ఈ 4 విషయాలు శాంతికి, సంతోషానికి మార్గం వంటివి.!

ప్రతి ఒక్కరూ ఆనందం, శాంతి  కూడిన జీవితం కోసం  ప్రయత్నిస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో డబ్బు అనే తోకలేని గుర్రం వెనుక పరుగులు తీయడంలో ఆనందం, శాంతి, సంతోషం మర్చిపోతున్నారు. డబ్బుతోనే  సుఖం, శాంతి, సంతోషం అనే కాలం వచ్చేసింది. ఆచార్య చాణక్యుడు ప్రశాంతమైన,  సంతోషకరమైన జీవితం కోసం కొన్ని సూత్రాలను అందించాడు. ఆ సూత్రాలు ఏమిటో తెలుసా? ఆచార్య చాణక్యుడి అనుభవాలు,  నీతి సమాహారమైన 'చాణక్య నీతి'లో సరైన జీవన విధానాల గురించి సమాచారం ఉంది. మీరు జీవితంలో విజయం, ఆనందాన్ని పొందాలనుకుంటే, ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలను ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే వారు మీ ఇంటిని స్వర్గంగా మార్చే సంతోషకరమైన జీవితం కోసం కొన్ని ప్రాథమిక మంత్రాలను చెప్పారు. ఇవి పాటిస్తే ప్రతిఒక్కరూ జీవితంతో ఆనందాన్ని పొందగలరు. సంతోషకరమైన జీవితానికి అత్యంత ముఖ్యమైన చాణక్యుడి తత్వశాస్త్రంలోని ఆ నాలుగు అంశాల గురించి తెలుసుకుందాం. 1. శాంతి: ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా మానవ జీవితంలోని ప్రతి మలుపులోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. చాలా సార్లు ఇలాంటి సమస్యలు మనల్ని మానసికంగా బలహీనపరుస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు శాంతియుతంగా పని చేస్తే, అన్ని సమస్యలకు పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఎందుకంటే అయోమయమైన మనస్సుతో మనిషి ఏ సమస్యను ఎదుర్కోలేడు లేదా దాని నుండి బయటపడలేడు. కాబట్టి మీరు మీ ఇంట్లో సంతోషాన్ని కోరుకుంటే, ఏదైనా సమస్యను సులభంగా ఎదుర్కోవటానికి మీరు శాంతితో నడవాలి. 2. ఆత్మసంతృప్తి:  ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నడుస్తున్న జీవితంలో ఒకరికొకరు ముందుండాలని కోరుకుంటారు. దీని కోసం రాత్రింబవళ్లు శ్రమించినా మనకు కావాల్సిన డబ్బు సంపాదించడం కష్టం. దీంతో వారు తమ ప్రియమైన వారికి సమయం కేటాయించలేకపోతున్నారు. మన జీవితం సంతోషంగా ముందుకు సాగాలంటే సంతృప్తి అనేది చాలా ముఖ్యమని చాణ్యకుడు చెబుతున్నారు.  మీరు జీవితంలో సంతృప్తిగా ఉంటే, మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు. తృప్తి చెందాలంటే ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోవాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని తృప్తి చెందే వ్యక్తి కంటే సంతోషించే వ్యక్తి మరొకడు లేడు. 3. కరుణ: మనిషిలో కరుణ చాలా ముఖ్యం. కానీ నేడు, డబ్బు, పేరు సంపాదించాలనే ఈ హడావిడిలో, మనం తరచుగా పేదలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము. మనపై ఇలాంటి వైఖరి సరికాదని చాణక్యుడు అంటున్నాడు. ఆచార్య చాణక్యుడు తనలో కరుణ ఉన్న వ్యక్తి అత్యంత సంతోషకరమైన వ్యక్తి అని చెప్పారు. ఎందుకంటే దయ అనేది మీ మనస్సులో ఇతర లోపాలు తలెత్తకుండా నిరోధించే లక్షణం. 4. ఆశయం: చాణక్యుడి నీతి ప్రకారం, దురాశ ఒక శాపం, అది ఒకరి మనస్సులోకి ప్రవేశించిన తర్వాత, అది తప్పుఒప్పులను అవగాహనను మరచిపోయేలా చేస్తుంది. అందుకే ఎప్పుడూ దురాశకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే అది మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తుంది.  ఆ తర్వాత మీ ఆనందాన్ని, శాంతిని దూరం చేస్తుంది. మీకు సంతోషకరమైన జీవితం కావాలంటే, దురాశను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ప్రస్తుతం ఉన్నదానితో సంతృప్తి చెందండి అని చాణక్యుడు తన తత్వశాస్త్రంలో చెప్పాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, పైన పేర్కొన్న 4 అంశాలను తన జీవితంలో స్వీకరించిన వ్యక్తి శాశ్వతంగా శాంతి, ఆనందంతో జీవిస్తాడు. మీ జీవితంలో శాంతి, సంతోషం కావాలంటే వీటిని స్వీకరించండి.

స్నేక్ ప్లాంట్ మొక్క పెంచుతుంటారా? ఈ నిజాలు తెలుసా?

సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా మొక్కలు పెంచుకోవడం చాలా మంది చేసే పని. కళ్లెదురుగా  మొక్కలు ఎదుగుతూ పువ్వులు, కాయలు కాస్తుంటే అదొక చెప్పలేని ప్రశాంతత మనసును హాయిగా ఉంచుతుంది. చాలామంది ఇంటిముందు జాగా లేకపోయినా కుండీలలో పెరిగే అవకాశం ఉన్న చాలా మొక్కలను పెంచుతుంటారు. వీటిలో కలబంద, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, గులాబీ, పీస్ లిల్లీ మొదలైనవి పెంచుతుంటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే స్నేక్ ప్లాంట్ గురించి చాలామందికి తెలియదు. ఈ స్నేక్ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే పాములు రావనే మాట తప్పితే దీని గురించి నిజానిజాలు తెలిసినవాళ్లు తక్కువ. ఈ మొక్క గురించి నిజాలేంటంటే.. స్నేక్ ప్లాంట్ గురించి చైనా వాస్తుశాస్త్రం చాలా గొప్పగా చెప్పింది. ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి అదృష్టం కలసివస్తుందని పేర్కొంది. అందుకే స్నేక్ ప్లాంట్ ను అదృష్టం తెచ్చి పెట్టే మొక్కగా చైనీయులు భావిస్తారు. సైన్స్ ప్రకారంగా చూస్తే స్నేక్ ప్లాంట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి... స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆ ఇంటి ప్రాంతంలో ఉండే గాలిని స్వచ్చంగా ఉంచుతుంది.  గాలి శుద్ది చేయడంలో ఈ మొక్క ప్రభావవంతంగా ఉంటుంది. స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచే మొక్క. చాలా మొక్కలు పగటి సమయంలో ఆక్సిజన్ గ్రహించి కార్భన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంటాయి. కానీ స్నేక్ ప్లాంట్ మాత్రం పగటి సమయంలో కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. వాతావరణంలోని మలినాలను, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఇది అలెర్జీలను, అలెర్జీకి కారణమయ్యే వాతావరణాన్ని క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలున్నవారు, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ పెంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. స్నేక్ ప్లాంట్ పెంపకంలో  అంత ఇబ్బందులేమీ ఉండవు. ఈ ఇండోర్ మొక్కకు నీరు ప్రతిరోజూ పెట్టాల్సిన అవసరం ఉండదు. తక్కువ గాలి, తక్కవ నీరు, తక్కువ వెలుతురులో చాలా ఆరోగ్యంగా పెరుగుతాయివి. స్నేక్ ప్లాంట్ మొక్క  ఇంట్లో తేమను నియంత్రించడంలో ముందుంటాయి. ఇవి పెరిగే కొద్దీ తేమను విడుదల చేస్తాయి. దీని వల్ల ఇంటిలోపల వాతావరణం చలిగానూ లేకుండా, వేడిగానూ లేకుండా  సమతుల్యంగా ఉంటుంది. ఇకపోతే స్నేక్ ప్లాంట్ ఆకులతో కూడిన మొక్క. దీని ఆకులు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి. ఈ మొక్క చూడ్డానికి చాలా ఆకర్షణగా ఉంటుంది. పైపెచ్చు ఈ ఆకులు ఆకుపచ్చ రంగులో కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటాయి.                                           *నిశ్శబ్ద.

కొత్త సంవత్సరంలో  కలల జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి?

మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరం కలల జీవితాన్ని ఎందుకు సృష్టించుకోకూడదు? ఆలోచన ఏదో బాగుంది. అయితే అది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. కేవలం ఒక సంవత్సరంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకునే మార్గం ఇక్కడ ఉంది. మీరు వృత్తిపరమైన విజయం, వ్యక్తిగత ఎదుగుదల, మెరుగైన ఆరోగ్యం లేదా మెరుగైన సంబంధాలను లక్ష్యంగా చేసుకున్నా, ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా ఏడాది చివరి వరకు విజయం సాధించవచ్చు. మీ జీవితాన్ని ఆడిట్ చేయండి: మీ కలల జీవితాన్ని సృష్టించే ముందు, మీరు మీ ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా పరిశీలించాలి. కెరీర్, సంబంధాలు, ఆరోగ్యం, వ్యక్తిగత ఎదుగుదల , పర్యావరణం - జీవితంలోని వివిధ అంశాలలో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. ఏది బాగా పని చేస్తుందో, ఏది మెరుగుపడాలో అంచనా వేయండి. మార్పు కోసం ఈ పరిశీలన కీలకం. శ్రద్ధ అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించండి.  భవిష్యత్తు కోసం మీ దృష్టితో వాటిని సమలేఖనం చేయండి. ఇది మీ కలకి పునాది వేస్తుంది.   మీరు మీ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి: మీ కలల జీవితాన్ని సృష్టించడానికి మనస్తత్వంలో మార్పు అవసరం. సమృద్ధి, అవకాశం, పెరుగుదల యొక్క మనస్తత్వాన్ని స్వీకరించండి. అన్ని విషయాల గురించి సానుకూలంగా ఆలోచించండి, సమస్యలపై దృష్టి పెట్టకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి. ఇది కష్టంగా ఉంటుంది కానీ మీ పురోగతికి ఏది అడ్డుగా ఉంది. దానిని ఎలా అధిగమించాలో అది మీకు తెలియజేస్తుంది. నేను చేయగలననే విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం. భవిష్యత్తును చిత్రించండి: మీ కలల జీవితం ఎలా ఉంటుందో మీరు వివరంగా ఊహించుకోవాలి. మీ జీవితంలోని అన్ని అంశాలను పరిగణించండి. ఒక సంవత్సరంలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఊహించుకోండి. మీ ఆదర్శ కెరీర్, సంబంధాలు, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధి గురించి ఒక దృష్టి పెట్టండి. ఈ చిత్రం మీ ఎదుగుదలకు ఒక దారి చూపుతుంది. మీ అభిప్రాయాన్ని వ్రాయండి. అలా జరిగితే కల నెరవేరుతుంది. మీ ఎదుగుదల కోసం పనులు చేయండి : వ్యక్తిగత అభివృద్ధి, అభివృద్ధికి కట్టుబడి ఉండండి. మీ మనస్సు, శరీరం, ఆత్మను పోషించే కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించండి. ఇందులో చదవడం, ధ్యానం, వ్యాయామం, దినచర్యలు లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివి ఉండవచ్చు. స్వీయ-అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడూ కలలుగన్న జీవితం మీకు కావాలంటే నిరంతర అభ్యాసం ముఖ్యం. వృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించండి. మీ బలాన్ని పెంచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. పాత వాటిని అభివృద్ధి చేయండి: మీరు ఎంచుకున్న జీవితంలో అభివృద్ధి చెందడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచండి. మీ ఆకాంక్షలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించండి. వాటిని పొందేందుకు లేదా మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించండి. ఇందులో కోర్సులు తీసుకోవడం, మెంటర్‌ని కనుగొనడం లేదా స్థిరంగా సాధన చేయడం వంటివి ఉండవచ్చు. వేగంగా మారుతున్న ప్రపంచంలో అనుకూలత కీలకం. ఒక భాష నేర్చుకోండి. దానిని మెరుగుపరచండి. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు సహాయపడుతుంది.

కొత్త ఏడాదిలో అయినా ఇవి అలవాటు చేసుకోండి.. జీవితం సంతోషంగా ఉంటుంది!

డిసెంబర్ నెల ముగింపుకు వచ్చేస్తోంది. కొత్త అనే పదంలోనే ఒకానొక ఆశాభావం ఉంటుంది.  చాలామంది పుట్టినరోజు సందర్బంగానో, పండుగల సందర్భంగానో, కొత్త ఏడాది సందర్బంగానో  ఈ సారి అయినా నా జీవితం మెరుగ్గా ఉండాలి, నేను ఇంకా బాగా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే  కొత్త ఏడాదిలో ఈ కింద చెప్పుకునే అలవాట్లు జీవితంలో భాగం చేసుకుంటే జీవితం సంతోషమయమవుతుంది. అవేంటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత అనేది చాలా గొప్ప విషయం. జీవితంలో సానుకూల అంశాల అంశాలను గుర్తుచేసుకుని  ఆయా సందర్బాలకు కృతజ్ఞత చెప్పుకోవడం, సానుకూల జీవతానికి సహకరిస్తున్నవారికి కృతజ్ఞతన చెప్పడం, ప్రపంచంలో ఎంతో మందితో పోలిస్తే తమకు మెరుగైన జీవతమే లభించిందని తృప్తిగా ఉండటం, జివితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల  మనిషిలో సంతృప్తి పెరుగుతుంది. సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆప్తులతో అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన సంబంధాలు జీవితంలో గొప్ప సంతోషానికి కారణమవుతాయి. కష్ట సుఖాలను పంచుకోవడం, విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం మొదలైన సందర్బాలకు ఆత్మీయ సంబంధాల తోడు ఎంతో అవసరం. మీకోసం మీరు.. ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, బంధువులు ఇలా అందరూ  ఉండి ఉండవచ్చు. అందరితో సంతోషమూ లభించవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత సమయం ఉండాలి.  చదవడం, నడవడం, అభిరుచి కలిగిన పనులు చేయడం. ఆనందాన్ని ఇచ్చే పనులు చేయడం ద్వారా మానసికంగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ సమయం ఆత్మ విమర్శ చేసుకోవడానికి, తమను తాము తరచి చూసుకోవడానికి కూడా సహాయపడుతుంది. చురుగ్గా ఉండాలి.. ప్రస్తుతకాలంలో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధులు, అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని నిశ్చలమైన జీవనశైలి వదిలిపెట్టాలి. శారరక  శ్రమ, మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ధ్యానం, యోగా వంటిని ఫాలో కావాలి. ఆరోగ్యకమైన ఆహారపు అలవాట్లు.. నేటికాలం ప్రజల ఆహారపు అలవాట్లు చాలా దారుణంగా తయారయ్యాయి.  పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్నని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. సెలబ్రేషన్.. చిన్న విజయం అయినా సరే అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది  తదుపరి  పనులను మరింత ఉత్సాహంతో చేసేలా ప్రేరేపిస్తుంది. పాజిటివ్ గా ఉండాలి.. పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్యలు అయినా అధిగమించవచ్చు. అవి వ్యక్తిగతం అయినా, వృత్తి సంబంధ విషయాలు అయినా సానుకూలతతో ముందుకు వెళితే ఫలితాలు కూడా సానుకూలంగానే ఉంటాయి.                                                   *నిశ్శబ్ద.  

ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నారా? అసలు కారణాలివే!

బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించి, ఒక బంధాన్ని వెతుక్కుని, పెళ్లి పిల్లలు అంటూ ఒక కుటుంబాన్ని సృష్టించుకుని మనిషి తన జీవితాన్ని విస్తారం చేసుకుంటాడు. కానీ జీవితం అయితే విస్తారం అవుతుంది. కానీ మనిషి మాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం, మెరుగైన వసతులు ఉన్నా సరే.. జీవితంలో సంతోషాన్ని పొందలేకపోతున్నాడు. దీనికి కారణం వసతుల లేమి కాదు.. సమాజంలో  కలుగుతున్న మార్పులు, వ్యాధులు, ఆందోళన, అనిశ్ఛితి మొదలైనవి  అని వైద్యులు, మనస్తత్త్వ శాస్ర్తవేత్తలు అంటున్నారు. కానీ వీటన్నింటికంటే మనిషి సంతోషంగా లేకపోవడానికి ఆ వ్యక్తి దినచర్య కూడా కారణమవుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. చాలా అలవాట్ల వల్ల ప్రజలు సంతోషంగా ఉండడం కష్టంగా మారింది.  నిద్ర లేకపోవడం  ఈ కారణాలలో  ఒకటి. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం, నిద్ర లేకపోవడం  మానసిక,  భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది, దీని కారణంగా ఒత్తిడి-ఆందోళన పెరుగుతుంది. ఇది ఇలానే ఉంటే వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా సరే సంతోషంగా ఉండలేరు. మనిషిపై నిద్ర ప్రభావం ఎలా ఉంటుంది.. పరిశోధకుల అధ్యయనాలలో  నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తేలింది. అందుకే ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన యువత  కూడా మునుపటి కంటే ఎక్కువ చిరాకు, కోపం, అసంతృప్తి,  అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇప్పట్లో సమాజంలో నిద్ర రుగ్మతల సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తుంది, ఇది వ్యక్తుల్ని మానసికంగా బలహీనపరుస్తుంది. నిద్రలేమి కారణంగా నిద్రపొయిన సమయంలో కూడా  కలత నిద్ర,  భావోద్వేగ పనితీరుపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. భావోద్వేగాల విషయంలో బలహీనంగా ఉండటం వల్లే  ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నాం. నేటికాలంలో యువత రాత్రిళ్లు నెట్ బ్రౌజింగ్, బయట పార్టీలు, నైట్ టైమ్ బయటకు వెళ్లడం, అర్థరాత్రుల వరకు చాటింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. వీరు ఏ రెండు లేదా మూడు గంటలకు పడుకుని ఉదయం 8 గంటలకు నిద్ర లేస్తారు. దీని వల్ల నిద్రా చక్రం దెబ్బతింటుంది. అది మానసిక సమస్యలకు, మెదడు మీద ఒత్తిడికి కారణం అవుతుంది. అస్తవ్యస్థమైన పనితీరు, వేళకాని వేళలో ఆహారం తినడం, తీసుకునే ఆహారం అనారోగ్యకమైనది కావడం వంటి కారణాల వల్ల మొత్తం లైప్ స్టైల్ దెబ్బతింటుంది. అందుకే నిద్ర అలవాటు మార్చుకుంటే మొత్తం జీవనశైలి కూడా మెల్లగా ఓ కొలిక్కి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. సంతోషం కోసం ఈ అలవాట్లు తప్పక మార్చుకోవాలి.                                               *నిశ్శబ్ద.  

గణితంతో ప్రపంచాన్ని విస్మయపరిచిన శీనివాస రామానుజన్..!

