Read more!

మొండిగా ఉన్న పిల్లలను మార్చడం కుదిరే పనేనా? ఇలా చేసి చూడండి!

మొండితనం పిల్లలలో చాలా సహజమైన విషయం. అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పెద్దల గారాబం పిల్లలను మొండివాళ్లుగా తయారుచేస్తాయి. ఇప్పటి తల్లిదండ్రులు ఒకప్పటి పిల్లలే.. అప్పటి బాల్యంలో చాలా విషయాలు కఠినంగా గడిచాయని  అలా తమ పిల్లలకు ఉండకూడదనే కారణంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద అతిప్రేమ, అతి గారాబం చేస్తారు. ఈ కారణంగానే ఇప్పటి పిల్లలలో మొండితనం తారా స్థాయిలో ఉంటుంది. ఎంతగా అంటే తల్లిదండ్రులే పిల్లల మాట వినేంత, పెద్దా చిన్న బేధం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడేంత.  ఇవన్నీ చూసి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో గొప్పగా మాట్లాడుతున్నారనుకుని మురిసిపోతారు. కానీ రానురాను అది పిల్లలలో మొండితనానికి, నిర్లక్ష్యానికి  ఎలా కారణం అవుతుందో తెలిసొస్తుంది. అయితే మొండిగా, నిర్లక్ష్యంగా ఉన్న పిల్లలను తిరిగి దారిలో పెట్టడం కుదురుతుందా అంటే.. కుదురుతుంది. అందుకోసం ఈ కింది టిప్స్ ఫాలో కావాలి.

చేతులారా చేస్తున్నారు..

తల్లిదండ్రులు బిజీ ఉన్న కారణంగా పిల్లలను ఏదో విధంగా సైలెంట్ గా ఉంచితే సరిపోతుందనే కారణంతో డబ్బు నుండి వారు అడిగిన ప్రతి వస్తువును వారి ముందు ఉంచుతారు. ఇలా అడగ్గానే అలా అన్నీ సమకూరుతుంటే పిల్లలు చాలా నిర్లక్ష్యంగా తయారవుతారు. ఆ తరువాత ఎప్పుడైనా వారు అడిగింది లేదంటే అరిచి గీ పెడతారు. ఏడుస్తారు. ఇంకా చెప్పాలంటే ఎమోనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి వారు అడిగింది వెంటనే సమకూర్చడం మాని వారికి అదెంత అవసరం, అసలు ఎందుకు అడుగుతున్నారు అనే విషయం మొదట ఆలోచించాలి. అదే విషయాన్ని పిల్లలకు చెప్పాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా అవసరమైనవి ఏంట్? అనవసరమైనవి ఏంటి? అనే విషయాలు ఆలోచించగలుగుతారు.

సమయం కేటాయించాలి..

ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలకోసం అన్నీ చేస్తున్నారు, వారికి సమయం కేటాయించడంలో మాత్రమే నిర్లక్ష్యంగా ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే ఈ నిర్లక్ష్యం మరింత ఎక్కువగా ఉంటుంది.  అదే పిల్లలకు సమయం కేటాయించి వారితో మాట్లాడటం, వారు చెప్పే విషయాలు వినడం, వారికి సరైన సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటే పిల్లలు మొండితనం మాని తల్లిదండ్రుల మాటకు, తల్లిదండ్రులకు విలువ ఇస్తారు. కావాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయంలో మొబైల్ ఫోన్ కూడా దూరం ఉంచవచ్చు.

మెచ్చుకోవాలి..

పిల్లలలో మొండితనం తగ్గించడానికి గొప్ప మార్గం మెచ్చుకోవడం. ఒక వ్యక్తిని దారిలో పెట్టాలంటే సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించాలని అంటారు. అయితే పిల్లలను దారిలో పెట్టడానికి వారిని మెచ్చుకోవడం, పొగడటం చేస్తే సరిపోతుంది. పిల్లలకు ఏదైనా పనిని అప్పజెప్పడం, ఆ పనులు పూర్తీ చేసిన తరువాత వారిని మెచ్చుకోవడం చెయ్యాలి. అదే విధంగా పిల్లలు ఏదైనా మంచి పని చేసినా, చదువులో, ఆటలలో, సామాజిక కార్యక్రమాలలో ఇలా ఏదైనా సరే మంచిగా రాణించినా వారిని మెచ్చుకోవడం, చిన్న బహుమతులు ఇవ్వడం చేస్తే వారి మొండితనం పోయి సంస్కారవంతులుగా మారతారు.

మార్గనిర్దేశం చెయ్యాలి..

పిల్లలకు మంచి, చెడు ఆలోచించే పరిణితి ఉండదు. వారికి అనిపించింది చేస్తారు, అలాగే వారికి కనిపించేది నిజమని అనుకుంటారు. మంచి చెడు, నైతికత మొదలైనవి పిల్లలకు అంతగా తెలియవు. వారికి తెలిసిందల్లా తమను ఆకర్షించే పనులు చెయ్యడం. అయితే తల్లిదండ్రులే ఈ విషయాల మీద అవగాహన పెంచాలి. మంచి, చెడు గురించి వివరించి చెప్పాలి. చెడ్డ పనుల వల్ల కలిగే నష్టాలు, మంచి పనుల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలి. ఇలా చేస్తే పిల్లలు  మంచిదారిలో ఉంటారు.

సృజనాత్మకత..

సృజనాత్మకత పిల్లలలో ఉండే ప్రతిభను బయటకు తీస్తుంది. పిల్లలను ఖాళీగా అస్సలు ఉంచకూడదు. ఏదో ఒక పని చేసేలా వారిని ప్రోత్సహించాలి. వారిలో ఉండే ప్రతిభను ప్రోత్సహించాలి. ఇది పిల్లలను మానసికంగా మెరుగ్గా ఉంచుతుంది. వారిలో ఆలోచనను, కష్టపడే గుణాన్ని, వారి ప్రవర్తనను అభివృద్ది చేస్తుంది.

                                                         *నిశ్శబ్ద.