Read more!

అనంతమైన ప్రేమకు నీరాజనం!

◆వాలెంటైన్స్ డే◆ 


ఫిబ్రవరి నెల పేరు చెబితే ప్రేమికులందరికీ గుర్తొచ్చేది వాలెంటైన్స్ డే నే.. ఎల్లలు లేని ప్రేమను చాటి చెబుతూ ప్రేమికులందరూ ఒకరి ఎదుట మరొకరు ఆరాధకులు అయిపోతారు. ప్రేమ పిపాసులు ప్రేమిస్తారు, ప్రేమను స్వీకరిస్తారు ఈ ప్రపంచాన్ని ప్రేమ మయం చేస్తారు. అయితే అక్కడక్కడా వినబడే కొన్ని వార్తలు మనసును కలచివేస్తుంటాయ్. 


ప్రేమను కాదంటే దారుణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ క్రతువుల్లో కాలిపోతున్నారు. మరెందరో యువకులు ఆత్మర్పణ చేసుకుంటున్నారు. ఇలా చూస్తే ప్రేమకు అర్థం ఇదేనా అని కాస్త ఆశ్చర్యం వేస్తుంది.


ప్రేమంటే..


ప్రేమంటే బాధను పరిచయం చేస్తుందని ఎంతోమంది చెబుతారు. ప్రేమ మనిషికి ఇచ్చేది ఏంటి?? ధైర్యం, ఆప్యాయత, అనురాగం, నమ్మకం ఇవన్నీ ప్రేమ ఇస్తుంది. కానీ.. అవన్నీ విరిగిపోయి వీగిపోతే.. ప్రేమ కూడా వెలసిపోతుంది. ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎన్ని కావ్యాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ ప్రేమను బాధగా పరిచయం చేసి తరువాత సంతోషంతో ముగింపు ఇస్తాయి. కానీ నిజజీవితంలో సుఖమైన ముగింపు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే.. అందుకే ప్రేమ అంటే బాధ అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడిపోయింది.


ఇస్తున్నారా?? తీసుకుంటున్నారా??


ప్రేమను తీసుకోవడమే ఈ ప్రపంచంలో చాలా మందికి ఇష్టం. ఒకరికి ప్రేమను పంచడం కూడా ఇష్టమే.. కానీ ఆ పంచడం అనేది కూడా తమకు నచ్చినట్టు ఉంటుంది కానీ ఎదుటివారికి కావలసింది ఇవ్వడం, దాన్ని అర్థం చేసుకోవడం తక్కువ. కొందరు అయితే తాము ప్రేమను ఇస్తున్నాం కాబట్టి ఎదుటివారు తమకు ప్రేమను ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటారు. ఇలా ప్రేమను కూడా డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం?? 


ప్రేమ మీద ఒట్టేసి..


ప్రేమించేవాళ్ళందరూ ఒకటే మాట చెబుతారు. జీవితాంతం నీతోనే ఉంటాను అని, నువ్వే కావాలి అని, నిన్ను ఎప్పటికీ వదులుకోనని. కానీ ఈ మాట నీటి రాతలు అయిపోతాయి. ప్రేమ మత్తులో ఎన్నో చెప్పిస్తుంది. ఎన్నెన్నో బాసలు చేయిస్తుంది. కానీ.. నిజంగా ప్రేమ మీద ఒట్టేసి మీ ప్రేమను ఎప్పటికీ వధులుకోమని మీకు మీరు ఓసారి మాట ఇచ్చుకోండి..


ప్రేమ గురించి కవులు, సినిమాలు, కథలు, ఎన్నెన్నో జీవితాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇక మనం ప్రత్యేకంగా ఏమని చెప్పుకోగలం. ప్రేమను ప్రేమగా మనలోకి ఒంపుకోవడం, ప్రేమను మౌనంగా ఆరాధించడం.. ప్రేమను ఇవ్వడమే కానీ తిరిగి ఆశించకుండా ఒకానొక నిశ్చల సంద్రంలో నిశ్శబ్దంగా ప్రయాణించడం. ఇవి మాత్రమే మనం చేయగలం. మీ ప్రపంచంలో  ఉన్న ప్రేమకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.. ప్రేమతో.. ఆరాధనతో.. 


                                      ◆నిశ్శబ్ద.