Read more!

మీ వయసు 20-30 ఏళ్ళ మద్యనుందా? పొరపాటున  కూడా ఈ తప్పులు చేయకండి!

మనిషి జీవితం ఎన్నో దశలతో కూడుకుని ఉంటుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యవయసు, వృద్దాప్యం ఇలా ప్రతి ఒక్కటీ అధిగమిస్తూ వెళ్తారు. అయితే ఈ అన్ని దశలలోకి చాలా సున్నితమైనది, కీలకమైనది యవ్వనదశ. 20-30 ఏళ్ల మధ్యనున్నవారు  తప్పులు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో ఆవేశం, సంతోషం, ఆరాటం, కోపం, మరీ ముఖ్యంగా శారీరక స్పందనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే యవ్వన దశను చాలామంది ఉరకలు వేసే వయసు అంటూ ఉంటారు. ఈ వయసులో చేసే కొన్ని తప్పులు జీవితాన్ని చాలా నష్టానికి గురి చేస్తాయి. భవిష్యత్తును వ్యక్తి చేతుల నుండి చేజారేలా చేస్తాయి.  యవ్వనంలో ఉన్నవారు పొరపాటున కూడా చేయకూడని పనులేంటో తెలుసుకుంటే..

మూర్ఖంగా ఉండకూడదు..

వయసు పెరిగేకొద్దీ విషయావగాహన కూడా పెంచుకోవాలి. 20ఏళ్లు దాటిన తరువాత  వ్యక్తిలో చాలా ప్రపంచ జ్ఞానం పోగై ఉండాలి. జీవితంలో 20-30 ఏళ్ళ మధ్యనే వృత్తి, ఉద్యోగం, వివాహం వంటి విషయాలలో నిర్ణయాలు జరుగుతాయి.  కాబట్టి ఈ కీలకమైన దశను సక్సెస్ గా డీల్ చేయాలంటే మూర్థత్వాన్ని వదిలించుకుని జ్ఞానవంతులుగా ఉండాలి. విషయాలను అన్ని కోణాలలో అలోచించుకునే వైఖరి అలవడాలి. లేకపోతే ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేక యవ్వనాన్ని, దీని కారణంగా జీవితాన్ని కూడా చేజేతులా నాశనం చేసుకుంటారు. ఈ దశ దాటితే జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశాలు మెండుగా దొరక్కపోవచ్చు.

లైంగిక వాంఛలతో జాగ్రత్త..

లైంగిక వాంఛలు సర్పం లాంటివి. అవి నిరంతరం మనిషిని ఉద్రేకానికి లోను చేస్తాయి. 20-30ఏళ్ళ మధ్య ఈ లైంగిక వాంఛల ప్రభావం కారణంగా ఎన్నో తప్పులు కూడా జరుగుతాయి. వీటిని తీర్చుకోవడం ఎంత అవసరమో.. వాటిని తీర్చుకోవడానికి ఎంచుకునే మార్గాలు అంత కీలకం. లైంగిక వాంఛలు వ్యక్తిని ఎప్పుడూ అసంతృప్తికి గురిచేస్తాయి. ఈ కారణంగా జీవితంలో గొప్పగా ఎదుగుతున్నా సరే సంతోషంగా ఉండలేరు. లైంగిక కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేస్తే మాత్రం దాని ఫలితాన్ని జీవితాంతం భరించాల్సి ఉంటుంది.

ఇతరుల పంచన ఉండకండి

ఇతరుల ఇంట్లో ఉండటమంటే స్వేచ్చను కోల్పోవడమే. దీని కారణంగా జీవితంలో ధైర్యంగా ఎదగలేరు. మంచి నిర్ణయాలు తీసుకోలేరు. అన్నింటికి ఇతరుల దయపై ఆధారపడతారు. ఇతరుల వద్ద ఆశ్రయం పొందుతున్నప్పుడు ఎక్కువశాతం మంది బానిస లాంటి జీవితాన్ని గడుపుతారు. జీవితం గురించి ఎన్ని కలలున్నా, ఎదగాలనే తపన ఉన్నా దాన్ని నెరవేర్చుకోవడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. అందుకే 20-30 ఏళ్ల వయసు మధ్యన ఉన్నవారు కష్టమైనా సరే స్వశక్తితో బ్రతకడానికి ప్రయత్నించాలి.

                                                        *నిశ్శబ్ద.