మనిషి జీవితం మొత్తం గణితం పై ఆధారపడింది. ఉదయం లేచింది మొదలు సమయం చూడటం నుండి ప్రతి పనిలోనూ గణితాన్ని ఉపయోగిస్తాము. ఈ గణిత శాస్త్రానికి సంబంధించి భారతీయులు గర్వంగా చెప్పుకోదగినవారు శ్రీనివాస రామానుజన్.  భారతదేశంలో గణిత దినోత్సవాన్ని శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్బంగా జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్   రచనలు దేశవ్యాప్తంగా,  ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేశాయి. శ్రీనివాస రామానుజన్  1887, డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మదినం అయిన డిసెంబర్ 22వ తేదీను గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్ గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకుంటే.. 1887, డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్ లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీనివాస రామానుడన్ తన 12 సంవత్సరాల వయస్సులో అధికారిక విద్య లేకపోయినా త్రికోణమితిలో రాణించాడు. ఆయనే సొంతంగా   అనేక సిద్ధాంతాలను అభివృద్ధి చేశాడు. 1904లో మాధ్యమిక పాఠశాలను పూర్తి చేసిన తర్వాత, రామానుజన్ కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదవడానికి స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించాడు.  కాని అతను ఇతర సబ్జెక్టులలో రాణించలేకపోవడం వల్ల స్కాలర్షిప్ కోల్పోయాడు.  14 సంవత్సరాల వయస్సులో రామానుజన్ ఇంటి నుండి పారిపోయాడు. ఆయన  మద్రాసుకు చేరుకుని, మద్రాసులోని  పచ్చయ్యప్ప కాలేజీలో చేరాడు.  అక్కడ  కూడా ఇతర సబ్జెక్టులలో కాకుండా  గణితంలో మాత్రమే రాణించాడు. తన చదువును  ఫెలో ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పూర్తి చేయలేకపోయాడు. దీంతో ఆయన అధికారిక చదువు ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే  భయంకరమైన పేదరికంలో ఉన్న శ్రీనివాస  రామానుజన్  గణితంలో తనకున్న అభిరుచి కారణంగా  స్వతంత్ర పరిశోధనను కొనసాగించారు. తన పరిశోధనల ఫలితంగా తొందరలోనే  వర్ధమాన గణిత శాస్త్రజ్ఞుడిగా  చెన్నైలోని గణిత శాస్త్ర వర్గాల్లో ఒకరిగా  గుర్తించబడ్డాడు. 1912లో  ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడు  అయిన రామస్వామి అయ్యర్  శ్రీనివాస రామానుజన్ కు  మద్రాసు పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్క్ ఉద్యోగం రావడంలో   సహాయం చేశాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొకవైపు గణిత శాస్త్రానికి చెందిన తన పరిశోధన ఫలితాలను   బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞులకు పంపేవాడు.  1913లో కేంబ్రిడ్జ్‌కు చెందిన GH హార్డీ రామానుజన్ సిద్ధాంతాలకు ముగ్ధుడై అతనిని లండన్‌కు పిలిపించాడు. అప్పుడే శ్రీనివాస రామానుజన్ జీవితంలోనూ,  శాస్త్రవేత్తగానూ  పురోగతిని అందుకున్నాడు. రామానుజన్ 1914లో బ్రిటన్‌కు వెళ్లాడు. అక్కడ హార్డీ అతన్ని కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో చేర్చాడు. 1917లో రామానుజన్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి సభ్యునిగా ఎన్నికైన తర్వాత విజయపథంలో దూసుకెళ్లాడు.   1918లో రాయల్ సొసైటీకి ఫెలో అయ్యాడు. ఇలా  రాయల్ సొసైటీలో గౌరవనీయమైన స్థానాన్ని సాధించిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచారు. తన పరిశోధనలు, తన జీవితం అభివృద్ది చెందుతున్న సమయంలోనే  రామానుజన్ 1919లో బ్రిటన్‌లో ఆహారాన్ని అలవాటు చేసుకోలేక భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది.  1920లో 32 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అయినప్పటికీ, గణిత శాస్త్ర రంగంలో ఆయన విజయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవించబడుతున్నాయి.  1729 సంఖ్య ప్రత్యేకత కావచ్చు, మ్యాక్స్- తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు కావచ్చు, నంబర్ థియరీ పరిశోధనలు కావచ్చు.. ప్రతి ఒక్కటీ ప్రపంచానికి విస్మయాన్ని కలిగించాయి. ఎంతో టెక్నాలజీ అభివృద్ది చెందినా ఇప్పటికీ రామానుజన్ సూత్రాలు, ఫలితాలను చూసి విస్మయం చెందాల్సిందే.  రామానుజన్ ప్రచురించని ఫలితాలను కలిగి ఉన్న  మూడు నోట్‌బుక్‌లను విడిచిపెట్టాడు.  గణిత శాస్త్రజ్ఞులు వీటికోసం పని చేస్తూనే ఉన్నారు. రామానుజన్ గొప్పదనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2012లో, అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 22ని - రామానుజన్ పుట్టిన రోజును  దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.                                                *నిశ్శబ్ద.

ధనవంతులైనా సరే.. ఈ అలవాట్లు మానకపోతే కటిక  పేదవాడిగా మారిపోతాడట.!

ధనవంతులు, పేదవారు అనే వర్గాలు  ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. ఈ రోజు పేదవాడిగా ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అలాగే ఈ రోజు ధనవంతుడిగా ఉన్నవాడు రేపు పేదవాడిగా కూడా మారవచ్చు. చిన్న ఉద్యోగాలలో చేరి, వ్యాపారాలు మొదలు పెట్టి ఈ రోజు అపర కుభేరులుగా మారినవారున్నారు. అలాగే ఒకప్పుడు భవంతులలో నివసించి అన్నీ పోగొట్టుకుని పేదలుగా నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మనిషి తన దగ్గరున్న డబ్బును నిలుపుకోవడం అనేది అతని వ్యక్తిత్వం, అతని అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం కింది అలవాట్లున్నవారు ఎంత ధనవంతులైనా సరే పేదవాడిగా మారడం ఖాయమంటున్నారు.  అపరిశుభ్రంగా ఉండేవారు.. అపరిశుభ్రంగా మురికి బట్టలతోనూ, ఇల్లంచా అస్తవ్యస్తంగానూ ఉండే వారు ఎప్పటికీ పేదరికంతోనే జీవిస్తారట. దీనికి కారణం డబ్బున్నా బయటకు తీయకపోవడం, దాన్ని అలాగే దాచడం, తనూ సుఖపడక, డబ్బును సరైన అవసరాలకు వినియోగించక పేదవాడిగానే ఉండిపోవడం. చెడుగా మాట్లాడేవారు మాటతీరు మంచిగా లేని వ్యక్తులు ఎప్పటికీ డబ్బును  నిలుపుకోలేరు. అబద్దాలు చెప్పడం, చెడుగా మాట్లాడటం చేస్తుంటే ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత ఎప్పటికి మెరుగుపడదు. లక్ష్మీదేవి కూడా ఇలాంటి వ్యక్తుల వద్ద ఉండటానికి ఇష్టపడదట. సూర్యాస్తమయం తరువాత నిద్రపోవడం చాలామంది సాయంత్రం సూర్యుడు అస్తమించగానే నిద్రపోతుంటారు. అయితే ఈ సమయాన్ని లక్ష్మీదేవికి పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని అంటారు. సోమరితనం సోమరితనం ఉన్నవారు ఏ పనులను సరిగా చేయరు. పనులను వాయిదా వేడయం, ఏవో ఒక సాకులు చెప్పడం,  తప్పించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎదగలేరు. తమ దగ్గరున్న డబ్బును మెల్లిగా కరిగించి చివరికి పేదవాడిగా మారిపోతాడు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఉంది అని డాంబికాలు పలికేది ఇలాంటి వారే. ఇలాంటి వారు తమ ముందు తరాలను పేదరికంలోకి చాలా సులువుగా నెట్టేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త లేకుంటే.. డబ్బు సంపాదించడం  ఒక కళ. అయితే ఆ డబ్బును ఎలా ఖర్చుపెట్టాలనేది కూడా కళే. ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు పెట్టడం, పొదుపుకు కొంత కేటాయించడం, ఎమర్జెన్సీ ఫండ్స్ అరెంజ్ చేసుకోవడం వంటి మనీ మేనేజ్మెంట్ ప్లాన్స్ లేకుండా పేదవాడిగానే ఉండిపోతాడు.                                        *నిశ్శబ్ద.  

పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారా? సద్గురు ఏం చెప్పారో తెలుసుకోండి.!

పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యమైన దశ.  ఒకప్పుడు అమ్మాయిలకు, అబ్బాయిలకు 20ఏళ్ళలోపే పెళ్లి చేసేవారు.. ఆ తరువాత కాలంతో పాటు మార్పులు వచ్చాయి. నిర్ణీత పెళ్లి వయసులో మార్పులు వచ్చాయి. అయితే అమ్మాయిలు కూడా  చదువు, ఉద్యోగం  సెటిల్మెంట్ మొదలైన విషయాల గురించి ఆలోచిస్తూ పెళ్లికి అంత తొందరగా సిద్దం కావడం లేదు. అబ్బాయిలు కూడా చాలానే గోల్స్ పెట్టుకుంటున్నారు. ఈ కారణంగా పెళ్లి విషయంలో  జాప్యం    జరుగుతూ వస్తోంది. చదువులు, ఉద్యోగం ఇతర విషయాలలో సెటిల్ అయ్యాక చాలామంది ఇక పెళ్లి అవసరమా అని  అంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు సమాజం మాత్రం వదిలిపెట్టదదు. పెళ్లి గురించి బోలెడు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుంది. అందుకే కొందరు ఏదో ఒకటి అని పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ గారు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే విషయం గురించి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఆయనేం చెప్పారో తెలుసుకుంటే.. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. వివాహం కేవలం ఒక సంస్థ.  దానిని విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి అనేది సమాజం పెట్టిన లేబుల్ మాత్రమే. కానీ  పెళ్లి అవసరం లేనప్పుడు కూడా   చేసుకుంటే అది నేరమవుతుంది.  ఎందుకంటే మీరు మీ జీవితంలో పెళ్లి చేసుకుని  మరొకరిని బాధపెడతారు. పెళ్ళి చేసుకోవాలి అని అనిపించినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పెళ్లి చేసుకోవడం వెనుక  అవసరాలను అర్థం చేసుకోవాలి.  అవసరాలు చాలా బలంగా ఉంటే నిజంగానే  వివాహం చేసుకోవాలి. అదే  అవసరాలను నియంత్రించగలిగితే, పెళ్లి ఆలోచనను వదులుకోవాలి. ఎందుకంటే సంతోషంగా లేని వివాహం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటమే మేలు. సమాజం చెప్పే మాటల వల్లనో, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనో పెళ్లి చేసుకోకూడదు. ఎంపిక.. పెళ్లి అంటే  జీవిత భాగస్వామి మద్దతు పొందడం అనడంలో సందేహం లేదు. నేటి కాలంలో, ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామితో తన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. గౌరవించడమే కాకుండా  అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వివాహం అనేది జీవితకాల ప్రయాణం. అందుకే మద్దతు తెలిపే భాగస్వామిని ఎంచుకోవడం ముఖ్యం. శారీరక అవసరాలకు వివాహం అవసరం మన సమాజంలో స్త్రీ పురుషులు వివాహానంతరం ఒకరికొకరు దగ్గరవ్వడం సరైనది,   సముచితమైనదిగా పరిగణించబడుతుంది. లైంగిక సాన్నిహిత్యం కోసం  వివాహం అవసరమని ప్రజలు భావించడానికి ఇది కూడా ఒక కారణం. అయితే, వివాహం  స్వంత అవసరాలకు అనుగుణంగా ఉండాలి.  అవసరాలు భౌతికంగా,  మానసికంగా ఉండవచ్చు. అయితే  సామాజిక లేదా ఆర్థిక కారణాల కోసం మాత్రమే వివాహం చేసుకోకూడదు. ఫర్పెక్ట్ మ్యాచ్ కోసం చూస్తున్నారా? ఈ రోజుల్లో జీవిత భాగస్వామికి సంబంధించి ప్రజల ఉద్దేశాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇలాంటి  పరిస్థితిలో  ఆదర్శవంతమైన పురుషుడు లేదా స్త్రీ కోసం వెతకకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు.  భాగస్వామి అవసరమని భావిస్తే,  కావలసినది  అందించే   వ్యక్తిని ఎంచుకోవాలి. మీరిద్దరూ ఒకరినొకరు అంగీకరించవచ్చు. ప్రేమించవచ్చు. ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. ఒకరితో ఒకరు నడవగలరు కూడా.                                                 *నిశ్శబ్ద.

ఆలోచనా మార్పులు సబబేనా??

మనిషి జీవితం ఒక నది లాంటిది. నది ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా దారి సహకరించకపోతే అది తన దారి మార్చుకుని ప్రయాణం చేస్తుంది. అలాగే మనిషి కూడా తన దారి మార్చుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ దారి మారడాన్ని ఆలోచనల్లో మార్పుగా కూడా చెప్పవచ్చు. అయితే చాలామంది ఇలా ఆలోచనలు మారిపోవడం గూర్చి మాట్లాడుతూ అలా ఎలా మారిపోతారు మనుషులు అని అంటూ ఉంటారు. ఇలా ఆలోచనలు మార్చుకోవడం, వాటి ద్వారా జీవితంలోనూ మార్పు చోటుచేసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న వేసుకుంటూ ఎంతో మంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కూడా. మరి ఆలోచనల మార్పు సబబేనా?? ఆలోచనా…. మూలం!! ప్రతి ఆలోచన వెనుక కొన్ని పరిస్థితుల ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రభావాలే మనిషి మార్పుకు కారణం అవుతాయి. అలా మార్పులు జరుగుతూ ఉన్నపుడు జీవితము మార్పుకు లోనవుతుంది. కానీ మనుషులు అనేస్తారు ఎలా మారిపోతారు వీళ్ళు అని. అందరికీ మార్పు ఉండకూడదు, ఎప్పుడూ తమనే అంటిపెట్టుకుని ఉండాలనే ఆలోచన ఉండటం సహజమే కానీ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వాస్తవ జీవితంలో  ఎదురవుతున్న ఎన్నో సందర్భాలను డీల్ చెయ్యాలి అంటే ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా కలిగే మార్పులు ఎంతో అవసరం అని అనిపిస్తుంది.  వాస్తవాలు…. విస్తారాలు!! పైన చెప్పుకున్నట్టు వాస్తవ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సందర్భాలను డీల్ చేయాలంటే మనిషి ఒకే చోట ఆగిపోకూడదు. గడియారంలో ముల్లు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే మనిషి జీవితంలో ముందుకు పోతూనే ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ తెలియని ఒక అమాయక జీవిగా, ఎన్నో అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిగా మిగిలిపోతారు.  అందుకనే వాస్తవ జీవితంలో మనిషి ఏదో ఒకరకంగా ఎదగాలి అంటే ఆలోచనాపరమైన మార్పులు తప్పనిసరి అనిపిస్తుంది. అంగీకారం…. అవసరం!! జీవితంలో ఎదురయ్యే మార్పులను అంగీకరించగలిగితే చాలా వరకు జీవితం ఎంతో ఆహ్లాదంగానే ఉంటుంది. ఈ అంగీకరించడం అనేది పూర్తిగా మనసుపై ఆధారపడినప్పటికి అది పూర్తిగా భౌతిక పరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తల్లి బిడ్డను కన్నప్పుడు మూరెడు కూడా ఉండడు, తరువాత శారీరకంగా ఎదుగుతూ అయిదు నుండి ఆరడుగుల(కొందరు ఇంకా ఎక్కువ, తక్కువ ఎత్తు ఉంటారనుకోండి) ఎత్తయ్యి, చివరికి వివాహ బంధం ద్వారా మరొక వ్యక్తికి జీవిత భాగస్వామి అవుతారు. ఎంతో మార్పుకు లోనైన మనిషి ప్రయాణం ఎన్నో సంఘటనలతో  నిండిపోయి ఉంటుంది. ఆ సంఘటనలలో ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించామా?? ఈ ప్రశ్న వేసుకుంటే సంఘటనను బట్టి ఆలోచన, ఆలోచనను బట్టి నిర్ణయాలు, నిర్ణయాలను బట్టి మార్పులు, మార్పులను బట్టి భౌతిక జీవితంలో తగ్గే అలజడులు అన్నీ ఒక సైకిల్ లాగా ఉంటాయి. అంతేకానీ ఏ సమస్య వచ్చినా ఒకే నిర్ణయం తీసుకోరు కదా!! ఆ విషయాన్ని గ్రహించగిలితే సంఘటనలను బట్టి, అప్పటి అవసరాలను బట్టి మనిషి ఆలోచనా పరమైన మార్పు చేయడం నేరమేమి కాదు.  దృష్టి కోణం!! చూసే విధానంలోనే అంతా ఉందని అందరూ అంటుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. మన ఆత్మీయులకో, స్నేహితులకో ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు వాస్తవంగా ఆలోచించమని, నిజాన్ని గ్రహించమని, పరిస్థితులను అంగీకరించమని చెబుతుంటాము. అయితే అలా చెప్పినవాళ్ళు అలాంటి పరిస్థితులు ఏవైనా తమకు ఎదురైతే మాత్రం వాటిని అంత సులువుగా ఎదుర్కోలేరు. కాబట్టి దృష్టి కోణం మాత్రమే కాదు, ఒకానొక స్పోర్టివ్ నెస్ మనిషి జీవితంలో ఉండాలి. అలా ఉంటే అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఎదుటివారు మూవ్ అయిపోవడాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు కూడా. కాబట్టి ఆలోచనా పరమైన మార్పులు సబబేనా అంటే సబబే అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. కొన్ని నిజాలు నచ్చకపోవచ్చు కానీ ఎ ఏమి చేస్తాం అబద్ధంతో బతికితే అవి భరించరాని బాధల కోటల్ని కట్టేస్తాయి.                                                                                                                 ◆ వెంకటేష్ పువ్వాడ.  

ఈ ముగ్గురికి సహాయం చేయకపోవడమే మంచిది..!

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనం కొందరికి ఎప్పుడూ సహాయం చేయకూడదని చెప్పాడు. చాణక్యుడి విధానం ప్రకారం మనం ఏ ముగ్గురికి సహాయం చేయకూడదు..? మీరు ఈ ముగ్గురికి సహాయం చేస్తే ఏమి జరుగుతుంది? తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త,దౌత్యవేత్తగా పేరుపొందాడు. ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిని అనుసరించడం ద్వారా ప్రజలు జీవితంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ పాలసీల ద్వారా మీరు తప్పొప్పుల గురించి అవగాహన పొందుతారు. మీరు గందరగోళంగా ఉన్న అనేక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, ఇతరులకు సహాయం చేయడం మంచిది, కానీ చాలాసార్లు మనం కొంతమందికి సహాయం చేస్తాము. దీనివల్ల జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. చాణక్యుడి విధానం ప్రకారం మనం ఎలాంటి వారికి సహాయం చేయకూడదు? 1. మాదకద్రవ్యాలకు బానిసలు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, మాదకద్రవ్యాల బానిసలకు మనం ఎప్పుడూ సహాయం చేయకూడదు. అలాంటి వారు మమ్మల్ని సహాయం అడిగితే తిరస్కరించడం మంచిది. ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ మత్తులో ఉంటారు. అవన్నీ మరిచిపోయి డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. ఈ వ్యక్తులు మత్తు కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అంతే కాదు, తాగిన వ్యక్తి మంచి,తప్పు అనే తేడాను గుర్తించలేడు, కాబట్టి అలాంటి వారికి సహాయం చేయకూడదు. వారికి సేవ చేయడం లేదా డబ్బు ఇవ్వడం ఎల్లప్పుడూ మీకు హాని చేస్తుంది. 2. చెడ్డ స్వభావం గల వ్యక్తి: చెడు స్వభావం గల వ్యక్తికి దూరంగా ఉండటం మంచిదని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, నీచమైన,చెడు స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ సహాయం చేయకూడదు. అలాంటి వారికి సహాయం చేస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అలాంటి వారితో పరిచయం వల్ల ఒక వ్యక్తి సమాజంలో  కుటుంబంలో పదేపదే అవమానానికి గురవుతాడు. అందుకే అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. 3. తృప్తి చెందని వ్యక్తి: జీవితంలో తృప్తి చెందని,ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉండేవారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారికి మనం ఎంత మేలు చేసినా బాధపడటం తప్పు కాదు. అలాంటి వారి జీవితం ఎంత బాగున్నా వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఈ వ్యక్తులు ఇతరుల ఆనందానికి అసూయ చెందుతారు.ఇతరులను తిట్టుకుంటూ ఉంటారు. ఆవిధంగా అసూయ, దుఃఖం లేని వ్యక్తులకు కారణం లేకుండా దూరంగా ఉండటమే మనకు మంచిదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు.  

