Read more!

ప్రతిరోజూ తండ్రులు ఈ పనులు చేస్తే చాలు.. తరగతిలో పిల్లలు ఫెయిల్ అవ్వడమనే మాట వినబడదు!

తల్లిదండ్రులు పిల్లల జీవితానికి మూలస్థంభాలు. సాధారణంగా పిల్లల జీవితం ఎక్కువగా తల్లి సమక్షంలోనే గడిచిపోతుంది. ఉదయమెప్పుడో ఆఫీసు, ఉద్యోగమంటూ వెళ్ళిపోయే తండ్రి రాత్రెప్పుడో పిల్లలు నిద్రలోకి జారుకునే సమయానికి ఇంటికి చేరుకుంటాడు. అంత వరకు పిల్లలు అన్ని అవసరాల కోసం తల్లిమీదనే ఆధారపడతారు. అందుకే పిల్లలకు తల్లులతోనే అనుబందం ఎక్కువ. అయితే పిల్లల విషయంలో తండ్రులు కొన్ని పనులు చేయడం ద్వారా పిల్లలు తరగతిలో ఫెయిల్ అనే మాట వినబడకుండా చూసుకోవచ్చు.

చదువులో పాలుపంచుకోవాలి..

పిల్లలు హోం వర్క్ చెయ్యాలన్నా, తరగతి విషయాలు మాట్లాడాలన్నా అన్నీ తల్లితోనే.. కేవలం స్కూలు ఫీజు విషయమే తండ్రుల వరకు వెళుతుంది. అయితే పిల్లలు చదువుకుంటున్నప్పుడు, హోం వర్క్ చేస్తున్నప్పుడు తండ్రులు  సమయం గడపాలి. వారిసందేహాలు తీరుస్తూ, తండ్రుల ప్రమేయం పిల్లల చదువులో చాలా ప్రభావం చూపిస్తుంది. పరీక్షల దగ్గర నుండి  తరగతిలో సాధారణంగా జరిగే విషయాల వరకు అన్నీ తండ్రులు తెలుసుకోవాలి.  పిల్లలలో మేధోవికాసాన్ని ప్రోత్సహించే అంశాలపై తండ్రులు పిల్లలతో మాట్లాడాలి. ఇదివారిని టాపర్స్ గా మారుస్తుంది.

రోల్ మోడల్స్..

పిల్లలకు తమ తండ్రులు రోల్ మోడల్స్ లానూ, సూపర్ హీరోస్ లానూ అనిపించాలి. తండ్రి ప్రవర్తన, పనితీరు, జీవిత విలువలు, కుటుంబం, వృత్తి, బాధ్యతల విషయంలో అతని నిర్ణయాలు ఇవన్నీ పిల్లలను కూడా ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ చూసి పిల్లలు నైతిక విలువలు అలవాటు చేసుకుంటారు. జీవిత నైపుణ్యాలు పిల్లలలో అభివృద్ది అవుతాయి. అందుకే తండ్రులు కూడా వీలైనంత సమయాన్ని పిల్లలతో గడపాలి.

ఎమోషన్ కనెక్షన్..

తండ్రి పిల్లల మధ్య సంబంధం బయటకు గంభీరంగా కనిపిస్తుంది. ఆడపిల్లలు తండ్రితో చనువుగా ఉన్నట్టు మగపిల్లలు ఉండలేరని కూడా అంటారు. అయితే తండ్రులు జెండర్ తో సంబంధం లేకుండా పిల్లలతో ఎమోషన్ బాండింగ్ పెంచుకోవాలి.  తండ్రులు తమ పనిలో పిల్లలను భాగస్వామ్యం చేసుకుంటూ ఉంటే  అది పిల్లలలో మానసిక పరిపక్వతకు దారితీస్తుంది.  మరొక విషయం ఏమిటంటే పిల్లలు తండ్రుల సమక్షంలో చాలా ధైర్యంగా ఉండగలుగుతారు కూడా.

కమ్యూనికేషన్..

పిల్లలతో కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. వారిని ఎప్పుడూ భయపెడుతూ మాట్లాడటం సరికాదు.  పిల్లలు స్కూల్ అయినా ఇతర విషయాలు అయినా వారు చెప్పేటప్పుడు శ్రద్దగా వినాలి. వారి ఎమోషన్స్ ను అర్థం చేసుకోవాలి. చిన్న వయసులో పిల్లలు  పేరెంట్స్ తమకు సపోర్ట్ ఉంటారనే భావనలో ఉంటారు. అయితే అలా కాకుండా పిల్లలు మాట్లాడటానికి భయపడేలా తండ్రులు ప్రవర్తిస్తే పిల్లలు ఏ విషయాన్ని బయటకు చెప్పలేక లోలోపలే కుమిలిపోయి మానసికంగా డిస్టర్బ్ అవుతారు.

                          *నిశ్శబ్ద.