ఎదుటివారిలో ఈ గుణాన్ని గుర్తిస్తున్నారా?

జీవితం చాలా విలువైనది. చాలా అందమైనది. ఇటువంటి విలువైన నీ జీవితం పట్ల సమాజానికి మంచి సదభిప్రాయం వుండాలి. మనం మన వ్యక్తిగత విషయాల పట్ల ఎదుటివారి దృష్టిలో విలువలు సంపాదించాలి. జీవితంలో కష్టసుఖాలు లాభనష్టాలు అల్లుకుపోయి వుంటాయి. వాటిని అందుకుని తీరకతప్పదు. మన జీవితంలో వచ్చిన కష్టనష్టాలకు గల కారణాలను వాస్తవాలను గ్రహించాలి. మనకు వచ్చిన కష్టనష్టాలకు ఇతరులు బాధ్యులు అని వారిని నిందించకూడదు. వారే నీ కష్టాలకు బాధ్యులు అని నీవు వారి పట్ల అంచనా వేయకూడదు. ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సంపన్నుడు. అతనికి చాలా డబ్బు వుండేది. ఆ డబ్బంతా ఏమి చేయాలో అతనికి తోచక తన స్నేహితుడిని ఈ డబ్బంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఏదైనా సలహా ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టాలలో వున్నాడు. అతనికి నీవు డబ్బులు ఇస్తే అతను తన కష్టాలు తీరిన తరువాత వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇస్తాడు. నీకు నీ డబ్బు ఇంకా రెట్టింపు అవుతుంది. తరువాత రాబోయే తరాలకు కూడా నీ డబ్బు ఉపయోగపడుతుంది. అని సలహా ఇచ్చి నీవు కూడా ఆలోచించు నేను చెప్పిన సలహా సరి అయినది అని అనిపిస్తేనే నీవు ఈ పని చేయి అని చెబుతాడు.  స్నేహితుడు చెప్పిన సలహా సరైనది అని తన మనసుకు తోచింది. స్నేహితుడు చెప్పినట్లుగా అతను కష్టాల్లో వున్న ఆ వ్యక్తికి డబ్బును ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఇతనికి వడ్డీతో సహా డబ్బులను తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి డబ్బు రెట్టింపు అయ్యింది. అపుడు అతను స్నేహితుడిని మెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఇతనికి బిజినెస్ చేయాలని అనిపించింది. అపుడు మరల స్నేహితుడి సలహాను కోరతాడు. అప్పుడు స్నేహితుడు రొయ్యల బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజులు ఆ రొయ్యల బిజినెస్ మంచిలాభం వచ్చింది. ఇలా లాభం రావడానికి కారణం తన స్నేహితుడే అని అతడిని బాగా అభినందించాడు.  తరువాత కొన్ని రోజులకి, ఆ రొయ్యల బిజినెస్ కి సరైన సదుపాయం లేక నష్టం వచ్చింది. ఆ స్నేహితుడు వల్ల అతను చాలా లాభాలు పొందాడు. కానీ నష్టం వచ్చేటప్పటికీ, నా స్నేహితుడు వలన నేను ఈ రొయ్యల బిజినెస్ పెట్టాను. దీనికి కారణం నా స్నేహితుడే అని అతడిని నిందిస్తాడు, అవమానపరుస్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు లాభాలు వచ్చినప్పుడు మెచ్చుకున్నాడు. తనకు నష్టం వచ్చినప్పుడు మరల నన్ను నిందిస్తున్నాడు. ఎప్పుడూ ఈ వ్యక్తికి సలహా ఇవ్వకూడదు. ఇతను డబ్బుకు విలువ ఇస్తున్నాడు. మనిషికి మనిషిగా విలువను ఇవ్వడంలేదు. అని తన మనస్సులో అనుకుని అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడు.  ఇప్పుడు అతనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేరు. నేను నిందించడం వల్లే నా స్నేహితుడు నా నుండి వెళ్ళిపోయాడు అని బాధపడి అతనిలో వున్న చెడు అభిప్రాయాలను తొలగించుకుని మనిషిగా మానవతా విలువలను పెంచుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎవరి సలహా అయినా తీసుకున్నప్పుడు ఆ మనిషి చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. అలాగే ఆ మనిషి వలనే నీకు కష్టం వచ్చింది అంటే అందుకు నీవే బాధ్యుడవు. అతని వల్ల పొందిన లాభాన్ని గ్రహించాలి. అతని వల్ల వచ్చిన కష్టాన్ని నిందించకూడదు, మీలోని ఆలోచనా విధానాన్ని గ్రహించాలి, దాన్ని సరిచేసుకోవాలి.  ఎదుటివారు చెప్పారు కదా అని మీరు ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగానే చేసి, అందువల్ల ఏదైనా కష్టం వస్తే వారే బాధ్యులు అని ఎలా నిందించగలరు? మీరే ఆలోచించండి..... మనం మనిషిగా మానవత్వపు విలువలను సంపాదించాలంటే మొదట మనం ఎదుటివారిలో వున్న మంచిని గ్రహించాలి.                                          ◆నిశ్శబ్ద.

ముందు చూపు కావాలి

ఒకానొక సర్వే ప్రకారం విదేశాల్లో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు తమ జీవితకాల చివర్లో పిల్లలకు తమ పాత ఇంటిని ఇచ్చి పరమపదిస్తున్నారని, మన భారతదేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో మొదట పెళ్లి కాగానే సేవింగ్స్ మొదలు పెడతాడు, పిల్లలు అవ్వగానే వారి చదువు, ఖర్చులు గట్రా ఆర్థిక విషయాలలో మునిగిపోయి సేవింగ్స్ ను పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంతా చేసాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పెళ్లి కోసం మళ్ళీ ఖర్చులు అంటారు. ఇవన్నీ అయ్యాక ఓ సొంతింటి గూర్చి ఆలోచిస్తున్నారు. నిజానికి అప్పటికి ఆ వ్యక్తి వయసు అక్షరాలా అయిదు పదులు దాటిపోయి ఆరు పదులకు చేరువగా ఉంటుంది. మిగిలిన జీవితాన్ని ఓ సొంత ఇంట్లో సెటిల్ అయిపోయి మనుమళ్లను, మనుమరాళ్లను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా కాస్త కలిగిన కుటుంబాలలో మాత్రమే. మరి మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల్లో సీన్ ఇలాగేమి ఉండదు.  సంపాదన మొదలైన నాటి నుండి ప్రతి రూపాయిని లెక్క గట్టి ఖర్చు చేస్తున్నా మిగులు మాత్రం శూన్యం అనే చెప్పాలి. ఎందుకంటే చదువుతోనే అన్ని సాధ్యం అని నమ్ముతారు కానీ చదువు కూడా జీవితంలో భాగం అని అనుకోరు మనవాళ్ళు. అక్కడే వచ్చింది సమస్య అంతా. చదువు తప్ప ఏమీ తెలియని వాళ్ళు ఎలాంటి ఇతర పనులలో చేరలేక తల్లిదండ్రులకు భారంగా మిగులుతున్న యువతకు మన దేశంలో కొరత లేదని చెప్పవచ్చు.  బాల కార్మిక వ్యవస్థ నేరం కానీ, ఒక వయసు వచ్చాక పని చేయడం అనేది ఎప్పటికి నేరం కాదు. చాలామంది పనిచేస్తూ చదువుకోవడం అనేది ఒక వయసు పిల్లలకు ఆటంకం అని, వారు తమ లక్ష్యాలను చేరుకోలేరని అనుకుంటూ వుంటారు కానీ అలా పనిచేయడమే వారిని లక్ష్యం వైపుకు వెళ్లేలా చేయగలిగే ఉత్ప్రేరకాలు అని తెలుసుకోరు. విదేశాల్లో స్కూల్ విద్య పూర్తయ్యి కాలేజి విద్య మొదలవ్వగానే తమ పాకెట్ మని కోసం సొంతంగా పనిచేస్తూ చదువుకునేవాళ్ళు 90% మంది ఉంటారు. మనదేశంలో కూడా ఇలా పనిచేస్తూ చదువు సాగించినవారు గొప్ప స్థానంలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. పిల్లలు పుట్టగానే  జీవితమంతా వారికసమే కష్టపడి సంపాదిస్తూ, అంతా పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చుపెడుతూ, పిల్లలు పెద్దయ్యి, తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యే సమయానికి వాళ్లకు మిగిలేది కేవలం నెరిసిన జుట్టు, జీవితానుభవం మాత్రమే. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు వృద్ధులయ్యాక పిల్లల చేత గెంటివేయబడటానికి కారణం 90% ఆర్థిక భారం తగ్గుతుందనే అనే విషయం మరచిపోకూడదు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను ఉద్దరిస్తారనే ఆలోచనతో సర్వస్వం వాళ్ళ మీద ఆధారపడకూడదు.  అందుకే పెద్దవాళ్లకు ఒక పద్దు కావాలి. అదేనండి సంపాదన, ఖర్చు, పొదుపు వంటి విషయాల్లో తమకు కాసింత ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అలాగే పిల్లలకు కూసా సంపాదించడం ఎలాగో నేర్పించాలి. చదువు అనేది సంపాదన కోసం అని భ్రమ పడటం మొదట మనేయాలి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఎలాంటి పెద్ద చదువులు లేకుండానే జీవితాన్ని మొదలుపెట్టిన విషయం ఎవరూ మరచిపోకూడదు.  ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకో రిటైర్ అయ్యాక పెన్షన్ లు వస్తుంటాయి. మిగిలినవాళ్ళం ఎలా?? అనే సందేహం అసలు అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు 60 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ వచ్చేలా ఎన్నో పాలసీలు అందుబాటులో ఉంచుతున్నాయి. సంపాదన ఉన్నపుడు వాటిలో తమకు కాసింత సేవింగ్స్ చేసుకుని, వృద్ధులయ్యాక నెలకు తగిన గౌరవ ప్రధమైన పెన్షన్  తీసుకుంటూ సంతోషంగా వృద్ధాప్యాన్ని కూడా గడిపేయచ్చు.  జీవితంలో చివరికి వచ్చాక బాధపడటం కంటే ముందు జాగ్రత్త ఎంతో అవసరం కదా! దీన్ని జాగ్రత్త అనడం కంటే తమ జీవితానికి తాము భరోసా ఇచ్చుకోవడం అంటే ఇంకా బాగుంటుంది. నిజమేగా మరి! ◆వెంకటేష్ పువ్వాడ

డబ్బు లోకానికి వైద్యం!

ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి డబ్బు ఎంతో అవసరం. ఒకప్పటి కాలంలో మనిషి జీవితానికి ఇప్పటి మనిషి జీవితానికి తేడా గమనిస్తే కాలానుక్రమంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని ప్రాధాన్యతలు పెరిగాయి. మరికొన్ని తగ్గిపోయాయి. అలాంటి వాటిలో ప్రథమ స్థానంలో ఉండేది డబ్బు. ఒకప్పుడు డబ్బు మనిషి అవసరం. అంతకు ముందు కాలంలో డబ్బు అనేది అంతగా అవసరం లేకుండా ఉండేది. అన్నీ వస్తుమార్పిడి ద్వారా జరిగిపోయేవి. ఆ తరువాత కొన్నిటి విలువ పెరుగుతూ  ఉన్నప్పుడు, చాలా వస్తువులు అరుదుగా మారిపోయినప్పుడు వాటిని డబ్బుకు అమ్మడం ఆ డబ్బుతో అవసరం అయిన వేరేవి కనుక్కోవడం చేసేవారు. ఆ డబ్బును క్రమంగా పొదుపు చేయడం మొదలుపెట్టాకా వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతుండగా డబ్బు ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. అలా మొదలైన డబ్బు ప్రస్థానం నేడు డబ్బే లోకంగా బతుకుతున్న మనుషులను తయారుచేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నా, డబ్బెవరికి చేదు అన్నా అదంతా డబ్బును మనుషులు చూస్తున్న కోణం ఆధారంగా చెప్పిందే. అసలు ఎందుకింత ప్రాధాన్యత! మనుషులు కరెన్సీ కాగితాలలో తమ జీవితాలను మెరుగ్గా చూసుకోవడం మొదలుపెట్టాకా ఆ కాగితాల హవా పెరిగిపోయింది. క్రమంగా మనిషి కష్టాన్ని కూడా ఆ కాగితాలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా  శ్రమదోపిడి వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఇక ప్రస్తుతం గురించి చెబితే కాగితాల వల్లనే మర్యాద, గౌరవం కూడా పొందుతున్న వాళ్ళు, ఆ డబ్బు వల్లనే గౌరవం, మర్యాద ఇస్తున్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫలితంగా డబ్బు చుట్టూ లోకం తిరుగుతూ ఉంది,  చేస్తున్న తప్పులు? మనుషులు ఒక తప్పుకు అలవాటు పడిపోయారు. అదేంటంటే మనిషిలో ఆలోచనను విజ్ఞానాన్ని పెంపొందించే విద్యను ఆదాయవనరుగా మార్చడం ఒకటైతే, ఆ చదువుతోనే డబ్బు సంపాదన సాధ్యం అనుకునే ఆలోచన కూడా మరొకటి. నిజానికి పెరుగుతున్న అభివృద్ధి దృష్ట్యా మనిషి ఎన్నో రకాల రంగాలలో ఎన్నో విధాలైన శిక్షణలు తీసుకోవడం వల్ల ఆయా రంగాలలో అవకాశాలు పొందగలుగుతున్నారు. అయితే ఎటు తిరిగి దాన్ని వృత్తిగా కాకుండా మనిషి జీవితాలకూ, ముఖ్యంగా మానసిక బంధాలను కూడా డబ్బుతో పోల్చి చూడటం మాత్రం ఎంతో దారుణమైన విషయం. ఇప్పటి కాలంలో అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న  ఇలాంటి రక్తసంబంధాలు కూడా డబ్బు ముందు వెలసిపోతున్నాయంటే అది డబ్బు తప్పు కాదు మనిషి తప్పు అని అందరికీ తెలుసు.  మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి అని చెప్పే కొందరు కూడా ఆ డబ్బు ఉన్నపుడు ఒకలా అది లేనప్పుడు మరొకలా ఉండటం చూస్తే నవ్వొస్తుంది కూడా. సుమతీ శతకకర్త బద్దెన అంటాడు…. సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!! సిరి అంటే డబ్బు. ఆ లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం. ఆ డబ్బు కొబ్బరికాయలో నీళ్లు వచ్చి చేరినట్టు ఎంతో నిశ్శబ్దంగా వస్తుంది. ఆ తరువాత ఏనుగు వెలగపండు నోట్లో వేసుకుని లోపలి గుజ్జు ఎలా మాయం చేస్తుందో అలాగే డబ్బు కూడా వెళ్ళిపోతుంది.  డబ్బు వచ్చేవరకు ఎవరికీ ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. కానీ ఆ డబ్బు చప్పుడు అవ్వగానే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టే అవుతుంది పరిస్థితి. ఆ తరువాత డబ్బు అయిపోయాక కాళీ వెలగపండులా ఏమిలేకుండా అయిపోతుంది పరిస్థితి. మరి అలా వచ్చి మనిషిని వ్యామోహాలకు లోను చేసి ఆ తరువాత విసిరేసినట్టు చేసే డబ్బుకు మనుషులు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా?? అని ఆలోచిస్తే తమ పిల్లలకు డబ్బే లోకం కాదు ఈ లోకం ఎంతో ఉంది అని అనుభవపూర్వకంగా తెలియజేప్తు ఉంటే కుటుంబాలు బాగుంటాయి. డబ్బుకు కూడా విలువ ఇచ్చినట్టే.  నిజం!! డబ్బును ఆశించడం తప్పు కాదు కానీ, దాన్ని ఎలా వాడాలో అలా వాడుకున్న వాడికి ఆ డబ్బు కూడా  తన పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది. ◆ వెంకటేష్ పువ్వాడ.

జీవితంలో విజయం సాధించాలంటే విదురుడు చెప్పిన ఐదు నియమాలు ఇవే..!

మహాభారతంలో విదురుడు చాలా గొప్పవాడు.  ఆయన బుద్ది, తీక్షణత, ఆయన చెప్పిన నీతి  ప్రతి వ్యక్తి జీవితానికి గొప్ప మార్గనిర్దేశాన్ని ఇవ్వగలవు.  జీవితంలో ఎన్నో కఠినమైన సమస్యలను పరిష్కరించగలవు.  ఒక రాజుకు ఉండాల్సిన అన్ని యోగ్యతలున్నా విదురుడు రాజు కాలేకపోయాడు. మంత్రిగా, అన్నింటికి మించి శాస్త్రాలను,  నియమాలను, విలువలను ఒడిసిపట్టిన, వాటిని ఇతరులకు ఎలాంటి పక్షపాతం లేకుండా బోధించినవాడు విదురుడే.. విదురుడు చెప్పిన ఐదు నియమాలు పాటిస్తే జీవితంలో విజయానికి ఢోకా ఉండదు.. అవేంటో తెలుసుకుంటే.. మతాన్ని ఉల్లంగించే పనిని, శత్రువు ముందు తల వంచడం లాంటి పనిని ఎప్పుడూ చేయకూడదు. మరీ ముఖ్యంగా డబ్బు సంపాదించడం కోసం ఈ పనులను ఎప్పుడూ  చేయకూడదని విదురుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఇతరులను ద్వేషించేవాడు, కోపంగా ఉండేవాడు  తన జీవితం పట్ల ఎప్పుడూ  అసంతృప్తిగా ఉంటాడు.  ఎల్లప్పుడూ సందేహాస్పదంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అందువల్ల ఈ చెడు అలవాట్లను వీలైనంత త్వరగా వదిలివేయాలి. ఇతరులను  గౌరవించడం,  తిరిగి గౌరవాన్ని  పొందడంలో ఉత్సాహంగా లేని వ్యక్తి ఏ విషయాన్ని అంగీకరించేందుకు సుముఖంగా ఉండడు. అదే విధంగా అన్ని విషయాలలో  చాలా కోపంగా ఉంటాడు.  కానీ ఇతరులను గౌరవించడం, తను తిరిగి గౌరవాన్ని పొందే వ్యక్తి గంగానదిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతడినే విదురుడు  జ్ఞానవంతుడు అని నిర్వచించాడు. జ్ఞానవంతుల మాదిరిగానే విదురుడు మూర్ఖుల గురించి కూడా తన నిర్వచనం ఇచ్చాడు. ఇతరులు ఆహ్వానించకుండా లోపలికి వెళ్లేవాడు, అడగకుండానే మాట్లాడేవాడు మూర్ఖుడని, అతను నమ్మదగినవాడు కాదని కూడా విదురుడు చెప్పాడు. ఇలాంటివారు పెద్ద మూర్ఖులని పేర్కొన్నాడు. మోహము, క్రోధము, లోభము అనే మూడు విషయాలు  ఒక వ్యక్తికి నరకంతో కూడిన  బాధను  కలిగిస్తాయి. అంతేకాకుండా  ఇవి మూడు  వ్యక్తి నాశనానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల, వీలైనంత వరకు ఈ మూడింటికి దూరంగా ఉండాలి.                       *నిశ్శబ్ద.  

ప్రపంచానికి పరిచయమైన ఓ కొత్త పాత్ర బార్బీ..!

పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భారతదేశంలో బొమ్మల సాంప్రదాయం,  వాటి ఉనికి ఈనాటిదేం కాదు. దసరా పండుగలో బొమ్మల కొలువు ఒక ఎత్తైతే.. పిల్లలకు గొప్ప కాలక్షేపంగా బొమ్మల హవా అంతా ఇంతా కాదు. అయితే.. బొమ్మల  విషయంలో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపినది మాత్రం బార్బీ డాల్  అని సందేహం లేకుండా చెప్పవచ్చు. సాధారణ బొమ్మలు ఎన్నున్నా సరే.. బార్బీ డాల్ ఎవరిదగ్గరైనా ఉందంటే ఆ గొప్పదనమే వేరు. ప్రతి ఆవిష్కరణ వెనుకా ఓ  కథ, కాసింత చరిత్ర  ఉన్నట్టు బార్బీ డాల్ పుట్టుక వెనుక కూడా చరిత్రలో కొన్ని  పేజీలున్నాయి. అందులో ఉన్న విషయమేంటో తెలుసుకుంటే.. ఆడపిల్లల దగ్గర బొమ్మలంటూ ఉంటే వారిదగ్గర ఖచ్చితంగా బార్బీ డాల్ ఉంటుంది.  అయితే ఈ బార్బీ డాల్ చరిత్ర మాత్రం చాలా  ఆసక్తికరమైంది.  రూత్ హ్యాండ్లర్  బార్బీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆడవారికే ఈర్ష్య పుట్టేలా, అందరినీ ఆకర్షించేలా బార్బీ డాల్ రూపుగదిద్దుకుంది. పొడవాటి కాళ్లు, చేతులు, ఇట్టే ఆకర్షించే కళ్లు, ఒత్తేన జుట్టు.. ఇలా ఒక ప్రత్యేకమైన జర్మన్ బొమ్మను మొదటిసారి రూత్ హ్యాండ్లర్ చూశారు. దీన్ని చూసిన తరువాత దాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాలనే ఆలోచన పుట్టింది. అలాగే కేవలం బార్బీని  మాత్రమే కాకుండా 1961లో బార్బీకి జోడీగా  కేన్ అనే ఒక బాయ్ ఫ్రేండ్ ను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు.  బార్బీని ప్రపంచానికి పరిచయం చేశాక పిల్లల నుండి యువతుల వరకు ప్రతి ఒక్కరికీ బార్బీ వ్యక్తిగత స్నేహితురాలిగా మారిపోయింది.  ప్రతి ఒక్కరి దగ్గరగా బార్బీ తమతో ఉంటే బాగుండనే కోరిక కూడా బలపడింది.  ఇలా సంవత్సరాలుగా బార్బీ డాల్ ప్రజల మనసులను తన చుట్టూ తిప్పుకుంటోంది.  కాలంతో పాటూ బార్బీ కూడా కొత్తకొత్తగా తన రూపాలు మార్చుకుంది. రంగురంగుల దుస్తులు, వాటిని తలదన్నే జుట్టు, బోలెడు అలంకరణ వస్తువులతో మరెంతో కొత్తగా, అద్బుతంగా ముస్తాబై ప్రపంచం మీద తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుంది. ఈ ప్రత్యేకతకు గుర్తుగానే బార్బీ డాల్ ప్రపంచానికి పరిచయం అయిన రోజు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 9వ తేదీన నేషనల్ బార్బీ డాల్ డే ని జరుపుకుంటున్నారు. ఇది విదేశాల నుండి పరిచయం అయినదైనా భారతీయులకు కూడా ఎంతో దగ్గరైన బొమ్మ. భారతీయ సంస్కృతిని కూడా ఇముడ్చుకుని పిల్లలు, పెద్దలలో భాగమైపోయింది.  ఇక ఈ బార్బీ డే ప్రత్యేకంగా పిల్లలు ఈరోజున బార్బీ డాల్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. పిల్లలకు బార్బీ డాల్ చరిత్రను వివరించి చెప్పవచ్చు. కేవలం ఒక బొమ్మగా పరిచయమైన బార్బీ ప్రపంచానికి ఎంత స్పెషలో తెలియజెప్పి  వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత ప్రపంచాన్ని కొత్తగా ఎలా మారుస్తాయో ఉదాహరణగా బార్బీని వారికి పరిచయం చెయ్యవచ్చు.                          *నిశ్శబ్ద.  