మహాభారతం కురుక్షేత్ర యుద్ధం మాత్రమే కాదు.

మహాభారతం కురుక్షేత్ర యుద్ధం మాత్రమే కాదు. మహాభారతం నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మహాభారతం నుండి ఎంచుకున్న జీవిత పాఠాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని అలవర్చుకుంటే జీవితంలో విజయం ఖాయం. మహాభారతానికి సంబంధించిన పాత్రలు, కథలు అందరికీ తెలుసు. హిందూ మతంపై ఈ పుస్తకం నుండి మనం చాలా నేర్చుకుంటాం. మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే, ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది మీకు జీవితంలో విజయాన్ని ఇస్తుంది. మహాభారతం నుండి మనం ఏమి నేర్చుకోవాలో తెలుసుకుందాం. - చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలని మహాభారతం మనకు బోధిస్తుంది, జీవితంలో ఎప్పుడూ చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు సాంగత్యానికి దూరంగా ఉండకుండా ఒక వ్యక్తి కెరీర్ జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. మంచి స్నేహితుల ఎంపిక : జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో మీకు అండగా ఉంటారు. శ్రీకృష్ణుడు పాండవులను ఆదరించినట్లే. అదేవిధంగా, మంచి స్నేహితుడిని ఎంచుకోవడం ప్రతి క్లిష్ట పరిస్థితిలో మీకు సహాయం చేస్తుంది. జీవితం నుండి నేర్చుకోండి: మహాభారతంలో , అర్జునుడు తన గురువు నుండి మాత్రమే కాకుండా అన్ని అనుభవాల నుండి నేర్చుకున్నాడు. మన వైఫల్యాల నుండి మనం ఎప్పుడూ పాఠాలు నేర్చుకోవాలి. ఇది ఒక వ్యక్తిని చాలా దూరం చేస్తుంది. అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం: ఏదైనా గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం. జీవితంలో విజయం సాధించాలంటే, ఎల్లప్పుడూ విషయాల గురించి పూర్తి సమాచారాన్ని పొందాలి. చెడు అలవాట్లను వదిలించుకోండి: జీవితంలో విజయం సాధించాలంటే మనిషి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ చెడు అలవాట్లు మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వవు. సత్యానికి మద్దతు ఇవ్వండి: హిందూమతంలోని ప్రతి పుస్తకం సత్య మార్గంలో నడవమని బోధిస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే ఎప్పుడూ సత్యానికి మద్దతివ్వాలి. ఇది ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది. మీ భావోద్వేగాలను నియంత్రించండి: జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలని మహాభారతం మనకు బోధిస్తుంది. భావోద్వేగాలపై తీసుకున్న నిర్ణయం వ్యక్తిని బలహీనపరుస్తుంది.   

మీ బంధాన్ని బలపరిచే సూత్రాలేంటో తెలుసా?

కోటిఆశలతో కొత్త జీవితంలోకి అడుగేస్తాం. మరి ఆ వైవాహిక జీవితం కలకాలం సంతోషంగా ఉండాలంటే మొదట్లోనే ధ్రుడమైన పునాదులు నిర్మించుకోవడం చాలా అవసరం. అందుకు ఈ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. అప్యాయత, అనురాగం ఉండాలి: ప్రేమ, ఆప్యాయతలను భాగస్వామిపై చూపించడం చాలా ముఖ్యం. కొందరు ప్రతిదానికి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. అలాచేయడం మనకు నచ్చినా మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. చూసే వారికీ అది ఏదోలా ఎగతాళిగా ఉంటుంది. అందుకే ఇద్దరికీ నచ్చేట్లుగా మీ ఆనందక్షణాలను మీ మధ్యే ఉండేవిధంగా చూసుకోవాలి. అంతేకానీ నలుగురి మెప్పుకోసం ప్రయత్నాలు చేయకూడదు.   తొందరపాటు మంచిది కాదు: మొదట్లో మీకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పేయాలని, లేదా భాగస్వామికి సంబంధించిన విషయాలన్నీ మీరు తెలసుకోవాలన్న కుతూహలం చూపించకూడదు. సహజంగానే ఆ బంధాన్ని వికసించేలా చేయండి. భాగస్వామి నిజంగా తన విషయాలను మనతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడే వినండి. కానీ చెప్పమని బలవంతం చేయకూడదు. ఆ మాత్రం రహస్యం ఉంటేనే..బంధం మనోహరంగా సాగుతుంది. పెళ్లికి ముందు మాటల్లోనే లేదా పెళ్లైన కొత్తల్లో కొందు భాగస్వామిని ఇంప్రెస్ చేసేందుకు ఏవేవో వాగ్దానాలు చేస్తుంటారు. తీరా వాటిని నిలబెట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలా చేయడం వల్ల భాగస్వామికి మన మీద అపనమ్మకం ఏర్పడుతుంది. అందుకే కచ్చితంగా మాట నిలబెట్టుకోగలం అనుకుంటేనే వాగ్దానాలు చేయండి. స్వేచ్చనివ్వండి: ప్రతినిమిషం భాగస్వామితోనే కలిసి సమయం గడపాలనుకోవడం సహజం. మరీ ముఖ్యంగా పెళ్లైన కొత్తలో అలాని వారికంటూ వ్యక్తిగత స్వేచ్ఛ, సమయం ఇవ్వకుండా ఉండటం సమంజసం కాదు. వాళ్లకూ స్నేహితులూ, ఆసక్తులూ, లక్ష్యాలు ఉంటాయి. వారు వ్యక్తిగతంగా ఎదిగితేనే కదా మన బంధమూ కూడా బలంగా ఉండేది.

ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.. విరాళానికి మీ చెయ్యి ముందుకు రావాలి!

భారతదేశం నా మాతృ భూమి.. భారతీయులందరు నా సహోదరులు.. ఈ మాట చిన్నప్పటి నుండి కంఠస్థం చేసినదే. అయితే సగటు సాధారణ పౌరుడు ఇలాంటి ప్రతిజ్ఞలలోనూ, మేరా భారత్ మహాన్.. అనో..  భారత్ మాతా కీ జై.. అనో నినాదాలు ఇస్తూ పైపైకి దేశ భక్తి చాటుకుంటారు. దేశం కోసం ఎవరైనా సైనికులు వీర మరణం పొందితే ఇతనే నిజమైన సైనికుడు, దేశ భక్తుడు అంటూ కీర్తిస్తారు. తప్పితే సగటు పౌరుడు ఇంకేమీ చెయ్యలేడు. కానీ ప్రతి పౌరుడు దేశం మీద తమకున్న భక్తిని చాటుకోవడానికి, దేశానికి తనూ సహాయం చెయ్యడానికి ఫ్లాగ్ డే ఆప్ ఇండియా సరైన రోజు. అసలేంటీ ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా? దీని చరిత్ర ఏంటి? భారతదేశ పౌరులు దీని సందర్భంగా ఏం చెయ్యవచ్చు? వివరంగా తెలుసుకుంటే.. ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.. భారత్ ను తమ ప్రాణాలను పణంగా పెట్టి సంరక్షిస్తున్న మన దేశ సూపర్ హీరోల సహాయార్థం ఈ ఫ్లాగ్ డే ఆప్ ఇండియాను జరుపుకుంటారు. దేశానికి సేవలు అందించే నౌకాదళం, వైమానిక దళం, భారత సైన్యంలోని సైనికుల కోసమే దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మూడు శాఖలలోని సైనికులు దేశం కోసం పోరాడుతూ మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి, వారికి ఆర్థిక సహాయం చెయ్యడానికి  ఈరోజున భారత జండాతో పాటు ముదురు నీలం, లేత నీలం, ఎరుపు రంగులలో ఉన్న చిన్న జెండాలను అందజేస్తారు. వీటిని అందుకున్నవారు బదులుగా డబ్బును విరాళంగా ఇస్తారు. ఈ జెండాను దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఈ డబ్బును సైనికుల కుటుంబాల కోసం వినియోగిస్తారు. చరిత్రలో ఏముంది?  ఇది 1949, ఆగస్టు 29న ప్రారంభమైంది. అప్పటి భారత రక్షణ మంత్రి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన  జెండా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం జెండాలను పంపిణీ చేయడం ద్వారా నిధులు సేకరించి ఆ నిధులను  సైనికుల కుటుంబాలకు సహాయంగా ఇవ్వాలని నిర్ణయించబడింది. భారత్ పౌరులు ఏం చేయవచ్చు.. ఈ నిధుల సేకరణ ముఖ్యంగా వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు సాధారణ పౌరులు బాధ్యత వహించే దిశగా సాగుతుంది. అమర వీరులకు, యుద్ద బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి కూడా ఈ నిధులు సేకరిస్తారు. భారత పౌరులు దేశంలో సురక్షితంగా జీవించడానికి దేశ సరిహద్దులలో సైనికుల  ధైర్యసాహసాలే కారణమని తెలుసుకోవాలి. ఇందుకోసం వారి కుటుంబాల పట్ల బాధ్యతగా ఉండాలి. తమకు తోచినంత మెరుగైన విరాళాలు ఇవ్వాలి. దేశానికి సైనికులు సేవ చేస్తే.. వారి కుటుంబాలకు అండగా ఉండగలమనే భరోసాను భారత పౌరులే  ఇవ్వాలి.                                                         *నిశ్శబ్ద.  

