ్యపరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపలేవని ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. ఇవి మూడు మనిషి జీవితానికి ఎంతో అవసరం.                                           *నిశ్శబ్ద.  

మనుషులను  జాంబీలుగా మార్చే వైరస్ రాబోతోందా?

కరోనా వైరస్ నాలుగు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా సంభవించిన మరణాలు మాత్రమే కాకుండా దీని వల్ల చాలామందిలో కాంప్లికేషన్స్ వారి జీవనశైలికి ఇప్పటికీ ఆందోళన కలిగిస్తూనే ఉంటోంది.  ఇదిలా ఉంటే మరోవైపు కరోనా కంటే ప్రమాదకర వైరస్ రాబోతోందని.. దీని కారణంగా మనుషులు జాంబీలుగా మారిపోతారని కూడా అంటున్నారు. అసలు ఈ వ్యాక్యలలో నిజమెంత ఉందనే విషయం అందరినీ గందరగోళానికి గురిచేస్తుండగా శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని విషయాలను స్పష్టంగా చెబుతున్నారు. సినిమాలలో జాంబీలు ఎలా ఉంటారనే విషయం చూసే ఉంటారు. అటు మనుషుల్లా స్పృహలో ఉండక, ఇటు మరణించిన వారిలా శవాల్లానూ ఉండక ఇంచుమించు ట్రాన్స్ లో ఉన్న దయ్యాల్లా ఉంటారు జాంబీలు.  వీరు మనుషులను చంపాలనే కుతూహలంతో ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి మనుషులలో తలెత్తే సమస్య ఉందన్న విషయం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. శాస్ర్తవేత్తలు చెబుతున్న విషయాలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న సరస్సులు  అక్కడి చలికారణంగా గడ్డ కట్టుకునిపోయి ఉన్నాయి. ఈ సరస్సుల అంతర్భాగంలో ప్రమాదకర వైరస్లు సమాధి అయిపోయి ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఈ సరస్సులు క్రమంగా కరిగిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సరస్సు అడుగున సమాధి అయిన వైరస్లు తిరిగి ఉనికిలోకి వస్తాయి. ఇవి ఉనికిలోకి వస్తే అంటువ్యాధుల తీవ్రత పెరుగుతుంది. మనుషులు చాలా తక్కువ కాలంలోనే జాంబీలుగా మారిపోతారని వైద్యులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వైరస్లు గనుక వ్యాప్తి చెందాయంటే మాత్రం ప్రపంచానికి మరో కొత్త మందు, వైద్య పరిస్థితులు ఏర్పాటుచేయడం పెద్ద సవాల్ తో కూడుకుని ఉంటుంది. దీని కారణంగా ప్రపంచానికి మరో కొత్తముప్పు, ఊహించని ప్రమాదం, నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.                                          *నిశ్శబ్ద.

మంచి ఆలోచనలు ఎందుకు అవసరం? 

మనం మన శారీరక ఆరోగ్యానికి అవసరానికి మించి ప్రాధాన్యమిస్తాం. యాభై శాతానికి పైగా శారీరక వ్యాధులకు కూడా 'మనస్సే' కారణమని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది. అందుకే మన మనస్సును ఆరోగ్యంగా ఉంచడం ఎంతైనా అవసరం. మనస్సుకు మంచి ఆహారం..   శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో మనస్సు  ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉండడానికి మంచి ఆలోచనలు చేయడం అంతే అవసరం. అందుకే ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం  మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహం పెంచుకోవాలి. చెడు ఆలోచనల్ని ఎలా ఎదుర్కోగలం?..  మనస్సును కొంతసేపు పరిశీలిస్తే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు కూడా రావడం  చూస్తాం.  