Read more!

మనిషి జీవితానికి మూడు ముఖ్య సూత్రాలు చెప్పిన స్వామి వివేకానంద..!

మనిషి జీవితానికి ఆత్మవిశ్వాసం, ఆత్మశక్తి, ఆత్మనిగ్రహం,  చాలా అవసరం. వీటిని  అలవర్చుకోవడం వల్ల జరిగేది ఏంటో స్వామి వివేకానంద ఇలా చెప్పారు..

 ఆత్మవిశ్వాసం..

భగవంతుణ్ణి నమ్మని వారిని సనాతన ధర్మం నాస్తికులని అన్నది. కానీ తమ మీద తమకి నమ్మకం లేని వారిని నాస్తికులంటుంది ఆధునిక ధర్మం. "పురాణాల్లో చెప్పిన మూడువందల ముప్ఫై కోట్ల దేవుళ్ళ మీద నమ్మకం ఉన్నా..... మీ మీద మీకు విశ్వాసం లేకుంటే మీకు ముక్తి లభించదు" అని స్వామి వివేకానంద అన్నారు. బధిరత్వం, అంధత్వం గల హెలెన్ కెల్లర్ అనే బాలిక ఆత్మవిశ్వాసంతో ఎన్నో అద్భుతాలను సాధించింది.


సీతాన్వేషణలో వానరులు మహాసాగరాన్ని దాటడానికి సాహసించలేదు. వయోవృద్దుడైన జాంబవంతునికి హనుమంతుడి శక్తి గురించి తెలుసు. బాల్యంలో హనుమంతునికి గల పరాక్రమాన్ని గుర్తు చేసి, ఆతనిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించాడు. అతను ఆంజనేయునితో "నీలో అపారమైన శక్తి ఉంది. నువ్వు అద్భుతాలు సాధించగలవు. నీపై నువ్వు విశ్వాసాన్ని పెంచుకో. రామకార్యాన్ని సాధించడానికి సిద్ధమవు, లే, జాగృతుడవవు" అన్నాడు. జాంబవంతుని మాటలు హనుమంతునిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. ఆ సవాలును ఎదుర్కొనేందుకు హనుమంతుడు సిద్ధపడి, రామకార్యాన్ని నిర్వర్తించాడు. నిరుత్సాహం, దిగులు కలిగినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడానికి బదులు తమ శక్తినంతటినీ కూడదీసుకుని లక్ష్యసాధనకై పరిశ్రమించాలి.

ఆత్మశక్తి..

 మనం శారీరకంగా, మానసికంగా, నైతికంగా దృఢంగా ఉండి మన దక్షత, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడాలి. మన భవితను మనమే సుగమం చేసుకోవాలి. మన జీవితాలకు మనమే బాధ్యత వహించగలిగితే మనం ఎన్నో సాధించగలం. ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పడానికి నిరాకరించినా తనంతట తానే విలువిద్య నేర్చుకుని, అర్జునుణ్ణి మించిన మేటి విలుకాడయ్యాడు ఏకలవ్యుడు. ఒకమారు ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో  తన సామాను మోయడానికి కూలివాడి కోసం చూస్తున్నాడు. ఇంతలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అక్కడకు వచ్చి, ఆ వ్యక్తికి సహాయం చేశాడు. ఇంటికి చేరగానే ఆ వ్యక్తి విద్యాసాగర్కు కొంత పైకం ఇవ్వబోగా, ఈశ్వరచంద్రుడు నిరాకరించాడు. ఆ వ్యక్తి "నీ పేరేమిటి” అని ప్రశ్నించగా విద్యాసాగర్ తానెవరో తెలియపరచగానే ఆ వ్యక్తి విద్యాసాగర్ కాళ్ళ మీద పడి, క్షమాపణ వేడుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ మన స్వశక్తిపై ఆధారపడడం నేర్చుకోవాలి.

ఆత్మనిగ్రహం..

 ఆత్మనిగ్రహం అంటే మనోనిగ్రహం కలిగి ఉండడం. ఎవరైతే మనసుని తమ ఆధీనంలో ఉంచుకోగలుగుతారో వారు ఎలాంటి క్లిష్టసమస్యల్ని అయినా ప్రశాంతంగా ఎదుర్కోగలరు.

స్వామి వివేకానంద పశ్చిమ అమెరికాలోని ఒక నగరంలో ఉపన్యసిస్తూ ఇలా చెప్పారు.. 'మనోనిగ్రహం కలిగిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులలోనైనా నిశ్చలంగా ఉంటాడు. బాహ్యపరిస్థితులు అతని ప్రశాంతతకు భంగం కలగజేయవు. స్వామీజీ ప్రసంగం విన్న కొంతమంది యువకులు స్వామీజీ చెప్పింది ఆయన జీవితంలో ఎంతవరకు ఆచరణలో పెట్టారో పరీక్షించాలనుకున్నారు. స్వామీజీ వారి గ్రామానికి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆ యువకులు స్వామీజీని ఒక బోర్లించిన తొట్టి మీద నిలబడి ప్రసగించమన్నారు. స్వామీజీ వారి అభ్యర్థన మేరకు అలాగే నిలబడి ప్రసంగిస్తూ అందులో లీనమయ్యారు. అంతలో ఆ యువకులు తుపాకీ గుళ్ళు వారి చెవుల మీద నుండి దూసుకుని వెళ్ళేలా తుపాకీ పేల్చసాగారు. అయితే స్వామీజీ కాస్త కూడా చలించలేదు. ప్రసంగాన్ని ఎంత ప్రశాంతంగా ప్రారంభించారో, అదే ప్రశాంతతతో కొనసాగించారు. వారు ఉపన్యాసం ముగించిన వెంటనే ఆ యువకులు స్వామీజీ చుట్టూ చేరి, కరచాలనం చేస్తూ “మీరు చెప్పినది అక్షరాలా నిజం స్వామీజీ. మీరు ఆచరించినదే మీరు బోధిస్తున్నారు” అన్నారు. మనోనిగ్రహం ఉంటే బాహ్యపరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపలేవని ఈ సంఘటన వల్ల తెలుస్తుంది.

ఇవి మూడు మనిషి జీవితానికి ఎంతో అవసరం.


                                          *నిశ్శబ్ద.