సెల్ఫ్ లవ్ ఎందుకు ముఖ్యం?

  సెల్ఫ్ లవ్ అంటే తమను తాము ప్రేమించుకోవడం. ప్రేమ అనేది ప్రతీ మనిషికి అవసరం. చాలామంది ఇంట్లో వారు, స్నేహితులు, తెలిసిన వారు ఇలా అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా ఎంత చేసినా వారిలో ఏదో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం సెల్ప్ లవ్ లేకపోవడమే. తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి ఇతరుల అవసరాలు తీర్చి వారిని సంతోష పెట్టగడేమో కానీ వారి దృష్టిలో ఖచ్చితంగా చులకన భావానికి లోనవుతాడు. దీనిక్కారణం తనకంటూ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చుకోకపోవడమే. అసలు  జీవితంలో సెల్ఫ్ లవ్ ప్రాముఖ్యత ఏంటి? సెల్ఫ్ లవ్ వైపు ఎలా వెళ్లాలి? సెల్ఫ్ లవ్ ప్రతి వ్యక్తికి ముఖ్యం. ఇదే వ్యక్తికి గుర్తింపునిస్తుంది.  ఇతరులు గౌరవించేలా చేస్తుంది. నిజానికి సెల్ఫ్ లవ్ కలిగిన వ్యక్తులు ఇతరులకు ప్రేమను అందించగలుగుతారు. ఇతరుల నుండి ప్రేమను, గౌరవాన్ని పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారనే విషయాన్ని అస్సలు  అంగీకరించలేరు. నన్నెవరు ప్రేమిస్తారు? నన్నెవరు గౌరవిస్తారు?  అని తమను తాము చిన్నతనం చేసుకుంటారు. తమను తాము ప్రేమించుకునే వ్యక్తులు ఎప్పుడూ సంబంధాల విషయంలో నిజాయితీగా ఉండగలుగుతారు. ప్రేమ విలువను గుర్తించగలుగుతారు.  ఇతరులతో ప్రేమగా మాట్లాడగలుగుతారు. ఇవి  ప్రతి మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. తమను తాము ప్రేమించుకోవడం ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలకు పునాది వేస్తుంది.  ఎందుకంటేఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ లవ్ మొదలైనవి ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటే ఇతరులతో బంధాలకు విలువ ఇవ్వడంలోనూ, ఇతరులను అర్థం చేసుకోవడంలోనూ ఎలాంటి పొరపాట్లు చేయరు. దీనివల్ల బంధాలు దృఢంగా ఉంటాయి. సెల్ఫ్ లవ్ అనేది తన గురించి తాను కేర్ తీసుకోవడంలోభాగం. ఇతరులేమన్నారు, ఇతరులు ఏమంటున్నారు? ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతూ ఉంటే  వ్యక్తి ఒత్తిడికి లోనవుతారు. అదే తమను తాము ప్రేమించుకుంటే స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమకు మంచి ఏది? చెడు ఏది? అనే విషయాలను గుర్తించి మంచిని తీసుకుని చెడును వదిలి ముందుకు సాగుతారు. అన్నింటికంటే ముఖ్యంగా స్వీయ ప్రేమ కలిగినవారు నిజాయితీగా ఉంటారు. ఇతరులతో కూడా అంతే నిజాయితీగా ఉండగలుగుతారు.  ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నిజాయితీని పాటిస్తారు.  ఇది లేకపోతే వ్యక్తులలో నటన, అబద్దాలు ఆడటం, బ్యాలెన్సింగ్ లేకపోవడం జరుగుతుంది.                                             *నిశ్శబ్ద.  

పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎందుకంత ముఖ్యం.

నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. పిల్లల గురించి ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పమంటే మొదట ఇదే చెబుతారు. ఆ తరువాత పిల్లల్లో దేవుడుంటాడని కూడా చెబుతారు. పిల్లలు పుట్టినప్పుడు చాలా అపురూపంగా చూసుకుంటాం. ఏడుస్తుంటే ఆకలేస్తుందేమో అని కంగారు పడతాం.  స్థోమతను బట్టి మంచి మంచి బట్టలు వేసి వారిని చూసి మురిసిపోతాం. బొమ్మలు కొనివ్వడం నుండి అడిగిన దానికల్లా తల ఊపుతాం. వారిని అంత ప్రేమగా పెంచి.. మూడు నాలుగేళ్లు నిండగానే ఇక వారి గురించి అంతగా పట్టించుకోవడం మానేస్తాం. చాలా మంది ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, అన్నీ సమకూరుస్తున్నాం, లోటు చేయడం లేదు కదా అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పని, వారికి అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమను పంచాలని, పసి మనసుల్లో బరువు దించాలని, వారితో మాట్లాడాలని పిల్లల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం ఎలా ఉండాలి?  పిల్లలకు కావాల్సిందేమిటి? పిల్లలతో సంభాషణ ఎందుకంత ముఖ్యం?  వంటి  విషయాల గురించి చర్చించేందుకు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని దృఢంగా మార్చేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 5 వ తేదీన పిల్లలతో సంభాషణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని ప్రకారం పిల్లలతో తల్లిదండ్రులకు ఉండాల్సిన అనుబంధం గురించి మరింత అవగాహన కల్పిస్తారు. బిజీ జీవితాలు గడిపే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చేతులారా వైఫల్యాలకు గురిచేస్తారో వారికర్థమయ్యేలా చెప్పడం, పిల్లల విషయంలో వారు ఎలా ఉండాలో తెలియజేయడం, వారి మనసు పొరల్లో ఉన్న సందేహాలు, భయాలు, అపోహలను నివృత్తి చేయడం ఈరోజు ఉద్దేశం. పిల్లలతో ఎందుకు మాట్లాడాలి? తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా పెంచాలని అనుకుంటారు. అందుకోసమే బోలెడంత డబ్బు ఖర్చు చేస్తారు. నిజానికి పిల్లలకోసం డబ్బు ఖర్చు చేయడం కాదు, వారితో మాట్లాడితే పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారు. ఉత్తమ పౌరులుగా  మారుతారు. ఎందుకంటే సంభాషణలోనే వారి భవిష్యత్తు నిర్మాణమవుతుంది. పిల్లలతో మాట్లాడే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధం చాలా దగ్గరగా, స్నేహభావంతో ఉంటుంది. పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడతారు. కొన్ని చెబితే ఏమనుకుంటారో అని సందేహంతో ఉంటారు. కొన్ని విషయాలు అడిగితే తల్లిదండ్రులు కోపం చేసుకుంటారేమో అని చెప్పలేరు. తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. వాళ్లు రక్తం పంచుకుపుట్టిన పిల్లలు. వారికంటే బయటి ప్రపంచం, డబ్బు, విలాసాలు ఏవీ ముఖ్యం కాదు.  అందుకే వారితో మాట్లాడుతుంటే తల్లిదండ్రులే తమకు గొప్ప స్నేహితులు అని భావిస్తారు. పిల్లలతో ఏం మాట్లాడాలి? పిల్లలతో ఏం మాట్లాడాలనే డైలమా చాలామంది తల్లిదండ్రులలో ఉంటుంది. అయితే పిల్లతో మాట్లాడటానికి వారిలో పరిణితి పెంచడానికి, వారిని ఆలోచించేలా చెయ్యడానికి చాలా అంశాలున్నాయి. పిల్లలు ఇంట్లో,  స్కూల్ నుండి రాగానే, స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు. చాలా  సందర్బాలలో బోలెడు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారు ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నారో గమనించాలి. వాటి గురించి పిల్లలతో మాట్లాడాలి. అందులో తప్పొప్పులు వారితో చర్చించాలి. దీనివల్ల పిల్లలో ఆలోచనా సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.  చాలామంది తల్లిదండ్రులు  పిల్లలు స్కల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే.. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అడుగుతారు. పిల్లలు కూడా చాలావరకు అల్లరి చేయడం స్కూల్లో పనిష్మెంట్ కు గురికావడం జరుగుతూ ఉంటుంది. ఈ  విషయం చెప్పేటప్పుడు పిల్లలు నిరాశగా, బాధగా ఉంటారు. అదే ఈ ప్రశ్న కాకుండా వేరే ప్రశ్నలు అడిగితే పిల్లలు సంతోషిస్తారు. ఎంతో ఉత్సాహాంతో తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఈరోజు స్కూల్లో ఏ పని బాగా చేశావనో..  క్లాసులో జరిగిన సరదా సంఘటన ఏంటనో.. అడగాలి. ఇవే కాకుండా.. ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపించిందని, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఎలా ఉందని కూడా అడగచ్చు. వీటి వల్ల పిల్లలు సంతోషంగా సమాధానాలు ఇస్తారు. పిల్లలను నొప్పించిన సంఘటనలు ఏవైనా ఉన్నా నోరువిప్పి చెబుతారు.  దానివల్ల పిల్లలకు ఏ విషయాన్ని దాపరికం లేకుండా చెప్పడం అలవాటు  అవుతుంది. స్నేహితుల గురించి, స్నేహితులతో జరిగే సంఘటనల గురించి వారితో సాన్నిత్యం, గొడవలు మొదలైనవన్నీ అడగాలి. ఎవరు బాగా స్నేహంగా ఉంటారో, వారు ఎలా చదువుతారో, వారు ఎలాంటి వారో అడిగి తెలుసుకుంటూ ఉంటే స్నేహం వల్ల పిల్లలు తప్పు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడవచ్చు. పిల్లలు తప్పు చేస్తే ఎప్పుడూ దండించకూడదు. వాటికి తగిన ఉదాహరణలు చెబుతూ వారు చేస్తున్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరించాలి. అంతే..  పిల్లలు ఆ తరువాత ఎప్పుడూ తప్పు చెయ్యలేరు. దగ్గర కూర్చుని చెప్పే మాటలు మనసును తాకుతాయి. అదే కోపంగా చెప్పేమాటలు వారి అహాన్ని దెబ్బ కొడతాయి. అందుకే కోపంతో ఎప్పుడూ ఏదీ చెప్పకూడదు. అది భయాన్ని పెంచుతుందే కానీ వారి మనసును మార్చదు.                                          *నిశ్శబ్ద.  