నేటి యువత తెలుసుకోవలసిన ముఖ్య విషయమిదే!

శాంతి సమాజ సౌధానికి పునాదిరాళ్ళు నేటి యువతీ యువకులే! అలాంటి యువతరం నేడు మానసిక ఉద్రేకాలకు లోనై హింసా ప్రవృత్తి మార్గాన్ని అనుసరించడం బాధాకరం! ఈ రోజు సమాజంలో పాశ్చాత్య పోకడలు, భౌతిక ఆకర్షణలతో పాటు మరెన్నో పరిస్థితులు యువతను దారుణాలకు ఉసిగొల్పుతున్నాయి. ఇదే భావనతో కురుక్షేత్ర సమరంలో అర్జునుడు...  అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః | అనిచ్ఛన్నపి వార్డేయ బలాదివ నియోజితః ॥  'పరమాత్మా! మానవుడు పాపమాచరించేందుకు అసలు హేతువేమిటి? ఇష్టం లేకున్నా కూడా మనుష్యులు ఎవరో బలవంతంగా ప్రోత్సహించినట్లు పాపం ఎందుకు చేస్తున్నారు? పాపాచరణకు కారణం బాహ్యమా? ఆంతరంగికమా? అని శ్రీకృష్ణభగవానుడిని ప్రశ్నిస్తాడు అర్జునుడు. దీనికి సార్వకాలికమైన, సార్వజనికమైన విశ్లేషణతో ఆ జగదేకనాయకుడు అద్భుతమైన వివరణనిస్తాడు. రజోగుణం నుంచి పుట్టిన కోరిక, అది తీరనప్పుడు కలిగే క్రోధమే పాపం చేయటానికి ప్రధాన కారణాలని స్పష్టం చేస్తాడు భగవానుడు. ఈ రోజు కూడా మనం పరిశీలిస్తే 'తీరని కోరికలు; తీరకపోతే కలిగే కోపాలే' యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ రెండింటి వలన కలిగే పరిణామాలు, మనిషిని రాక్షసుడిగా మార్చేస్తున్నాయి. అందుకే మన సనాతన ధర్మం మనిషిలోనే ఉండి, మనిషికి శత్రువుగా మారి అతనిని నేరప్రవృత్తి వైపునకు మరలించే ఆరుగుణాలను 'షడ్-రిపు'గా అభివర్ణించాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు! ఇవన్నీ మానవుడు పుట్టినప్పటి నుంచీ మనస్సును ఆవరించి అల్లకల్లోల పరుస్తున్నా, వాటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా మన సనాతన ధర్మంలో విపులంగా సూచించారు. మనిషి తలచుకుంటే ఈ కామక్రోధాలను తన అదుపులో పెట్టుకోగలడు. ఇతర జీవజాతులకు ఆ అవకాశమే లేదు.  దురదృష్టవశాత్తూ ఆధునిక నాగరకతలో యువతీయువకులు మనస్సుకు ఈ రకమైన శిక్షణనివ్వటంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కింది నాలుగు అంశాల్లో తమ మానసిక సమతౌల్యాన్ని కోల్పోవటం వల్లే యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతటి నేరాలకైనా ఒడిగడుతున్నారు. అవి... మానసిక ఉద్వేగం (emotionality)  క్రియాశీలత (activity) ప్రచోదనం (impulsivity) సాంఘికంగా సర్దుబాటు (sociability)  ఒక కోరికవైపు మనస్సు మొగ్గుచూపగానే వెంటనే అది 'ఎమోషనల్' అయిపోతోంది. దానిని ఎలాగైనా తీర్చుకోవాలన్న తపన పెరుగుతోంది. ఈ సమయంలోనే ఆ కోరిక సక్రమమైందా? కాదా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాలి. తరువాతే మన క్రియాశీల, ప్రచోదక శక్తులను వినియోగించుకోవాలి. అప్పుడే మనస్సు సరైన దిశలో పయనించటం అలవరచుకుంటుంది. లేనట్లయితే, కనిపించిన ప్రతి కోరికనూ మనస్సు తీర్చుకోమంటుంది. ప్రలోభాలతో ప్రమాదంలోకి పడవేస్తుంది. ముఖ్యంగా మన నడవడిక, కామ, క్రోధాలు సమాజంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో ఆలోచించుకోవాలి.  పుట్టే  ప్రతి కోరికను తీర్చుకుంటూ దాన్ని సంతృప్తిపరచాలని ప్రయత్నించటాన్ని మించిన అమాయకత్వం మరోటి లేదు. అవి ఎంత తీర్చితే, అంతకు వందరెట్లు ఆవురావురుమంటూ వెంట పడతాయి. చివరకు మన పతనానికే కారణమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విశృంఖల ఇంద్రియవాంఛలే (unrestrained sensual desires) సభ్యసమాజంలో నేరధోరణికి ప్రధాన కారణం. అందుకే ఎక్కడో ఒక దగ్గర వాటికి భరతవాక్యం పలకాలి. అందుకే భగవద్గీతలాంటి ధార్మిక సారస్వతం 'వాంఛలను అణచుకోమని' చెప్పటం లేదు. వాటిని అధిగమించి ఉన్నతమైన అంశాలపైకి మనస్సును తీసుకువెళ్ళమంటోంది.                                     ◆నిశ్శబ్ద.

ప్రపంచం మీద మహిళల పతాకం.. మహిళా దినోత్సవం!

మహిళ లేకపోతే ఈ భూమి మీద ప్రాణిని నవమాసాలు మోసి  కనే మార్గం లేదు. ఆడవారికే ప్రత్యేకతను తీసుకొచ్చే అంశం ఇది. ఈ సృష్టిలో ఆడ, మగ అంటూ రెండు వర్గాలున్నా.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకం. కానీ పితృస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో తరతరాలుగా స్త్రీని ఒక శ్రామికురాలిగా చూస్తున్నారు. ఆడది అంటే భర్తకు సేవ చేయడం, పిల్లల్ని కనడం, ఇంటి పనులు చేయడం, భర్తకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం తీరడానికి తనొక మార్గమన్నట్టు, భర్తకు శారీరక అవసరం తీర్చే వస్తువు అయినట్టు ఇలా మహిళను ఎంతో దారుణంగా చూసేవారు. దీన్ని అధిగమించి మహిళలు ఈ ప్రపంచంలో తమకంటూ గుర్తింపు కోసం ఎంతో పోరాటం చేశారు. దీని ఫలితమే మహిళా దినోత్సవం.  ప్రతి సంవత్సరం, మార్చి నెల మహిళల చరిత్రను ఈ ప్రపంచమంతా గొంతువిప్పి చెబుతుంది. ఈ చరిత్ర  సమకాలీన సమాజంలోని సంఘటనలను మహిళల సహకారాన్ని అందరికీ తెలుపుతుంది.  మార్చి 8న ప్రజలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున వివిధ రంగాలలో మహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక - ఆర్థిక విజయాలను గురించి ప్రపంచానికి పరిచయం చేస్తుంది.   పక్షపాతం, వివక్ష లేని లింగ-సమాన ప్రపంచం కోసం మహిళా దినోత్సవం  పిలుపునిస్తుంది.  ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ ను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది థీమ్ ఎంబ్రేస్ ఈక్విటీ లేదా #ఎంబ్రేస్ ఈక్విటీ. "ఈక్విటీ అనేది కేవలం మాటల్లో కాదు, అది మహిళల జీవితాల్లో తప్పనిసరిగా ఉండాలి. లింగ సమానత్వం సమాజంలో భాగం కావాలి. IWD 2023 #EmbraceEquity ప్రకారం 'సమాన అవకాశాలు ఎందుకు సరిపోవు' అనే విషయం  గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేయడమే ముఖ్య ఉద్దేశం. మహిళా దినోత్సవ చరిత్ర.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో జరుపుకునేవారు.  ఐక్యరాజ్యసమితి పేర్కొన్న విషయాలు పరిశీలిస్తే.. "మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28, 1909న యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించబడింది.  దీనిని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా 1908లో న్యూయార్క్‌లో గార్మెంట్ కార్మికుల సమ్మె గౌరవార్థం అంకితం చేసింది.  మహిళలు కఠినమైన పని, అక్కడి పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 1917లో, రష్యాలోని మహిళలు ఫిబ్రవరిలో చివరి ఆదివారం (గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8న) "బ్రెడ్ అండ్ పీస్" నినాదంతో నిరసన, సమ్మెను చేశారు. వారి ఉద్యమం చివరికి రష్యాలో మహిళల ఓటుహక్కు చట్టానికి దారితీసింది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన చట్టం స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని  ధృవీకరించే మొదటి అంతర్జాతీయ ఒప్పందంగా ప్రకటించింది, అయితే 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మార్చి 8న మాత్రమే ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. తరువాత డిసెంబర్ 1977లో, జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు, అంతర్జాతీయ శాంతి కోసం మహిళా దినోత్సవాన్ని సభ్యదేశాలు సంవత్సరంలో ఏ రోజునైనా పాటించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చివరగా, 1977లోనే ఐక్యరాజ్యసమితి దీనిని ఆమోదించిన తరువాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ఆమోదించింది. ఇలా పలు మార్పులు చెందుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రూపుదిద్దుకుంది. మహిళా దినోత్సవం కేవలం సంవత్సరంలో ఒకసారి జరుపుకునే ముచ్చటగా, కేవలం ఆరోజు మాత్రమే మహిళలను గౌరవించే సందర్భంగా కాకుండా ప్రతిరోజూ మహిళకు తగిన గౌరవం, మహిళల పనికి తగిన గుర్తింపు కల్పించడం ఎంతో ముఖ్యం. మీ ఇంటి ఆడవారిని మీరు గౌరవించడం మొదలుపెడితే సమాజం ఆడవారిని గౌరవిస్తుంది. అలా ఒక బాధ్యతాయుతమైన ప్రపంచం ఆడవారి చుట్టూ పెనవేసుకుపోతుంది. ఈ ప్రపంచమంతా ఆడవారి సంకల్పశక్తి అనే పతాకం రెపరెపలాడుతుంది. మగవాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ఆడదాని విజయం వెనుక మగవారి అర్థం చేసుకునే మనసు ఉండటం ప్రధానం. సమకాలీన ప్రపంచంలో ప్రతి మహిళ జీవితం యుద్ధమే.. అలాంటి మహిళలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు అండగా నిలబడే పురుషులకు ఆనందోత్సవ శుభాకాంక్షలు.. మీ ఆడవారి విజయం మీకు ఆనందమేగా..                                       ◆నిశ్శబ్ద.

నమ్మకం ఎందుకు ముఖ్యం?