ప్రమేయం లేకుండానే చెడు ఆలోచనలు గొప్ప శక్తితో  దాడి చేయడం జరుగుతుంది. వీటిని ఎలా ఎదుర్కోవడమంటే.. ఒక బకెట్లో మురికి నీళ్ళున్నాయి. దాన్ని మంచి నీళ్ళతో ఎలా నింపగలం? బక్కెట్ పైన ఉన్న కుళాయి తిప్పి, మంచి నీటిని కాసేపు వదిలితే చెడు నీరు దానంతటదే బయటకు పోవడం   గమనించవచ్చు. అదే విధంగా  చెడు ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా  మనస్సును మంచి ఆలోచనలతో నింపివేయాలి. దీనితో ఆ చెడు ఆలోచనలు వాటంతట అవే బలహీనమవుతాయి. ఆలోచనలు ఉన్నతమైతే సమాజానికీ  మంచిదే.. మంచి ఆలోచనలు  తెలియకుండానే ఎక్కడో దూరంలో ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తాయి. మహాపురుషులు ఈ సమాజానికి దూరంగా ఏ కొండల్లోనో, గుహల్లోనో చేసిన ఒక గొప్ప ఆలోచన ప్రపంచమంతా తరంగ రూపంలో వ్యాపించి, కొన్ని వేలమందిని ప్రభావితం చేయగలదు. అందుకే ఈ రోజుల్లో తీవ్రవాదం, అశాంతి పెరుగుతున్నాయని  రోజులు తరబడి చర్చించే కన్నా ఉన్నతమైన ఆలోచనలు అనే శక్తివంతమైన బాంబులను నలువైపులా వేస్తే అవి సరైన సమయంలో విస్ఫోటనం చెంది ఈ సమాజంలో శాంతి కిరణాలను ప్రసరింపజేయగలవు. ఆలోచనలే కార్యాలకు పునాది రాళ్ళు..   ఒకే తల్లికి జన్మించిన సంతానంలో ఒకరు ఉన్నతమైన జీవితం గడిపితే మరొకరు నీచమైన జీవితం గడపడం  చూస్తున్నాం. భారతమాతకు జన్మించిన సంతానంలో కొందరు దేశానికై ప్రాణాలను అర్పిస్తే మరికొందరు దేశవినాశనానికి కారకులవుతున్నారు. ఈ వ్యత్యాసానికి కారణం  ఆలోచనలు వేరు కావడమే! ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులను చేస్తే కొంత సమయానికి  మంచి పనులను చేయాలనే బుద్ధి దానంతటదే కలుగుతుంది.  చెడు చేద్దామనుకున్నా  మనస్సు అలా చేయనివ్వదు.  ఈ స్థితికి రావాలంటే క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి. ఈ విధంగా  ఉన్నతమైన ఆలోచనలతో మహోన్నతమైన కార్యాలను సాధించి దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్ళగలం.                                             *నిశ్శబ్ద.  

గణతంత్రపు ఘన చరిత్ర..  ప్రాముఖ్యత ఇవే..!

భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 26ను గణతంత్రదినోత్సవంగా జరుపుకుంటారు.  రాజ్యంగ పీఠికలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య  గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని వర్ణించారు.  జనవరి 26, 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రేస్ పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. రెండు దశాబ్దాల తర్వాత అంటే 20ఏళ్ల తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎంతో శ్రమతో రూపొందించింది. ఈ రాజ్యాంగం జనవరి 26, 1950న అమోదించబడింది. ఇదే సంపూర్ణ స్వాతంత్ర్యంగా పేర్కొంటారు.  ఈ ఏడాది జనవరి 26న 75వ గణతంత్రదినోత్సవాన్ని జరుపుకుంటారు. జనవరి 26 చాలా ప్రత్యేకమైనది. ఇది భారతదేశ గతం, వర్తమాన,  భవిష్యత్తును కలిపే వారధిగా పనిచేస్తుంది. ఈ రోజు 'పూర్ణ స్వరాజ్' స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.  స్వాతంత్ర్యం  పోరాటం నుండి ప్రజాస్వామ్య, సార్వభౌమ గణతంత్ర స్థాపన వరకు జరిగిన ఎన్నో పరిణామాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.   