Read more!

మంచి ఆలోచనలు ఎందుకు అవసరం? 

మనం మన శారీరక ఆరోగ్యానికి అవసరానికి మించి ప్రాధాన్యమిస్తాం. యాభై శాతానికి పైగా శారీరక వ్యాధులకు కూడా 'మనస్సే' కారణమని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది. అందుకే మన మనస్సును ఆరోగ్యంగా ఉంచడం ఎంతైనా అవసరం.

మనస్సుకు మంచి ఆహారం.. 

 శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో మనస్సు  ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉండడానికి మంచి ఆలోచనలు చేయడం అంతే అవసరం. అందుకే ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం  మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహం పెంచుకోవాలి.

చెడు ఆలోచనల్ని ఎలా ఎదుర్కోగలం?..

 మనస్సును కొంతసేపు పరిశీలిస్తే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు కూడా రావడం  చూస్తాం.  ప్రమేయం లేకుండానే చెడు ఆలోచనలు గొప్ప శక్తితో  దాడి చేయడం జరుగుతుంది. వీటిని ఎలా ఎదుర్కోవడమంటే..

ఒక బకెట్లో మురికి నీళ్ళున్నాయి. దాన్ని మంచి నీళ్ళతో ఎలా నింపగలం? బక్కెట్ పైన ఉన్న కుళాయి తిప్పి, మంచి నీటిని కాసేపు వదిలితే చెడు నీరు దానంతటదే బయటకు పోవడం   గమనించవచ్చు.

అదే విధంగా  చెడు ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా  మనస్సును మంచి ఆలోచనలతో నింపివేయాలి. దీనితో ఆ చెడు ఆలోచనలు వాటంతట అవే బలహీనమవుతాయి.

ఆలోచనలు ఉన్నతమైతే సమాజానికీ  మంచిదే..

మంచి ఆలోచనలు  తెలియకుండానే ఎక్కడో దూరంలో ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తాయి. మహాపురుషులు ఈ సమాజానికి దూరంగా ఏ కొండల్లోనో, గుహల్లోనో చేసిన ఒక గొప్ప ఆలోచన ప్రపంచమంతా తరంగ రూపంలో వ్యాపించి, కొన్ని వేలమందిని ప్రభావితం చేయగలదు. అందుకే ఈ రోజుల్లో తీవ్రవాదం, అశాంతి పెరుగుతున్నాయని  రోజులు తరబడి చర్చించే కన్నా ఉన్నతమైన ఆలోచనలు అనే శక్తివంతమైన బాంబులను నలువైపులా వేస్తే అవి సరైన సమయంలో విస్ఫోటనం చెంది ఈ సమాజంలో శాంతి కిరణాలను ప్రసరింపజేయగలవు.

ఆలోచనలే కార్యాలకు పునాది రాళ్ళు..

  ఒకే తల్లికి జన్మించిన సంతానంలో ఒకరు ఉన్నతమైన జీవితం గడిపితే మరొకరు నీచమైన జీవితం గడపడం  చూస్తున్నాం. భారతమాతకు జన్మించిన సంతానంలో కొందరు దేశానికై ప్రాణాలను అర్పిస్తే మరికొందరు దేశవినాశనానికి కారకులవుతున్నారు. ఈ వ్యత్యాసానికి కారణం  ఆలోచనలు వేరు కావడమే!

ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులను చేస్తే కొంత సమయానికి  మంచి పనులను చేయాలనే బుద్ధి దానంతటదే కలుగుతుంది.  చెడు చేద్దామనుకున్నా  మనస్సు అలా చేయనివ్వదు.  ఈ స్థితికి రావాలంటే క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి. ఈ విధంగా  ఉన్నతమైన ఆలోచనలతో మహోన్నతమైన కార్యాలను సాధించి దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్ళగలం.

                                            *నిశ్శబ్ద.