మనిషి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా విషయాలు నమ్మకంతో ముడిపడి ఉంటాయి. అయితే జీవితంలో లక్ష్యాలు సాధించే క్రమంలో నమ్మకం ఎందుకు అవసరం?అది ఎంత వరకు ముఖ్యం? దాని పాత్ర ఏమిటి? నమ్మకం అనేది మనమీద మనతో ప్రారంభం కావాలి. మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కొండల్ని సైతం పిండి చేయవచ్చు. మనం చేసే పనిపై పూర్తి నమ్మకం, శ్రమ, ఆలోచన అనేవి లేకుండా విజయాల్ని సాధించలేము. ప్రతి ఒక్కరు వారు చేసే పని చిన్నదైనా, పెద్దదైనా పరిపూర్ణతకోసం తపించాలి. ప్రతికష్టంలోనూ ఆనందం ఉంటుంది. ఉదాహరణకు నవమాసాలు మోసి ప్రసవవేదన తరువాత పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లి ఎంతో ఆనందపడుతుంది. తన కష్టాన్ని బాధల్ని పూర్తిగా మరచిపోతుంది. అదేవిధంగా ఏ పనిచెయ్యడానికైనా కష్టం తరువాత ఆనందం వస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉంటే మనం మన జీవితంలో దేనినైనా జయించవచ్చు. నమ్మకం అనేది లేకపోతే మనం ఏ పనిని ప్రారంభించలేము. విజయాల్ని సాధించలేము. చీకటి వెనకాల వెలుగు ఎలాగైతే వుంటుందో అలాగే కష్టం వెనకాల ఆనందం, ఫలితం ఉంటాయని తెలుసుకోవాలి. మనకు ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేయగలం కాబట్టి మనకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. ఏ పని చేస్తున్నా దానిలోని కష్టాన్ని, నష్టాన్ని కాక దానివల్ల లభించే ఫలితాలను గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే కష్టం, నష్టం గురించి ఆలోచిస్తామో అప్పుడే మనసు నిరాశలోకి జారుకుంటుంది. అదే మనిషిని లక్ష్యం నుండి వెనక్కి లాగుతుంది. కానీ అవేవి పట్టించుకోకుండా నమ్మకంతో పనిచేస్తే రాబోయే ఫలితం యొక్క ఆనందం కష్టాన్ని మరిపిస్తుంది. నేటికష్టం రేపటి ఆనందానికి పెట్టుబడి. అవుతుంది. సాధించగలమనే నమ్మకం ఉన్నప్పుడే ఆనందంగా కష్టపడగలం. సరైన ఆలోచనా విధానం కలిగి ఉండటం ప్రధానం మరి!! "ఏ లక్ష్యం లేకుండా తింటూ జీవించడం కంటే ఏదో ఒక లక్ష్యం కోసం చనిపోయినా ఫర్వాలేదు" అన్నారు ప్రముఖ కార్ల కంపెనీ తయారుదారు హెన్రీఫోర్ట్.  మనిషి తలచుకుంటే ఏ పని అయినా చెయ్యగలడు. అదేవిధంగా ఒక పనిని చెయ్యలేము అనుకుంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేము. ఈ మాటలలో వైరుధ్యం ఏమీ లేదు. చెయ్యగలము, చెయ్య లేము రెండూ కరక్టే. ఒక లక్ష్యంతో విజయం సాధించిన వారు విజయం సాధించడానికి కారణం తాము అనుకున్న పనిని చేయగలమనే నమ్మకం, విశ్వాసం కలిగి వుండటమే! లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలం కావడానికి కారణం వారిలో విజయం సాధిస్తామనే నమ్మకం లేకపోవడమే తప్ప వారిలో సమర్ధత లేకపోవడం కాదు.చాలామంది  అంటారు మేము కష్టపడ్డాము అని, మేము ప్రయత్నం చేసాము అని. కానీ నిజానికి ప్రయత్నం చేయడంలో, కష్టపడటంలో కాదు మనం గెలవగలమో లేదో, సాధించగలమో లేదో అనే భావాన్ని మనసులో ఏ మూలనో ఉంచుకోవడం వల్ల విఫలం అవుతుంటారు. మనమీద మనకు నమ్మకం ఉండాలి. మనని మనమే నమ్మకపోతే ఇతరులు మనల్ని ఎందుకు నమ్ముతారు? అందుకే మనని మనం పూర్తిగా పరిపూర్ణంగా నమ్మాలి. జీవితంలో నమ్మకమనేది ఉంటే ఏదైనా సాధించగలం. మనం చేసే ప్రతిపనిలో నమ్మకమనేది ఉండాలి. నమ్మకమనేది వుంటే విజయాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. నమ్మకం వెంటే విజయాలు వుంటాయి. నమ్మకం కలిగి ఉండటమే మన తొలి విజయం. ఇది నమ్మండి.                                          ◆నిశ్శబ్ద.

నేటి యువత రేపటి సూత్రధారి!

ఈ ప్రపంచంలో రేపు ఎలా ఉంటుంది అనేది యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉత్సాహం, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలే రేపటిని గొప్పగా ఉంచాలన్నా, అధఃపాతాళంలోకి నెట్టివేయలన్నా మూలకారణం అవుతాయి.  నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి యువత రేపటిని నడిపించే బాధ్యతాయుత సూత్రధారులు  అవుతారు. ప్రపంచం మొత్తం మీద జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే యువత ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం ఎంతో ముఖ్యమైనది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, ఉన్నత విద్యలు చదివినా ఉద్యోగ అవకాశాలు సరైనవిధంగా లేక మిగిలిపోతున్న యువత ఎందరో ఉన్నారు. అయితే యువతకు సరైన మార్గం చూపేందుకు ఈ ప్రపంచం కూడా కృషి చేస్తోంది. అంతర్జాతీయ యువ దినోత్సవ కర్తవ్యం అదే. తేడా!! చాలామంది యువ దినోత్సవం అని వినగానే అది వివకానందుడి జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం అని అనుకుంటారు. అయితే జాతీయ యువజన దినోత్సవానికి, అంతర్జాతీయ యువ దినోత్సవానికి మధ్య బేధాన్ని గుర్తించడం అవసరం. అంతర్జాతీయ యువ దినోత్సవం!! ఈ ప్రపంచంలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశకత్వం  అవసరమని, వారికి సరైన సలహాలు, సూచనలు దొరికితే ఈ ప్రపంచాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రపంచదేశాల అభిప్రాయం. దానికి అనుగుణంగానే 1999లో 54/120 అనుసరణ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు. కార్యక్రమాలు!! ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. అంతర్జాతీయ యువ దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు. యువత కోసం కొన్ని మాటలు!! స్వేచ్ఛ అనేది అడగాల్సినది కాదు అది ఎవరికి వారు తీసుకునేది అంటారు సుభాష్ చంద్రబోస్. యువతకు లభించే స్వేచ్ఛ వారిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఆ అభివృద్ధి దేశాన్ని కూడా ముందుకు నడిపించగలగాలి. యువతలో ఉండే విభిన్న ఆలోచనలను నిరుత్సాహ పరచకుండా వారిని ప్రోత్సహించాలి. యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే. భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.  చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం. కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.                                     ◆ నిశ్శబ్ద.

ఫ్యామిలీ ఫైటింగ్స్ ఇదిగో పరిష్కారం!

గొడవలు అన్ని చోట్లా ఉంటాయి. వృత్తుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, బయట ఎన్నో చోట్ల, ముఖ్యంగా పోటీ ప్రపంచంలో అయితే వాటిన్నింటికంటే భిన్నమైన గొడవలు ఏమిటంటే ఫామిలీ గొడవలు. భార్య, భర్త, పిల్లలు ఇట్లక్ వీళ్ళ మధ్య సాగే గొడవల వల్ల ఆ కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒకరు ఒకటి చెబితే ఇంకొకరు ఇంకొకటి చెబుతారు. తద్వారా భిన్న దృవాల్లా తయారవుతారు. చిన్న చిన్న గొడవలు కూడా చిలికి చిలికి గాలి వానా అయినట్టు అవుతుంటాయి. ఇలాంటి సమస్యలకు అన్నిటికి పరిష్కారం కావాలంటే ఇదే సరైన సమయం మరి.  విషయం! చాలా కుటుంబాల్లో విషయం ఇదీ అనే కారణం లేకుండా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. నిజానికి గొడవ పడకపోతే వాళ్లకు తోచదేమో అనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్లకు. కానీ ఆ అసంతృప్తులు ఎక్కడి నుండి వచ్చాయి అన్నది ఆయా కుటుంబాల్లో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు నువ్వు అది చేసావు, ఇది చేసావు అలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు, అది లేదు, ఇది లేదు ఇలాంటి వాటిని గురించే ఇంట్లో మాట్లాడుతూ ఉంటే అది ఆలోచించాల్సిన విషయమేనని గుర్తుపెట్టుకోండి.ఎందుకంటే ప్రతి కుటుంబంలో మనుషుల సంపాదన, ఖర్చులు, బాధ్యతలు, ప్రాముఖ్యతలు వంటివి అన్ని ఆ కుటుంబంలో వాళ్లకు తెలిసే జరుగుతాయి అలాంటప్పుడు అనవసర వాదనలు ఎందుకు అవసరం.  పోలికల తంటా.. శుభలగ్నం సినిమాలో పాట ఉంటుంది. పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు అని. అది మహిళల గోల అయితే అది  మాత్రమే కాకుండా కుటుంబంలో అందరూ తమకు ఇష్టమైన విషయాలను ఇట్లా పోలికలు చూపెడుతూ ఇంట్లో అందరిని పరస్పరం ఎత్తి చూపుకుంటూ ఉండటం వల్ల ఒరిగేది ఏముంటుంది అని ఆలోచిస్తే కలసికట్టుగా ఉండాల్సిన కుటుంబం తమలో తాము శత్రువులను వెతుక్కున్నట్టే అనిపిస్తుంది కదా!! నాలుగ్గోడలు దాటితే నవ్వులాట! నిజమే కదా!! చాలామంది అనుకుంటూ వుంటారు. చేసే పనులు అలాంటివి మళ్లీ బయటకు తెలిస్తే ఏమి. నిజమే చెబుతున్నాం కదా!! నిజమే మాట్లాడుతున్నాం కదా అని. కానీ కుటుంబం మీది అయినప్పుడు మీ కుటుంబాన్ని అందులో లోటు పాట్లను మీరే  నలుగురికి తెలిసేలా చేసి నలుగురికి ఎంటర్టైన్మెంట్ అయ్యి, నలుగురిలో ఫలానా కుటుంబం ఫూల్ అనుకునేలా చేయడం ఒకటే ఫైనల్ ఔట్ ఫుట్ అవుతుంది. కాబట్టి విషయం ఏదైనా మెల్లిగా చర్చించుకుని మెల్లిగానే పరిష్కరించుకుంటే ఎంత బాగుంటుంది. పిండి కొద్ది రొట్టె తృప్తి కొద్దీ జీవితం లేని దాన్ని ఆలోచిస్తే కలిగేది అసంతృప్తి. అందుకే ఉన్నదానీతో తృప్తి పడాలని పెద్దలు చెబుతారు.  ఆశ పడటం తప్పు కాదు కానీ దాని కోసం కష్టపడాలి అంతే కానీ ఇంట్లో వాళ్ళను సాధించడం మంచి పని కాదు.  ముఖ్యంగా కుటుంబ విషయాలను కుటుంబసభ్యులు మాట్లాడుకుని వాళ్లే అన్నిటినీ చక్కబెట్టుకోవడం మంచిది. బయట వ్యక్తుల ప్రమేయం ఎప్పటికీ మంచిది కాదు. మన కుటుంబం అనే భావన ఎప్పుడూ మనసులో పెట్టుకుని ఉండాలి. కుటుంబం బరువు కాదు బాధ్యత అని అనుకోవాలి. అందరూ ఒకరికోసం ఒకరు అన్నట్టు ఉండాలి. అలా ఉంటే దేవులపల్లి గారు చెప్పినట్టు మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అని అందంగా పాడుకోవచ్చు. పాడుకుంటారు కూడా. ◆ వెంకటేష్ పువ్వాడ    