గణతంత్ర దినోత్సవం కేవలం దేశ పౌరులు గొప్పగా చేసుకునే వేడుకల కార్యక్రమం కాదు. ఇది ప్రజాస్వామ్య ఆదర్శాల పట్ల భారతదేశ నిబద్ధతకు ప్రతిబింబం. భారత రాజ్యాంగం ఎన్నో సమగ్రమైన చర్చల ద్వారా రూపొందించబడిన దార్శనిక పత్రం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం,  సౌభ్రాతృత్వ సూత్రాలు ఇందులో ఉన్నాయి.  సమ్మిళిత పాలన కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి ఈ సూత్రాలను దేశమనే వస్త్రంలో   అల్లితే అది   జనవరి 26  అనే ఒక స్వేచ్ఛా పుష్పం వికసించింది. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి దృశ్యమాన నిదర్శనం. రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల పట్టిక, వారి ప్రత్యేక వారసత్వం, సంప్రదాయాలు,  విజయాలను ప్రదర్శిస్తూ, దేశాన్ని నిర్వచించే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇది  ప్రతిబింబిస్తుంది. కవాతు అనేది భాషా, ప్రాంతీయ, సాంస్కృతిక సరిహద్దులకు అతీతంగా భారతీయులను ఏకం చేసే ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించిన వేడుక. రిపబ్లిక్ డే తన ప్రభావాన్ని భారతదేశ సరిహద్దులకు మించి విస్తరించింది. ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. ప్రజాస్వామ్య పాలన పట్ల భారతదేశం  నిబద్ధతను నొక్కి చెబుతుంది. విభిన్న రాజకీయ భావజాలంతో పోరాడుతున్న ప్రపంచంలో, వలస పాలన నుండి శక్తివంతమైన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం దిశగా  భారతదేశం  ఎదిగిన తీరు ఎన్నో దేశాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుంది. రాజ్యాంగం,  ప్రజాస్వామ్య సూత్రాలపై లోతైన అవగాహనను పెంపొందించే విద్యా వేదికగా గణతంత్ర దినోత్సవం పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు,  కళాశాలలు ఈ రోజును జరుపుకోవడమే కాకుండా పౌరులుగా వారి బాధ్యతను,  ప్రజాస్వామ్య వారసత్వం పట్ల గర్వాన్ని, గౌరవాన్నిపెంపొందించే కార్యకలాపాలలో పాల్గొంటాయి.  గణతంత్ర దినోత్సవం దేశం యావత్తు చేసుకునే  వేడుకలకు ఒక సమయం మాత్రమే కాదు.. ఇది ఆత్మపరిశీలనకు కూడా ఒక గొప్ప సందర్భం కూడా. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాజిక-ఆర్థిక అసమానతల నుండి రాజకీయ వివాదాల వరకు, దేశానికి పునాదిగా ఉండే ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా పౌరులను ప్రేరేపిస్తాయి. గణతంత్ర దినోత్సవం ఈ సవాళ్లను పరిష్కరించడానికి,  మరింత సమగ్రమైన,  న్యాయమైన సమాజం కోసం కృషి చేయడానికి  గొప్ప నినాదంగా కూడా  మారుతుంది.  గణతంత్ర దినోత్సవం పౌరులలో దేశభక్తిని,   కర్తవ్య భావాన్ని నింపుతుంది. పౌరులు గంభీరంగా  ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని  వారి బాధ్యతలను గుర్తు చేస్తుంది.  న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం,  సౌభ్రాతృత్వం  విలువలను నిలబెట్టడానికి  గొప్ప నిబద్ధత కలిగి ఉండాలనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెడితేనే ఈనాడు ప్రజలందరూ స్వేచ్చగా ఉండగలుగుతున్నారు. కనీసం జాతీయ జెండాను అయినా ఇలా ఎగరేయగలుగుతున్నారు. కాబట్టి వీరుల త్యాగం, దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా సగటు పౌరులుగా దేశాన్ని గర్వించే స్థాయికి తీసుకెళ్ళడం పౌరులందరి బాధ్యత.                                                      *నిశ్శబ్ద.