కాలుష్యపు కోరలను తుంచివేయాలి!

కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన అతిపెద్ద సమస్య. సరిగ్గా గమనిస్తే మనిషి పూర్తీగా కాలుష్యపు వలయంలో నివసిస్తున్నాడు. అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, గాలిలో నాణ్యత అనేవి మచ్చుకైనా కనిపించవు. పట్టణీకరణ అభివృద్ది చెందేకొద్దీ వాతావణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో మొబైల్, ఒక్కొక్కరికి ఒక్కో బైక్, అదనంగా అందరూ కలసి బయటకు వెళ్లడానికి కారు.. ఇలా చెబుతూ పోతే వాహనాల రద్దీ కారణంగా వాతావరణం కలుషితం అవుతోంది. ఇక వ్యాపారాల కారణంగా ఏర్పడిన ఫ్యాక్టరీలు.. వాటి నుండి వెలువడే పొగ కారణంగా గణనీయంగా గాలి కాలుష్యం, ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా నీటి కాలుష్యం కూడా జరుగుతోంది. కనీసం మనిషి చేతుల్లో నియంత్రించగలిగిన వాటిని కూడా నియంత్రించకుండా చాలావరకు ప్రజలే వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. వీటన్నింటి గురించి చర్చించి వాతావరణ కాలుష్య కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయాలని ప్రతి ఏటా డిసెంబర్ 2వ తారీఖున ప్రపంచ వాతావరణ కాలుష్య నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజు చరిత్ర, దీని ప్రాధాన్యత, ప్రజల భాద్యత మొదలైన విషయాలు తెలుసుకుంటే.. పర్యావరణ కాలుష్యం  ప్రజల ఆరోగ్యం,  భూమిపై దాని ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ కారణంగా ఈ భూమితో పాటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.  ప్రపంచాన్ని కబళిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది  ప్లాస్టిక్ కాలుష్యం. నేల నాణ్యతను దిగజార్చడం నుండి సముద్ర జీవులను చంపడం వరకు ప్లాస్టిక్ కాలుష్యం దారుణంగా ఉంటుంది. ఇది  త్వరలోనే ప్రజల ఉనికికి కూడా శాపంగా మారే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), గ్రీన్‌పీస్  సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు కాలుష్యాన్ని నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను కోరుతున్నాయి. అయితే బాధ్యత మన ప్రభుత్వాలపై మాత్రమే  ఉందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వాలు, ప్రతినిధులు మాత్రమే ముందుకు వచ్చి చేస్తే పరిష్కారమయ్యే సమస్య కాదు ఇది.  పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయడానికి  ప్రజలే  ముందుకు రావాలి. పరిశోధనలు  వివిధ సర్వేల ఆధారంగా, వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోందని అంచనా వేయబడింది, అయితే ఇది తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాలలో వాయు కాలుష్యం కారణంగా మరణాల రేటు బాగా పెరిగింది. వాతావరణంలోని మార్పులే కాకుండా కరోనా వంటి దారుణమైన దాడుల తర్వాత చాలామంది ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. ఈ కారణంగా ప్రజలు చిన్న చిన్న సమస్యలకే మరణాలకు లోనవుతున్నారు. ఎక్కువశాతం మంది శ్వాస సంబంధ సమస్యలతోనే మరణిస్తున్నారు. దీని కారణంగా, WHO భారతదేశం, బంగ్లాదేశ్, ఖతార్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్,మంగోలియా వంటి కొన్ని దేశాలకు కఠినమైన గాలి నాణ్యత నిబంధనలను విధించింది. మనలో చాలా మందికి మనం తీసుకోగల నివారణ చర్యల గురించి తెలుసు,కానీ వాటిని పాటించము. సమస్య మనది కాదులే అనే నిర్లక్ష్యం చాలామందిలో ఉంటుంది. మొక్కలను నాటడం, సరైన స్థలంలో చెత్తను వేయడం, ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం, పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను ఉపయోగించడం. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ప్రకృతి సంపదను పెరిగేలా చేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. కానీ దీన్ని పాటించేవారు తక్కువ. తెలిసిన వారికే కాదు.. తెలియని వారికి అజ్ఞానంలో  ఉన్నవారికి కూడా  జ్ఞానోదయం చేయాలి. కాలుష్యం  వల్ల ఎదురయ్యే  ప్రాణాంతక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పరిస్థితి  తీవ్రతను తెలియజేయాలి. అంతేకాకుండా  వీటిని ఇంటి నుండే ప్రారంభించాలి. కాబట్టి మీరు మీ పిల్లలు,  యువ తరానికి స్థిరమైన భవిష్యత్తును సృష్టించాలనుకుంటే, వాతావరణాన్ని కాపాడే విషయంలో ఎలాంటి జాప్యం చేయకూడదు. ఇతరులు చేయట్లేదు మనమెందుకు చేయాలనే వాదాన్ని పక్కన పెట్టి  మీకు మీరుగా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రకృతి సంపదను పెంచడానికి కృషి చేయాలి. ఇలా చేస్తే సగటు పౌరుడిగా సమాజం కోసం తమ వంతు కృషి చేసినట్టే.                                                    *నిశ్శబ్ద.  

ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీ కెరీర్ నాశనమే..

ప్రతిమనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలతో పాటు కెరీర్ గురించి కూడా శ్రద్ద పెడతాడు. నిజానికి బంధాలు అనుబంధాలు అనేవి కాలంతో పాటూ కొత్తగా కూడా పుడతాయి. కానీ కెరీర్ అనేది చాలా ముఖ్యం. ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చెయ్యకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చదువు..  ఉద్యోగం.. ఈ రెండూ జీవితంలో ఎంత బాగా బ్రతకగలం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఇవి రెండూ బాగుండాలన్నా ఆ తరువాత జీవితం సజావుగా సాగాలన్నా జీవితంలో నమ్మకమైన మనుషులతో స్నేహం అవసరం. ఎందుకంటే జీవితంలో అన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో ఆచార్య చాణక్యుడు  నొక్కి చెప్పాడు. చాణక్యనీతిలో ఎవరిని నమ్మకూడదని చెప్పాడంటే.. ఆయుధాలు ఉపయోగించే వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. కత్తులు, పిస్టల్, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నవారు ఎక్కువ కోపం స్వభావం కలిగినవారై ఉంటారు. వీరికి కోపం వస్తే కొన్నిసార్లు ముందు వెనుక ఆలోచించకుండా ప్రమాదం తలపెడతారు. అందుకే ఆయుధాలు ఉన్నవారితో దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. బలవంతులతో స్నేహం ఎప్పటికైనా ముప్పేనని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే బలవంతులు తమ స్వార్థం కోసం మనుషుల్ని ఉపయోగించుకుంటారు. అది పెద్ద తప్పేం కాదనే వాదనలో ఉంటారు. వారి కారణంగా జీవితంలో ముఖ్యమైన కాలాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. బలవంతులు అంటే డబ్బు మదం కలిగినవారు. చెడు అలవాట్లున్న ఆడవారిని నమ్మడం కూడా ఇబ్బందులలో అడుగేసినట్టేనట. తమ సంతోషం కోసం, సుఖాల కోసం, అవసరాల కోసం భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసే మహిళలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనిషిలో ఎలాంటి ఆలోచనలున్నాయో, వారు ఎప్పుడేం చేస్తారో తెలియనప్పుడు వారితో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి ఆడవాళ్లు బాగా నాటకీయంగా ఉంటారు. హింస ప్రవృత్తి కలిగిన వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. హింసను చూసి ఆనందపడేవారు చివరికి మిమ్మల్ని కూడా హింసిస్తూ పైశాచికానందం పొందే అవకాశం లేకపోలేదు. ఇతరుల మీద అసూయను, ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ కుళ్లుకునేవారితో స్నేహం కూడా మంచిది కాదు. అలాంటి వారు ఇతరులు ఎదిగితే చూడలేరు. స్నేహమనే పేరున్నా సరే.. మీరు ఎదిగినా కూడా ఓర్చుకోలేరు.                                          *నిశ్శబ్ద.

ప్రశాంతమైన జీవితానికి పది సూత్రాలు..