ఒత్తిడిని దూరం చేసే మార్గాలు1

ఈ రోజుల్లో ఒత్తిడి లేనిది ఎవరికి? ఈ పోటీ ప్రపంచంతో పరుగులెత్తే జీవితంలో అందరూ ఒత్తిడికి లోనయ్యేవారే! కొంతవరకూ ఈ ఒత్తిడి అవసరమే కూడా! కానీ తలకెత్తుకున్న ఒత్తిడి ఓ పట్టాన దిగిరాకపోతే మాత్రం కష్టం. మనసుకి భారమైన ఒత్తిడితో శరీరానికి కూడా నష్టం. ఏ జీవితం కోసమైతే మనం ఇంతగా ఒత్తిడికి లోనవుతున్నాయో, ఆ జీవితాన్నే నరకంగా మార్చేసే రోగాలన్నీ ఒత్తిడితో వచ్చేస్తాయి. అందుకే అనవసరమైన ఒత్తిడిని నివారించుకునేందుకు, తరుణోపాయాలను కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఇవిగో... రాసుకుని పక్కన పెట్టేయండి! చిత్రంగా అనిపించినా, ఈ చిట్కా తప్పకుండా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మనం ఏదన్నా సమస్యని ఎదుర్కొన్నప్పుడు దాని గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాము. దాని పరిష్కరించడం కోసమో, దాన్నుంచి బయటపడటం కోసమో మన మెదడు తెగ వేడెక్కిపోతూ ఉంటుంది. అందుకనే ఇక ఈ సమస్య గురించి ఇప్పుడు, ఇంతకుమించి ఆలోచించి ఉపయోగం లేదనుకున్నప్పుడు దాన్ని ఒక చోట రాసుకుని పక్కన పెడితే సరిపోతుంది. ఆ సమస్యను మర్నాడు చూసుకుంటే సరిపోతుంది. అంకెలూ పనిచేస్తాయి అంకెలు లెక్కపెట్టడం అనే ఆలోచన పాతచింతకాయ పచ్చడిలా కనిపించవచ్చు. కానీ ఒకో అంకె లెక్కపెట్టేకొద్దీ మరింత నిదానంగా ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియను జోడిస్తే, ఒత్తిడి ఇట్టే మాయమవుతుందట. అలా నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువు చేరుతుంది. దీని వల్ల రక్తపోటులో అప్పటికప్పుడే మార్పులు గమనించవచ్చునంటున్నారు వైద్యలు. ఇలా పీల్చుకునే ఊపిరిని నోటి ద్వారా వదలడం వల్ల మరింత ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఊహకు రెక్కలివ్వండి ప్రకృతికీ ప్రశాంతతకూ అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి కళ్ల ముందుంటే తల్లి ఒడిలో ఉన్నంత భరోసా ఉంటుంది. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు వీలైతే కాస్త పచ్చని వాతావరణంలో తిరిగేందుకు ప్రయత్నించండి. అదీ కాదంటే కిటికీలోంచి బయట ఉన్న ప్రకృతిని గమనించండి. అది కూడా వీలుకాకపోతే, ఒక్క నిమిషం కళ్లు మూసుకొని మీరు ప్రకృతి ఒడిలో ఉన్నట్లు భావించుకోండి. కొండలూ, మబ్బులూ, జలపాతాలూ, పక్షులూ, చెట్లూ... అన్నీ మీ కళ్ల ఎదుటే ఉన్నట్లుగా ఊహించుకోండి. మీలోంచి ఒత్తిడి ఎలా మాయమవుతుందో చూడండి! కండరాలకు విశ్రాంతినివ్వండి! మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కూడా ఒత్తిడికి లోనవుతుంది. కండరాలన్నీ బిగుసుకుంటాయి. తల భారంగా మారిపోతుంది. కండరాలను బిగించి వదలడం, మెడని అటూ ఇటూ తిప్పడం వంటి చిన్నపాటి వ్యాయామాలతో శరీరం కాస్త తేలికపడుతుంది. చేతులకీ, మెడకీ చేసుకునే చిన్నపాటి మసాజ్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఏదన్నా యోగాసనంలో కాసేపు కూర్చునే అలవాటు ఉన్నా ప్రయోజనమే! నీటిలో గడపండి నీటికీ మన శరీరానికీ అవినాభావ సంబంధం ఉంది. నీరు తగలగానే మన శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకనే స్నానమో, కాళ్లూ చేతులూ కడుక్కోవడమో చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మొహం మీద నీళ్లు చల్లుకోవడం, షవర్ కింద కాసేపు నిల్చోవడంతో మనసు తేలికపడుతుంది. ఇంకా మాట్లాడితే ఈత కొట్టే అవకాశం, అలవాటు ఉంటే కనుక ఒత్తిడి ఆ ఈతకొలనులోనే మాయమైపోతుంది. ఒత్తిడి అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి ఎవరి అనుభవానికీ, ఆలోచనకూ తగినట్లుగా ఒత్తిడిని నివారించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు తమకి ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఒత్తిడిని మర్చిపోతే, మరికొందరు కాసేపు స్నేహితుల మధ్య గడిపి ఒత్తిడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎవరు ఏ పద్ధతిని అనుసరించినా, ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం మాత్రం... మనకూ, మన కుటుంబానికీ చాలా అవసరం!    

జీవితం బంగారుమయం కావాలంటే ఈ సూత్రాలు తప్పనిసరి!

భగవద్గీత మనకు జీవిత పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎలా ఉండాలో భగవద్గీత నుండి నేర్చుకోవాలి. మెరుగైన జీవితం కోసం భగవద్గీతలోని ఏ సూత్రాలను మనలో మనం పాటించాలో తెలుసా? భగవద్గీత యొక్క ఈ బోధనలు ఖచ్చితంగా మన జీవితానికి వెలుగును నింపుతాయి. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాలను వివరిస్తుంది. భగవద్గీతలో మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాలను మనం చూడవచ్చు. గీతలో ఇవ్వబడిన బోధనలు నేటికీ సమానంగా ఉన్నాయి. ఈ బోధనలు మనిషి జీవించడానికి సరైన మార్గాన్ని చూపుతాయి. గీతా బోధలను జీవితంలో అలవర్చుకుంటే మనిషి ప్రగతి పథంలో పయనిస్తాడు. మనిషి జీవన విధానాన్ని బోధించే ఏకైక గ్రంథం గీత. భగవద్గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ అనే పాఠాన్ని బోధిస్తుంది. శ్రీమద్ భగవద్గీత జ్ఞానం మానవ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గీత జీవితం యొక్క మొత్తం తత్వశాస్త్రం, దానిని అనుసరించే వ్యక్తికి ఉత్తమమైనది. గీతలోని అమూల్యమైన బోధనల గురించి తెలుసుకుందాం. మంచిగా ఉండు: ప్రతి వ్యక్తి మంచితో మంచిగా, ఉండాలని భగవద్గీత చెబుతోంది. అయితే, గీతలో చెడ్డవారిలో చెత్తగా ఉండకూదని పేర్కొంది. వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు కానీ మట్టితో మురికిని శుభ్రం చేయలేమని శ్రీ కృష్ణుడు చెప్పాడు. అందుకే నీ నైతికతను, ఆలోచనలను ఎప్పుడూ అలాగే ఉంచుకోవాలి. ఈ 5 లక్షణాలను అలవర్చుకోండి: గీతలో, శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన ఐదు లక్షణాలను పేర్కొన్నాడు. భగవద్గీత ప్రకారం, ప్రతి వ్యక్తి శాంతి, సౌమ్యత, నిశ్శబ్దం, స్వీయ నియంత్రణ, స్వచ్ఛత వంటి వాటిని కలిగి ఉండాలి. ఈ ఐదు విషయాలు జీవితాన్ని క్రమశిక్షణగా ఉంచుతాయి. శ్రీ కృష్ణుడి ప్రకారం, ప్రతి వ్యక్తి ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండాలి, అప్పుడే అతను సరైన మార్గంలో నడవగలడు. మంచి పని చేయండి: ప్రతి వ్యక్తి  భవిష్యత్తు అతని పూర్వ కర్మల ఫలితమని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఈరోజు మనం చేసేదే మన రేపటిని నిర్ణయిస్తుంది. అందుకే సదా సత్కార్యాలు చేయాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: ఒక వ్యక్తి  విధిని ఎవరూ మార్చలేరు, కానీ మంచి స్ఫూర్తిని అందించడం ద్వారా ఒక వ్యక్తికి మార్గనిర్దేశం చేయగలరని గీత పేర్కొంది. శ్రీ కృష్ణుడి ప్రకారం, మీకు జీవితంలో ఎప్పుడైనా అవకాశం వస్తే, రథసారథిగా మారడం స్వార్థం కాదు. గర్వం పక్కన పెట్టాలి: శ్రీ కృష్ణుడి ప్రకారం, అహం మనిషిని అన్ని పనులను చేయిస్తుంది. అది అంతిమంగా అతని నాశనానికి దారి తీస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదు. సంతోషకరమైన జీవితం కోసం, మీరు వీలైనంత త్వరగా మీ అహాన్ని వదిలివేయడం అవసరం. కర్మను కర్మఫలం: శ్రీ కృష్ణుడి ప్రకారం, కర్మ అనేది ఒక వ్యక్తి ప్రతి పరిస్థితిలో స్వయంగా ఎదగడానికి పొందవలసిన ఫలం. కాబట్టి ఎప్పుడూ మంచి విత్తనాలు వేస్తే పంట బాగా పండుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతస్థాయిలో ఉండాలంటే పైన పేర్కొన్న విషయాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయపథంలో దూసుకుపోతారు. జీవితం బంగారుమయం అవుతుంది. 

కష్టనష్టాలు చూసి దిగులుపడుతున్నారా?