 రిపబ్లిక్ డే పరేడ్ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్రదినోత్సవం  జరుపుకుంటారు.  ఈసారి భారతదేశం 74వ గణతంత్రదినోత్సవాన్ని జరుపుకుంటుంది. 26 జనవరి 1950 న, భారతదేశంలో రాజ్యాంగం అమలు చేయబడింది.  అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్రదినోత్సవంగా జరుపుకుంటాము.  గణతంత్రదినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్ చాలా ఆసక్తిగా ఉంటుంది.  రిపబ్లిక్ డే పరేడ్ గురించి ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుంటే.. గణతంత్రదినోత్సవం రోజున  జరిగే కవాతును చూసేందుకు దాదాపు 2 లక్షల మంది వస్తారని మీకు తెలుసా ? ప్రతి సంవత్సరం గణతంత్రదినోత్సవం సందర్బంగా థీమ్ ను ప్రకటిస్తారు.  ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ "సామాన్య ప్రజల భాగస్వామ్యం." ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి హాజరవుతారు. 26 జనవరి 2024న రిపబ్లిక్ డే పరేడ్‌లో 12 రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు,  తొమ్మిది మంత్రిత్వ శాఖలు,  విభాగాలు వాటి పట్టికను ప్రదర్శించడానికి సెలెక్ట్ చేశారు. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్,  ఉత్తరాఖండ్ ఉన్నాయి. జనవరి 26 న జరిగే కవాతు గురించి ఆసక్తికరమైన విషయాలు..  1950 నుండి 1954 వరకు  26వ జనవరి కవాతు వరుసగా ఇర్విన్ స్టేడియం (ప్రస్తుతం నేషనల్ స్టేడియం), కింగ్స్‌వే, రెడ్ ఫోర్ట్,  రామ్‌లీలా మైదాన్‌లో జరిగింది.  1955,  జనవరి 26 న జరిగే కవాతుకు రాజ్‌పథ్ శాశ్వత వేదికగా మారింది. ఆ సమయంలో రాజ్‌పథ్‌ను 'కింగ్స్‌వే' అనే పేరుతో పిలిచేవారు  ఇప్పుడు దీనిని కర్తవ్యాపత్ అని పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం 26 జనవరి పరేడ్‌కు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి  ఏదైనా దేశ పాలకులను అతిథిగా ఆహ్వానిస్తారు. మొదటి కవాతు 26 జనవరి 1950న జరిగింది. ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్ణో  అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయితే 1955లో రాజ్‌పథ్‌లో మొదటి కవాతు జరిగినప్పుడు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్‌ను  ఆహ్వానించారు. జనవరి 26న జరిగే పరేడ్ కార్యక్రమం రాష్ట్రపతి రాకతో ప్రారంభమవుతుంది. అన్నింటిలో మొదటిది, రాష్ట్రపతి యొక్క కావలీర్ అంగరక్షకులు జాతీయ జెండాకు వందనం చేస్తారు మరియు ఈ సమయంలో, జాతీయ గీతం ప్లే చేయబడుతుంది.  21 గన్స్ సెల్యూట్ కూడా ఇవ్వబడుతుంది. కానీ 21 కానన్లతో కాల్పులు జరగవు, దీనికి బదులుగా, "25- పాండర్స్"  అని పిలువబడే భారత సైన్యం  7- ఫిరంగులను 3 రౌండ్లలో కాల్చడానికి ఉపయోగిస్తారు.  గన్ సెల్యూట్ ఫైరింగ్ సమయం జాతీయ గీతం  సమయంతో సరిపోతుంది. మొదటి ఫైరింగ్ జాతీయ గీతం ప్రారంభంలో జరుగుతుంది. చివరి కాల్పులు 52 సెకన్ల తర్వాత జరుగుతుంది. ఈ ఫిరంగులు 1941లో తయారు చేయబడ్డాయి. సైన్యం యొక్క అన్ని అధికారిక కార్యక్రమాలలో వీటిని ఉపయోగిస్తారు.  చివరి ఏడాది కవాతులో  ఈ  ఏడాది ఎవరు కవాతు చెయ్యాలనే విషయాన్ని అధికారికంగా తెలియజేస్తారు.  అప్పటి నుండి  కొత్త ఏడాది జనవరి 26న అధికారికంగా ప్రదర్శించడానికి ముందు వరకు   600 గంటల పాటు ప్రాక్టీస్ చేసి ఉంటారు.  భారతదేశం యొక్క సైనిక శక్తిని చూపించే అన్ని ట్యాంకులు, సాయుధ వాహనాలు,  ఆధునిక పరికరాల కోసం ఇండియా గేట్ ప్రాంగణానికి సమీపంలో ఒక ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుంది. జనవరి 26న జరిగే కవాతు కోసం రిహార్సల్ కోసం ప్రతి బృందం  12 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.  