వీకెండ్ నలభీమ పాకం
వంట చేయడం ఒకప్పుడు ఆడవాళ్ల డ్యూటీ.. ఇప్పుడైతే మగమహారాజులుకూడా ఫ్యాషన్ గా వంట చేసేయడం పాషన్ గా మార్చుకుంటున్నారు. రకరకాల రుచులు, వంటకాల్ని నేర్చుకుని సరదాగా జీవిత భాగస్వామికి ఓ రోజు వండిపెట్టి ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఆలూమగలన్నాక ఆ మాత్రం అవగాహన ఉండదా ఏంటి అని ఎవరైనా అడిగితే.. రోజూ చూసే భార్యేకదా అని పొగడకుండా ఉంటామా..ఏంటి అంటూ గడుసు సమాధానం చెబుతున్నారు.
వారమంతా ఆఫీస్ పనిలో తలమునకలయ్యే పురుషపుంగవులకు వీకెండ్ లో ఏదైనా వెరైటీగా చేయాలన్న తపన ఎక్కువైపోతోందట. ఆదరాబాదరాగా ఏదో రెస్టారెంట్ కెళ్లి వాళ్లు పెట్టిందంతా తిని అవస్థపడేకంటే ప్రియమైన భార్యామణికి నలభీమ పాకాన్ని రుచిచూపించి, ఓ రోజంతా పూర్తిగా విశ్రాంతి ఇచ్చేసి.. ఆవార.. కావాల్సిన చోట కావాల్సినంత పిండుకోవడానికి, జుర్రుకోవడానికి తెగ ఉత్సాహం చూపించేస్తున్నారన్న విషయం తాజా అధ్యయనాల్లో తేలింది.