జీవితం అనేది సుఖదుఃఖాల కలయిక. మనం సుఖాన్ని ఎలా అనుభవిస్తామో, దుఃఖాన్ని కూడా సహించగలిగి ఉండాలి. జీవితాన్ని అన్ని కోణాలలో పరిశీలిస్తే జీవన సంబంధాల విలువ, ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. కానీ ఈ విషయం అర్ధం చేసుకోకుండా చాలామంది సంతోషాలు, సుఖాలు మాత్రమే కావాలని అనుకుంటారు. అది చాలా పొరపాటు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి.  మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి చీకటి వెలుగులులాంటివి. చీకటి తరువాత వెలుగు, వెలుగు తరువాత చీకటి ఇలా ఒకదాని తరువాత ఒకటి ఎలాగ వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూపోతూ ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించ కూడదు. కష్టం వచ్చినప్పుడు బాధపడి, సుఖం వచ్చినప్పుడు ఆనందించకూడదు. కష్టసుఖాలను సమానంగా అనుభవించే గుణాన్ని కలిగి ఉండాలి. ఇలా కష్టసుఖాలను సమానంగా చూసే స్వభావం ఉన్నవారు అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడగలరు.  ముఖ్యంగా ఓటమికి వెనకడుగు వేయడం, కష్టాలు వచ్చినప్పుడు భయపడటం వంటి స్వభావం తగ్గిపోతుంది. రెండింటిని సమానంగా చూడటం నేర్చుకుంటే. అప్పుడే మనిషి తన జీవితంలో ఎదగగలడు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా అశాశ్వతమైన విషయాలపై మోజు పెంచుకొని జీవన సమరంలో అలసిపోతున్నారు. నిరంతరం అశాంతి, ఆందోళనలు, అలజడుల మధ్య మనిషి జీవితం కొనసాగుతుంది. మనిషికి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అయినా సరే వాటికోసమే పోరాటం సాగించి జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాడు. జీవితంలో పోరాటం అనేది ఉండాలి. ఎందుకంటే జీవితమంటేనే పోరాటం, పోరాటంలోనే ఉంటుంది జయం అన్నారు. అంతేకానీ జీవితాన్నే పోరాటంగా చేసుకోకూడదు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సంఘటనలు, జ్ఞాపకాలు, అనుభూతులు, సామాజిక బంధాలు జీవితంలో పెనవేసుకు పోతాయి. విజయవంతమైన, ఫలప్రదమైన జీవితం గడపటానికి ఈ బంధాలు, వాటి మధ్య పటిష్టత చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో జీవితం వేగవంతం కావటం,  తీరికలేని పరిస్థితి, పట్టణాలలో స్థిరపడటం, ప్రవాస జీవితం మొదలైన కారణాల వల్ల మనుషుల మధ్య బంధాలు బలహీనంగా ఉన్నాయని చెప్పవచ్చు.  పూర్వకాలంలో పండుగలు, పుణ్యకార్యక్రమాలకు కుటుంబ సభ్యులు అందరూ సమావేశమయ్యేవారు. కష్టసుఖాల గురించి చర్చించుకొనేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో తగ్గిపోతున్నాయి. ఫోనులలో పలకరించటం, తమకు తీరికలేదని చెప్పటం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రకంగా అనుబంధాలలో స్వచ్ఛత లోపించటం కనిపిస్తుంది. జీవితం అనేది చాలా విలువైనది. మన విలువైన జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది సమర్ధనీయం కాదు. ఎందుకంటే చాలామంది యువకులు, గృహస్తులు తాత్కాలిక భావోద్వేగాలకు లోనయి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. జీవితం విలువ తెలుసుకున్నవారు మాత్రమే జీవితాన్ని అర్ధం చేసుకుంటారు. ఆర్ధిక బాధలు, ప్రేమ విషయాలలో విఫలం కావటం, అవమానం, మానసిక ఒత్తిడి, తీవ్ర అనారోగ్యం, అనుకున్నవి జరగలేదనే తీవ్ర ఆవేదన, డిప్రెషన్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జీవితానుభవం ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి.                                         ◆నిశ్శబ్ద.

బహుమతులు ఇలా ఇవ్వండి!

చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు, ఆత్మీయులు, పిల్లలు, భాగస్వామి, తోడబుట్టినవాళ్ళు, తల్లిదండ్రులు ఇలా ప్రతి మనిషి జీవితంలో బోల్డు రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ లో కొన్ని ఘాడమైన బంధాలు, మరికొన్ని ఎదో అట్లా తెలిసిన వాళ్ళలా సాగిపోయే బంధాలు. మొత్తానికి ఇట్లా ఎందరితోనో అటాచ్మెంట్ ఉన్నపుడు వారి వారి జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు వస్తుంటాయి. ఆయా సందర్భాలలో ఇష్టంగానో, మొహమాటంగానో, బాద్యతగానో బహుమానాలు ఇస్తూ ఉంటారు. అయితే చాలామంది ఈ బహుమతుల విషయంలో ఎంతో ఉదాసీనంగా ఉంటారు. కానీ బహుమతులు ఇవ్వడంలో కాస్త ఆసక్తి ఉండాలే కానీ చిన్న చిన్న బహుమతులు, చిన్న సందర్భాలు కూడా ఎంతో గొప్ప జ్ఞాపకాలు అవుతాయి అవతలి వారి జీవితంలో. అలాగే బహుమతి ఇచ్చిన వారు కూడా ఎంతో బాగా గుర్తుండిపోతారు, ఒకానొక ఆప్యాయతా బీజం మొలకెత్తి అది రానురాను పెరుగుతూ బలపడుతుంది. అయితే అందరికీ కావాల్సింది ఇలా బహుమతులు విషయంలో కాసింత అవగాహన మాత్రమే!!  కాగితాల గోలలు వద్దు! చాలామంది పెళ్లి, పుట్టినరోజులు, గృహప్రవేశాలు మరింకా ఇంకా ఏవైనా శుభసందర్బాలకు పిలిచినపుడు 90% మంది చేసే పని ఒక గిఫ్ట్ కవర్ లో వంద నుండి తమకు తోచినంత డబ్బును పెట్టేసి, దాని మీద పేరు రాసి ప్రెజెంటేషన్ గా ఇచ్చేయడం. అయితే అలా ఇచ్చిన డబ్బు ఆ కవర్ తీసేయగానే గుంపులో గోవిందలాగా కలసిపోతుంది. ఆ డబ్బు స్వరూపమే మారిపోతుంది. దానికంటూ ఒక గుర్తింపు లేకుండా పోతుంది. సాదారణంగా కొందరు అలా ప్రెజెంటేషన్ లు రూపంలో వచ్చిన డబ్బుతో ఇంట్లో వాడుకోవడానికి గుర్తుగా మంచి వస్తువు తీసుకుంటూ ఉంటారు. కానీ మరికొంతమంది వాటిని బీరువాలో పెట్టి ఏదో అలా వాడేస్తారు. అప్పుడు మీరిచ్చిన భజమతి ఏమైంది అంటే ఏమో!! బహుమతి ఇచ్చేసాక ఇక దాని గూర్చి మాకెందుకు అనుకునే అభిరుచి లేనివాళ్లకో మాట. కూసింత కళా పోషణ ఉండాలి కదా!! మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా!! అందుకే మరి కాగితాల ప్రెజెంటేషన్ లు వద్దు. మరింకెమి ఇవ్వాలి? డబ్బు ఖర్చుపెట్టుకునే సామర్త్యాన్ని బట్టి బహుమతులను కూడా వర్గాలుగా విభజించవచ్చు. అలాగే అవతలి వారి వయసును బట్టి, వారి గురించి కాస్తో కూస్తో ఉన్న అవగాహనను బట్టి ఇవ్వచ్చు. బట్టలు ఇవ్వడం రొటీన్ కానీ అందులోనూ ప్రత్యేకత చూపించచ్చు. అవతలి వాళ్లకి నచ్చిన రంగు తెలుసుకుని వయసులో ఉన్నవాళ్లకు అయితే కాస్త ట్రెండ్ కు తగ్గట్టూ, పెద్దవాళ్లకు అయితే సాంప్రదాయంగా ఉండేలా ఇవ్వచ్చు.  ప్రతి మనిషి జీవితంలో అవసరమైన వస్తువులు కొన్ని ఉంటాయి. వయసును బట్టి వాటి ప్రాధాన్యత ఉంటుంది. అంతే కాదు అవతలి వాళ్ళ అభిరుచులను బట్టి కూడా బహుమతులు ఇవ్వచ్చు.  డాన్స్ బాగా చేసేవాళ్లకు అయితే వాళ్లకు నచ్చిన పాటలున్న cd, మంచి కలెక్షన్ ఉన్న డాన్స్ వీడియోస్, అలాగే వాళ్లకు కంఫర్ట్ గా ఉండే దుస్తులు, రాసే అలవాటు ఉన్నవాళ్లకు పెన్ను, వాళ్ళు రాసేవి అన్ని ఒకచోట పొందిగ్గ రాసుకోడానికి అందమైన పుస్తకం, సినిమాలు అంటే అభిరుచి ఉన్న వాళ్లకు నచ్చిన నటుడి/నటి సినిమా కలెక్షన్ ఉన్న పెండ్రైవ్, లేదా cd. ఇంకా రీడింగ్ లాంప్, వాచ్, మంచి పుస్తకాలు, మంచి కళ్ళజోడు ఫ్రేమ్ లు, షూస్, అమ్మాయిలకు అయితే తెగ నచ్చే కాళ్ళ పట్టీలు(వెండే అక్కర్లేదు. కాస్త ఫాషన్ గా ఉన్నవి బోల్డు అందుబాటులో ఉంటాయి షాప్స్ లో. అవి ఎప్పుడన్నా వేసుకోవడానికి స్టైలిష్ గా ఉంటాయి). ఇంకా ఫ్రెండ్స్ ను ఎంకరేజ్ మరియు ఆరోగ్యంగా ఉంచే ఫిట్నెస్ పరికరాలు. ముఖ్యంగా చూసుకోడానికి వెయిటింగ్ మిషన్ ఇలాంటి….. పెద్దవాళ్లకు హాండ్ స్టిక్, హెల్త్ కిట్స్ లో ఉండే షుగర్, బిపి చెకప్ మీటర్స్, మంచి నడకకోసం మెత్తటి చెప్పులు, అలాగే కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలా కుర్చీ, బల్ల, ఆర్థిక స్థాయిని బట్టి పడుకోవడానికి ఏర్పాట్లు. పెద్దల ఆసక్తిని బట్టి ఆధ్యాత్మిక గ్రంధాలు.  ఇక సాధారణ పరిచయస్తులకు అయితే ఇంటి ఉపకరణాలు. కాఫీ కప్, డైనింగ్ కిట్, దేవుడి గదిలో అందంగా ఉంచుకునే వస్తువులు. కిచెన్ లో అవసరమయ్యేవి, ముఖ్యంగా ఇప్పట్లో ఆన్లైన్ స్టోర్ లలో తక్కువ ధరలతో మంచి వస్తువులు దొరుకుతున్నాయి, అవి మాత్రమే కాకుండా చైనా బజార్, సూపర్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఇంటి ముఖద్వారంలో తోరణాలు, వాల్ హంగేర్స్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు.  అన్నిగి కంటే ముఖ్యమైనది అవతలి వారు వెతికి ప్రాధాన్యం ఇస్తారు తెలుసుకోవడం. ఇది తెలుసుకోవడానికి పెద్ద కష్టపదక్కర్లేదు సాధారణ మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి బహుమతులు ఇచ్చేటప్పుడు మీదైన మార్క్ చూపించండి.  ◆ వెంకటేష్ పువ్వాడ

పరీక్ష కాలాన్ని పరుగులు పెట్టించండి ఇలా!