అయితే జనవరి 26వ తేదీన  9 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేస్తారు. న్యాయమూర్తులు పరేడ్‌లో కూర్చొని ఉంటారు.  పాల్గొనే ప్రతి సమూహానికి 200 పాయింట్స్  ఆధారంగా తీర్పు ఇస్తారు.  ఈ తీర్పు ఆధారంగా "ఉత్తమ కవాతు సమూహం"  టైటిల్‌ను అందజేస్తారు.   జనవరి 26వ తేదీన జరిగే కవాతు కార్యక్రమంలో నిర్వహించబడే ప్రతి కార్యకలాపం ప్రారంభం నుండి చివరి వరకు ముందుగా నిర్ణయించబడుతుంది. అందువల్ల చిన్న పొరపాటు జరిగినా నిమిషం  ఆలస్యం అయినా   నిర్వాహకులకు భారీగా ఖర్చు అవుతుంది.  కవాతు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఆర్మీ సిబ్బంది 4 స్థాయిల విచారణను దాటాలి. వారి చేతులు లైవ్ బుల్లెట్లతో లోడ్ చేయబడలేదని నిర్ధారించుకోవడానికి వారి చేతులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కవాతులో పాల్గొన్న శకటాలు దాదాపు 5 km/hr వేగంతో కదులుతాయి. ఈ శకటాల డ్రైవర్లు వాటిని ఒక చిన్న విండో ద్వారా డ్రైవ్ చేస్తారు. ఈవెంట్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన భాగంగా"ఫ్లైపాస్ట్" నిలుస్తుంది. ఇది  వెస్ట్రన్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్‌ నిర్వహిస్తుంది, ఇందులో దాదాపు 41 ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొంటాయి. కవాతులో పాల్గొన్న విమానం వైమానిక దళంలోని వివిధ కేంద్రాల నుండి బయలుదేరి నిర్ణీత సమయంలో రాజ్‌పథ్‌కు చేరుకుంటుంది.  మహాత్మా గాంధీకి ఇష్టమైన పాట అయిన  “అబిడ్ విత్ మి” రిబబ్లిక్ డే ప్రతి ఈవెంట్ లో ప్లే చేసేవారు. ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది.  2014 పరేడ్‌లో జరిగిన పరేడ్ ఈవెంట్‌లో సుమారు 320 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది. 2001లో ఈ ఖర్చు దాదాపు 145 కోట్లు. ఈ విధంగా, 2001 నుండి 2014 వరకు జనవరి 26 కవాతుపై చేసిన వ్యయం 54.51% పెరిగింది.  బీటింగ్ రిట్రీట్ వేడుక జనవరి 29 వ తేదీన విజయ్ చౌక్‌లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్,  నేవీ బ్యాండ్‌ల ప్రదర్శనతో జరుగుతుంది. ఇది భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచిస్తుంది.                                             *నిశ్శబ్ద.

బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన హిమశిఖరం.. మన బోస్!

నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు వింటే భారతీయ యువత పులకరించి పోతుంది. మీ రక్తాన్ని నాకివ్వండి నేను మీకు స్వేచ్చను ప్రసాదిస్తాను అని భారతీయ యువతను స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రేరేపించిన ధీరుడాయన. ఉన్నత చదువులు చదివి, గొప్ప ఉద్యోగాల వైపు వెళ్లకుండా, తను జీవితంలో గొప్పగా స్థిరపడే మార్గం ఉన్నా దాన్ని చేజేతులా వదిలి దేశ స్వాతంత్ర్య సమరం కోసమే జీవితాన్ని పణంగా పెట్టిన మేరు ఘన ధీరుడు.  ప్రతి ఏటా జనవరి 23వ తేదీని పరాక్రమ్ దివాస్ గా జరుపుకుంటారు. ఇది సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ఏర్పాటైన దినోత్సవం కావడం గమనార్హం. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన జీవితం ఇతర విశేషాలు తెలుసుకుంటే..   నేతాజీ సుభాష్ చంద్రబోస్ 23 జనవరి, 1897న ఒరిస్సాలోని కటక్‌లో జన్మించారు.  