ఈకాలంలో డబ్బు అయితే ఈజీగా సంపాదించగలుగుతున్నారు కానీ ప్రశాంతతను సంపాదించుకోలేకపోతున్నారు. ప్రశాంతత లేనిదే సంతోషాలుండవు.  ఒకవేళ జీవితంలో సంతోష క్షణాలు వచ్చినా అవి దీర్ఘకాలం ఉండవు. సంతోషాలు జీవితంలో ఉన్నా వాటిని అనుభూతి చెందలేరు. అందుకే ఎవరు చూసినా జీవితంలో ప్రశాంతత కరువైందని అంటూ ఉంటారు. కానీ ప్రశాంతత కావాలంటే జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని నిజాలు, కొంత అవగాహన చాలా ముఖ్యం. ప్రశాంతమైన జీవితం సొంతం కావాలంటే ఈ కింది పది సూత్రాలను తూ.చా తప్పకుండా పాటించాలి.  అప్పుడు ప్రశాంతత కరువైందిరా బాబూ.. అని గోడు వెళ్లబోసుకోనక్కర్లేదు. ఇంతకీ ఆ సూత్రాలేంటో చూస్తే.. నేనేదీ ప్లానింగ్ చేసుకోను, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజానికి నేటికాలంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని, చిన్న చిన్న సంతోషాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్లానింగ్ ముఖ్యం. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీసు పని నుండి ఇంట్లో పనుల వరకు.. ప్రణాళికా బద్దంగా పూర్తీ చేస్తుంది ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ అయిపోయి మిగిలిన కొద్దో గొప్పో సమయం మీద ప్రభావం ఉండదు.  లోతుగా చేసే శ్వాస వ్యాయామాలు ఒత్తిడి  మీద మంత్రంలా పనిచేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఫాలో అవుతుంటే చాలు ఏ పని చేయాలన్నా కంగారు, హడావిడి లేకుండా చెయ్యగలుగుతారు. శ్వాస వ్యాయామాల పుణ్యం  మంచి ప్రశాంతత చేకూరుతుంది. కేవలం శ్వాస వ్యాయామాలే కాదు శారీరక వ్యాయామాలు కూడా అవసరం. శారీరక వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్పిన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఇప్పట్లో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు ఏమీ లేవు, దీని కారణంగా చాలా తొందరగా శరీరాలు బలహీనం అవుతున్నాయి. హార్మోన్ల స్థితిలో మార్పు,  అవయవాల సామర్థ్యం తగ్గడం జరుగుతున్నాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నుండి 60 నిమిషాల వ్యాయామం చెయ్యాలి. ధ్యానం మనిషిని అంతర్గతంగా రిపేర్ చేస్తుంది. మనసు నుండి శరీర అవయవాల వరకు ధ్యానం చేకూర్చే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యం, మానసిక ఒత్తిడి మొదలైన వాటిపై ప్రభావవంతంగా ఉంటుంది. మనసును నియంత్రిస్తుంది. తద్వారా ప్రశాంతత చేకూరుస్తుంది. మనిషి ప్రశాంతతలో నిద్ర కూడా కీలకమైనది. చక్కని నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ప్రతిరోజూ కనీసం 7-8 గంటల మంచి నిద్ర బోలెడు రోగాలను దూరం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనులు చకచకా జరగాలన్నా కాఫీ, టీ తాగి చురుగ్గా మారతారు. కానీ ఇవి తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిచ్చినట్టు అనిపిస్తాయి కానీ వీటిలో కెఫిన్ మానసిక సమస్యలు పెంచుతుంది. కాఫీ టీ బదులు, లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం, మరీ ముఖ్యంగా హెర్బల్ టీలు ప్రశాంతతను చేకూరుస్తాయి. చాలామంది ఎమోషన్ గా ఉంటుంటారు. కానీ ఎమోషన్స్ పెంచుకోవడం జీవితంలో దుఃఖానికి కారణం అవుతుంది. ఆర్థిక నష్టాలు అయినా, వ్యక్తిగత విషయాలు అయినా నిరాశ పరిస్తే వాటిని ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇలాంటి వారు దాదాపుగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఆఫీస్ లో ఎంతో బాగా పనిచేస్తున్నాం కానీ గుర్తింపు లేదు, ఇంట్లో అందరి విషయంలో బాధ్యతగా ఉంటున్నాం కానీ గౌరవించరు. అందరికీ సాయం చేస్తుంటారు కానీ ఎవరూ పొగడరు. అందరితో మంచిగా ప్రేమగా ఉంటాం కానీ ఎవరూ మనల్ని తిరిగి అలా ట్రీట్ చేయరు. చాలామంది జీవితాల్లో జరిగేవి ఇవి.  జీవితం గురించి  అర్థం చేసుకునేవారు వీటిని పట్టించుకోరు. ఇతరుల నుండి ఏమీ ఆశించరు. కానీ కొందరు మాత్రం ప్రతి పని నుండి గుర్తింపో, ఆర్థిక లాభమో ఆశిస్తారు. ఇలాంటి వారే ప్రశాంతతకు దూరం అవుతారు. ఆఫీసు పనులు, ఇంటి పనులు, ఇతర బాధ్యతలు అన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అనుకుంటున్నారా? ఎప్పుడూ పనులు, బాధ్యతలే కాదు. విశ్రాంతి కూడా కావాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలంటే ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండాలి. అది మానసికంగా చాలా మంచి ఊరట ఇస్తుంది. వంట, సంగీతం వినడం, డ్యాన్స్, పుస్తకాలు చదవడం, ఆర్ట్స్, విభిన్న కళలుంటే వాటిని కంటిన్యూ చేయడం. కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా ఏదో ఒక అదనపు వ్యాపకం ఉండాలి. ఇవి ఒత్తిడి తగ్గించి ఉల్లాసాన్ని పెంచుతాయి.                                 *నిశ్శబ్ద.  

నమ్మకం విజయానికి తొలి అడుగు అంటారెందుకు?

మనిషికి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యం. అది మనిషి జీవితాన్ని ఎప్పుడూ మెరుగ్గా ఉండేలా, ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఓ చిన్న కథ అదే చెబుతుంది….. పూర్వం ఒక రాజు వుండేవాడు. అతని భార్య గొప్ప అందగత్తె.  ఆమెను చాలా ప్రేమతో చూసుకునేవాడు. ఆమెకు ఎక్కడ లేని నగలను దేశ విదేశాల నుంచి తీసుకువచ్చే వాడు. అరేబియా నుంచి నగల వర్తకులు నేరుగా ఆమె భవనానికి వచ్చి నగలు అమ్మేవారు. ఇలా 25 సంవత్సరాలు గడిచాయి. ఆమె అందం తగ్గింది. రాజు మరో భార్యను చేసుకున్నాడు. క్రమక్రమంగా ఆమె దగ్గరికి రావటం తగ్గించాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పెద్దభార్య భర్త తనదగ్గరకి తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తుండేది. ఆ రాజ్యంలో జరుగుతున్న విశయలు ఏమీ తెలియని ఒక అరేబియా వర్తకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన దగ్గరవున్న అత్యంత ఖరీదైన నగను పెద్ద రాణికి అమ్మడానికి సరాసరి ఆమె భవనానికి వచ్చాడు. ఆ నగను ఆమెకు చూపించాడు. ఆ రాణి ఆ నగ పనితనానికి ముచ్చటపడి కొనాలని ఆసక్తి చూపి, భర్త నిరాదరణ గుర్తుకువచ్చి మానివేసింది.  ఆమె అనాసక్తిని అరేబియా వర్తకుడు మరొక విధంగా తలచి "అమ్మా, ఈ హారానికయ్యే సొమ్మును నాకు వెంటనే ఇవ్వవలసిన అవసరం లేదు. నేను వర్తకం నిమిత్తం మరిన్ని దేశాలు తిరగవలసివస్తుంది. సంవత్సరం తరువాత నేను మీ రాజ్యానికి తిరిగివస్తాను. అప్పుడు నాకు సొమ్ము ఇవ్వవచ్చు" అన్నాడు.  రాణి ఇంకా తటపటాయిస్తూండగా ఆమె కొడుకైన యువరాజు ఆ హారాన్ని తీసుకొని, తల్లి మెడలో అలంకరించాడు. వర్తకుడు ఆనందంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తల్లితో "ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? సంవత్సరం లోపల ఏమైనా జరగవచ్చు. నాన్నగారు మనసు మారి మళ్లీ నీ దగ్గరకు రావచ్చు, రాజ్యాధికారం అంటే విరక్తి కలిగి నన్నే రాజుగా ప్రకటించవచ్చు. పిన్ని ఆరోగ్యానికి భంగం కలిగి రాజు నిన్నే ఆదరించవచ్చు, రాజు దురదృష్టం కొద్దీ మరణిస్తే నేనే యువరాజును కాబట్టి రాజ్యాధికారం నాకే రావచ్చు. నాన్నగారు అనారోగ్యానికి లోనైనా నాకే రాజ్యాధికారం రావచ్చు. సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చు, నేను పొరుగు రాజ్యాన్ని జయించి రాజును కావచ్చు. గుర్రం ఎగరవచ్చు, కుక్కలు సింహాలను ఎదిరించవచ్చు. సంవత్సరంలో ఈ నగల వ్యాపారి మరణించవచ్చు, ఒక సంవత్సరం తరువాత మన దగ్గరడబ్బు లేకపోతే నగ నచ్చలేదని తిరిగి అతనికే ఇచ్చేయవచ్చు. సంవత్సరం తరువాత మనదే రాజ్యం అన్న నమ్మకాన్ని పెంచుకో అమ్మా మనకి మంచి జరుగుతుంది అన్నాడు.  వర్తకుడు తిరిగివచ్చేగడువు మూడు రోజులలోకి వచ్చింది. పెద్దరాణి ఆందోళన పడసాగింది. యువరాజు ధైర్యంగా ఉన్నాడు. పరిస్థితులలో ఏ మార్పు లేదు. రెండు రోజులలోకి వచ్చింది గడువు, పెద్దరాణి నగను వర్తకుడికి ఇచ్చేయడానికి సిద్ధపడింది ఇంతలో పిడుగులాంటి వార్త. రాజుగారిని హఠాత్తుగా కొంతమంది దొంగలు బంధించటం జరిగింది. యువరాజు ధైర్యంగా అడవికి వెళ్ళి, ఆ దొంగలను బంధించి, రాజును విడిపించాడు. రాజుగారు సంతోషించి యువరాజుకు రాజ్యం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. గడువు చివరిరోజు యువరాజుకి రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన అరేబియా వర్తకుడిని యువరాజు సాదరంగా ఆహ్వానించి, అతనికి నగకి ఇవ్వలసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉచితరీతిన సత్కరించి పంపాడు. ఏ పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పొగొట్టుకోకూడదు. నమ్మకమనే విశ్వాసాన్ని మించిన శక్తి లేదు. భవిష్యత్తు మనదేనన్న నమ్మకంతో జీవించాలి. పైన చెప్పుకున్న కథ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏ పరిస్థితులలో అయినా నమ్మకం, ధైర్యం కలిగి ఉన్నపుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేది. ఆ విషయం ఎప్పటికీ మరచిపోకూడాది.                                       ◆నిశ్శబ్ద.