క్లాస్ రూమ్ కురుక్షేత్రంగా మారిపోయే సమయం ఆసన్నమైంది. ఏడాదంతా పడ్డ శ్రమకు ఇది నిజంగా 'పరీక్షా' సమయమే. ఆ రోజు అర్జునుడు బాధతో యుద్ధమంటే విముఖత చూపాడు . అందుకే 'క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప..” అంటాడు కృష్ణుడు, అర్జునిడితో. ముందు మనసుని దృఢపరచుకోమంటాడు. కాని ఇప్పుడు మనం పరీక్షల భయంతో ఆందోళన పడుతున్నాం. ఇలాంటి సమయంలో మనలోనే కృష్ణుడి లాంటి 'మోటివేటర్' మేల్కొనాలి. ధైర్యంగా పరీక్ష రాయించాలి... పాస్ చేయించాలి. అందుకు మానసికంగా కొంత యోగం... సాధనా యాగం అవసరం. అందుకే నాలుగు అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటే మనం విజయం సాధించనట్లే.. అవి నిర్భయం... పఠనం... మననం... లేఖనం  నిర్భయం... ముందు నిర్భయంగా నిలబడండి. కురుక్షేత్రంలో అర్జునుడు వెనకడుగు వేసినప్పుడు కూడా కృష్ణుడు చెప్పిందిదే. 'క్షుద్రం హృదయ దౌర్బల్యం..' అన్నాడు. ఎల్కేజీ నుంచి మనకు పరీక్షలేమీ కొత్తకాదు. గతంలో పరీక్ష ముందు మీరు పడ్డ ఆందోళనను గుర్తుచేసుకోండి. పరీక్ష రాశాక ఆ ఆందోళనకు ఎంత నవ్వుకున్నారో మననం చేసుకోండి. ఆ పరీక్షలకు ఈ పరీక్ష కూడా భిన్నమైందేమీ కాదు. మనం ఎప్పుడైతే భయం వీడి ప్రశాంతంగా ఉంటామో, మన మెదడు నిర్మలంగా పనిచేస్తుంది. కిచెన్లో నుంచి ఏది అడిగితే అది ప్రేమతో ఇచ్చే అమ్మలా మనం చదివి దాచుకున్న జవాబులన్నింటినీ మెదడు సజావుగా పరీక్షగదిలో సరఫరా చేస్తుంది. 'భయమే మరణం... నిర్భయమే జీవితం...'. కాబట్టి ముందు ధైర్యంగా ఉందాం. పఠనం... ముందు పరీక్ష కోసమే పఠనం అన్న భావనను విడనాడాలి. జ్ఞాన సముపార్జనలో పరీక్షలు చిన్న మజిలీయే. పరీక్షాపత్రమే పూర్తి చదువు కాదు కదా. అయితే చదివే విధానం మారాలి. ప్రతీ పాఠాన్ని కంఠోపాఠంలా కాకుండా, విశ్లేషణతో చదవాలి. అంత పెద్ద రామాయణాన్ని కూడా అర్థం చేసుకొని మూడుముక్కల్లో కీ నోట్ రాయచ్చు.  మననం.. ఎంత చదివినా అభ్యాసం(ప్రాక్టీస్) ప్రధానం. 'అభ్యాసేన తు కౌంతేయ..' అంటాడు విజయుడితో వేణుమాధవుడు. అభ్యాసంతో ఎంతటి కఠినమైన అంశంపై కూడా ఆధిపత్యాన్ని సంపాదించవచ్చు. మనలో చాలా మంది ఎంత చదివినా  పరీక్ష దగ్గరకు వచ్చేసరికి మరచిపోవడానికి కారణం, ఈ మననం అంటే రివిజన్ లేకపోవటమే. అందుకే మనం తయారు చేసుకున్న కీనోట్ ని తరచూ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయాలి అంటే ముందు మన మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసర విషయాల్ని ఎప్పటికప్పుడు బయటకి పంపాలి. మనసుని విలువైన వస్తువులు పెట్టుకునే ఆభరణాల పెట్టెలా సిద్ధం చేసుకోవాలి. లేఖనం... మనలో చాలా మందికి అన్నీ తెలిసినా ఎలా చెప్పాలో, ఎలా రాయాలో తెలీదు. ఇక్కడే మనకు సృజనాత్మకత కావాలి. ఆధునిక పరీక్షా విధానమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. నీకు తెలిసిన అంశాన్ని ఎంత చెబుతున్నావన్నదే ప్రధానం. ఈ అంశాలతో పాటు అన్నింటికీ మించి మనసును కుదురుగా ఉంచుకుంటే జీవితమనే పరీక్షలోనూ విజయం సాధిస్తాం. ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు ముఖ్యంగా మన ఏకాగ్రతకు పదును పెడతాయి... ఆ తరువాత పరీక్షలే కాదు ఎంతటి అలజడుల్లోనైనా మన విజయం సాధించగలం .                                       ◆నిశ్శబ్ద.  

జీవితంలో ఎదగాలంటే వీటిని కంట్రోల్ పెట్టాలి!

మన జీవితంలో సమయం ఎంతో విలువైనది. మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేదాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. అంటే మనం గొప్పగా ఉండాలన్నా, మనకంటూ ప్రత్యేకత సృష్టించుకోవాలన్నా సమయాన్ని కూడా దానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలి, మనం పనికిరానివాళ్లుగా మిగిలిపోవాలంటే సమయాన్ని  కూడా అలాగే వృధా చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి మన జీవితాన్ని నడిపిస్తున్న అతిగొప్ప వాహకం సమయమే. అయితే పైన చెప్పుకున్నట్టు సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఉండాలని అనుకునేవాళ్లే కానీ పనికిరానివాళ్లుగా మారిపోవాలని ఎవరూ అనుకోరు. అందుకే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తాం అనే విషయాన్ని టైం ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేశారు. సోషల్ మీడియా!! సోషల్ మీడియా అనేది చాలా పెద్ద వ్యసనం అయిపోయింది ఈ కాలంలో. ఎక్కడెక్కడో ఉన్న కొత్త వ్యక్తులను స్నేహితులుగా చేసే వేదికగా ఈ సోషల్ మీడియా యాప్స్ ఉంటున్నాయి. వాటిలో పోస్ట్ లు పెట్టడం, వేరే వాళ్ళతో కబుర్లు చెప్పడం, పోస్ట్ లకు లైక్స్ చేయడం, కామెంట్స్ పెట్టడం ఇదంతా ఒక తంతు అయితే ఆ సోషల్ మీడియా లో కొన్నిసార్లు పోస్ట్ ల విషయంలోనూ, కామెంట్స్ విషయంలోనూ మాటమాట అనుకుని అక్కడ ఇగో పెరిగిపోయి జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. వీటన్నిటి వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఒనగూరే ప్రయోజనం ఏమి ఉండదు.  కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ అందరితో సరదాగా చాటింగ్ చేసుకుంటూ కాసేపయ్యక సమయం చూసుకుంటే అమ్మో ఇంత సమయం అయిపోయిందా అనిపిస్తుంది. అంటే అప్పటికి ఈ సోషల్ మీడియా వల్ల ఎంత సమయం వృధా అవుతుందో గుర్తుచేసుకోండి. అదే సమయంలో జీవితాన్ని మెరుగుపరుచుకునే బోలెడు పనులు చేసుకోవచ్చు.  ప్లానింగ్!! ప్లానింగ్ అంటే ఏదేదో చేయడం కాదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రేపు చేయాల్సిన పనులు ఏంటి?? ఏ సమయంలో ఏది చేయడం బాగుంటుంది వంటివి ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల పనులన్నీ పక్కాగా పూర్తయిపోతాయి. అంతేకాదు పనులు పక్కాగా, తొందరగా పూర్తయిపోవడం వల్ల సమయం మిగులుతుంది. ఆ మిగిలే సమయంలో నచ్చిన పనులు, అభిరుచులు, ఇంకా వేరే విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే ప్లానింగ్ అనేదానికి దూరం ఉండకూడదు.  అదే ప్లానింగ్ చేయకపోతే రోజులో ఎంత పని చేసినా ఇంకా ఏదో మిగిలి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. నిద్రపోవడం!! నిద్ర మహా బద్దకమైన మనుషుల్ని తయారుచేస్తుంది. అతినిద్ర అనేది రోజులో చాలా సమయాన్ని తినేస్తుంది. నిద్రకు కూడా సరైన టైమింగ్ పెట్టుకోవడం ఎంతో అవసరం. ఉదయం లేవడం నుండి రాత్రి పడుకోవడం వరకు అన్ని పనులను ఎలాగైతే ప్లానింగ్ చేసుకుంటారో రాత్రి పడుకుని ఉదయం లేవడానికి కూడా సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే నిద్ర కూడా హాయిగా పడుతుంది. అంతేకానీ రోజులో ఎప్పుడంటే అప్పుడు పడకమీదకు ఎక్కి వెచ్చగా బజ్జోవడం మంచిది కాదు. అతిగా ఆలోచించడం!! ఏదైనా పని చేయడానికి  ఆలోచన అవసరమే కానీ అతిగా ఆలోచించడం మాత్రం చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. తింటూ ఉంటే కొండలు కరిగిపోయినట్టు ఆలోచిస్తూ ఉంటే గంటలు గంటలు అలా దొర్లిపోతాయి. కొంతమంది అలాంటి అతి ఆలోచనల వల్ల రోజులో చేయాల్సిన పనులను కూడా చేయకుండా నిర్లక్ష్యంగా, బద్ధకంగా, నిరాసక్తిగా ఉంటారు. అందుకే అతి ఆలోచనలను దూరం పెట్టాలి. టీవీ చూడటం!! సినిమాలు, సీరియల్స్, కామెడీ షో లు, ఆదివారం వచ్చిందంటే ప్రత్యేక ప్రోగ్రామ్స్, వంటలు, వింతలు, విచిత్రాలు, రాజకీయం, గాసిప్స్ అబ్బో ఇవన్నీ టీవీ లో వస్తున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మార్చి మార్చి చూస్తూ వాటికి అతుక్కుపోయేవాళ్ళు ఉన్నారు. అయితే అపుడపుడు చూడచ్చేమో కానీ అతిగా టీవీ చూడటం  రోజుమొత్తాన్ని గంగలో కలిపేస్తుంది. షాపింగ్!! ఆన్లైన్ కావచ్చు, ఆఫ్ లైన్ కావచ్చు షాపింగ్ చేసేటప్పుడు గంటలు గంటలు తిరుగుతూనే ఉంటారు. ఈరకమైన షాపింగ్ అప్పుడప్పుడు అంటే పర్లేదు. కానీ ఎక్కువగా షాపింగ్ చేస్తే సమయం, డబ్బు రేణు ఖర్చైపోతాయి. వాయిదా వేయడం!! పనులను మొదలుపెట్టాక పూర్తిచేయడం ఉత్తమం. దాన్ని వాయిదా వేస్తే ఆ తరువాత ఆసక్తి తగ్గి అది పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఫోన్ కాల్స్!! అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్ వచ్చాక ఎవరైనా ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడేస్తుంటారు. అవేమైన చాలా ముఖ్యమైన విషయాలా అంటే ఉహు కాదు పిచ్చాపాటి కబుర్లు అవన్నీ. ఫోన్ లో ఎక్కువ మాట్లాడకుండా విషయం ఒక్కటి చెప్పడం, తెలుసుకోవడం చేసి దాన్ని పక్కన పెట్టాలి. ఇతరుల గురించి మాట్లాడుకోవడానికో, ఇతరుల విషయాలను కథలుగా చెప్పుకోవడానికో సమయాన్ని వృధా చేయకూడదు. ఇలా అన్నీ గమనించి పాటిస్తే మనిషి ఎదుగుదలకు కారణమయ్యే సమయం చాలా విలువైనదిగా కనబడుతుంది, విలువైనదని అర్థమవుతుంది.                              ◆ వెంకటేష్ పువ్వాడ.

దుఃఖాన్ని అంతమొందించే తాళం చెవి ఎక్కడుంది?