విమాన ప్రమాదంలో కాలిన గాయాలతో బాధపడుతూ తైవాన్‌లోని ఆసుపత్రిలో 18 ఆగస్టు, 1945న మరణించాడని అంటారు. సుభాస్ చంద్రబోస్ నాయకత్వ నైపుణ్యాలు అసాధారణమైనవి. ఆయన గొప్ప  ఆకర్షణీయమైన వక్త. భారత్ స్వాతంత్ర్య పోరాటంలో  అత్యంత ప్రభావవంతమైన  సమరయోధుడిగా పరిగణిస్తారు. అతని ప్రసిద్ధ నినాదాలు ' తుమ్ ముజే ఖూన్ దో, మెయిన్ తుమ్హే ఆజాదీ దుంగా', 'జై హింద్'  'ఢిల్లీ చలో'. వంటి నినాదాలతో సుభాష్ చంద్రబోస్ యువతను పోరాటంలోకి ఆహ్వానించాడు.  ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించడం కారణంగా కూడా ఆయన్ను ఆజాద్ అని కూడా పిలుస్తారు.   భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి  అనేక రచనలు చేశాడీయన.  స్వాతంత్ర్యం పొందటానికి ఈయన సోషలిస్ట్ విధానాలకు ఈయన పాటించిన  మిలిటెంట్ విధానాలు ఈయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. బోస్ జీవితం ఇదే..  16 సంవత్సరాల వయస్సులో స్వామి వివేకానంద,  రామకృష్ణ వారి రచనలు, బోధనలతో బోస్  ప్రభావితమయ్యాడు. తర్వాత అతనిని అతని తల్లిదండ్రులు ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఇండియన్ సివిల్ సర్వీస్‌కు కోసం పంపారు. 1920లో  సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఏప్రిల్ 1921లో భారతదేశంలోని జాతీయవాద కల్లోలాల గురించి విన్న తర్వాత  తన అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి  భారతదేశానికి తిరిగి వచ్చాడు. సుభాష్ చంద్రబోస్,  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. బోస్  INCని శక్తివంతమైన అహింసా సంస్థగా మార్చిన మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. ఉద్యమ సమయంలో తన రాజకీయ గురువుగా మారిన చిత్తరంజన్ దాస్‌తో కలిసి పనిచేయమని మహాత్మా గాంధీ అతనికి సలహా ఇచ్చారు. ఆ తరువాత  యువ విద్యావేత్త,  బెంగాల్ కాంగ్రెస్ వాలంటీర్లకు కమాండెంట్ అయ్యాడు. 'స్వరాజ్' అనే వార్తాపత్రికను ప్రారంభించారు. 1927లో, జైలు నుండి విడుదలైన తర్వాత బోస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు.   స్వాతంత్ర్యం కోసం జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి పనిచేశాడు. 1938లో  భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.  విస్తృత పారిశ్రామికీకరణ విధానాన్ని రూపొందించిన జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇది కుటీర పరిశ్రమలు,  దేశ స్వంత వనరులను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందడం అనే భావనకు కట్టుబడి ఉండే గాంధేయ ఆర్థిక ఆలోచనతో ఏకీభవించలేదు. 1939లో తిరిగి ఎన్నిక కోసం గాంధేయవాద ప్రత్యర్థిని ఓడించినప్పుడు బోస్ లో తిరుగుబాటు ధోరణి బయటకు వచ్చింది.  మొత్తానికి ఈయన తిరుగుబాటు నాయకుడిగా ముద్రపడ్డాడు. ఈయనకు గాంధీకి మద్దతు లేకపోవడం వల్ల రాజీనామా చేయవలసి వచ్చింది. సుభాష్ చంద్రబోస్  ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ భారతదేశంలోని వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది 1939లో సుభాస్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియా కాంగ్రెస్‌లో ఒక వర్గంగా ఉద్భవించింది. కాంగ్రెస్‌లో వామపక్ష అభిప్రాయాలకు ఆయన బాగా పేరు తెచ్చుకున్నారు. ఫ్రోవర్డ్ బ్లాక్  ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీలోని అన్ని రాడికల్ అంశాలను తీసుకురావడం. తద్వారా  సమానత్వం,  సామాజిక న్యాయం సూత్రాలకు కట్టుబడి భారతదేశ  సంపూర్ణ స్వాతంత్ర్య అర్థాన్ని వ్యాప్తి చేశాడు. సుభాస్ చంద్ర బోస్,  ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఒక ముఖ్యమైన పరిణామం ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క నిర్మాణం ,  కార్యకలాపాలు.  దీనిని ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా INA అని కూడా పిలుస్తారు. భారతదేశం నుండి తప్పించుకుని జపాన్‌లో చాలా సంవత్సరాలు నివసిస్తున్న భారతీయ విప్లవకారుడు రాష్ బిహారీ బోస్, ఆగ్నేయాసియా దేశాలలో నివసిస్తున్న భారతీయుల మద్దతుతో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ని స్థాపించారు. జపాన్ బ్రిటీష్ సైన్యాన్ని ఓడించి ఆగ్నేయాసియాలోని దాదాపు అన్ని దేశాలను ఆక్రమించినప్పుడు, బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతో లీగ్ భారతీయ యుద్ధ ఖైదీల నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసింది. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో అధికారిగా పనిచేసిన జనరల్ మోహన్ సింగ్ ఈ సైన్యాన్ని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈలోగా సుభాష్ చంద్రబోస్ 1941లో భారతదేశం నుండి తప్పించుకుని జర్మనీకి వెళ్లి భారతదేశ స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. 1943లో  ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకత్వం వహించడానికి సింగపూర్‌కు వచ్చాడు.  భారత జాతీయ సైన్యాన్ని పునర్నిర్మించి భారతదేశ స్వేచ్ఛకు సమర్థవంతమైన సాధనంగా మార్చాడు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో దాదాపు 45,000 మంది సైనికులు ఉన్నారు. వీరిలో భారతీయ యుద్ధ ఖైదీలు అలాగే ఆగ్నేయాసియాలోని వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయులు ఉన్నారు. 21 అక్టోబర్ 1943న  సుభాష్  బోస్ సింగపూర్‌లో స్వతంత్ర భారతదేశం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నేతాజీ జపనీయులు ఆక్రమించిన అండమాన్‌కు వెళ్లి అక్కడ భారత జెండాను ఎగురవేశారు. 1944 ప్రారంభంలో ఆజాద్ హింద్ ఫౌజ్ (INA)  మూడు యూనిట్లు భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి భారతదేశంలోని ఈశాన్య భాగాలపై దాడిలో పాల్గొన్నాయి. అయితే ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా భారతదేశానికి విముక్తి కల్పించే ప్రయత్నం విఫలమైంది. భారత జాతీయవాద ఉద్యమం జపాన్ ప్రభుత్వాన్ని భారతదేశానికి స్నేహితుడిగా చూడలేదు. జపాన్ దురాక్రమణకు బలి అయిన ఆ దేశాల ప్రజల పట్ల దాని సానుభూతి ఉంది. అయితే జపాన్ మద్దతుతో ఆజాద్ హింద్ ఫౌజ్ సహాయంతో,  భారతదేశంలో తిరుగుబాటుతో భారతదేశంపై బ్రిటిష్ పాలనను అంతం చేయవచ్చని నేతాజీ విశ్వసించారు. ఆజాద్ హింద్ ఫౌజ్, 'ఢిల్లీ చలో' నినాదంతో.  జై హింద్ అనే మాటలు దేశం లోపల,  వెలుపల ఉన్న భారతీయులకు ప్రేరణగా నిలిచింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆగ్నేయాసియాలో నివసిస్తున్న అన్ని మతాలు,  ప్రాంతాల భారతీయులతో కలిసి నేతాజీ ర్యాలీ చేశారు. భారతదేశ స్వాతంత్ర్య కార్యకలాపాలలో భారతీయ మహిళలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ నేతృత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా రెజిమెంట్ ఏర్పడింది. దీనిని రాణి ఝాన్సీ రెజిమెంట్ అని పిలిచేవారు. ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశ ప్రజలకు ఐక్యత,  వీరత్వానికి చిహ్నంగా మారింది. భారతదేశం  స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప నాయకులలో ఒకరైన నేతాజీ, జపాన్ లొంగిపోయిన కొద్ది రోజులకే విమాన ప్రమాదంలో మరణించినట్లు  తెలిసింది.                                                   *నిశ్శబ్ద.