మనిషిని కదిలించేవి భావోద్వేగాలు. ప్రేమ, బాధ, దుఃఖం, అసూయ, ద్వేషం ఇవన్నీ విభిన్నమైన భావోద్వేగాలు. అయితే వీటిలో మనిషి ఎక్కువగా ప్రేమకు, దుఃఖానికి, కోపానికి తొందరగా చలించిపోతూ ఉంటాడు. దుఃఖం మనివాహిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. రోజు మొత్తం సంతోషం ఉన్నా ఒక్క దుఃఖభరితమైన సంఘటన జరిగిందంటే చాలు మనిషి ఇక తనకు సంతోషమే లేదన్నంత బాధపడిపోతూ ఉంటాడు.  మీకు ప్రియమైన వారు ఎవరయినా పోయినప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే  ఆ కన్నీళ్లు మీ కోసమా లేక చనిపోయిన వారి కోసమా? మీ కోసమే మీరు ఏడుస్తున్నారా? ఇతరుల కోసమా? నిజానికి ఇతరుల కోసం ఎప్పుడయినా ఏడ్చారా? యుద్ధక్షేత్రంలో చనిపోయిన  ఎవరికోసం అయినా ఎప్పుడైనా ఏడ్చారా? ఈ ఏడుపు అంతా మీరు ఏదో కోల్పోయారన్న భావంతోనా లేక ఒక మనిషి చనిపోయినాడే అనే చింతవల్లనా? మీ కోసం మీరు ఏడ్చినట్లయితే దానిలో అర్థం లేదు. మీరు ఆప్యాయత కురిపిస్తున్న ఒక మనిషి పోయినాడు గనుక మీరూ ఏడుస్తున్నారూ అంటే - నిజంగా అలాంటి ఆప్యాయత లేనేలేదు అన్నమాట! చనిపోయిన మీ తమ్ముని కోసం - అతని కోసమే - ఏడవండి. అతను పోయాడు గనుక మీ కోసం మీరు ఏడవడం చాల తేలిక. మీ హృదయం స్పందించింది గనుక మీరు ఏడుస్తున్నారు. కాని, అతని కోసం కాదు ఈ స్పందన. ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ… మీ మీద మీకు జాలి, అనుకంప. దీనితో మీరు కరుడు కట్టుకుపోతున్నారు, మూసుకొని పోతున్నారు. దీనివల్లనే మొద్దుబారి మూర్ఖులయిపోతున్నారు. మీ కోసం మీరు విలపిస్తూ వున్నట్లయితే అది ప్రేమ అవుతుందా? మీరు వంటరివారు అయినారు గనుక, అశక్తులయిపోయారు కనుక, మీ పరిస్థితి విచారకరం అయిపోయింది గనుక ఈ విలాపం కొనసాగుతూ వున్నదా? మీకు యీ విషయం అయితే తెలిసివస్తే  ఒక చెట్టునో స్తంభాన్నో ప్రత్యక్షంగా తట్టిచూసినంత స్ఫుటంగా అప్పుడు యీ విచారమంతా స్వయంకృతమయినదే అని అనిపిస్తుంది.  ప్రతి మనిషికి జీవితంలో కలిగే ఎన్నో భావోద్వేగాలకు ఆలోచనలే మూలం. ఈ  ఆలోచన వల్లనే విచారం ఏర్పడుతోంది. దుఃఖం కాలానికి ఫలితం. ఒకరికి కొంత కాలం క్రితం ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు ఏదో ప్రమాదంలో చనిపోయాడు. అతను చనిపోయిన తరువాత ఇతడు ఒంటరి వాడు అయిపోయాడు. ఆ తమ్ముడు ఉన్నపుడు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి, గొడవ పడటానికి బాగుండేది. కానీ అతడు పోయాక ఒంటరితనం అవరిస్తుంది. ఆ ఒంటరితనం నుండి బాధ పుడుతుంది. ఆ బాధ నుండి ఊరట కలగడం కోసం ఏడుస్తారు.    మీరు గమనించగలిగితే, ఇలాంటివి ఏవైనా మీ హీవితంలో జరిగినప్పుడు ఇదంతా మీ అంతరంగంలో కదలాడడం చూడగలుగుతారు. పూర్తిగా సంపూర్ణంగా చూడగలరు. ఒక్క వీక్షణంలోనే. దానికోసం సమయం విశ్లేషణ వెచ్చించకండి. 'నేను, నా కన్నీళ్లు, నా కుటుంబం, నా జాతి, నా నమ్మకాలు, నా మతం' ఇలాంటి అస్తవ్యస్తమయిన సమాచారం అంతా దాని స్వరూప స్వభావాలు దాని క్షుద్రత్వం.  అన్నీ ఒక్క క్షణంలో, మీ అంతరంగంలో దర్శించుకోగలుగుతారు. మీమనసుతో కాక, హృదయంతో దానిని చూడగలిగినప్పుడు  హృదయపు లోతులలో నుంచి చూడగలిగితే  అప్పుడు మీకు దుఃఖాన్ని, విచారాన్ని  అంతమొందించగల తాళపుచెవి ఖచ్చితంగా దొరుకుతుంది. దుఃఖానికి మూలం అంతరంగంలోనే ఉందనే విషయమూ అర్థమవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

కష్టమైతే ఖచ్చితంగా చెప్పేయండి!

మనుషుల మధ్య బంధాలు ఎంతో సహజం  ఈ బంధాలు చాలా దగ్గరివి కావచ్చు, సాధారణమైనవి కావచ్చు. కొన్ని బంధాల విషయంలో పెద్దగా ఎక్స్పెక్టషన్స్ ఉండవు, మరికొన్ని బంధాలను అంతగా పట్టించుకోరు. కానీ ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం, ప్రతి నిమిషం గురించి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం వ్యక్తిగత బంధాలకు ఉంది. ఆ వ్యక్తిగత బంధాలలో భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో అది సరైన విధంగా లేకుంటే అంతే సున్నితంగా ఉంటుంది.  ఈమధ్య కాలంలో కాబోయే జీవిత భాగస్వాములకు కొన్ని లిస్ట్ ఏర్పడ్డాయి. వాటిలో ఇష్టాలు, అభిరుచులు మాత్రమే కాకుండా అవతలి వ్యక్తి ఇలా అనే కొన్ని నిర్ణయాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఆచరణ దగ్గరకు వచ్చేసరికి వాటిలో కొన్ని వెనక్కు తీసుకోవాల్సి రావచ్చు. జీవితభాగస్వాముల దగ్గర కోపాన్ని విషయాల్లో ఏమి పర్లేదులే, అడ్జస్ట్ అయిపోవచ్చు అని తీసుకునే కొన్ని నిర్ణయాలు తరువాత చాలా ఇబ్బంది పెట్టేస్తాయని ఫ్యామిలీ కౌన్సిలర్లు చెబుతున్నారు. స్పష్టత ముఖ్యం! ఏ విషయంలో అయినా స్పష్టత చాలా ముఖ్యం. అది ఒకరికి ఏదైనా చెప్పడం, ఒకరు ఇలా ఉండాలి అని అనుకోవడం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి నుండి కోరుకుంటున్న విషయం ఎందుకు కోరుకుంటున్నామని, దానివల్ల జీవితానికి చేకూరే ప్రయోజనం, జీవితంలో ఆ నిర్ణయం వల్ల ఏర్పడే పరిస్థితులు, దాని ప్రాముఖ్యత వంటివన్నీ ఆలోచించి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలి. ఒత్తిడికి తలొగ్గద్దు! భార్యాభర్తలు కావడం కోసమైనా, భార్యాభర్తలు అయిన తరువాత అయినా పెద్దవాళ్ళ ఒత్తిడి చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని భరించలేమని, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినా పెద్దవాళ్ళు పరువు పోతుందని, చుట్టుపక్కల ఏదో అనుకుంటారని, ఆర్థికపరమైన బెనిఫిట్స్ పోతాయని ఆలోచించి విడిపోవద్దని, బంధం కలుపుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. కానీ సమస్య అనిపించినప్పుడు అసలు ఎవరి ఒత్తిడో భరించలేక ఇరుక్కుపోవద్దు. మొహమాటం వదిలెయ్యాలి! కొందరు కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో చెప్పడానికి కూడా మోహమాటపడుతుంటారు. ఇంకా ఆ మొహమాటం స్థానంలో కాసింత భయం కూడా ఉంది ఉండచ్చు, ఏదైనా స్వేచ్ఛగా పంచుకునే చనువు కూడా లేకపోవచ్చు. అలాంటివన్నీ లేకపోతేనే బాగుంటుంది. ఇష్టం లేని విషయాల నుండి అవతలి వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకమైన నిర్ణయాల గురించి మనసులో ఉన్నట్టయితే వాటిని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా బయటకు చెప్పేయడం మంచిది.  నిర్ణయాలు వెనక్కు తీసుకోవడం కష్టం! కాబోయే భాగస్వామి లేదా జీవిత భాగస్వామి విషయంలో ఏవైనా విషయాలు మొహమాటం కొద్దీ సరేనని చెప్పడం, ఏవైనా షరతులు ఒప్పుకోవడం, ప్లానింగ్స్, ఆర్థిక, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాల గురించి ఒప్పుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఇలాంటి విషయాలలో మాట ఇవ్వడం అంటే ఇక అది పూర్తిగా ఒకరి చేతుల నుండి జారిపోయినట్టు. ఇద్దరి నిర్ణయంగా మారిపోయినట్టు. ఆ తరువాత ఏదైనా అసౌకర్యం కలిగి కాదు కూడదు అనలేని పరిస్థితులు ఎదురైతే అది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా దేన్నీ చాలా కష్టంగా భరించకూడదు. అసలు భరించడం అనే మాటల్లోనే చెప్పలేనంత ఇబ్బంది ఉంది కాబట్టి ఏ విషయంలో అయినా కష్టమనిపిస్తే మొదటగా దాన్ని బయటకు చెప్పేయడం మంచిది.                              ◆ వెంకటేష్ పువ్వాడ.

బిడ్డ తల్లికడుపులో ఉన్నప్పుడే ఈ గుణాలు నేర్పించండి!

ఆచార్య చాణక్య విధానం నేటికీ సంబంధితంగా ఉంది. సామాన్యుడు చాణక్యుడి సూత్రాలను పాటించడం ద్వారా జీవితంలో విజయం సాధించగలడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆచార్య చాణక్యుడు మౌర్య సామ్రాజ్యానికి సమకాలీనుడు. మౌర్య సామ్రాజ్య స్థాపనలో చాణక్యుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లలు తల్లి గర్భంలో 4 శుభ లక్షణాలను నేర్చుకోవడం ప్రారంభిస్తారు. అలాంటి పిల్లలు భవిష్యత్తులో చాలా విజయవంతమైన వ్యక్తులు అవుతారు. వారు అన్ని దిశలలో చర్చించారు. కాబట్టి, ఆ 4 గుణాల గురించి ఇప్పుడు  తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు పదకొండవ అధ్యాయంలోని మొదటి శ్లోకంలో పిల్లలు తల్లి గర్భంలో దానగుణాన్ని నేర్చుకుంటారని చెప్పారు. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఈ లక్షణాలను నేర్చుకోలేడు. తల్లిదండ్రులు దాతలు అయితే పిల్లలు కూడా దానం చేసి దాతలు అవుతారని చాణక్యుడు చెప్పాడు. మధురమైన ప్రసంగం: జ్యోతిష్యుల ప్రకారం, జాతకంలో బుధగ్రహం యొక్క బలమైన ప్రభావం లేదా బుధుడు యొక్క శుభ ప్రభావం కారణంగా, వ్యక్తి మధురంగా మాట్లాడతారు. కానీ చాణక్యుడు ప్రకారం, పిల్లలు వారి తల్లిదండ్రుల విలువలను అభివృద్ధి చేస్తారు. తల్లిదండ్రులు మధురంగా మాట్లాడితే పిల్లలు గుణవంతులు, మధురమైనవారు. ఈ లక్షణాలను పిల్లలు తమ తల్లి కడుపులో నేర్చుకుంటారని చాణక్యుడి తత్వం చెబుతోంది. ధైర్యం: ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లలు తమ తల్లి కడుపులో ధైర్యం నేర్చుకుంటారు. ధైర్యం పిల్లలను జీవితంలో విజయవంతం చేస్తుంది. అలాంటి వ్యక్తులు జీవితంలోని అన్ని కష్టాలను తమ ధైర్యంతో అధిగమిస్తారు. పుట్టిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఈ లక్షణాలను నేర్చుకోలేడు.  తప్పొప్పులు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లలు తల్లి కడుపులో మంచి , తప్పులను నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ఈ సంస్కారాలు పిల్లల్లో వస్తాయి. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత కూడా ఈ ఆలోచనలను నేర్చుకోలేడు. ఈ నాలుగు గుణాలు ఉన్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయవంతమైన వ్యక్తి అవుతాడు.